Telugu Cinema

తెలుగు చిత్ర సీమలో దర్శక ద్రోణచార్యుడు.. వి.మధుసూదన రావు.

విజయం అంత సులభంగా దక్కదు. అందులోనూ సినిమా రంగంలో 24 విభాగాలను కలుపుకొని పోయే దర్శకులకు అది మరింత కష్టం. విజయానిది చంచలమైన మనస్సు. ఒక్క క్షణం కూడా దానికి స్థిరత్వం ఉండదు. ఒడిసి పట్టుకుందామనుకునే లోపే  పాదరసంలా మన దగ్గర నుండి జారిపోతూ ఉంటుంది. అలాంటి విజయాన్ని తన మెగా ఫోన్ కు కట్టేసుకొని ఆ విజయాన్ని తన ఇంటిపేరుగా చేసుకున్న దర్శకుడు దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారు.

ఆయన ఇంటిపేరు వీరమాచనేని, కానీ తాను అందరికీ విక్టరీ మధుసూదన రావు గానే తెలుసు. సినిమాకు అసలు పరమార్థం సామాజిక ప్రయోజనమేనని మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించిన వ్యక్తి ఆయన. దర్శక ద్రోణచార్యుడు ఆయనది సుదీర్ఘ ప్రయాణం. జానపదం మినహా సాంఘిక, పౌరాణిక, భక్తి చిత్రాలెన్నో తీసి ఎందరో నట దర్శకులను తీర్చిదిద్దిన దర్శక ద్రోణాచార్యుడు మధుసూదన రావు గారు. చుట్టూ కనిపించే సమాజంలో రకరకాల జీవితాలను తెరకెక్కించిన మధుసూదన రావు జీవితం ఒక సినిమా అనే చెప్పుకోవాలి.

కథను నమ్మిన దర్శకుడు. తనది ఎక్కడా కూడా రాజీపడని తత్వం. అదే తనకు అనేక విజయాలను తీసుకొచ్చింది. మానవ సంబంధాలను అద్భుతంగా చూపించడంలోనూ, భావోద్వేగాలని పండించే కథలను ఎంచుకోవడంలోనూ తన శైలి తప్పకుండా కనిపిస్తుంది. భావోద్వేగ సన్నివేశాలలో హృదయాన్ని హత్తుకోవడం ఎలాగో మధుసూదన రావు గారికి బాగా తెలుసు.

చిత్రీకరణ సమయంలో మధుసూదన రావు గారు పులిలా ఉండేవారని సినీ ప్రముఖులు చెబుతారు. కథను ఎంచుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనేది తన సిద్ధాంతం. కథలో ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయో పసిగట్టి అందుకు అనుగుణంగా కథనం వ్రాసుకోవాలనుకునేవారు. కథ ఏ భాష నుంచి ఎంచుకున్నా దానిని మన ప్రేక్షకులకు తగిన విధంగా మలుచుకునేవారు. పక్కాగా స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే చిత్రీకరణ మొదలవ్వాలి అనేది మధుసూదన రావు గారు తొలి నుండి ఆచరించిన సూత్రం.

ఏ రోజు కూడా మూడి ఫిల్మ్ వృధా కాకుండా జాగ్రత్తపడ్డారు. తాను దర్శకత్వం వహించిన తొలి 50 చిత్రాలలో తొంభై శాతం విజయాలే. రక్తసంబంధం, వీరాభిమన్యు, ఆరాధన, లక్షాధికారి, గుడిగంటలు, జమీందారు, మంచి కుటుంబం, భక్తతుకారం, ఆత్మీయులు, కళ్యాణమండపం, మనుషులు మారాలి, అంతస్తులు, కృష్ణవేణి, కాంచన గంగ, ఎదురీత, మల్లె పువ్వు లాంటి విజయవంతమైన చిత్రాలు మధుసూదన రావు గారి ఖాతాలోనివే.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    వీరమాచనేని మధుసూదనరావు

జననం    :    14 జూన్ 1923 

స్వస్థలం   :     ఈడుపుగల్లు, విజయవాడ, కృష్ణా జిల్లా..

