TRAVEL

తొమ్మిది రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోండిలా..!

చాలామందికి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని ఉంటుంది. కానీ, వాటన్నిటికీ వెళ్లాలంటే కనీసం 30 రోజుల సమయం కావాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ప్లాన్ చేయగలిగితే 10 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి..? ఎలా ప్లాన్ చేయాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

*మొదటి రోజు ఈ ప్రయాణం చేయడానికి విజయవాడ నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి రైలులో ఉజ్జయిని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణానికి కనీసం ఒక రోజు పడుతుంది.
*రెండవ రోజు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత.. ఆహారం తిని రోడ్డు మార్గం ద్వారా ఓంకారేశ్వర ఆలయానికి ప్రయాణించాలి. దీనికి 20 గంటల సమయం పడుతుంది.
*మూడవరోజు సాయంత్రానికి ఓంకారేశ్వర ఆలయం చేరుకుంటారు. అక్కడ బెట్‌ ద్వారకాను వీక్షించి రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
*నాలుగవరోజు ఉదయం ఓంకారేశ్వర ఆలయం నుంచి ద్వారకా ప్రయాణించాలి. రాత్రికి ద్వారకాలోని నాగేశ్వర ఆలయం చేరుకుంటాం. నాగేశ్వరుడిని దర్శించుకుని.. రాత్రి అక్కడే బస చేయాలి.
*ఐదవరోజున ఉదయం టిఫిన్‌ చేశాక, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత సోమనాథ్‌కు బయల్దేరుతారు. ఈ ప్రయాణానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. సోమనాథేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత సోమనాథ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి త్రయంబకేశ్వరం బయలుదేరాలి.
*ఆరవరోజు ఉదయం టిఫిన్‌ చేశాక త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణెకు ప్రయాణం కావాలి.
*ఏడవరోజు ఉదయం టిఫిన్‌ చేశాక భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఔరంగాబాద్‌ బయల్దేరతారు.
*ఎనిమిదవ రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని తిరిగి సికింద్రాబాద్‌ లేదా విజయవాడ‌కు ప్రయాణం కావాలి. ఇలా 7 జ్యోతిర్లింగాలను దర్శించడానికి 9 రోజులు పడుతుంది.
*దీంతో మీ సప్త జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది.

టూర్‌లో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

*మీరు చలికాలంలో ప్రయాణిద్దామనుకుంటే.. తప్పకుండా చలి కోట్లు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
*బస చేయడానికి రూం కోసం ఐడి ప్రూఫ్ తప్పకుండా తీసుకుని వెళ్లాలి.
*చాలా వరకు ప్రదేశాల్లో ప్లాస్టిక్, స్టౌలు, థర్మాకోల్ లాంటివి అనుమతించరు. కాబట్టి వీటిని తీసుకెళ్లకపోతేనే మంచిది.

టూర్ బడ్జెట్

*కేవలం రైలు, బస్సు, ఆటో ద్వారా ప్రయాణిస్తే తక్కువ ఖర్చుతో ఈ టూర్ పూర్తి చేయవచ్చు.
*హోటల్ రూం రోజుకు రూ.800 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.
*ఆహారానికి రోజుకు ఒకరికి రూ.500 అవుతుంది.
*ఈ టూర్‌కు ఒక్కరికి రూ.21 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుంది.

Show More
Back to top button