అధ్యాత్మ రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన “మునిపల్లె సుబ్రహ్మణ్య కవి”.

శ్రీకాళహస్తి” పేరు ఎత్తగానే మనకు జ్ఞాపకం వచ్చేవి సాలెపురుగు, పాము, ఏనుగు వాటి కైవల్యం. శ్రీకాళహస్తి అనే పేరు మూడు భాగాలతో చేయబడింది. శ్రీ (సాలిపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). పరమశివుడు, శ్రీకాళహస్తీశ్వరుడు తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు.
“శ్రీకాళహస్తి” పేరు ఎత్తగానే మనకు జ్ఞాపకం వచ్చేది కన్నప్ప “విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని కన్నప్ప బాణపు మొనతో తన కంటి గుడ్డుని పనస తొనలా వొలిచి పరమేశ్వరుడికి సర్మర్పించినాడు.
“శ్రీకాళహస్తి” పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ధూర్జటి. ఆయన అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం, శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. “రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు అంభోజాక్షి చతురంగ యానతురగీ భాషాదుల్ ఆత్మవ్యథా బీజముల్” అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో వైరాగ్యంతో కన్నీరు మున్నీరైనారు.
“శ్రీకాళహస్తి” పేరు చెప్పగానే మనకు స్ఫురణకొచ్చేది సువర్ణముఖి నది. గుండు సూది పడ్డా కనిపించేంత తేట నీటి ప్రవాహం. అన్నింటినీ మించి నిత్యం కర్పూరం కలిపిన నీటితో అభిషేకం చేసుకుంటూ లోకాన్ని చల్లగా చూసే కాళహస్తీశ్వరుడు.
శ్రీకాళహస్తి అంటే చాలామందికి తెలియని మరో రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి “ఆధ్యాత్మి రామాయణ కీర్తనలు”, రెండు వాటిని రచించిన “మునిపల్లె సుబ్రహ్మణ్య కవి”. ఇక “మునిపల్లె సుబ్రహ్మణ్య కవి” విషయానికి వస్తే..
మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి తెలుగు కవి, సంగీత విద్వాంసులు, వ్యాకరణ ప్రవీణులు. ఆయన వ్యాసప్రోక్తమైన సంస్కృత భాష లోని అధ్యాత్మ రామాయణమును తెలుగులోకి అనువదించారు. ఆయనతో బాటు మరి కొంతమంది కవులు కూడా దీనిని తెలుగులోకి అనువదించారు. కానీ అధ్యాత్మ రామాయణమును ఈయన తప్ప ఇతరులెవ్వరూ కీర్తనల రూపంలో అనువదించలేదు. సుబ్రహ్మణ్య కవి విరచిత ఈ “ఆధ్యాత్మ రామాయణ కీర్తనల ఆయన అనువాదాలన్నింటిలో మకుటాయమానమై బహుళ ప్రజాదరణ పొందినది.
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి పూర్వపు కృష్ణా జిల్లాలో గల మునిపల్లె గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కానీ శ్రీకాళహస్తి లో తన పాండిత్య ప్రదర్శన వలన అచ్చట సంస్థానధీశుని మెప్పించి వారివద్ద గురుస్థానాన్ని పొందగలిగారు. కుష్ఠు వ్యాధి సోకి, బంధువుల చేత, సంఘం చేత గెంటివేయబడి “ఆధ్యాత్మిక రామాయణాన్ని” రచించి, దైవనుగ్రహం పొంది సువర్ణముఖీ నదిలో స్నానం చేసి, వ్యాధి నుండి ఉపషమనం పొందిన వైనం ఎంతో మందికి ఆదర్శం.
