రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన విష్ణు క్షేత్రం.. శబరి, జటాయువు లకు మోక్షం సిద్దించిన ప్రాంతం..
శ్రీరాముడు, హనుమంతుడు కలుసుకున్న స్థలం..
శ్రీరాముడు నడయాడిన దివ్య ప్రదేశం కావడంతో ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం.. రామదాసు కాలం కంటే ముందు నుంచే ఉంది. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీరామ గిరి ఆలయం గురించి మీకు తెలుసా..? ఈ ఆలయాన్ని మాతంగ ముని నిర్మించినట్టు
పురాణాలు చెబుతున్నాయి. భద్రాచలం రామాలయంలో జరిగే కైంకర్యాలని శ్రీ రామగిరి క్షేత్రం నుండే ప్రారంభం అవుతాయి. ఏ విష్ణు క్షేత్రంలోనూ లేనివిధంగా శ్రీరామచంద్రుడు దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే ప్రాంతం శ్రీ రామగిరి ఒక్కటి మాత్రమే.
శ్రీరాముని క్షేత్రం శ్రీరామగిరి విషయాలు మనం తెలుసుకుందాం.. త్రేతా యుగంలో సీతా.. లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు శ్రీరామగిరి ప్రాంతాన్ని సందర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పటి తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన వరరామచంద్రపురం మండలానికి చెందిన ప్రాంతం శ్రీరామగిరి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వర రామచంద్రపురం మండలంలో ఉన్న చిన్న గ్రామం శ్రీ రామగిరి. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయి తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రపురం లో భాగమైంది. ప్రాచీన దేవాలయంగా రెండవ భద్రాద్రిగా శ్రీరామగిరి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శ్రీరామదాసు భద్రాచలం దేవాలయాన్ని నిర్మించడం కంటే ముందు నుండి ఉందని పురాణాలు చెబుతున్నాయి. భద్రాచలం పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో శ్రీరామగిరి ఉంది. ఈ శ్రీరామగిరి ప్రాంతం గోదావరి నదికి ఉపనది అయిన శబరి నదికి ఒడ్డున ఉంది. చుట్టూ కీకారణ్యంతో కూడుకొని ఉంది. నిరంతరం ఇక్కడ అడవి జంతువులు, క్రూర మృగాలు సైతం సంచరిస్తూ ఉంటాయి. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కూడా. ఆహ్లాదకరమైన వాతావరణంతో చుట్టూ ఎతైన కొండలు, పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతమైన పరిసరాలు మనసుని మైమరపిస్తాయి. అత్యంత సుందరంగా ఉండే ఈ శ్రీరామగిరి క్షేత్రంలో శ్రీరాముడు సుందర రాముడిగా పూజలు అందుకుంటాడు.
జటాయువుకు స్వయంగా శ్రీరాముడే పిండ ప్రదానం చేసిన ప్రాంతం..