తండ్రి   :   వీరమాచనేని రామభద్రయ్య 

తల్లి     :   అన్నపూర్ణమ్మ 

 వృత్తి      :    తెలుగు సినిమా దర్శకులు

భార్య        :    వీరమాచనేని సరోజిని

పిల్లలు    :   వీణా, వాణి

మరణం   :   11 జనవరి 2012

జననం…

వీరమాచనేని మధుసూదన రావు గారు కృష్ణా జిల్లాలో గల విజయవాడ ప్రక్కనున్న ఈడుపుగల్లులో 14 జూన్ 1923 నాడు వీరమాచనేని రామభద్రయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. వీరమాచనేని రామభద్రయ్య గారు సన్నకారు రైతు. వీరికి నలుగురు సంతానం. పెద్ద వాళ్ళిద్దరూ అబ్బాయిలు కృష్ణమూర్తి, మధుసూదనరావు. చిన్న వాళ్ళిద్దరూ అమ్మాయిలు చంద్రమాణిక్యం, శేషరత్నాంబ.

బాల్యం…

మధుసూదన రావు గారి బాల్యమంతా ఈడుపుగల్లులోనే సాగింది. చిన్నప్పటి నుంచి ఇబ్బందులు, కష్టాలు, సవాళ్లు మధుసూదన రావు గారి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. తాను రెండేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రెండు మూడు రోజులు మూసిన కన్ను తెరవలేదు. ఆ రోజుల్లో వైద్యం అంతంత మాత్రమే. ఏవేవో నాటువైద్యం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చుట్టుప్రక్కల వాళ్ళంతా తన మీద ఆశలు వదులుకోమని తల్లికి చెప్పారు. తన తల్లి తల్లడిల్లిపోయింది. కానీ అదృష్టవశాత్తు తన గండం గట్టెక్కింది. తనకు నయమైపోయింది. ఆ తర్వాత తన ఏడేండ్ల వయస్సులో తన తల్లిగారు మరణించారు.

ఆ వయస్సులో తన తల్లికి అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. అంత హృదయ విదారక పరిస్థితులను ఎదుర్కొన్నారు మధుసూదన రావు గారు. రెండేళ్ల చిన్న చెల్లెలు, నాలుగేళ్ల పెద్ద చెల్లెలు, అంత చిన్న వయస్సులో తల్లిని పోగొట్టుకుని సొంత కాళ్ళ మీద నిలబడడం, తోబుట్టువులకు అండగా నిలవడం అంటే ఏంటో అభ్యాసాత్మకంగా తెలుసుకున్నారు. ఎలమర్రు లో ఉన్న పెద్దమ్మ ఈడుపుగల్లులో ఉన్న నాయనమ్మ వారి బాగోగులు చూడడం మొదలుపెట్టారు. తన నానమ్మకు వయసు మళ్ళి రేచీకటి రావడంతో, మధుసూదన రావు గారే తన చెల్లెళ్లకు స్నానాలు చేయించడం, సైకిల్ మీద చెల్లెళ్లను బడికి తీసుకెళ్లడం లాంటివి చేసేవారు.

విద్యాభ్యాసం…

సుంకర సత్యనారాయణ రావు గారి లాంటి కమ్యూనిస్టుల వల్ల మధుసూదన రావు గారు గోచిపెట్టి, కావడి కట్టి, ఇంటింటికీ తిరిగి విదేశీ వస్త్రాలు సేకరించి వాటిని కాల్చేయడం లాంటివి చేస్తూ దేశభక్తి భావాలను వంట పట్టించుకొన్నాడు. తన ప్రాథమిక విద్య ఈడుపుగల్లు లోనే అయిపోయింది. ఊళ్లో కూలి వాళ్లతో కలిసి వేరుశనగ కోతకు వెళ్లేవారు. సంక్రాంతి రోజులలో కుప్పలు నూర్చిన పొలంలో పరిగె ఏరుకునేవారు. అవి అమ్మగా వచ్చిన పావలా, అర్థ రూపాయ దాచుకునేవారు. వేసవికాలంలో సోడా అమ్మేవాడు.

