దేశవ్యాప్తంగా నలుమూలల నుండి మేడారం చేరుకుంటున్నారు భక్తులు. మేడారం అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రపంచ స్థాయికి సైతం మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఖ్యాతి విస్తరించింది. తెలంగాణ రాష్ట్ర మహా జాతర, భారతదేశంలోని రెండో అతిపెద్ద కుంభమేళాగా పేరుందిన సమ్మక్క సారలమ్మ జాతర ఘట్టం నేటి నుండి ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుండి సైతం పది కోట్ల మందికి పైగా ఈ వనదేవతల జన జాతరకు భక్తజనం హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలోని
ములుగు తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996 లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ముందుగా ఈ జాతరను చిలుకల గుట్ట వద్దనే జరిపే వారట క్రమక్రమంగా అమ్మవార్ల స్థానాలను మార్చి జాతరను మేడారంలో నిర్వహిస్తున్నారు.
900 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర
గిరిజన సాంప్రదాయ ప్రకారం జరిపే జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, ఈ జాతరకు సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలదు. 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
చిలకల గుట్ట రహస్యం ఏమిటి.. ?
మేడారం మహా జాతర సమ్మక్క సారలమ్మల గురించి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిలకల గుట్ట రహస్యం. ఆనాటి కాలంలో కాకతీయులతో యుద్ధం జరుగుతుండగా సమ్మక్క విరోచితంగా పోరాడి మేడారంలో ఉన్నటువంటి దట్టమైన కీ కారణ్యమైనటువంటి గుట్ట వద్దకు వెళ్లి మూలమలుపు వద్ద మాయమైపోయింది. ఆమెను వెంబడించిన కాకతీయ రాజులు, సైనికులు ఆమె వెంటే పరిగెత్తారు. ఆ మూలమలుపు వద్దకు వెళ్లిన సమ్మక్క ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. కాకతీయులకు కూడా ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. తమ ప్రాంతం కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన జంపన్న, సారలమ్మ, పగిలిద్దరాజు సమ్మక్కలను స్మరించుకుంటూ.. సమ్మక్క జాడ కోసం ఆ గిరిజన ప్రజలు చిలుకల గుట్ట వైపుగా నడిచారు. అదే సమయంలో గుట్ట పైభాగాన ఒక రాయి వద్ద కుంకుమ పసుపుతో కూడిన ఒక కుంకుమ భరణి గిరిజనులకు దర్శనం ఇచ్చింది. ఆ కీకారణ్యంలో ఎంత వెతికినప్పటికీ సమ్మక్క జాడలు కనిపించలేదు. అదృశ్యమైపోయిన సమ్మక్క దేవత రూపంలో కుంకుమ భరణి గా మారిందని గ్రహించిన గిరిజనులు ఆ క్షణం నుండి సమ్మక్క సారలమ్మలను కొలుస్తూ ఆమెకు పూజలు చేయడం ప్రారంభించారు.
ముందుగా చిలకల గట్టు వద్దనే జాతరను నిర్వహించేవారు. అయితే కీకారణ్యంతో కూడుకొని నిటారుగా ఉన్న ఆ కొండ వద్దకు జనాలు రాలేక ఇబ్బందులు పడతారని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని గ్రహించిన జాతర నిర్వాహకులు జాతరను మేడారంలో ఏర్పాటు చేశారు. అప్పటినుండి మేడారం జాతర గద్దెల వద్ద జరుగుతుంది. అయితే ఈ చిలకల గుట్ట గురించి ఎవరికీ తెలియని రహస్యాలను జాతరను నిర్వహించే సిద్ధబోయిన వంశీయులు కొన్ని విషయాలను వెల్లడించారు. అందరిలో మెదులుతున్న ప్రశ్నలు ఏమిటంటే అసలు చిలకలగుట్ట పైన సమ్మక్క ఎక్కడ ఉంటారు? ఎందుకు ఎవరూ చిలకలగుట్ట పైకి వెళ్లే సాహసం చేయరు? చిలకలగుట్ట పైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు సంబంధించిన రహస్యాన్ని ఆ జాతర వహించే సిద్దబోయిన వంశీయులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మేడారం మహా జాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్ట పై నుండి సమ్మక్కను అధికార లాంచనాలతో, ఉన్నతాధికారులు తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపి ఘనంగా స్వాగతిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళే సమ్మక్క పూజారులు అమ్మవార్లను ఆవాహనం చేసుకొని నిశ్శబ్దంగా మారిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు. రెండేళ్లకు ఒకసారి చిలకలగుట్ట పైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకువస్తారు. మళ్లీ రెండేళ్ల వరకు గుట్ట ప్రాంతం అంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం కూడా చేయరు. అమ్మవార్లను తీసుకువచ్చే పూజారులు కూడా అక్కడకు వెళ్లలేరు.