సీతారామ లక్ష్మణులు త్రేతా యుగంలో 14 ఏళ్ళు వనవాసం కొరకు భద్రాచలం సమీపంలోని దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామంలో నివాసం ఉన్నారు. సీతారాములు కుటీరం నిర్మించుకొని వనవాసం చేస్తున్నారు. ఈ క్రమంలో రావణబ్రహ్మ సీతామాతను ఎత్తుకుపోవడంతో శ్రీరామచంద్రుడు కలత చెందాడు. తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సీతామాత కోసం అడవిలో వెతకడం ప్రారంభించాడు. అలా అడవిలో శ్రీరాముడు సీతామాత కోసం వెతుకుతూ తూర్పు దిశగా వెళ్ళాడు. రాముడు దుఖిస్తూ సీత కోసం వెతుకుతుండగా ఆ సమయంలో రామా.. రామా.. అనే పిలుపులు వినిపించాయి. శ్రీరాముడు లక్ష్మణ ఇక్కడ నా పేరును ఎవరో తలుస్తున్నారు. ఈ అరణ్యంలో నా కోసం ఎవరో పరితపిస్తున్నారు అంటూ.. అటువైపుగా వెళ్ళాడు. ఆ సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జటాయును శ్రీరాముడు చూశాడు. రావణుడు సీతామాతను ఎత్తుకు వెళుతుండగా రావణుడితో పోరాడితే తన ఖడ్గంతో రెక్కలను, కాళ్లను ఖండించాడని జటాయువు రాముడితో చెబుతుంది. రాముడికి విషయాన్ని అంతా చెప్పి జటాయువు శ్రీరాముని చేతిలో ప్రాణాలు విడుస్తుంది. శ్రీరాముడు జటాయువు కు కర్మకాండ క్రియలు చేశాడు. దశరధుడికి లేని దివ్య అవకాశం జటాయువు పొందింది. జటాయువు మరణం శ్రీరాముడిని కలచివేసింది. శ్రీ రామగిరి లోనే గోదావరి నది ఒడ్డున జటాయుకు స్వయంగా శ్రీరాముడు దహన సంస్కారాలు చేశాడు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ మనం దర్శించవచ్చు.
శ్రీరాముడికి హనుమంతుడు ఎదురుపడింది శ్రీరామగిరి లోనే…
సీతాపహరణం, జటాయువు మరణంతో శోకసంద్రంలో మునిగిన శ్రీరాముడు అడవిలో వెళుతుండగా
ఆ క్రమంలో వీరికి హనుమంతుడు ఎదురవుతాడు. బాధలో ఉన్న శ్రీరాముడిని చూసి హనుమంతుడు ఏమి జరిగిందని అడగగా సీతాపహరణం గురించి రాముడు వివరిస్తాడు. ఎంతో చింతించిన హనుమంతుడు శ్రీరాముడుకు ఈ విధంగా చెపుతాడు. మీ సమస్యకు మా వానర రాజు సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు నాతో రండి అని రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకువెళతాడు. మాతంగముని ఆశ్రమంలో తలదాచుకున్న సుగ్రీవుడిని శ్రీరాముడికి హనుమంతుడు పరిచయం చేస్తాడు. విచారంలో ఉన్న సుగ్రీవుడిని గమనించిన శ్రీరాముడు తన గురించి అడిగి తెలుసుకుంటాడు. మహా బలవంతుడైన తన అన్న వాలి తన రాజ్యాన్ని భార్య రుమను అపహరించుకుపోవడంతో భయపడి మాతంగముని ఆశ్రమంలో తలదాచుకున్న విషయాన్ని శ్రీరాముడికి సుగ్రీవుడు తెలియపరుస్తాడు. దీంతో శ్రీరాముడు.. వాలిని తాను సంహరిస్తానని, వాలితో యుద్ధానికి సిద్దం కావాలని సుగ్రీవుడికి ధైర్యం చెప్తాడు.
రాముడు వాలిని సంహరించుట…
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండడంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి సుగ్రీవుడిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.
ఇద్దరు ఒకేలా ఉండడంవల్ల
నేను మౌనంగా ఉండిపోయాను సుగ్రీవా.. నేను ఇచ్చే గజపుష్పి లతను ఆనవాలుగా ధరించు అప్పుడు నాకు ఇద్దరిలో తేడా కనిపిస్తుంది అని సుగ్రీవుని మెడలో మాలను రాముడు అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలి కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.
అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టి చెట్టు చాటున చేరి బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ ప్రాణాలు విడిచాడు. వాలి ఆధీనంలో ఉన్న సుగ్రీవుని రాజ్యాన్ని, అతని భార్య
రుమను సుగ్రీవుడికి శ్రీరాముడు అప్పగిస్తాడు.
ఆ కృతజ్ఞతతో సుగ్రీవుడు సీతను వెతకడంలో తన సహాయాన్ని అందిస్తానని శ్రీరాముడికి వాగ్దానం చేస్తాడు. శ్రీరామగిరి క్షేత్రం ఎదురుగా కొద్ది దూరంలో వాలి, సుగ్రీవ పర్వతాలు మనకు ఇప్పటికే దర్శనమిస్తాయి.
