TRAVEL

శృంగేరి టెంపుల్‌కు వెళ్లొద్దామా..

ప్రకృతి అందాలను చూడాలని అనుకునే వారు శృంగేరి టెంపుల్ టూర్‌కి తప్పక వెళ్లాలి. ఈ టూర్‌కి వెళ్లే ప్రదేశాల్లో రమణీయమైన ప్రకృతి అందాలను చూసి మైమరచిపోవడం ఖాయం అని అక్కడికి వెళ్లి వచ్చిన ప్రజలు అంటున్నారు. మరి అక్కడికి ఎలా వెళ్లాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? ఎన్ని రోజులు టూర్ ప్లాన్ చేసుకోవాలి..? ఏ సమయంలో టూర్‌కి వెళ్తే బెటర్..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగేరి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో చిక్‌మగళూరు అనే జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. ఇందులో శారదాంబ దేవి కొలువై ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి మంగళూర్ విమానంలో ప్రయాణం చేసి.. అక్కడి నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 6 గంటలపాటు సాగుతుంది.

లేదా ఇంకో రెండు మార్గాల ద్వారా కూడా శృంగేరి దేవాలయానికి వెళ్లవచ్చు. రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకుంటే ఉడుపి రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లవచ్చు.

బస్సు మార్గం నుంచి వెళ్లాలనుకుంటే ముందుగా బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి బస్సులో శృంగేరికి వెళ్లవచ్చు.

శృంగేరి బస్‌టాప్ ఆలయానికి 1 కి.మీ దూరంలో ఉంటుంది. ఆలయానికి శృంగేరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే..? విభాండక మహర్షి కుమారుడు అయిన ఋష్యశృంగుని ఆశ్రమం దగ్గర ఉన్న శృంగేరి పర్వతం వద్దనే ఈ దేవాలయం ఉంది. ఈ ప్రాంత విశేషం ఏంటంటే..? రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో కరువు రాగా..  ఋష్యశృంగుడు అడుగుపెట్టి రాజ్యాన్ని కరువు నుంచి కాపాడాడు. అందుకే ఈ ప్రాంతం ఎల్లప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

అంతేకాదు, ఆదిశంకరాచార్యులు నిర్మించిన నాలుగు శారదా పీఠాలలో ఇదే మొదటిది. ఎందుకంటే..?

ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన జరుపుతున్న సమయంలో తన పరివార శిష్యులతో ఈ ప్రదేశానికి వచ్చారు.

ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు పాము పడగ విప్పి నీడను కల్పించింది.

బద్ధ శత్రువులైన పాము, కప్పల మధ్య పరస్పర మైత్రి భావం చిగురించేలా చేసిన ఈ ప్రదేశంలోనే మొదటి శారదా పీఠం నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

ఈ దేవాలయాన్ని దర్శిస్తే ఎంతటి శత్రువులైన మిత్రులవుతారని అక్కడి ప్రజల నమ్మకం.
 
ఈ దేవాలయం దగ్గరలో విద్యాశంకర ఆలయం, శారదా దేవి ఆలయాలు ఉన్నాయి. శృంగేరికి వెళ్లినవారు ఈ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి సంవత్సరంలో ఏ రోజైనా వెళ్లవచ్చు. ఆలయంలోకి వెళ్లేటప్పుడు మీ ఐడీ కార్డు తీసుకుని వెళ్తే బెటర్.

శృంగేరి టెంపుల్ టూర్‌కి వెళ్లడానికి కనీసం 3 రోజుల సమయం కేటాయిస్తే బాగుంటుందని అక్కడికి వెళ్లినవారు చెబుతున్నారు.

మనిషికి ఒక రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఫుడ్‌కు ఖర్చవుతుంది.

రూమ్‌కి ఒక రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు అవుతుంది. ఇతర ఖర్చులు రూ.500 వరకు అవుతాయి.

ప్రయాణం ఖర్చు మీరు ఎంచుకున్న రవాణా మీద ఆధారపడి ఉంటుంది. ఈ టూర్‌కు గాను మొత్తం ఖర్చు దాదాపు రూ.4000 నుంచి 15,000 వరకు కావచ్చు.

Show More
Back to top button