CINEMATelugu Cinema

పులకించని మది పులకింప జేసే నేపథ్య గాయని… జిక్కీ..

మన సినీ వినీలాకాశంలో ఎన్నెన్నో తారలు. కొన్ని తారలు తెర ముందు అద్భుతమైన  అభినయాన్ని పండిస్తే మరి కొన్ని కనిపించని తారలు ఆ అభినయానికి రాగాల వన్నెలు అద్దుతాయి. వారే “నేపథ్య గాయకులు”. ఆ రోజుల్లో మహిళా గాయనీ మణులు చాలా తక్కువ మంది ఉండే వారు. మంచి గాత్రం తో పాటు, శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండటం వారి ప్రాథమిక అర్హత. అలాంటి గాయనీ మణులలో పి.లీల, పి.సుశీల, యస్.జానకి, పి.భానుమతి, బి.వసంత, జమునారాణి, ఎల్లారీశ్వరి వారు చాలా మందే ఉన్నారు. వారిలో జిక్కీ (పి.జి.కృష్ణవేణి) ఒకరు. పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కీ సొంతం.

జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. చిన్న వయస్సు లోనే జిక్కీ చిత్ర పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. తండ్రితో పాటు స్టూడియోల్లో తిరుగుతున్న బాల జిక్కీని చూసి పంతులమ్మ సినిమాలో బాలనటిగా అవకాశం ఇచ్చారు గూడవల్లి రామబ్రహ్మం గారు. కానీ తాను నటిగా కొనసాగలేదు. నేపథ్య గాయనిగానే స్థిరపడింది. ఒకే స్వరంలో అటు మధురానుభూతిని, ఇటు కవ్వింపునీ పలికించగల గాయని జిక్కి. ఆమె పాట వింటే పులకించని మది పులకిస్తుంది, ఆమని హాయిగా సాగుతుంది.  ఎన్ని సార్లు విన్నా ఆమె గాత్రంపై మోజు తీరలేదు అనిపిస్తుంది. సినీ నేపథ్య గాయకులలో సంగీత జ్ఞానం కన్నా హావాభావాలు పలకడం ముఖ్య లక్షణం గా ఉండాలి.

మహేష్ బాబు గారి “మురారి” సినిమాలోని “అలనాటి రామ చంద్రుడి కన్నింటా సాటి” అనే పాట వినగానే గుర్తొచ్చే గాయని కూడా జిక్కినే. తన పూర్తి పేరు “పిల్లపాలు గజపతి కృష్ణవేణి”. తనను పి.జి.కృష్ణవేణి అని, జిక్కీ అని కూడా పిలుస్తారు. ఎక్కడ ఏ రాగం ఎలా పలకాలో తెలియకపోతే అది పాట కాదు పచ్చడి అవుతుంది. మరి వీటికి పూర్తిగా విరుద్ధం ఈ జిక్కీ. జీవితంలో ఒక్క రోజు కూడా సంగీతం నేర్చుకొని జిక్కి గాత్రం నుంచి పాటల మధురిమలు తొణికిసలాడేవి. దేనికి పులకించని వారిని కూడా తన గాన మాధుర్యంతో పులకించగల గాత్రం జిక్కి సొంతం.

అప్పటి సినీ సంగీత దర్శకులందరి దృష్టి జిక్కి మీదనే. 1950 దశకంలో దక్షిణ సినీ పరిశ్రమలో గాయనిగా జిక్కికి తిరుగులేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ ఇలా ఏ భాషలోనైనా ఆమె గాత్రమే వినిపించేది. మొత్తం పది వేలకు పైగా పాటలు పాడారు. సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారికి జిక్కి బాగా నచ్చేది. సువర్ణ సుందరిలో అజరామర గీతం “హాయి హాయిగా ఆమని సాగే” లాంటి పాటలెన్నో జిక్కితోనే పాడించుకున్నారాయన. “పంతులమ్మ” లో బాలనటిగానే కాదు, గాయనిగానూ తనేమిటో చెప్పే ప్రయత్నం చేశారు జిక్కి. ఇంకా “త్యాగయ్య”, “మంగళసూత్రం”, “గొల్లభామ” చిత్రాల్లో నటించారు. తర్వాత “జ్ఞానసుందరి” అనే తమిళ సినిమాతో పూర్తి గాయనిగా మారారు.