అలా స్వయంకృషితో పునాదిపాడు లో 1934 నుండి 1940 వరకు హై స్కూల్ చదువు కొనసాగించారు. 1938 – 39 ప్రాంతాల్లో స్టూడెంట్ ఫెడరేషన్ లో సభ్యుడయ్యాడు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కనుక్కోవడమే స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క ఆశయం. తాను ఎస్.యల్.సి లో ఉండగానే “అన్నే సత్యనారాయణ” గారు వ్రాసిన నాటకాల్లో వేషం వేయడంతో తన రంగస్థలం జీవితం ప్రారంభమైంది. నష్టపోయిన విద్యార్థిగా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గా రెండు పాత్రలు ఆ నాటకంలో వేశారు.

ఆ నాటకంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని అనుకరిస్తూ వ్యంగ్యంగా తనను చిత్రీకరించినందుకు, ఆ ప్రధానోపాధ్యాయుడు మధుసూదన రావు గారి సర్టిఫికెట్లపై తన ప్రవర్తన అసంతృప్తికరం అని వ్రాశారు. 16 ఏళ్ల వయస్సులో ఆ సర్టిఫికెట్ ని తీసుకొని రెండు మూడు కళాశాలలకు వెళ్లారు. తనను చేర్చుకోలేదు. చివరిగా గుంటూరు హిందూ కళాశాలకు వెళితే “కండక్ట్ సర్టిఫికెట్” తో సంబంధం లేకుండా మార్కులు చూసి సీటు ఇచ్చారు. మధుసూదన రావు గారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని సగం ఫీజులో రాయితీ ఇచ్చారు. అలా గుంటూరులో తన కళాశాల చదువు 1940 లో ప్రారంభమైంది.

పూర్తిస్థాయి కమ్యూనిస్టుగా…

తాను కళాశాల చదువుకునే సమయంలో గుంటూరులో స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలతో కమ్యూనిస్టు కార్యాలయంలో ఉండగా నిషేధిత పుస్తకాలు కలిగి ఉన్నందుకు తనను పోలీసులు అరెస్టు చేసి మూడు వారాలు జైల్లో ఉంచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ పరీక్ష వ్రాయడం పూర్తవ్వగానే పోలీసులు మళ్లీ రెండవసారి అరెస్టు చేశారు. ఈసారి మధుసూదన రావు గారిని బళ్లారి జైల్లో ఉంచారు. తాను విడుదలై వచ్చేసరికి ఇంటర్ రెండవ సంవత్సరం ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ గారు తనను రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేశారు. అయితే రెండు సార్లు జైలుకు వెళ్లడం, కమ్యూనిస్టు కార్యకర్తలు, పెద్దవాళ్లతో పరిచయాలతో కళాశాల చదువుకు స్వస్తి చెప్పి గురజాల లో పూర్తి స్థాయి కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టారు.

తన పట్టుదల, కఠోర దీక్ష, కష్టపడే మనస్తత్వం, అంకితభావం చూసి తనకు కృష్ణాజిల్లా స్టూడెంట్ ఫెడరేషన్ సెక్రటరీగా బాధితులు అప్పగించారు. తమ్మారెడ్డి సత్యనారాయణ గారు స్టూడెంట్ ఫెడరేషన్ కు ఆర్గనైజర్ గా ఉండేవారు. ఏడు ఎనిమిది సంవత్సరాలు కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగాయి. జిల్లా విద్యార్థి సంఘ సమావేశాల కోసం విరాళాల సేకరణ, అందులో భాగంగా చదలవాడ పిచ్చయ్య గారు బెంగాల్ కరువు ఆధారంగా వ్రాసిన “ప్రతిమ” అనే నాటకం ప్రదర్శించడం, నాటకంలో నటించడం, నాటకాల నిర్వహణ కూడా చేసేవారు మధుసూదన రావు గారు.

