HISTORY CULTURE AND LITERATURE

శోభనుతెచ్చే ‘శోభకృత్’ నామసంవత్సరాది.. ఉగాది! 

తెలుగు సంవత్సరంలో తొలి మాసం చైత్రం… 

ఎన్నో శుభదినాలకు నాంది ఈ మాసం…

వసంత నవరాత్రులు మొదలుకొని సీతారాముల కల్యాణం, వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రుల వంటి పర్వదినాలకు ఆహ్వానం పలికే శుభమాసం ఇది…

తెలుగువారితో పాటు.. మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రియులకు సైతం చైత్రాది దినమే సంవత్సరాది… 

సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈరోజునే సృష్టిని ప్రారంభించాడు. ఈరోజునే దేవతల్ని ఆయా కార్యాలకు నియమించాడు. అందువల్లే ఈరోజున సంత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణంలో రాసి ఉంది..  

‘ఉగము’ అనగా నక్షత్ర గమనం అని అర్థం. 

‘ఉగాది’ నాటి నుంచి నక్షత్ర గమనమును లెక్కిస్తారు. కాబట్టి యుగానికి ఆది అయినటువంటి ఉగాది.. రోజున తలంటు స్నానం చేసి, ఉగాది పచ్చడిని ఈశ్వరుడికి నివేదన చేసి, స్వీకరిస్తారు. దీనివల్ల జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే ఆంతర్యం బోధపడుతుంది.

శిశిరం తర్వాత వచ్చే నెలే చైత్రం.. 

పన్నెండు మాసాలలో శిశిరం చివరిది..

అది ఆకురాల్చే కాలం..

చైత్రం కొత్త చిగుళ్లు వేసే మాసం..

ఈ ప్రకారమే మానవాళిని కొత్త ఆశయాలతో, ఆశయసాధనకై మేల్కొలిపే కార్యమే.. ఈ ఉగాది.

దేవతలంతటి వారే ఈరోజు అతి ప్రాముఖ్యమైన రోజుగా భావిస్తే.. ఇక సామాన్యులం మనం పాటించడంలో ఆతర్యం ఏముంటుంది..

ఇక ఈరోజున వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు.. 

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపార లావాదేవీలను కొత్తగా తీర్చిదిద్దుతారు. 

ఇదే అనాదిగా ఆచారంగా వస్తుంది. 

అంతేకాదు..14ఏళ్ల వనవాసం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు చైత్ర శుక్ల పాడ్యమి రోజునే తిరుగు ప్రయాణమయ్యాడట. ఇటువంటి ముఖ్య కారణాల వల్లే.. ‘ఉగాది’ తెలుగువారి తొలి పర్వదినం అయిందని చెబుతారు పెద్దలు, పండితులు. ఇలా ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలూ కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకూ ప్రతిరోజూ ఓ పర్వదినంగా పరిగణించవచ్చు. 

చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటంవల్లే ఈ మాసానికి చైత్రమనే పేరు వచ్చింది. సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశియైన మేషరాశిలోనే సంచరించడమనేది మరో విశేషం.

పంచాంగ కర్తలు సైతం ఈరోజున తప్పక పాటించాల్సిన ఆచార నియమాలను చెబుతున్నారిలా… 

ప్రతి గృహధ్వజారోహణం దేవాలయాల్లో ధ్వజస్తంభం ప్రతిష్టించడం చూస్తుంటాం. పూర్వపు రోజుల్లో సంవత్సరాదినాడు ప్రతి ఇంటి ముందు ఈ ధ్వజారోహణోత్సవాలు నిర్విఘ్నంగా సాగుతుండేవి. ఇలా ధ్వజాన్ని నిలపడం విజయానికి చిహ్నంగా భావించేవారట. కొన్ని వ్రతగ్రంథాల్లోనూ ఉగాది రోజున బ్రహ్మ ధ్వజాన్ని కానీ ఇంద్ర ధ్వజాన్ని కానీ పూజించాలని రాసి ఉంది. 