నేపథ్యం…
తెలుగు దేశము సంగీతమునకు జన్మభూమి. విజయనగర సామ్రాజ్య కాలములో సంగీతం ఉన్నతస్థితి పొందింది. ఆ రాజ్యము అంతరించిన తరువాత మహమ్మదీయ శకం ప్రారంభమైంది. ప్రభువులు ప్రజలను విపరీతంగా బాధించేవారు. సరిగ్గా 17వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ సాంఘిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటం వలన సంగీతానికి బొత్తిగా ఆదరణ కరువైంది. దాంతో సంగీతం అంటే మమకారం వదులుకోలేని అనేకమంది తంజావూరు వెళ్లిపోవడం జరిగింది. సంగీతాన్ని కొనసాగించడం ఇబ్బందిగా ఉండడం వలన సుబ్రహ్మణ్య కవి పూర్వీకులు కడుపు చేత పట్టుకుని సంగీతాన్ని నెత్తిన పెట్టుకొని తంజావూరుకు వలస పోయారు. అక్కడ ఎంతో కాలం ఆనందంగా గడిపిన సుబ్రహ్మణ్య కవి తండ్రి రామలింగన్న పుట్టిన గడ్డపై మమకారం చంపుకోలేక మళ్ళీ తిరిగి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మునిపల్లె అనే గ్రామంలో స్థిరపడ్డారు. రామలింగన్నకు ముగ్గురు కుమారులు. మొదటివాడు వరదన్న, రెండవ వాడు వెంకన్న, మూడో వ్యక్తి సుబ్రహ్మణ్యం. తండ్రి సంగీత విద్వాంసుడవడం వలన వారికి సంగీతం బాగా వంటపట్టింది.
మునిపల్లె గ్రామ చరిత్ర…
ప్రాచీన కాలంలో గ్రామాల పేర్లు ఇంటి పేర్లుగా గానీ, లేక ఇంటి పేర్లు గ్రామాల పేర్లుగా గానీ వ్యవహిరించబడుతూ ఉండేవి. చరిత్ర పరిశోధకులు అంచనా ప్రకారం పురాణ కాలంలో శాతవాహన రాజ్య పరిపాలన సమయంలో దక్షిణ ప్రాంతమంతా దండకారణ్యము వ్యాపించి ఉండేదని నిర్ణయించారు. బ్రిటీషు పాలన సమయంలో కూడా ప్రస్తుత జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు మూడూ కలసి మూకుమ్మడిగా ఒకే జిల్లా కృష్ణా జిల్లాగా వ్యవహరించబడేది. పూర్వకాలంలో ఈ కృష్ణా జిల్లా అరణ్యప్రాంతముగా ఉండడమే కాకుండా కృష్ణా నదీ, కృష్ణా – సాగర ప్రాంతము కావడం వలన అనేకమంది ఋషులకు ఆశ్రయమిచ్చింది.
హంసలదీవిలో పరమహంసలు వెలుగొందగా, నేటి రేపల్లి లో ఉన్న మొరతోట ఆనాడు మునులతోటగా ప్రసిద్ధిగాంచింది. శ్రీకాకుళంలో అత్రి ముని, చ్యపలూరులో చ్యపనుడు, అవనిగడ్డలో వశిష్టుడు ముని, పెదముత్తేవిలో వ్యాస మహర్షి, విజయవాడలో విజయుడు, ఇలా తమతమ ఆశ్రమాలను నిర్మించుకొని ఈ సీమను దివిసీమగా పేరొందించారు. అందులోని భాగమే నేటి దివితాలూకా. “సుబ్రహ్మణ్య కవి” జన్మించిన మునిపల్లె ఈ ప్రాంతానికి చెందినదే. మునుల కోవకు చెందిన ఇచ్చట ఈ ప్రముఖ ముని ఇక్కడ నివసించినందున మునిపల్లె అని ఈ గ్రామమునకు పేరు వచ్చినది.
కుష్ఠు వ్యాధి సోకి…
మునిపల్లె సుబ్రహ్మణ్య బాల్యం బాగానే సాగింది. కానీ తాను యవ్వనంలోకి వచ్చిన తరువాత ఉన్నట్టుంది ఒకరోజు వొంటి మీద పొడలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత శరీరం మీద మచ్చలు రావడం మొదలైనాయి. ఆ మచ్చలకు స్పర్శ జ్ఞానం లేకపోయింది. దాంతో భయపడ్డ సుబ్రహ్మణ్యం ఒక ఆయుర్వేదం వైద్యున్ని సంప్రదించగా ఆయన సుబ్రహ్మణ్యానికి కుష్టు వ్యాధి సోకిందనే పిడుగు లాంటి వార్త చెప్పాడు. ఆయనకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆ రోజులలో కుష్ఠు వ్యాధి అంటే చాలా మంది భయపడేవారు. ఆ పేరు ఎత్తడానికి జంకేవారు. వారిని సమాజం వేలేసేది. ఆఖరికి వారి కుటుంబ సభ్యులు సైతం వారిపట్ల నిర్లక్ష్యం చూపేవారు. ఆ కుష్టు వ్యాధికి ఒక్కటే మందు ఆత్మహత్య.