జిక్కీ గారు తన గొంతు పలకడంలో శృతి సమస్య లేదు. ఇంత శృతి అయితే పలుకుతుందనే బాధ లేదు. సంగీత దర్శకులు ఎంత శృతి పెట్టినా ఎలా కావాలంటే అలా పాడేయగల సామర్థ్యం ఆమెకుంది. శృంగార రస ప్రధానమైనవి, జానపద పద్ధతిలో ఉన్నవి ఎక్కువగా పాడారు. అయినా శాస్త్రీయ బాణీలు, భక్తి కూడా అవలీలగా పాడి ఒప్పించారు. నాకు పాడడం వచ్చింది అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం, నాదేం లేదు. ఆ దేవుడిచ్చిన కంఠంతో నేను దాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చాను. ఎప్పుడు పాడుతూనే ఉండాలని నా కోరిక అనే వారు జిక్కీ గారు. సుమారు 15 ఏళ్లు నేపథ్య గాయనిగా సంగీత అభిమానులను అలరించిన జిక్కీ గారు ఎన్నో గొప్ప పాటలు పాడారు. చరిత్రలో తన స్థానం ఎప్పటికీ పదిలం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పిల్లవాలు గజపతి కృష్ణవేణి

ఇతర పేర్లు  :  జిక్కీ  

జననం    :     03 నవంబరు 1935    

స్వస్థలం   :    చంద్రగిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

వృత్తి      :     నేపథ్య గాయని

శైలి      :    సినిమా సంగీతం ( ప్లేబ్యాక్ సింగింగ్ ), భారతీయ శాస్త్రీయ సంగీతం

తండ్రి    :     గజపతి నాయుడు 

తల్లి     :     రాజకాంతమ్మ

జీవిత భాగస్వామి :  ఏమల మన్మధరాజు రాజా 

మరణం  :   16 ఆగష్టు 2004, చెన్నై , తమిళనాడు, భారతదేశం..

నేపథ్యం…

జిక్కీ గారు 03 నవంబరు 1935 నాడు చెన్నైలో జన్మించారు. తన తండ్రి గజపతి నాయుడు మరియు తల్లి రాజకాంతమ్మ. చెన్నైలో వీరిది తెలుగు కుటుంబం. వారు ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నుండి జీవనోపాధి కోసం చెన్నైకి  వెళ్లారు. జిక్కీ గారి మేనమామ, దేవరాజు నాయుడు. ప్రముఖ కన్నడ థియేటర్ లెజెండ్ మరియు చలనచిత్ర మార్గదర్శకుడు గుబ్బి వీరన్నతో సంగీత స్వరకర్తగా పనిచేశారు. తానే చిన్న వయస్సులో జిక్కీ గారిని చలనచిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు.

పందిట్లో పెళ్లవుతున్నాది, కనువిందవుతున్నాది, నటనమే ఆడెదనూ, నటనమే ఆడేదనూ అంటూ ప్రతీ పెళ్లి పందిట్లోనూ మారుమ్రోగిన గళం ఆంధ్రులందరికీ సుపరిచితమే. మధురమైన కంఠం జిక్కిది. పీ.జీ.కృష్ణవేణి గా మొదట్లో కొన్ని సినిమాల టైటిల్స్ లో కనిపించినా కూడా తాను జిక్కీగానే తన సుస్థిర కీర్తి నార్జించారు. ఆమెని మొదటి నుండి ఎరుగున్న వారు “అంత అమాయకురాలు మరొకరు ఉండరు” అని చెప్తారు. ఎంతో ప్రతిభావంతురాలు అయిన జిక్కీ గారు చాలా అమాయకంగా, లోకం పోకడ తెలియకుండా ఉంటారంటే ఆశ్చర్యమే కలుగుతుంది.