ఈ నాటకంలో సినిమా నటులు పెరుమాళ్ళు కూడా నటిస్తుండేవారు. ఆ రోజులలో మధుసూదన రావు గారు విజయవాడ లోని మొగల్రాజపురంలో నివసిస్తుండే వారు. తనకు తాతినేని ప్రకాష్ రావు గారు, చదలవాడ కుటుంబా రావు గారు వీళ్లంతా తనకు పరిచయమయ్యారు. స్టూడెంట్ ఫెడరేషన్ లో ఎదుగుతూ 1945 డిసెంబర్ లో “ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్” కి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. విద్యార్థులందరినీ ఒకే తాటి మీద నడపాలనే లక్ష్యంతో పనిచేసేవారు మధుసూదన రావు గారు. ఆ క్రమంలో తాను “ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్” కి ఉమ్మడి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

వివాహం..

1946 మార్చి 13 నాడు కమ్యూనిస్టు సాంస్కృతిక దళంలో పనిచేస్తున్న సరోజిని గారితో మధుసూదన రావు గారి వివాహం జరిగింది. సరోజిని గారి నాన్నగారు అట్లూరి సుబ్రహ్మణ్యం గారు బడి పంతులు. వారిది గన్నవరం తాలూకా లోని ఆత్కూర్ అనే ఊరు. సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు, సరోజిని గారికి బాబాయి గారు అయిన అట్లూరు శ్రీమన్నారాయణ గారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. మధుసూదన్ రావు గారు శ్రీమన్నారాయణ గారితో కలిసి పనిచేస్తుండేవారు. ఒక సభలో మధుసూదన్ రావు గారి ప్రసంగాన్ని విన్న సరోజిని గారు, తనను వివాహం చేసుకోవాలని అనుకున్నారు. చదువు మానేసి పార్టీలో తిరుగుతున్న మధుసూదన రావు గారికి సరోజినిని ఇస్తారనే నమ్మకం ఆమెకు కలగలేదు. అలాగని తండ్రిని ఒప్పించే ప్రయత్నాలు కూడా తాను మానలేదు.

కూతురు పట్టుదల, తమ్ముడు శ్రీమన్నారాయణ ప్రోద్భలంతో మధుసూదన్ రావు గారికి సరోజిని గారిని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నారు  22 సంవత్సరాల మధుసూదన్ రావు గారి పెళ్లి నాడు తోరణాలు అరుణ పతాకంతో, ముగ్గులు కూడా ఎరుపు రంగులోనే వేసి ఉంచారు. చుట్టుప్రక్కల ఉన్న కమ్యూనిస్టు కార్యకర్తలందరూ తరలివచ్చారు. వాకిట్లో ముగ్గులతో బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి లాంటి కమ్యూనిస్టు నినాదాలతో   ఉదయం 10 గంటలకు మొదలుకొని మధుసూదన రావు, సరోజిని గార్లు దండలు మార్చుకొని దంపతులు అయ్యారు. “మధు సమేత సరోజినీ, సరోజినీలోని మధుకి” అని వ్రాసి ఉన్న అమర ప్రేమ అనే పుస్తకాన్ని వీళ్ళకి బహుమతిగా ఇచ్చారు. ఆరోజు పెళ్లి ఖర్చు మొత్తం 25 రూపాయలు అని మధుసూదన్ రావు గారు తన సన్నిహితుల దగ్గర పలుమార్లు ప్రస్తావించారు.

ప్రజా నాట్యమండలి..