శ్రీరామగిరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
వాలి సంహారం అనంతరం వర్షాకాలం మొదలైంది. వర్షాలు అధికంగా ఉండడంతో వర్షాలు తగ్గిన తర్వాత రావణుడిపై యుద్ధానికి సిద్ధం అవుదామని సుగ్రీవుడు రాముడుతో చెప్తాడు. అప్పటివరకు మాతంగమని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవాలని సుగ్రీవుడు రాముడిని కోరుతాడు. ఆ సమయంలో శ్రీరాముడు మాతంగముని ఆశ్రమంలో దక్షిణాభిముఖంగా ధ్యానం చేస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో శ్రీరాముడు దక్షిణాభిముఖుడై వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ధ్యానం వల్ల శ్రీరాముడి ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించాడట. అందుకే ఇక్కడ వెలిసిన శ్రీరాముడిని సుందర రాముడిగా, ధ్యానం చేసినందుకు యోగ రాముడు గాను పిలుస్తారు. శ్రీరాముడు ధ్యానం చేసిన గిరి కాబట్టి ఆ ప్రాంతానికి ‘శ్రీరామ గిరి’ అనే పేరు వచ్చినట్లు పురాణ గాధలు చెబుతున్నాయి.
శబరి మాతకు మోక్షం…
శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన స్త్రీ. ఈమె మతంగ మహాముని
శిష్యురాలు. బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు శ్రద్ధగా వినేది. మతంగ మహామునిని పరమశివుడుగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మతంగ మహాముని ద్వారా శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది. మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన విషయం తపశ్సక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు, తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.సీతా,లక్షణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది.అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.
దర్శనభాగ్యంకోసం ఎదురు వృద్ధాప్యం వరకు వేచి చూసింది.
రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు, పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టి అలంకరించేది.ఫలహారంగా పెట్టడానికి పళ్ళను సిద్ధంగా ఉంచేది.ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే 13 సంవత్సరాల కాలం గడిపింది. చివరికి శ్రీరాముడు సీతా అన్వేషణ లో గోదావరి తీరం వెంట పయనిస్తూ శబరి వృత్తాంతం కబంధుడు ద్వారా తెలుసుకొని, శబరిని చూడటానికి వస్తాడు. ఆ సమయంలో శబరికి చూపు కనపడలేదు.ఒళ్ళంతా కళ్ళయినట్టు… చేతులతో తడిమింది. రామ రామ అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి, నెత్తిన నీళ్ళు చల్లుకుంటుంది.పూలు చల్లింది. ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చియిచ్చింది.
వగరుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడూ ఎంగిలి అనుకోకుండా ఇష్టంగా తింటాడు.శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్దుడవుతాడు జీవితమంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మలేకుండా, గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇస్తాడు. శబరికి మోక్షం ప్రసాదిస్తాడు. శబరిమాతను నదిగా మారుస్తాడు. శబరి మాత నదిగా మారుతుంది. శబరి నది శ్రీరామగిరి క్షేత్రం సమీపంలో ఉన్నటువంటి అల్లూరి సీతరామ రాజు జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. గోదావరికి ఉపనది అయిన శబరినది రెండూ నదులు కలిసి పాపికొండలు వద్ద కలుస్తాయి. ఒకపక్క గోదావరి నలుపు రంగులో, మరోపక్క శబరినది ఎరుపు రంగులో ప్రవహిస్తూ కనిపించే దృశ్యాలు పర్యటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శబరి నదికి ఉపనది సీలేరు. కూనవరం వద్ద శబరి నది ఒడ్డున శబరిమాత విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా శబరిమాత మోక్షం పొందిన ప్రదేశంగా కూడా శ్రీరామగిరి ప్రాచుర్యం పొందింది.
