HISTORY CULTURE AND LITERATURE

శివుడి పక్కన యముడు కొలువుదీరిన క్షేత్రం కాళేశ్వరం

త్రివేణి సంగమంగా పేరొందిన ప్రాంతం లయకారుడు పరమేశ్వరుడు. లింగ రూపంలో భక్తులకు దర్శనమిచ్చే భగవంతుడు.. లింగ రూపంలో భారతదేశంలో అనేక శైవ క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నాడు. దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం కాళేశ్వరం. కాళేశ్వర క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం.

కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయం. ఈ క్షేత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న ఈ క్షేత్రమే కాలేశ్వరం గా పిలవబడుతుంది. ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ ప్రకృతి నడుమ.. పరమ పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం  ప్రాచీనమైనది. ఈ కాలేశ్వరం క్షేత్రం గురించి స్కంద పురాణంలో చెప్పబడుతోంది.

త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన ఈ  ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలో చూసినా ఒక శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది. కానీ ఒక్క కాలేశ్వరంలో మాత్రమే రెండు శివలింగాలు దర్శనం ఇస్తాయి. అవే ఒకటి ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటి కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా భారతదేశం లోనే ఎక్కడా కనిపించదేమో. మహిమాన్వితమైనది గోదావరి నదికి దగ్గరలో వెలిసిన క్షేత్రం పురాతనమైనది. ప్రముఖ పట్టణమైనటువంటి కరీంనగర్ కి 132 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆలయంలోని గర్భగుడిలో రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు ముక్తేశ్వర స్వామి ముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ గంగోత్రి, దక్షిణ త్రివేణి సంగమం అని కూడా అంటారు.

కాళేశ్వరం క్షేత్రం స్థల పురాణం…

కాళేశ్వరం క్షేత్రం స్థల పురాణానికి వస్తే పూర్వము ప్రజలంతా ముక్తేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ శివ భక్తులై.. పంచాక్షరి మహామంత్రాన్ని నిత్యం జపిస్తూ, ధర్మముగా సంచరిస్తూ.. అందరు పునీతులయ్యారు. పాపాత్ములు లేకపోవడంతో యమలోకం బోసిపోయింది. అప్పుడు విచారం చెందిన యముడు కైలాసానికి చేరుకొని ఆ పరమేశ్వరుడితో దేవా.. లోకం మొత్తం మీ భక్తులు. ఎక్కడ చూసినా పాపాలన్నిటివి లేవు. నరకానికి ఒక్క జీవి కూడా రావడం లేదని యముడు అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు.. యమధర్మ రాజా చింతించకు. నీవు కూడా నా స్థానం పొంది కాలేశ్వరంలో లింగంగా ఉండి నాతో పాటు పూజలు అందుకో అంటాడు. వెళ్ళిన వారికి ముక్తి అనేది దొరకదు అలాంటి వారిని నీవు నరకానికి తీసుకొనిపోవచ్చు అని శివుడు యమధర్మరాజుకి చెబుతాడు.

ఈ విధంగా యమధర్మరాజు కాలేశ్వరంలో ముక్తేశ్వరుడి పక్కనే కాలేశ్వరుడిగా ప్రతిష్టితుడైనాడు. ముక్తేశ్వర స్వామి లింగంలో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. లింగం భాగంలో రెండు పక్కల చిన్న రంధ్రాలు దర్శనమిస్తాయి. వాటిని నాశికా రంద్రాలు అంటారని అర్చకులు చెబుతారు. ఈ రంధ్రాలలో ఎన్ని నీళ్లు పోసినా.. లోపలికి వెళతాయట. ఒక్క బొట్టు కూడా బయటికి రాదని వారు చెబుతున్నారు. ఆ నీరు అక్కడ నుంచి భూమి లోపలికెళ్ళి.. ప్రాణహిత ఉపనది భాగాలలో కలుస్తుందని స్థలపురాణం చెపుతున్నది. ఆ విధంగా ఈ  ప్రదేశం త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందినట్లు అర్చకులు తెలియజేశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ గంగోత్రి, దక్షిణ త్రివేణి సంగమం అని కూడా అంటారు.  ఈ క్షేత్రం సమీపంలో బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. సాధారణంగా బ్రహ్మదేవునికి ఎటువంటి ఆలయాలు ఉండవు. కానీ ఒక్క కాలేశ్వరం క్షేత్రంలో మాత్రమే బ్రహ్మ దేవునికి ఆలయం ఉండడం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు.

త్రివేణి సంగమం…

గోదావరి, గోదావరి నదికి ఉపనది అయినటువంటి ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యా వందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునే వారని స్కంధ పురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునే వారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరుగగా తిరిగి 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా 2022లో పుష్కరాలు వస్తాయి, సరస్వతి నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి వస్తాయి.

కాళేశ్వరం క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే.. 

వాయు మార్గం..

వాయు మార్గంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లి కారు, రైలు లేదా బస్సులో ప్రయాణించవచ్చు. ప్రత్యామ్నాయంగా, నాగ్‌పూర్‌కు వాయు మార్గంలో.. ఆపై కారును కాళేశ్వరానికి తీసుకువెళ్ళాలి. హైదరాబాద్ కు కాళేశ్వరం 214 కిలోమీటర్ల దూరంలో  ఉంటుంది.

రైలు మార్గం…

కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషనైన రామగుండం (98 కిలోమీటర్లు)లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

రోడ్డు ద్వారా…

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. కారు, బైక్ 

మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చు.

Show More
Back to top button