గుట్టమీద గుడి కట్టడం మనందరికీ తెలిసిందే. కానీ ఓ గుట్టని గుడిగా మార్చారు. అంతేకాకుండా గుట్టలోని రాతిని చెక్కి విగ్రహాలను తయారు చేయడం గొప్ప విషయం. అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాక్షస జాతికి చెందిన బకాసురుని ఆలయం ఉండడం. భారతదేశంలోనే అరుదైన, ఎవరు విననటువంటి బకాసురుని ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. కాలక్రమేనా ఈ ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంగా పిలవబడుతుంది. ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకుందాం.
నైన్పాక ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గులాబీ రాతి శిలపై 15 లేదా 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రజలు భావిస్తారు. ఈ ఆలయం శైలి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ రాతి కోట ఆలయం, సర్వటోభద్ర వాస్తుశిల్పం యొక్క నమూనా, ఇందులో నాలుగు దేవతలు బండరాయిపై చెక్కబడి ఉంటాయి.
గర్భగుడి లోపల, యోగా నరసింహ స్వామి, కలేయ వేణుగోపాల స్వామి, శ్రీ రామ, బలరాముడి శిల్పాలు, తూర్పు, దక్షిణ, ఉత్తరం మరియు పడమర వైపు వరుసగా ఉంటాయి.
ఈ ఆలయం నాలుగు ప్రవేశాలను కలిగి ఉండడంతో ఈ మందిరం అన్ని వైపుల నుండి ప్రవేశించవచ్చు. 50 అడుగుల గోపురం వాస్తు కలకు నిదర్శనంగా చెప్పవచ్చు.
నైనపాక గ్రామానికి చేరుకున్న తర్వాత ఆ గ్రామంలోని పలు ప్రాంతాలలో ఎక్కడపడితే అక్కడ దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయనపాక గ్రామంలో ఎక్కడా లేనివిధంగా బకాసురుడు అనే రాక్షసుడికి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం పాండవులు వనవాసం చేసిన సమయంలో బకాసురుడితో భీముడు ఇక్కడ యుద్ధం చేసినట్లుగా చెబుతోంది. ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది. గుట్టపై మధ్య భాగంలో ఆలయం ఉంటుంది. దానికి నాలుగు వైపులా 5:30 అడుగుల ఎత్తులో ద్వారాలు ఉంటాయి. లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల దేవత విగ్రహాలు చెక్కి ఉంటాయి. తూర్పు వైపున భయంకరమైన ఆకారంలో బకాసురుడు నరసింహస్వామి ఆకారాన్ని పోలి ఉంటాడు.
ఒకే శిలపై నాలుగు వైపులా దేవత విగ్రహాలు ఉన్నందున దీనిని ఏకశిలా క్షేత్రమని అంతేకాకుండా సర్వతోభద్ర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి తూర్పు ద్వారం నుంచి చూస్తే లక్ష్మీనరసింహస్వామి, దక్షిణాన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కనిపిస్తారు. పశ్చిమ ద్వారం నుంచి లక్ష్మీనారాయణ స్వామి కనిపిస్తారు. ఉత్తర ద్వారం నుంచి చూస్తే సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామితో కలిసి కనిపిస్తారు. విగ్రహాన్ని చెక్కగా వచ్చిన రాళ్లతోనే ఆవిగ్రహం చుట్టూ దాదాపు 25 అడుగుల ఎత్తులో గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత దానిపై మరో 3 అడుగుల ఎత్తులో గోపురానన్ని నిర్మించారు.
ఇక్కడ గుడి ముందు మధ్యలో కోనేరు ఉండేది. కాలక్రమమైన అది పూడుకుపోయింది. గుట్ట రాతిలోని విగ్రహం చెక్కివున్న దేవాలయం ఇప్పటివరకు లేదని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.
స్థానిక కథనం…
ఒకప్పుడు బకాసురుడు ఈ భూమిని పరిపాలించాడని స్థానికులు చెబుతున్నారు. అతను తన రాజ్యం పరిధిలోని ప్రజలను రక్షించేవాడు. కానీ తన రాజ్యానికి వెలుపల ఉన్నవారిని మాత్రం తన ఆకలి తప్పుడు తీర్చుకోవడానికి సంహరించేవాడు. అందువల్ల ప్రజలంతా భయపడిపోయేవారు. బకాసురుడని దెయ్యం అని పిలిచేవారు. అతని రాజ్యంలోని ప్రజలు మాత్రం అతనిని తమ దేవుడిగా భావించేవారు అంతేకాకుండా ఆయనకు నివాళిగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ నిర్మాణం అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. గర్భగుడి మొత్తం ఒకే భారీ బండరాయితో చెక్కబడింది. ‘సిఖారా’ ఇటుకలతో నిర్మించిన నిర్మించినట్టు చారిత్రక కథలు చెబుతున్నాయి.
ఆలయ అభివృద్ధిపై అధికారుల సీత కన్ను…
చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం అంతులేని నిరాదరణకు గురవుతోంది. ఆలయం శిథిలావస్థకు చేరుతున్న దేవాదాయ శాఖ కానీ, పురావస్తు శాఖ కానీ పట్టించుకోవడం లేదు. ఆలయం పై భాగంలో మొక్కలు మొలుస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. ఆలయం వర్షానికి కొంతమేర కూలిపోతున్న పునరుద్ధరించట్లేదు. ఆలయ విశిష్టతను తెలుసుకొని అప్పటి సభాపతి మధుసూదనాచారి ప్రత్యేక దృష్టి సారించి 3.30 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 2018 ఏప్రిల్ లో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించిన గుత్తేదారులు జాగ్రత్త తీసుకోకుండా దిమ్మల నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ఆలయ నిర్మాణానికి ముప్పు వాటిల్లుతుందని పురావస్తు శాఖ అధికారులు పనులు నిలిపివేశారు. పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు. ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దేవాలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని అక్కడి పూజారి చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని సర్వే చేయించి ప్రభుత్వ భూములను తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. ఒకే ఆలయంలో నలుగురు దేవతమూర్తులు ఉండడంతో సంవత్సరంలో నాలుగు సార్లు జాతరలు జరుగుతాయి. గోపురం పాక్షికంగా కూలడంతో వర్షం కారణంగా జాతరలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణం చేయడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.
స్వామి వారికి కళ్యాణం చేయాలనుకున్న ఎండలో నిలబెట్టి కల్యాణ చేయాల్సి వస్తుందని ఇంతవరకు ఆలయానికి ధ్వజస్థంభం లేదని తెలిపారు. ప్రాకారమండపం ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చిపోయే భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడకుండా జడ్పిటిసి బోర్ వేయించారని కానీ దాని ఇంతవరకు ఎటువంటి ట్యాంక్ లేదన్నారు. ఎండోమెంట్, పురావస్తు శాఖ వారికి చెప్పి చెప్పి విసుగు చెందాము కాని వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. వర్షం పడితే ఆలయంలోపల భాగంలో కురుస్తుందని తెలిపారు.
చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయాన్ని అధికారులు ప్రభుత్వం పట్టించుకోని అభివృద్ధి దిశగా నడిపించాలని స్థానికులు కోరుతున్నారు.