బాల్యం…

జిక్కీ గారు తన ఏడవ ఏట నుండే పాటలు పాడడం మొదలుపెట్టారు. తాను సంగీత సంప్రదాయం గల కుటుంబమేమి కాదు. తన తండ్రి స్టూడియోలో చాలా చిన్న తరహా పనులు చేస్తుండేవారు. అయితే జిక్కి గారిలో ఉన్న సంగీతాన్ని అద్భుతమైన గ్రహణ శక్తిని గుర్తించిన గూఢవల్లి రామబ్రహ్మం గారు తాను తీస్తున్న పంతులమ్మ (1943) సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చి ఒక పాట కూడా పాడించారు. ఆ మొదటి పాట “ఈ తీరున నిన్నెరిగి పలుకగా తరమా”. ఈ పాటకు సంగీతం అందించినది గాలి పెంచల నరసింహారావు గారు. అందులో పంతులమ్మగా “లక్ష్మీరాజ్యం” గారు నటించగా, శిష్యురాలిగా జిక్కీ గారు నటించారు. అదేవిధంగా “మంగళసూత్రం” (1946) లో కూడా నటించారు, పాడారు. ఆ పాట పిఠాపురం నాగేశ్వరావుతో కలిసి “మా మామయ్యొచ్చాడే”. దీనికి సంగీతం పి.మునుస్వామి.

సినీ రంగ ప్రవేశం…

చిత్తూరు నాగయ్య గారు నటించిన “త్యాగయ్య” (1946) లో “రారే రారే పిల్లల్లారా” అని పిల్లల బొమ్మలు పెళ్లి సన్నివేశంలో పాడుతూ నటించారు జిక్కీ గారు. గొల్లభామ (1947) లో కోయపిల్లగా నటించారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండే నటిస్తూ, పాటలు పాడినా క్రమక్రమంగా నేపథ్యం సంగీతానికే ప్రాధాన్యతనిచ్చి నటనను వదిలేసి, గళసంపద మీదనే ఆధారపడ్డారు జిక్కీ గారు. జిక్కీ గారు “శ్రీ లక్ష్మమ్మ కథ” లో సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకత్వంలో పాడారు. బొంబాయి సంగీత దర్శకులు “శంకర్ – జై కిషన్” ల సంగీత దర్శకత్వంలో ప్రేమలేఖలు (1953) చిత్రంలో పాడారు. అనార్కలి (1955) నాటికి జిక్కీ గారు తిరుగులేని నేపథ్య గాయనిగా స్థిరపడిపోయారు. అప్పటికే “రాజు పేద”, “వద్దంటే డబ్బు” లాంటి సినిమాల్లో పాటలు పాడి పేరు సంపాదించుకున్నారు.

“అనార్కలి” లో “జీవితమే సఫలము”, “తాగి తూలేనని తలచేను లోకము”, అర్ధాంగిలో “వద్దురా కన్నయ్యా”, “రాకరాక వచ్చావు చందమామ”, దొంగ రాముడు లో “అందచందాల సొగసరి వాడు”, రోజులు మారాయిలో “ఏరువాక సాగారో రన్నో చిన్నన్న”, ప్రేమ లేఖలు లో “ఏకాంతము సాయంత్రము”, “నీ పేరు విన్నా” పాటలతో అత్యంత ఉన్నత స్థాయికి చేరుకున్నారు జిక్కీ గారు. సినిమా పరిశ్రమలో నేపథ్య గాయనులు పి.లీల, జిక్కీ రాజ్యమేలిన రోజులవి. “భలే రాముడు”, ” భలే అమ్మాయిలు”, “సువర్ణ సుందరి”, “చెంచులక్ష్మి”, “జల్సారాయుడు”, “మా ఇంటి మహాలక్ష్మి”, “వద్దంటే డబ్బు”, “వీర కంకణం” ఇలా ఎక్కడ చూసినా జిక్కీ గారి పాటలు మారుమ్రోగిపోయేవి. అప్పట్లో కథానాయికకు జిక్కీ లేకుంటే పి.లీల పాడడం రివాజుగా ఉండేది.