గరికపాటి రాజారావు గారు స్థాపించిన ప్రజానాట్య మండలి తరుపున నాటకాలలో మధుసూదన రావు గారు “మా భూమి” నాటకం వేసేవారు. తన భార్య సరోజిని గారిని కూడా నాటకాలలో పాత్రలు వేసేందుకు మధుసూదన్ రావు గారు ప్రోత్సహించేవారు. విజయవాడలో “ఆంధ్ర కళా నాట్య పరిషత్” పోటీలు జరిగినప్పుడు మధుసూదన రావు గారి బృందం “మాభూమి” నాటకం ప్రదర్శిస్తే, మరో బృందం వచ్చి “చేసిన పాపం” అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో నటించిన ఒక నటుడు తర్వాతి కాలంలో తెలుగు సినిమాలో తిరుగులేని నటుడయ్యారు (వారే ఎన్టీఆర్ గారు. తనతో కూడా మధుసూదన్ రావు గారు సినిమాలు తీశారు).

ఎన్.ఏ.టి అనే నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేస్తుండే వారు ఎన్టీఆర్ గారు. అందులో భాగంగా “అనార్కలి” నాటకం వేస్తూ అందులో సలీం పాత్రను వేస్తుండేవారు. ఎన్టీఆర్ గారు సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళినప్పుడు, ఆ సలీం పాత్రను మధుసూదన రావు గారు వేస్తుండేవారు. ఆ క్రమంలో మధుసూదన రావు గారు వేసిన “మా భూమి” నాటకాన్ని, సరోజిని గారు నటించిన “అపనింద” అనే నాటకాన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు “ఎల్వీ ప్రసాద్” గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నాటకం అవ్వగానే వేదికను ఎక్కిన ఎల్వి ప్రసాద్ గారు మధుసూదన రావు గారిని ప్రత్యేకంగా అభినందించారు.

సినీ రంగ ప్రవేశం…

మధుసూదన రావు గారు మద్రాసుకు వెళ్లి “రామకృష్ణ మిషన్ పాఠశాల” లో డ్రిల్ మాస్టర్ గా ఉద్యోగంలో చేరారు. ఆ రోజులలో ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయిలు ఆనంద్ ప్రసాద్, రమేష్ ప్రసాద్ లు మధుసూదన్ రావు గారి శిష్యులే. తనకు జీతం సరిపోక మద్రాసు లో ఉండే ధనవంతుల పిల్లలకు ట్యూషన్ చెబుతుండేవారు. తమ కుటుంబం విజయవాడలో ఉండి తాను మద్రాసు లో ఉండడం నచ్చని మధుసూదన రావు గారు మద్రాసు నుండి విజయవాడ లోని మొగల్రాజపురం వచ్చి అక్కడ మున్సిపల్ స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా చేరి పాఠాలు చెబుతూ, ట్యూషన్లు కూడా చెబుతుండేవారు. 1951 లో రెండో పాప జన్మించింది. ఆమెకు వాణి అనే పేరు పెట్టుకున్నారు.

దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారి ఒకప్పుడు కమ్యూనిస్టు మిత్రుడు అయిన తాతినేని ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో “పల్లెటూరు” అనే చిత్రం అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుండగా యూనిట్ అంతా విజయవాడ వచ్చింది. పాత పరిచయాలతో తాతినేని ప్రకాష్ రావు గారిని కలిసి ఆ సినిమా లో ఒక చిన్న పాత్ర ధరించారు మధుసూదన రావు గారు. వారితో పాటు కోడూరు అచ్చయ్య, పెరుమాళ్ళు, చదలవాడ లాంటి వాళ్లు కూడా నటించారు. కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేయడం, ప్రజా నాట్యమండలి మూత పడటంతో వీళ్లంతా మద్రాసు సినీ పరిశ్రమకు చేరుకున్నారు. తాతినేని ప్రకాష్ రావు, తాతినేని చలపతిరావు గార్లు కూడా అలా వచ్చినవారే.