రెండేళ్లకు ఒకసారి మాత్రమే, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకువచ్చే క్రమంలో, వారం రోజులపాటు అమ్మవారిని ఆవాహనం చేసిన తమకు చిలకలగుట్ట పై మార్గం కనిపిస్తుందని సిద్ధబోయిన వంశీయులు తెలిపారు. మిగతా రోజుల్లో ఎవరికి ఆ మార్గం కనిపించదని, ఇదే చిలకలగుట్ట పై సమ్మక్క అసలు రహస్యం అని చెబుతున్నారు.
చిలకలగుట్ట పై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప, మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరు చిలకలగుట్ట పై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని, జాతర సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను, నియమ నిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయత్నస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని, ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనని చెబుతున్నారు. ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజనేతరులను కూడా తన మహిమతో కాపాడుతుందని చెప్పడానికి కోట్లాదిగా వచ్చే భక్తజనమే నిదర్శనమని సమ్మక్క వెల్లడించారు. చిలకలగుట్ట యొక్క అసలు రహస్యాన్ని, అమ్మవారి మహత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చిలకలగుట్ట పైకి వెళ్ళినట్లయితే వారికి జరిగే ప్రమాదం నుండి ఎవరు కాపాడలేరని వెల్లడించారు. ఎంతోమంది చిలకల పుట్టపై ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గుట్ట పైకి వెళ్లారని, ఒకానొక సమయంలో కొందరు వెనుతిరిగి రాలేకపోయారని చెప్పారు.
క్రూర మృగాలతో కూడి ఉన్న కీకారణ్యమైన చిలుకలగుట్ట పైకి వెళ్లాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందేనని గగూర్పొడిచే విషయాలను వెల్లడించారు. గుట్ట పైకి కేవలం జాతర సమయంలో అమ్మవార్లను ఆవహించుకున్న వారు మాత్రమే వెళ్ళగలరని, మిగతా సమయంలో ఆ ప్రాంతమంతా భయానకంగా కనిపిస్తుందని తెలిపారు. జాతర అయిపోయిన తర్వాత తిరిగి అదే స్థానంలో అమ్మవారి ప్రతిమ కలిగిన కుంకుమ భరణిని తిరిగి యధా స్థానంలో చిలకలగుట్టపై పెట్టేందుకు వెళతామని అన్నారు. అది కూడా కేవలం అమ్మవారిని ఆవాహన చేసుకున్న ఒకే ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్లాలని కీకారణ్యంలో చీకటి రాత్రిలో గుట్ట పైకి ఒకే ఒక వ్యక్తి వెళ్లి భరణిని చిలకలగుట్టపై వదిలేసి వస్తామని తెలిపారు. ఆ సమయంలో తమ ఒంటిపై అమ్మవారు ఆవహించి ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందో తమకు తెలియదని, ఒంటరిగా వెళ్లిన వ్యక్తి క్షేమంగానే వెనుతిరిగి వస్తారని అన్నారు.
జాతర అనంతరం భయానకంగా పరిసరాలు…
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం మహా జాతర భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. మహోన్నత శక్తి ఏమిటంటే కొన్ని కోట్ల మంది ప్రజలు అమ్మవారికి బంగారాన్ని (బెల్లం) సమర్పించుకుంటారు. అయితే అక్కడ అమ్మవారికి సమర్పించిన బెల్లం కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఈగలు మాత్రం వాలవు. అదే అమ్మవారి మహత్యం. అద్భుతంగా జరిగే ఈ జాతర అనంతరం అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. జాతర చివరిరోజే దుకాణదారులు, జనాలు మేడారాన్ని విడిచి వెళుతూ ఉంటారు. మనుషులన్న వారు ఒక్కరూ కనిపించరు. ఆ సమయంలో పెద్ద పెద్ద ఈగలు గుంపులు గుంపులుగా చేరుకుంటాయి. నిర్మానుషంగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఈగలతో చుట్టు ముడుతుంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారి నిర్మానుష ప్రాంతంతో భయానకంగా కనిపిస్తాయి. ఎప్పుడైతే సమ్మక్క చిలకలగుట్ట వద్దకు తిరిగి వెళుతుందో ఆరోజు నుండే జాతర ప్రాంగణం నుండి ఒక్కొక్కరు మేడారాన్ని వీడుతారు.
మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్ట ఏర్పాట్లు…
ఇక మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. హెలికాప్టర్ సేవలను సైతం అందించింది. హెలికాప్టర్ ద్వారా అమ్మవారిని దర్శించుకునే వారికి ప్రత్యేక దర్శన అవకాశాన్ని సైతం కల్పించింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కొరకు రైల్వే సదుపాయం కల్పించింది. నూతనంగా రైల్వే సర్వీస్ లోని ఏర్పాటు చేసి వరంగల్ కాజీపేట రైల్వే ప్రాంగణానికి ప్రయాణికులు చేరుకుని అక్కడి నుంచి మేడారం వచ్చేలా ప్రభుత్వం రైల్వే సదుపాయం కల్పించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మేడారం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రయాణ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ సకల సేవలను అందిస్తుంది. ఇక పోలీసు శాఖ పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహార కాస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నీడలో మేడారం జాతర జరుగుతుంది.