అప్పట్లో జిక్కీ గారు ఏ.ఎం.రాజా గారితో తప్ప మరెవరితోనూ యుగళగీతాలు పాడరని ఆంధ్రదేశమంతటా ఒక గాలివార్త దావణంలా వ్యాపించింది కావచ్చు, లేదా లోలోపల అలాంటి భావం వచ్చి ఉండవచ్చేమో క్రమ క్రమంగా జిక్కీ పాడడం చాలా వరకు తగ్గించింది. ఏ.ఎం రాజా కి తెలుగు పరిశ్రమలలో గాయకుడిగా పెద్దగా స్థానం లేదు. ఘంటసాల గారు హీరోలకు పాడడంలో  నెంబర్ వన్ గా ఉంటే, కథానాయికలకు జిక్కీ గానీ, పి.లీల గాని పాడేవారు. అత్యంత ప్రతిభావంతురాలైన పి.సుశీల అప్పుడే చిత్రరంగంలో పైకి వస్తున్నారు.

ఉత్థాన స్థితిలో ఉన్నప్పుడే అవకాశాలు తగ్గించుకుని..

డ్యూయెట్లు పాడడానికి జిక్కీ, ఏ.ఎం రాజా లను పెట్టుకోకుండా జిక్కీ స్థానం సుశీలకు మార్చడంతో జిక్కీకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. జిక్కీ ఆసరాతో ఏ.ఎం రాజా పైకి వద్దామని ఒకవేళ భావించి ఉంటే అతని అంచనా తప్పింది. తాను పైకి రావడం మాట ఎలా ఉన్నా జిక్కీ క్రిందకి వెళ్లిపోవడం జరిగింది.  క్రమంగా జిక్కి మీద ఆంక్షలు, ఆరడులు ఎక్కువైపోయాయని చెప్పుకునేవారు. అదిగాక ఆమె పిల్లల్ని కనడం, పెంచడం తప్పించుకోలేకపోయారు. ఆ విధంగా జిక్కీ గారు గొంతు మంచి స్థితిలో ఉన్నప్పుడే తన సినీ సంగీత నేపథ్య గానం నుండి ప్రక్కకు తొలిగిపోయారు.

సహా కథానాయికలకు పాడిన జిక్కీ…

పెళ్ళికానుక చిత్రానికి ఏ.యం.రాజాయే సంగీత దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఒక్క పాట “పులకించని మది పులకించు” (కృష్ణ కుమారి) మీద చిత్రీకరించినది మాత్రమే జిక్కీ గారు పాడారు. ఆనాటి వ్యాపార సరళని బట్టి కథానాయిక బి.సరోజాదేవికి అన్ని పాటలు పి.సుశీల గారే పాడారు. అయినప్పటికీ ఆ చిత్రంలో పాటలన్నింటిని పాటుగా జిక్కీ గారు పాడిన పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పాట దానికదే సాటి అన్నంతగా ప్రజాదరణ పొందింది.  దొంగరాముడు లాంటి సినిమాలో హీరోయిన్ కి పాడిన జిక్కీ గారు ఆ తర్వాత అన్నపూర్ణ వారి చిత్రాలలో సహా కథానాయికలకు పాడారు. కొన్ని హాస్యం పాటలు కూడా పాడారు. సుశీల నూటికి నూరుపాళ్ళు తన ప్రతిభతోనే పరిశ్రమలో నిలబడినప్పటికీ జిక్కీ ప్రక్కకి వెళ్లిపోవడం వల్ల ఎప్పటికప్పుడు తన స్థానం పరిరక్షించుకోవాల్సిన బాధ లేకుండా పోయింది.

సంసార సాగరంలో…

జిక్కీ గారు “చెంచులక్ష్మి” కి ఘంటసాల తో కలిసి డ్యూయెట్ పాడారు. ఆ తర్వాత రాజా దర్శకత్వంలో “శోభ” అనే సినిమాకి పూర్తిగా పాడినప్పటికీ ఆ చిత్రం బాగా ఆడకపోవడం వల్ల పాటలు ఆదరణ పొందలేదు. అదిగాక జిక్కీ గారు బాదర బంధిలో చిక్కుకుపోయారు. స్త్రీలకి సంసారం అంటేనే హింస, అవమానం, ఆరళ్ళూ అన్ని ఉంటాయి. అందరూ కష్టాలు పడతారు. అలాగే తాను కష్టాలు పడ్డారు అత్తగారితో, ఆడబిడ్డలతో. భర్త చెప్పినట్టు విన్నారు. పాడమంటే పాడారు, వద్దంటే మానేశారు. ఎప్పుడైనా పాడడానికి వెళ్ళినప్పుడు ఆ సంగీతం వల్ల తనకు హాయిగా ఉండేది. తాను పాట పాడుతుంటే అన్నీ మర్చిపోయి తనకు శాంతిగా అనిపించేది. తనకు ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. వారంతా పెళ్లిళ్లయ్యి బాగానే ఉన్నారు. అప్పట్లో ఇద్దరు గాయకులు పెళ్లి చేసుకున్న జంట జిక్కీ, రాజాలదే.