ఎల్వి ప్రసాద్ గారి పర్యవేక్షణలో రంగనాథ్ దాసు గారి దర్శకత్వంలో “దాసి” అనే చిత్రం తీస్తున్నారు నిర్మాత లక్ష్మీరాజ్యం గారు. ఎల్వీ ప్రసాద్ గారి సిఫారసు మేరకు దాసి చిత్రంలో పనిచేయడానికి మధుసూదన్ రావు గారికి అవకాశం దొరికింది. నెల జీతం వచ్చే దర్శకత్వ శాఖలో పనిచేస్తూ, నటుడుగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు మధుసూదన రావు గారు. దాసి చిత్రం నిర్మాణంలో ఉండగా ప్రకాష్ స్టూడియో లో శాశ్వత ఉద్యోగులుగా కె ఎస్ ప్రకాష్ రావు గారి వద్ద నెలకు ₹100 తో ఉద్యోగంలో చేరారు మధుసూదన రావు గారు. కన్నతల్లి సినిమా కోసం మధుసూదన రావు గారు నటీ నటులకు సంభాషణలు నేర్పేవారు. కన్నతల్లి, అంతేకావాలి, బాలనందం సినిమాలకు పనిచేశారు. ఆ సమయంలోనే మధుసూదన రావు గారికి ఆదుర్తి సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది.

తొలిసారి దర్శకత్వం “సతీ తులసి” …

చదలవాడ కుటుంబరావు, వి.శ్రీరామమూర్తి గార్లు నిర్మించిన “సతీ తులసి” (1959) కి తొలిసారి దర్శకత్వం వహించారు మధుసూదన రావు గారు. కమ్యూనిస్టు భావాలు, హేతువాద ధోరణి కలిగిన మధుసూదన రావు పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించడమేమిటి అని పలువురు వ్యాఖ్యలు కూడా చేశారు. “సతీ తులసి” తో ఆయన ఆర్థిక విజయాన్ని అందుకోలేక పోయినా దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. వి.బి.రాజేంద్రప్రసాద్ గారు “జగపతి ఆర్ట్ పిక్చర్స్” ను స్థాపించి  మధుసూదన రావు దర్శకత్వం లో తమ తొలి చిత్రం “అన్నపూర్ణ” (1960) ను నిర్మించారు. అదే సమయంలో నందమూరి తారకరామారావు గారితో “టాక్సీ రాముడు” చేశారు.

ఆ తరువాత నటుడు జగ్గయ్య గారు నిర్మించిన రాజకీయ అభ్యుదయ చిత్రం “పదండి ముందుకు” (1962) మధుసూదన రావు గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియా , తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 5వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది. రష్యన్ జ్యూరీ సభ్యుడు అలెగ్జాండర్ రౌ నుండి ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఈ చిత్రం విమర్శకుల ఆదరణ పొందింది. మధుసూదన రావు గారికి కీర్తి ప్రతిష్టలు దక్కేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత వచ్చిన ఆరాధన, రక్తసంబంధం లక్షాధికారి, ఆత్మబలం, గుడిగంటలు అంతస్తులు, వీరాభిమన్యు ఇత్యాది వరుస విజయాలతో మధుసూదన రావు గారి పేరు మార్మోగిపోయింది. అప్పటి నుండి విక్టరీ అనేది ఆయన ఇంటి పేరు అయిపోయింది.

రక్త సంబంధం…

తమిళంలో ఘన విజయం సాధించిన “పాశమలర్‌”  చిత్రానికి తెలుగు వెర్షన్‌, రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్‌ వారి “రక్త సంబంధం”. 1-11-1962 లో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని మొదట అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి లతో తీయాలనుకున్నారు.

కానీ అక్కినేని గారు సావిత్రికి అన్నగా నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఎన్‌.టి.ఆర్‌. గారు ఆ పాత్రను పోషించారు.

ఎన్‌.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్ల పాత్రలలో విడదీయరానంతగా ఆ పాత్రల్లో లీనమై నటించారు.

తోబుట్టువు సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అన్నయ్యగా ఎన్‌.టి.రామారావు గారు ప్రేక్షకుల్ని ఏడిపించేశారు.