రానురాను.. ఆంధ్రుల్లో ఈ కృత్యం అంతగా ఆచరణలోకి రాలేదు. కానీ అప్పట్లో ఇంటిని శుభ్రపరచుకొని, గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడాన్ని మాత్రమే పాటిస్తూ వస్తున్నాం.

అయితే ఈ ధ్వజారోహణ కృత్యాన్ని విధిగా నేటికీ  మహారాష్ట్రులు పాటిస్తున్నాయి. గుడి పర్వమని పిలుస్తారు అక్కడివాళ్లు. ఈరోజున మహారాష్ట్ర స్త్రీలు ఇంటి ముంగిళ్లను పేడ నీటితో అలికి, ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యన చౌరంగం అనే కర్రపీటను ఉంచుతారు. ఆ పీట మీద నీళ్లతో నింపిన ఒక చెంబును నెలకొల్పుతారు. అందులో ఒక రూపాయి బిళ్ళను వేసి, పైన టెంకాయను నిలుపుతారు. పూజ అనంతరం భక్ష్యాలను తింటారు. ఆలాగే ఈరోజున ఇంటి ముందు ధ్వజాన్ని తప్పనిసరిగా నెలకొల్పడం విశేషం. దానిమీద వెండి లేదా రాగి పాత్రను ఉంచుతారు. ఆ ధ్వజాన్ని ముత్యాల పూసలతో అందంగా అలంకరిస్తారు. ఇంద్రలోకంలోని ఇంద్రుడు సైతం ఈరోజున ఇటువంటి ధ్వజస్తంభాలనే నెలకొల్పుతాడని వీరి విశ్వాసం. 

తైలాభ్యంగనం అంటే, నువ్వుల నూనెతో తలంటు పోసుకోవడం. ఇది చాలా ముఖ్యమైంది. సకల శుభకార్యాలప్పుడు తలంటి పోసుకోవడం విధిగా చేస్తుంటాం. అయితే ఈ నువ్వుల నూనెతో చేయడం వల్ల.. శరీరంలోని అన్ని ఇంద్రియాలకు పాటవం కలిగి, సుఖమైన నిద్ర పడుతుందట. ఇది దీని వెనకున్న ఆంతర్యం.

నవ వస్త్రధారణం, ఛత్రచామరాది స్వీకరణ.. 

పండుగలప్పుడు కొత్త బట్టలు ధరించడం.. మంగళకరకంగా భావిస్తాం. అలాంటిది ఉగాది రోజున సంప్రదాయ వస్త్రాలు ధరించడం.. తెలుగు లోగిళ్ళకు మరింత శోభనిస్తుంది.

ఈ మాసం నుంచే ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి గొడుగును వెళ్లిన చోటుకు వెంట తీసుకెళ్లడం చాలా అవసరం. ఈరోజున గొడుగును ఎవరికైనా దానం చెయ్యడం కూడా మంచిదే. 

ఉగాది పచ్చడి.. ఆరోగ్య ప్రదాయిని

ఉగాది రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాలు చెప్పలేదు… కానీ పార్వతీపరమేశ్వరుల్నీ దర్శించుకుంటే మంచిది. 

ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించాలి.

ఆరు రుచులతో చేసే ఉగాది పచ్చడిలో…

వేపపువ్వు, చింతపండు గుజ్జు, కొత్త బెల్లం, మామిడి ముక్కలు, చెరకు రసం, ఉప్పు, కారం.. వంటి షడ్రుచులు సమ్మేళనంగా ఉంటాయి.

వేపపువ్వులోని చేదు క్రిమిసంహారిణిగా పని చేస్తుంది. కఫ, వాత, పైత్యాలను పోగొట్టి, జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. 

బెల్లం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. మామిడికాయ గుండెకు బలాన్నిస్తుంది. కాలేయానికి కూడా మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

చెరకురసం మూత్రపిండాలకు చాలా మంచిది. అధిక మూత్రాన్ని, వాతాన్ని అరికడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజునే కాకుండా శ్రీరామనవమి వరకూ తీసుకుంటే మంచిదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్నీ పర్వదినంలో భాగంగా చెబుతారు.