చీరకట్టులో సాదాసీదాగా…

తాను గాయని, రాజా గారు గాయకులు, వారిది ప్రత్యేకమైన జంట అంటారు జిక్కీ గారు. జిక్కీ గారు ఎప్పుడూ చీర చాలా పైకి కట్టుకునేవారు. చాలా పైకి అన్నమాట. అలా బాగాలేదు కాస్త కిందికి పాదాలు కప్పేసి కట్టుకో అంటే వద్దు అంచులు మాసిపోతాయి అనే వారు తాను. అంత అమాయకంగా ఉండేవారు జిక్కీ గారు. జిక్కీ గారు అంత డబ్బు, ఆస్తి సంపాదించినా కూడా ఎప్పుడూ సాదా చీరలోనే ఒక నిండు పేదరాలి గానే కనిపించేవారు. జిక్కీ గారు ఒకసారి రేడియో స్టేషన్ కు రాజు గారితో వచ్చినప్పుడు అక్కడి వారంతా ఆమెను కుర్చీలో కూర్చొమని ఎన్నిసార్లు చెప్పినా కూర్చోలేదు. చివరికి దూరంగా నిలబడి మాట్లాడుతున్న రాజాని చూపించి ఆయన అక్కడ నిలబడి ఉండగా నేను కూర్చోవడమే అన్నారు భయంగా. ఇది గమనించినప్పుడు హింస అంటే ఏమిటో అర్థం అవుతుంది.

విదేశాలలో ప్రదర్శనలు…

ఇవన్నీ కూడా రాజా గారి మరణంతో తెరపడిన సంఘటనలు. తర్వాత జిక్కీ గారిని తన పిల్లలు జాగ్రత్తగా చూసుకున్నారు. తరచూ ఆంధ్ర లోనూ, తమిళనాడు లోనూ, శ్రీలంకలోనూ జిక్కీ గారు సినిమా పాటలు, కార్యక్రమాలు చేసేవారు. తాను అప్పుడప్పుడు అమెరికా, లండన్, మలేషియా లాంటి దేశాలు వెళ్లి అక్కడి తెలుగు వారికి పాత పాటలు విందు చేసేవారు.  అక్కడివారు పాత పాటలందు చూపిస్తున్న అభిమానం, మోజు తనకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయని అంటారావిడ. మీకు ఇప్పుడు అసంతృప్తిగా ఇంకా పాడగలిగి కూడా పాడలేకపోయాననే అనిపిస్తుందా అని అడిగితే, అందుకు జిక్కీ గారు సమాధానంగా “లేదు నాకు భగవంతుడిచ్చిన వరం నా కంఠం. నేను ఎంత వరకు చేయాలో అంతా చేశాను. నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతా నాకు దక్కింది. పేరు ప్రతిష్టలు వచ్చాయి, డబ్బు వచ్చింది. ఎప్పుడూ కూడా నేనే పాడుతూ ఉండాలని నేను అనుకోను. కొత్తవారు వస్తూ ఉంటారు, రావాలి కూడా. వారు పాడాలి, వారికి కూడా పేరు డబ్బు రావాలి, వారు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి” అంటారామే.

ఇల్లు అమ్మి ఆస్తి పిల్లలకు పంచి..

