మనలో చాలామంది ప్రకృతిని ఆస్వాదించడం కోసం అనేక రాష్ట్రాల టూర్లు వేస్తుంటారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ చుట్టూ ఉన్న ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతాలను చూశారా..! ఏంటి మన ఉమ్మడి వరంగల్‌లో అన్ని జలపాతాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి మన వరంగల్ చుట్టు పక్కల జలపాతాలు ఉన్నాయి అవేంటో వాటి వద్దకు ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొగత వాటర్ ఫాల్
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత గ్రామంలో ఈ జలపాతం ఉంది. దీన్ని తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్స్‌గా పిలుస్తారు. ఈ జలపాతం దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి నీటి హొయలతో నిండి ఉంటుంది. ఇది వరంగల్ నుంచి 133 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 279 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అందాలను చూడడానికి జులై రెండవ వారం నుంచి అక్టోబర్ నెల బెస్ట్ టైం.
ముత్యం ధార వాటర్ ఫాల్
ఈ వాటర్ ఫాల్ కూడా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వీరభద్రవరం గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడి నీరు గోదావరి నదికి ఉపనది కడమ్ నది నుండి వస్తుంది. ఇది వరంగల్ నుంచి 151 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 301 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వాటర్ ఫాల్‌కి వెళ్లేందుకు అనుమతి ఇవ్వటం లేదు.
మాషేనులొద్ది వాటర్ ఫాల్
ఈ వాటర్ ఫాల్ మొత్తం నీలం రంగులో ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వరంగల్ నుంచి 132 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 278 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్‌కి వెళ్లాలంటే కొంచెం రిస్క్ చేయాల్సి వస్తుంది. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల హెవీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
కొంగల వాటర్ ఫాల్
ఈ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంగల గ్రామం నుంచి ఈ వాటర్ ఫాల్‌కు 2కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. వరంగల్ నుంచి 127 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 274 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సెప్టెంబర్-అక్టోబర్ వరకు ఈ జలపాతం అందాలను చూసేందుకు మంచి సమయం.
గుండం వాటర్ ఫాల్
ఇక్కడి వాటర్ ఫాల్‌లో వాటర్ బ్లూ కలర్‌లో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్‌కు 2.5 నుంచి 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. వరంగల్ నుంచి 129 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 275 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అందాలను చూడడానికి బెస్ట్ టైం ఆగస్టు మూడవ వారం నుంచి అక్టోబర్ నెల వరకు చూడవచ్చు.