పంచాంగ శ్రవణం

ఈరోజున తిథి, వార, నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని వినడం వల్ల ఆ  ఏడాదంతా జరగబోయే పనులను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పనిసరి ప్రక్రియగా మారింది.

సంవత్సరం ముగింపు వరకు జరిగే విశేషాలను, రాశులవారిగా ఈరోజున బ్రాహ్మణులు వివరిస్తారు.

ప్రసాదాన వితరణఎండలు మండిపోయే ఈ వేసవి  కాలంలో మన తోటివారికి సహాయం చెయ్యటమే దీని వెనక అంతరార్ధం అయి ఉండచ్చు. అంటే ఎండని భరించలేక తాపంతో ఉండేవాళ్ళకి మజ్జిగ, మంచినీళ్ళు, ఇతర చల్లని పానీయాలు ఇచ్చి కాస్త దాహం తీర్చటం. పూర్వం అటుగా వెళ్ళేవాళ్ళు కాసేపు సేదతీరటానికంటూ ప్రత్యేకంగా ఎంతోమంది తమ ఇళ్ల ముందు తాటాకు పందిర్లు వేసి ఉంచేవారట. దీని ప్రకారం మన శాస్త్రాలు ఏవి చెప్పిన అవి నలుగురికి ఉపయోగపడేవిగానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.

తొలి నవరాత్రులూ

నవరాత్రులు అనగానే మనకు దుర్గాదేవిని పూజించే శరన్నవరాత్రులు లేదంటే గణపతి నవరాత్రులు గుర్తొస్తాయి. ఈ రెంటితోపాటూ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధనవమి వరకూ వసంత నవరాత్రుల్ని చేసే సంప్రదాయమూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది. 

ఏడాదిలో మూడుసార్లు నవరాత్రులు వస్తే… తొలి వసంత నవరాత్రుల్ని ఈ చైత్రమాసంలోనే చేస్తారు. ఈ సమయంలో శక్తిస్వరూపిణి అయిన లలితా పరమేశ్వరిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. 

అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రుల సమయంలో రామాయణ పారాయణం, రామనామ జపాన్ని కీర్తిస్తారు. ఎందుకంటే, రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజుల్లోనే జరిగాయని ప్రతీతి.  ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజులకు శ్రీరామనవమి వస్తుంది. ప్రతి ఊర్లో సీతారామ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంటుంది. ఇక సీతారాముల కల్యాణం జరిగిన తరువాతే చాలామంది తమ ఇళ్లల్లో వివాహాది శుభకార్యాల్ని తలపెట్టేందుకు ముందుకు వెళ్తారు.

ఇకపోతే చైత్ర పౌర్ణమినాడు వివిధ ప్రాంతాల్లో హనుమజ్జయంతిని ఘనంగా జరిపిస్తారు. 

భజరంగబళీ జయంతిగా పిలిచే ఈరోజున ఉపవాసం ఉండి, హనుమంతుడ్ని పూజిస్తే… చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని నమ్ముతారు.

ఇవే కాకుండా చైత్రశుద్ధ పంచమి, అష్టమి, ఏకాదశి, బహుళ త్రయోదశి ఇలా ఈ మాసం మొత్తం పర్వదినాలే కావడం విశేషం!

మరీ ఈ ఏడాది బుధవారం(22మార్చి) చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాదిగా రాబోతుంది. 

శోభకృత్ అంటే శోభను కలిగించేదని అర్థం. ఈ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగును నింపేదని.. ఉద్యానవనాలన్నీ పూలశోభతో కళకళలాడుతూ ఎలా ఉంటాయో.. ఆ  విధంగానే ఈ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉండబోతుంది. 

సర్వేజనా.. సుఖినోభవంతు..!

Show More
Back to top button