జిక్కీ గారికి ఉన్న పెద్ద ఇల్లు అమ్మేసి, ఆ ఆస్తి పిల్లలకి పంచేశారు. జీవితాన్ని జీవింతంగా స్వీకరించి కష్టాలు అనుభవించి, ఒకప్పుడు నెంబర్ వన్ నేపథ్య గాయనిగా తెలుగు సినిమా పరిశ్రమలో హోదాని అనుభవించి ఎంతో గౌరవాన్ని పొంది, చాలా తృప్తిగా సంతోషంగా నిరాడంబరంగా ఉన్న జిక్కీ గారిని చూస్తే నిర్లిప్తంగా ఉన్న తపస్వినిగా అనిపిస్తుంది. ఆనాటి పాటల మాధుర్యాన్ని ఆస్వాదించిన వారు ఈనాటికి ఆమె పాటల్ని ఆమెను ప్రేమిస్తూనే ఉంటారు. దేవదాసు సినిమాలో సి.ఆర్.సుబ్బరామన్ గారి దగ్గర మీరు ఒక్క యుగళగీతం మాత్రమే పాడారు, మిగిలినవేమి పాడలేదు. దానికి ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా అని అడిగితే, అవును నేను “దేవదా” అనే డ్యూయెట్ మాత్రమే పాడాను. తర్వాత రాయల్టీ విషయంలో మాకు కుదరక మిగిలిన పాటలు నేను పాడలేదు. ఓ దేవదా పాటకి ముందు వచ్చే హమ్మింగ్ రాణి చేత పాడించి జాయిన్ చేశారు. రికార్డ్ మీద నా పేరు కూడా లేదు కే.రాణి అనే ఉంటుంది అని చెప్పారు జిక్కీ. అసలు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం సినిమాలో పాడే సందర్భం వస్తే కేవలం సంగీత దర్శకులు చెప్పే దాన్ని బట్టి నేర్చుకుని పాడిన సందర్భాలు ఉన్నాయి.

క్లాసికల్ కూడా పాడిన జిక్కీ…

జిక్కీ గారు క్లాసికల్ పాడలేనని అంటుంటారు. పి.ఆదినారాయణ రావు గారు తన చేత “హాయి హాయిగా ఆమని సాగే” అనే రాగమాలికను ఘంటసాల గారితో పాటించారు. తాను క్లాసికల్ పాడలేనన్న వారు ఆ పాట విని ఆశ్చర్యపోయారు. అయితే కొందరు తన పాడలేదు అనిపించాలని ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తాను మరింత పట్టుదలగా నేర్చుకొని పాడి వారి అభిప్రాయం తప్పని నిరూపించారు జిక్కీ గారు. జిక్కీ గారి చేత “ఆదిత్య 369” లో ఇళయరాజా గారు “జానవులే వీర వీణవులే” అనే పాట పాడించారు. ఈ పాట అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ప్రసిద్ధి చెందింది కూడా. ఆ తర్వాత “ఆరో ప్రాణం”, “నిన్నే పెళ్ళాడుతా”, “ఆహ్వానం”, “అమ్మ కొడుకు” లాంటి సినిమాల్లో పాడారు. జిక్కీ గారు తెలుగు లోనే కాక తమిళం, కన్నడం, మలయాళం, సింహాళం మొదలైన భాషలలో కూడా పాడారు.

కుటుంబం…

జిక్కీ గారు తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు అయిన ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) గారిని ఎం.జి.రామచంద్రన్ గారు హీరోగా నటించిన “జెనోవా” సినిమా సెట్స్‌లో కలిశారు. మొదట్లో సంగీతం, నేపథ్య గాయనిగా పాటలు పాడటం, పాటలు నేర్చుకోవడం, రికార్డింగ్ కి వెళ్లడం, పాడడం, రావడం ఇదే లోకం తనకు. ఇవి తప్ప మరో ధ్యాస లేని జిక్కీ గారికి తన ఇంట్లో పెళ్లి ఊసు ఎత్తేవారు కాదు. ఆమెకు కూడా పెళ్లి గురించిన ఆలోచన లేదు. పలుమార్లు ఆ ప్రసక్తి వచ్చినా కూడా డబ్బు సంపాదిస్తుంది తప్ప ఆమె పెళ్లి చేసుకోదు అనే నిర్ణయానికి కుటుంబం అంతా వచ్చారు.