ప్రతీ మహిళ ఈ చిత్రంలోని అన్న లాంటి అన్న తనకూ ఉంటే బావుండునని అనుకున్న చిత్రమిది.

“బంగారు బొమ్మ రావేమే” అనే పాట లేని పెళ్లిపందిరి, “చందురుని మించు అందమొలికించు” అన్న జోలపాట పాడని తల్లి ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలు ఎన్‌.టి.ఆర్‌, సావిత్రి గార్ల నటనకు గొప్ప ఉదాహరణలుగా నిలిచాయి. 10-10-1988న జంటనగరాల్లో మరోసారి విడుదలై రిపీట్‌ రన్‌లో కూడా వందరోజుల ఆడి విజయపతాకం ఎగురవేసిందీ చిత్రం. 05-02-1989న హైదరాబాద్‌ చిక్కడపల్లి ఫంక్షన్‌ ప్యాలెస్‌లో ద్వితీయ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

కాగా వి. మధుసూదన రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించారు.

రీమేక్ కింగ్..

సంభాషణలతో సహా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకుండా ఏనాడు సినిమా షూటింగ్ మొదలు పెట్టేవారు కాదు. ఇక పరభాష చిత్రాలను విజయవంతంగా పునర్నిర్మించడంలో దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారు తనకు తానే సాటి అనిపించుకున్నారు. తమిళంలో శివాజీ గణేషన్ ప్రధాన పాత్ర పోషించిన పాశమలర్ చిత్రాన్ని ఎన్టీఆర్ తో “రక్తసంబంధం” గా మధుసూదన రావు గారు పునర్నిర్మించారు. ఆ సినిమాతోనే తెలుగు వారికి ఎన్టీఆర్ అన్నగా మారిపోయారు. బెంగాలీ “సాగరిక”ను తెలుగులో “ఆరాధన” గాను, మలయాళ “తులాభారం” ను తెలుగులో “మనుషులు మారాలి” గాను, హిందీ “అమానుష్”ను తెలుగులో “ఎదురీత” గాను, గురుదత్  ప్యాసా ను తెలుగులో “మల్లెపువ్వు” గాను, జాకీష్రాఫ్ హీరోను తెలుగులో “విక్రమ్” గాను పునఃసృష్టించి రీమేక్ కింగ్ అనిపించుకున్నారు మధుసూదన రావు గారు.

కొత్త దర్శకులకు గురు బ్రహ్మ…

దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారి దగ్గర శిష్యరికం చేసి దర్శకులుగా ఎదిగిన వారు దాదాపు 75 మంది పైగానే ఉన్నారు.

పి.సి.రెడ్డి గారు, కే.రాఘవేందర్రావు గారు, యం.మల్లికార్జున రావు గారు, వి.రామచంద్ర రావు గారు, కే.ఎస్.రామిరెడ్డి గారు, ఎస్.గోపాలకృష్ణ గారు, తమ్మారెడ్డి లెనిన్ బాబు గారు, ఏ.కోదండరామిరెడ్డి గారు, వంశీ గారు, శివ నాగేశ్వరరావు గారు, జి.సి.శేఖర్ గారు ఇత్యాది దర్శకులంతా మధుసూదన రావు గారి దగ్గర ఓనమాలు నేర్చుకున్న వారే. “రక్తసంబంధం” తో ముల్లపూడి వెంకటరమణ గారిని సినీ రచయితగా పరిచయం చేశారు. ఇలా చాలామంది సాంకేతిక నిపుణులు కూడా మధుసూదన్ రావు గారి దగ్గర పరిచయం అయ్యారు.