శ్రీరాముని కళ్యాణ ఉత్సవానికి శ్రీకారం చుట్టేది శ్రీ రామగిరి లోనే..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. లక్షల సంఖ్యలో భద్రాచలం రామయ్య కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలివస్తారు. అంత అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామచంద్రుని కళ్యాణానికి శ్రీకారం చుట్టేది మాత్రం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి, కొండకోనల్లోని రాముని సమక్షంలోని శ్రీరామగిరిలోనే అనే విషయం చాలామందికి తెలియదు. శ్రీరామగిరిలో ముందుగా తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే కానీ భద్రాచలం రాములవారికి పెళ్లి తంతు ప్రారంభం కాదు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీరామగిరి శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని తొలగించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం ఆనవాయితీ. ప్రధానాలయ గోపురం పై భాగాన శంఖు, చక్రాలతో కూడిన విష్ణు నామం ఉంటుంది. నల్లరాయితో తయారు చేయబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు సర్వాలంకార భూషితమై ఎంతో ఆకర్షణీయంగా ఉండి భక్తులను ఆధ్యాత్మికత భావనకు ప్రేరేపిస్తాయి.
పాపికొండలు యాత్ర.. శ్రీరామగిరి నుండే మొదలు..
పాపికొండలు విహారయాత్ర శ్రీ రామగిరి గ్రామం మీదుగానే వెళ్లాలి. ఒకప్పుడు బోటింగ్ పాయింట్ శ్రీరామగిరి క్షేత్రం గోదావరి నది ఒడ్డు నుండి ప్రారంభమయ్యేది. ఎంతోమంది శ్రీరామ గిరి క్షేత్రాన్ని సందర్శించి పాపికొండలు యాత్రకు ప్రారంభమయ్యేవారు. ఒకప్పుడు అత్యధికంగా వచ్చిన వర్షాలు వరదల కారణంతో ప్రస్తుతం అక్కడ నుంచి పోచవరం గోదావరి ఒడ్డుకు పాపికొండలు బోటింగ్ పాయింట్ ను ఏపీ టూరిజం బోర్డు మార్చివేసింది.
శ్రీరామగిరి.. పోలవరం ప్రాజెక్టుతో కనుమరుగు కానుందా…
నిజమే.. శ్రీరామ గిరి క్షేత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కనుమరుగు కానుంది. సుమారు 80 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీరామగిరి కొండకు 170 మెట్లు ఎక్కి ఆలయాన్ని దర్శించుకుంటారు. అంత ఎత్తులో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పూర్తిగా కనుమరుగు కానున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అదే కనుక జరిగితే ఒక గొప్ప పర్యాటక ప్రదేశాన్ని, రాముడు నడయాడిన పుణ్యభూమిని, ప్రాచీన పురాతన కట్టడాన్ని మనం కోల్పోయినట్టే. అత్యధికంగా వర్షాలు కురిసి గోదావరి తీర ప్రాంతాలు మునిగిపోయినప్పుడు శ్రీరామగిరి సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కొండపైకి చేరుకొని ఆలయంలోనే బస చేస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుతో శ్రీరామగిరి క్షేత్రం కనుమరుగైతే ఆ ప్రాంత వాసులకు ఇంటి స్థలాలను అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనున్నట్లు తెలిపింది. మరి శ్రీరాముని క్షేత్రాన్ని కూడా వేరొక చోటికి తరలిస్తారా లేదా అనేది తెలియాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన ప్రాచీన కట్టడం పోలవరం ప్రాజెక్టుతో కనుమరుకు కానుంది. ఆ సమయం వచ్చేలోపే శ్రీరామగిరి క్షేత్రాన్ని దర్శించని వాళ్ళు ఎవరైనా ఉంటే రాముడు నడయాడిన ఆ ప్రదేశాన్ని ఇప్పుడే దర్శించుకోండి.