అరకు అందాలను చూడాలంటే శీతాకాలం కంటే మంచి సమయం ఉండదు. వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం ప్రారంభానికి ముందు ఉండే మధ్య కాలంలో అరకు అందాలను వర్ణించలేము. చూస్తేనే ఆ అనుభవం తెలుస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో ఎప్పుడు వెళ్లిన చక్కని అనుభవం మీ సొంతం అవుతుంది. విశాఖపట్నం నుంచి దాదాపు 112 కి.మీ దూరంలో అరకు లోయలు ఉంటాయి.
ఇది సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ అందాల లోయ అణువణువులో అద్భుతం తాండవం చేస్తుంది. అక్కడి పర్వతాలు ప్రకృతి రమణీయంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అరకు వెళ్లాలంటే మీ నివాస స్థలం నుంచి విశాఖపట్నానికి ముందుగా వెళ్లాలి. ఇక్కడికి విమానాశ్రయం, రైలు, బస్సు రవాణా సౌకర్యాలు ఉంటాయి. మీ బడ్జెట్‌కి అనువైన రవాణాను ఎంచుకోండి.
విశాఖపట్నానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అరకు చేరడానికి బస్సులో, రైల్లో, టాక్సీలో వెళ్లవచ్చు. లేదా టూ విలర్ రెంట్‌కి తీసుకోవచ్చు. మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం రూ.200 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. అరకు వెళ్లిన తర్వాత చాపరాయి జలపాతం, బొర్రా గుహలు, గాలి కొండల వ్యూ పాయింట్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి జలపాతాలు, ట్రెక్కింగ్, కటికి జలపాతాలను సందర్శించవచ్చు. ఇవన్నీ.. చూడడానికి కనీసం 2-3 రోజుల సమయం పడుతుంది.
వసతి కోసం రోజుకు రూ.950 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. రోజుకు ఒకరికి ఆహారం ఖర్చు రూ.300 నుంచి రూ.400 వరకు అవుతుంది. రెండు రోజుల ట్రిప్‌కి ఒకరికి రూ.5000 నుంచి రూ.6000 వరకు అవుతుంది. కాబట్టి మీ బడ్జెట్ ప్రకారం ట్రిప్‌ని ప్లాన్ చేసుకోండి.