ఏనాడు నేను చేసుకున్న పాపమో అని పరితపించిన సుబ్రహ్మణ్యం ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా వెంకటేశ్వర స్వామి పైన భారం వేసి తిరుపతి వెళ్ళిపోయారు. తనకొచ్చిన ఈ భయంకరమైన వ్యాధిని నయం చేయమని కన్నీటితో వేడుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు, కీర్తనలు వ్రాస్తూ కాస్త ఊరట పొందుతున్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి సంస్థానాధీశులు అయిన దామెర్ల కుమార వెంకటాద్రి సార్వభౌముల వారు ఏడుకొండల వారిని సేవించుకునేందుకు తిరుపతి వచ్చారు. అప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య కవి గానం విని ముద్దులైపోయారు. వెంటనే తన ఆస్థాన విద్వాంసుడిగా శ్రీకాళహస్తి ఆహ్వానించడం జరిగిపోయాయి.
కలలో వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి…
శ్రీకాళహస్తి సంస్థానాధీశులు కుమార వెంకటాద్రి సార్వభౌముల వారి ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తి విచ్చేసిన మునిపల్లె సుబ్రహ్మణ్య కవి “అంతా నీ లీలనే ప్రభు” అని శ్రీ వెంకటేశ్వరుడి మీదనే భారమంతా వేసి, తనకు సోకిన వ్యాధి, తన జీవిత ప్రస్థానం గురించే ఎక్కువగా ఆలోచించసాగారు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి దీర్ఘాలోచనలో పడి కన్నులు మూసి పడుకున్న సుబ్రహ్మణ్య కవికి కలలో “శంఖు, చక్రాలు ధరించి తిరునామం దిద్ది మందహాసంతో స్వామి సాక్షాత్కరించి “తనమీద కీర్తనలు వ్రాసి అంకితమిస్తే నీ వ్యాధి నయమవుతుంది” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
శ్రీకాళహస్తి సంస్థానానికి వచ్చిన సుబ్రహ్మణ్య కవికి రాజావారు సకల సౌకర్యాలు కలిగించి, ప్రశాంతంగా రచనలు చేసుకోవడానికి వీలుగా “సువర్ణముఖి నది” ఒడ్డున ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. శ్రీకాళహస్తి దేవాలయంలో ఒక బ్రహ్మీ ముహూర్తాన పరమేశ్వరుడి సాక్షిగా వెంకటేశ్వరుడు ఆజ్ఞాపించిన ప్రకారం శ్రీరామచంద్రుని కథని కీర్తనలుగా వ్రాయడానికి శ్రీకరం చుట్టాడు. అంటే శివుని సమక్షంలో విష్ణువు కథని వ్రాస్తున్నాడు. హరిహరాద్వైతం అంటే ఇదే, దాని పరమార్థం కూడా. ఆయన వ్రాసిన ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు శివుడు పార్వతికి రామాయణం చెప్పినట్లుగా ఉంటాయి. “చేరి వినవేశౌరి చరితము గౌరీ సుకుమారి గిరివరకుమారి” అనే కీర్తన దీనికి ఉదాహరణ. తెలుగు సాహితీ జగత్తులో ఇంత అలవోకగా ప్రాసలు వేసి వ్రాసిన కీర్తనలు చాలా అరుదు.
కుష్ఠు వ్యాధి మాయం…
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మిక రామాయణం వ్రాయడం పూర్తిచేశారు. కానీ అది తనకి అంకితం ఇవ్వమని రాజు పేచీ పెట్టాడు. డానికి కవి ససేమిరా అన్నాడు. రాజు కన్నా కవి బలవంతుడు. కత్తి అన్నా కలం గొప్పది. శాసనం కన్నా అక్షరాలు గొప్పవి. అందుకే గువ్వల
చెన్నుడు ఇలా అంటాడు..
“గుడి కూలును – నుయి పూడును
వడి నీళ్ళకు చెరువు తెగును
వనములు కిలమౌ
చెడనిది పద్యంబొక్కటే
కుడి ఎడమల కీర్తి గన్న గువ్వల చెన్న…
కొన్నాళ్ళ తరువాత రాజా వారు పశ్చాత్తాప పడి లెంపలు వాయించుకుని క్షమాపణ కోరి తానే స్వయంగా కవికి పల్లకి ఏర్పాటు చేసి అంకితం ఇప్పించారు. ఆ మరుసటి రోజు సుబ్రహ్మణ్య కవి “సువర్ణముఖి నది” లో స్నానం చేసేసరికి తనను ఎప్పటినుండో తనను పీడిస్తున్న “కుష్టి వ్యాధి” ఏదో మంత్రం వేసినట్టు మాయమయిపోయింది. శరీరం సువర్ణ ఛాయాలతో వెలిగిపోయింది. రాజు వెళ్లిపోయాడు, కవి కూడా వెళ్లిపోయాడు. కానీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు మాత్రం శాశ్వతంగా మిగిలిపోయాయి.