మంచి హస్తవాసి

దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారి హస్త వాసి చాలా మంచిది అంటారు. సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా తెరమీద కనపడింది మధుసూదన్ రావు గారు తీసిన “పదండి ముందుకు” చిత్రంలో. ఏ.ఎన్.ఆర్ తన నట వారసుడుగా నాగార్జునని పరిచయం చేయాలనుకున్నప్పుడు తనకు గుర్తొచ్చింది మధుసూదన రావు గారే. విక్రమ్ తో “నాగార్జున”కు బలమైన పునాది వేశారు మధుసూదన రావు గారు. జగపతిబాబు, రమేష్ బాబుల తొలి చిత్రాలు కూడా మధుసూదన రావు గారి చేతుల మీదుగానే రూపొందాయి. శోభన్ బాబు, కాంచనలకు నటనలో మెలకువ నేర్పించింది కూడా మధుసూదన రావు గారే కావడం విశేషం.

పురస్కారాలు..

1967 వ సంవత్సరంలో “అంతస్థులు” తెలుగు చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డు వరించింది.

దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారు తెలుగు చలనచిత్ర సీమకు చేసిన సేవలకు గానూ 1997 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.

1964 లో గుడి గంటలు చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1965 లో “అంతస్థులు” చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1966 లో “ఆస్తిపాస్థులు” చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1969 లో “ఆత్మీయులు” చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1972 లో “ప్రజా నాయకుడు” చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1984 లో “కాంచనగంగ” చిత్రానికి ఉత్తమ చిత్రం గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

దర్శకుడిగా చిత్ర సమాహారం..

సతీ తులసి

అన్నపూర్ణ

టాక్సీ రాముడు

పదండి ముందుకు

రక్త సంబంధం

అప్పగింతలు

ఆరాధన

లక్షాధికారి

ఆత్మ బలం

గుడి గంటలు

జమీందార్

అంతస్తులు

వీరాభిమన్యు

ఆస్తిపాస్తులు

డా. ఆనంద్

మంచి కుటుంబం

లక్ష్మీ నివాసం

అదృష్టవంతులు

ఆత్మీయులు

మనుషులు మారాలి

పవిత్ర బంధం

అమాయకురాలు

కల్యాణ మండపం

ప్రజా నాయకుడు

మంచి రోజులు వచ్చాయి

కన్న కొడుకు

భక్త తుకారాం

జేబు దొంగ

ఇద్దరు ఇద్దరే

చక్రధారి

ఎదురీత 

మల్లెపూవు

చండీప్రియ

బంగారు కానుక

విక్రమ్

సామ్రాట్

మరణం…

బయట మృధు స్వభావిగా కనిపించే దర్శక ద్రోణచార్యుడు మధుసూదన రావు గారు షూటింగ్ లోకేషన్ మాత్రం చంఢశాసనుడిగా వ్యవహరించేవారు. టైం అంటే టైం.

చిత్రికరణకు ఆలస్యంగా వచ్చినా, సరిగ్గా సంభాషణలు చెప్పకపోయినా కోప్పడే వారు. ఆ భయంతోనే అందరు తన దగ్గర క్రమశిక్షణ గా ప్రవర్తించేవారు.

మొదటి నుంచి కన్నీళ్లతోని, కష్టాలతోనే పోరాటం చేస్తూ విజేతగా నిలిచిన మధుసూదన రావు గారు తన జీవితం చివరి మజిలీలో మాత్రం పక్షవాతంతో పోరాడి ఓడారు.

దాదాపు 11 ఏళ్లు ఆయన పక్షవాతం తో ఇబ్బంది పడ్డారు. అయినా కూడా చివరి క్షణం వరకు దర్శకత్వం చేయాలని తపపించారు. కానీ తన శరీరం సహకరించలేదు.

మధుసూదన రావు గారు తన 89 సంవత్సరాలు వయస్సులో 11 జనవరి 2012 బుధవారం రాత్రి 6:30 గంటలకు హైదరాబాదులో తుది శ్వాస విడిచారు.

మధుసూదన్ రావు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సరోజినీ దేవి 1999 లోనే మరణించారు.

మధుసూదన్ రావు గారు తన సినీ జీవితంలో 72 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Show More
Back to top button