డార్జిలింగ్ ప్రదేశం గురించి వర్ణించాలంటే.. ప్రకృతి తన అందాలను ఆరబోసినట్లు ఉంటుంది. తన అందాల రమణీయాలు చూడడానికి రెండు కనులు సరిపోవంటే అతిశయోక్తి కాదనే చెప్పవచ్చు. ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడానికి వర్షాకాలం తప్ప ఏ కాలంలోనైనా వెళ్లవచ్చని చెబుతున్నారు పర్యాటకులు. ఈ వెచ్చని ఎండాకాలంలో డార్జిలింగ్ వెళ్తే మనసు పరవశించే ఆనందం మీ సొంతం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ ఎలా వెళ్లాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి రైలు మార్గంలో, విమాన మార్గంలో, రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. సిలిగురి నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది కాంచనజంగ పర్వత శ్రేణులలో ఉంది. మరి ఈ వేసవి సెలవులకు డార్జిలింగ్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుందామా..?
ఎలా వెళ్లాలంటే..
విమాన మార్గం : హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌లోని బాగ్దోగ్రా విమానాశ్రయానికి ఫ్లయిట్‌లో వెళ్లవచ్చు. ఇరువైపుల ప్రయాణానికి దాదాపు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు అవుతుంది.
రైలు మార్గం : డార్జిలింగ్‌కు నేరుగా రైళ్లు లేవు. కోల్‌కతాకు వెళ్లి, అక్కడి నుంచి జల్పాయిగురి వెళ్లి, అక్కడి నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. ట్యాక్సీ ఖర్చు షేరింగ్ అయితే ఒకరికి రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది. అదే బుక్ చేసుకుంటే రూ.1500 నుంచి రూ.2000 వరకు అవుతుంది.
రోడ్డు మార్గం : డైరెక్ట్ బస్సులు కూడా లేవు. బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి రైల్లో కాని విమానంలో కాని బాగ్దోగ్రా వెళ్లి.. అక్కడి నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ఇరవై గంటల పైనే సమయం పడుతుంది. లేదా మీ సొంత వాహనంలో కూడా డార్జిలింగ్ చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి డార్జిలింగ్ 1966 కి.మీ దూరం ఉంటుంది.
వైజాగ్ నుంచి డార్జిలింగ్ 1517 కి.మీ దూరం ఉంటుంది.
విజయవాడ నుంచి డార్జిలింగ్ 1845 కి.మీ దూరం ఉంటుంది.
డార్జిలింగ్‌లో చూడవలసిన ప్రదేశాలివే
*కాంచనజంగా పర్వతం
*టీ ఎస్టేట్స్
*సెంచాల్ లేక్
*బటాసియ లూప్ అండ్ ది వార్ మెమోరియల్
*జపనీస్ పీస్ పగోడా
*టాయి ట్రైన్
*మౌంటనీరింగ్ ఇన్‌స్టిట్యూట్
*టైగర్ హిల్స్
*రాక్ గార్డెన్
*రోప్ వే
*సెంచాల్ అభయారణ్యం
*టెన్జింగ్ రాక్ మీద ట్రెక్కింగ్
*చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
*లవ్ రోడ్
ఎంత ఖర్చవుతుంది..?
*మీరు ఎంచుకునే రవాణా మీద ఆధారపడి మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది.
*డార్జిలింగ్‌లో తిరగడానికి ప్రయాణ ఖర్చు దాదాపు రూ.2500 నుంచి రూ.4000 వరకు అవుతుంది.
*రూంకు రోజుకు దాదాపు రూ.1500 నుంచి రూ.2500 వరకు ఉంటుంది. ఇది సీజన్‌ని బట్టి రేటు మారుతుంది.
*భోజన ఖర్చు రోజుకు దాదాపు రూ.500 వరకు ఖర్చు అవుతుంది.
*ఎంట్రీ ఫీజులు రూ.500.
*టాయి ట్రైన్ టికెట్ ఫీజు రూ.1000 నుంచి రూ.1,500 వరకు అవుతుంది. ఎక్కువ ఖర్చు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు.
*షాపింగ్ చేయాలనుకునే వారు సెంచాల్ లేక్‌లో చేనేత వస్తువులను కొనుగోలు చేయవచ్చు.