తెలుగు వారికి దొరికిన బంగారుపాత్ర…
ఆంధ్రదేశంలో వందేళ్ల క్రిందట “ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు” రాని ఆడపిల్లలు లేరు. ఇది అతిశయోక్తి కాదు, నిజంగా ఒక్కసారి ఆ కీర్తనలన్నింటినీ వింటే అది అబద్దం అని తెలుస్తుంది. ఆ కీర్తనలన్నింటినీ వింటే వాటి శక్తి ఏమిటో తెలుస్తుంది. ఆధ్యాత్మిక రామాయణం లోని కీర్తనలలోని అక్షరాల్ని పిండితే అమృతం బొట్టు బొట్టులా రాలుస్తుంది.
“ఆదిదంపతులు (ఉమా మహేశ్వర) సంవాదరూపంలో సాగిన ఆధ్యాత్మిక రామాయణంలో వేదాంతం మూర్తిభవించింది. సుబ్రహ్మణ్య కవి వట్టి విద్వాంసుడే మాత్రమే కాదు, అఖండ చిదానుభవాన్ని అనుభవించిన ఆత్మనిష్ట గల యోగిలా కనిపిస్తాడు. ఇందులో క్షేత్రయ్య ఛాయలు కానరావు. మహా భక్తుడైన జయదేవుడు కూడా అందుకోలేని తాత్విక స్థాయి ఇందులో గోచరిస్తుంది” అని హిందూ కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు ప్రమీలాదేవి గారు తమ పరిశోధన గ్రంథంలో పైవిధంగా అన్నారు.
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి వ్రాసిన “ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు” వింటుంటే శ్రీరాముడు శివుడికి క్షీరాభిషేకం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈశ్వరుడు వెంకటేశ్వరుడికి అర్చన చేసినట్టు కూడా అనిపిస్తుంది. మాణిక్యాంబ (పార్వతీదేవి) సీతమ్మ వారిని పెళ్లికూతురును చేస్తున్నట్లు అనిపిస్తుంది. తెలుగు వారు చదువుకున్న కొద్దీ దొరికే బంగారుపాత్రని దాచిన మునిపల్లె సుబ్రహ్మణ్య కవిని ఎంత స్మరించుకుంటే మన తెలుగు నేల ధన్యమవుతుంది?
రచనలు…
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మిక రామాయణమును కీర్తనల రూపంలో రచించారు. ఆయన ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలేని రాగాలు అయిన ఘంటా, హిందూ ఘంటా, రేగుప్తి, మారువ, మంగళ కౌశిక, గుమ్మకాంభోజి రాగాలను సుబ్రహ్మణ్య కవి తన గ్రంధంలో వాడారు. వీటికి తోడు అన్నమాచార్యులు వాడిన కర్ణాటక, సారంగ, గౌరీ లాంటి రాగాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో సంగీత విద్వాంసులకు అనుభవంలోకి రాని ద్విజావంతి లలిత పంచమి అను అపురూప రాగాలను కూడా తన రచనలలో వాడారు.
ఈ రాగాలన్నీ కూడా అన్నమాచార్యుల కీర్తనలతో పాటు ప్రాచీన యక్షగానాలలో ఎక్కువగా వాడుకలో ఉండేవి. మునిపల్లె సుబ్రహ్మణ్య కవి సంగీత విద్వాంసులే కాకుండా, వ్యాకరణ ప్రవీణులు కూడా అవ్వడం వలన తన కాలంలో వాడుకలో ఉన్న సంగీత వ్యాకరణ ప్రయోగాలతో రచన కొనసాగించారు. ఈ రచనలో 104 కీర్తనలు 58 వివిధ రాగాలలో రచించబడ్డాయి. కర్రా అచ్చయ్య అండ్ సన్స్, రాజమండ్రి వారు 1920 లో ఈ కీర్తనలు “శ్రీ అధ్యాత్మ రామాయణ కీర్తనలు” గా ప్రకటించారు.