అప్పటికే తాను వేలకు వేలు సంపాదిస్తున్నారు. జిక్కీ గారు ఏ.యం. రాజా గారితో చాలా డ్యూయెట్లు పాడారు. అవన్నీ ఎంతగానో ప్రసిద్ధి పొందాయి. ఇద్దరికీ ఎంతో పేరొచ్చింది. అలాంటి ఒక రికార్డింగ్ సందర్భంలో ఏ.యం.రాజా గారు చిన్న కాయితం మీద మీకు ఇష్టమైతే మిమ్మల్ని వివాహం చేసుకుంటానని వ్రాసి ఇచ్చారు. ఆమెకు అర్థం కాలేదు. ఇంటికెళ్లి ఆ విషయం ఆమె తండ్రి సమక్షంలో కుటుంబ సభ్యులకు తెలియజేసినప్పుడు పెళ్లి వద్దనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు పెళ్లి అంటూ వచ్చావేమిటి..? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే ఇంతవరకు ఉన్న డబ్బు, ఆస్తి ఏమి తీసుకోవడానికి వీలు లేదు. అంతా మాకు వ్రాసిచ్చి వెళ్లి పెళ్లి చేసుకుంటే చేసుకో అని కుటుంబం అంతా ముక్త కంఠంతో చెప్పేసరికి ఆమెకు ఏమి చేయాలో తోచలేదు.

ఆమె చేసేదేమి లేక అదే మాట రాజా తో చెప్పారట. “నువ్వు కట్టుబట్టలతో వచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని” రాజ చెప్పారట. సరేనని ఆమె పెళ్లికి సిద్ధపడ్డారు. పెళ్లి సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. కట్టుబట్టలతో వచ్చిన స్వీకరించి పెళ్లి చేసుకుంటానని పలికిన భర్త ఏ.ఏం రాజా గారు ఆ తర్వాత ఆమెలోని గానానికి, ఆమె పాటకి ఆమె కెరీర్ కి ఎంతవరకు సహకరించారన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

మరణం…

08 ఏప్రిల్ 1989 నాడు తిరునెల్వేలి జిల్లాలోని వల్లీయూర్ రైల్వే స్టేషన్‌లో జిక్కీ తన భర్త ఏ.యం.రాజా తో కలిసి కన్యాకుమారి జిల్లాలోని ఒక దేవాలయంలో కచేరీ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఏ.యం.రాజా గారు రైలు ఎక్కుతుండగా జారి పట్టాల మధ్య పడిపోవడంతో ఏ.యం.రాజా గారు మరణించారు. భర్తను కోల్పోయిన జిక్కీ గారు, అతని మరణం తరువాత ఆమె కొంతకాలం పాడటం మానేశారు. కానీ కొన్నాళ్ళ తరువాత ఇళయరాజా కోసం పాటలు పాడారు. జిక్కీ గారు తన ఇద్దరు కొడుకులతో సంగీత బృందాన్ని కూడా ప్రారంభించారు. అమెరికా, మలేషియా మరియు సింగపూర్‌తో సహా అనేక దేశాలలో నేపథ్య గాయనిగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

సంవత్సరాలు గడిచాయి. జిక్కీ గారు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డారు. తనకి శస్త్రచికిత్స జరిగింది. కానీ ఆ క్యాన్సర్ తన మూత్రపిండాలకు, కాలేయానికి వ్యాపించింది. జిక్కీ గారి ప్రాణ స్నేహితురాలు మరియు గాయని కె. జమునా రాణి గారు ఆమెను రక్షించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. మ్యూజికల్ నైట్స్ ద్వారా విరాళాలు సేకరించారు. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుండి ఆమెకు ఆర్థిక సహాయాలు అందాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత గారు 100,000 రూపాయలు విరాళం అందిస్తే, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిక్కీ గారికి 200,000 రూపాయలు మంజూరు చేశారు. డాక్టర్ ఎం.జి.ఆర్ ట్రస్ట్ నుండి 200,000 రూపాయలను ఆమెకు మంజూరు చేసినారు. కానీ రొమ్ము కాన్సర్ నుండి భరించలేక తాను 16 ఆగస్టు 2004న చెన్నైలో మరణించారు.

Show More
Back to top button