CINEMATelugu Cinema

నవరసాల అనుపమాన సర్వాంగ సుందర చిత్రం.. నర్తనశాల సినిమా

తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి నర్తనశాల అనేది అచ్చ తెలుగు సామెత. సృష్టి మొదటి నుండి కూడా అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో వచ్చిన సాహిత్యాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే అత్యద్భుతమైన రచయిత “వ్యాస మహర్షి”. ఎందుకంటే అన్ని కాలాలకి, అన్ని సమాజాలకి వర్తించే మానవ సంబంధాల మహోతిహాసం “మహాభారతం”. దీని రచయిత “వ్యాస మహర్షి”.

మహాభారతం లో ఉన్న ధర్మ సందేహాలు, ప్రశ్నించదగ్గ నీతి సూత్రాలు, పాత్ర ఔచిత్యాల గురించిన వాదోపవాదాలు అన్నింటిని పక్కన పెడితే, వందలాది పాత్రలు వేలాది సన్నివేశాలు సమహారంగా అన్ని భావోద్వేగాలు కలగలిగిన భావరస సంబంధాల సమాహారం మహాభారతాన్ని కొన్ని శతాబ్దాలుగా తెలుగువారు గుర్తుంచుకొంటున్నారు, గుర్తుపెట్టుకుంటారు కూడా.

ఈ వేద వ్యాసుడి యొక్క రచనా చాతుర్యం మహాభారతంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఎన్ని పాత్రలు, ఎన్ని సంఘటనలు అన్నిటినీ కూడా చక్కగా అల్లడంలో విడివిడిగా చూస్తే కొన్నిచోట్ల ఈ సంఘటనలు అసంబంధం కదా అనిపించే వాటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట వరమో, శాపమో కారణంగా చూపించడం గొప్ప చిత్రానుగుణమైన కథా రచయిత వ్యాస మాహర్షి. అందులో అజ్ఞాతవాసం ఆధారంగా కథను ఎంచుకుని తీసిన చిత్రం “నర్తనశాల” 

తెలుగు పౌరాణికాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన చలనచిత్రం నర్తనశాల. కథానుగుణంగా నవరసాలు అనుపమానంగా ఆవిష్కరించిన ఈ సినిమా 60 ఏళ్ల క్రిందట ఇదే రోజు విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దర్శకత్వం, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, సంభాషణ, నృత్యాలు, పోరాటాలు ఇలా ఏ విభాగం చూసినా ఉన్నత స్థాయి ప్రతిభ మిళితమైన “సర్వాంగ సుందర చిత్రం ఈ నర్తనశాల. 

ఇంద్ర సభకు అర్జునుడు ఆగమనంతో చిత్రం ఆరంభం అవుతుంది. విరాట నగరంలో ద్రౌపది పాండవుల అజ్ఞాతవాసం, బృహన్నల ఉత్తరకు నాట్యం నేర్పడం, కీచకుడిని వలలుడు నర్తనశాలలో వధించడం, ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవులను అర్జునుడు ఓడించడం, ఉత్తరాభిమన్యుల కళ్యాణం. ఇది స్థూలంగా చిత్ర కథాంశం. తెలుగులో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలన్నిటికీ “నర్తనశాల” నే స్ఫూర్తి.

11 అక్టోబరు 1963 నాడు విడుదలైన ఈ సినిమా తెలుగు వారందరూ సగర్వంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భావించేలా తీసిన తెలుగు చిత్రం  నర్తనశాల. పాండవులు మొదట వనవాసం, ఆపై అజ్ఞాతవాసం చేస్తారు. ఇది వేద వ్యాసుడు వ్రాసిన మహాభారతం. కానీ సినీ వ్యాసుడు కమలాకర కామేశ్వరరావు గారు తీసిన మహాభారత క్రమం వేరు. మొదట అజ్ఞాతవాసం “నర్తనశాల” (1963). ఆ తర్వాతే పాండవ వనవాసం (1965). ఈ రెండు చిత్రాలలో ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా శ్రీకృష్ణ పాత్ర వేసే అవకాశం కాంతారావు గారికి దక్కటం మరో విశేషం.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   కమలాకర కామేశ్వరరావు

నిర్మాణం   :  సి.లక్ష్మీరాజ్యం,

కె.శ్రీధరరావు

కథ     :     మహాభారతంలోని కథ – సముద్రాల రాఘవాచార్యచే కూర్పు

తారాగణం  :   నందమూరి తారక రామారావు, సావిత్రి, దండమూడి రాజగోపాలరావు, ఎస్.వి.రంగారావు, మిక్కిలినేని, రేలంగి, ముక్కామల, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, సంధ్య, ధూళిపాళ, ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం, కాంచనమాల, అల్లు రామలింగయ్య, కాంతారావు, కైకాల సత్యనారాయణ, శోభన్ బాబు, వంగర, బాలకృష్ణ, సి.లక్ష్మీరాజ్యం, సీతారాం

సంగీతం    :    సుసర్ల దక్షిణామూర్తి

నేపథ్య గానం   :    మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.జానకి, బెంగుళూరు లత, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల

నృత్యాలు   :    వెంపటి పెదసత్యం

గీతరచన   :    సముద్రాల రాఘవాచార్య

సంభాషణలు   :   సముద్రాల రాఘవాచార్య

ఛాయాగ్రహణం  :  ఎమ్.ఎ.రహమాన్

కళ   :    టి. వి. యస్. శర్మ

కూర్పు    :     ఎస్.పి.ఎస్.వీరప్ప

నిర్మాణ సంస్థ    :    రాజ్యం పిక్చర్స్

విడుదల తేదీ   :    11 అక్టోబరు 1963

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

మహాభారతంలోని “విరాట పర్వం” లో జరిగిన పాండవుల యొక్క అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు పన్నెండు ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపై ఉంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు.

ఆ విరాటరాజు కొలువులో ధర్మరాజు కంకుభట్టుగాను, భీముడు వంటలవాడు వలలుని గాను చేరుతారు. “పేడివి కమ్ము” అని ఊర్వశి ఇచ్చిన శాపాన్ని అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని అర్జునుడు బృహన్నలగా విరాటరాజు కుమార్తె ఉత్తరకు “నర్తనశాల” లో నాట్యాచార్యుడౌతాడు. నకులుడు ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగాను, సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో గోసంరక్షకుడిగానూ విరట కొలువులో చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు భార్య సుధేష్ణ పరిచారిక అవుతుంది.

పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు. పాండవులు ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, కీచకుని హతం చేస్తాడు.

కీచకుని మరణం సంగతి విని, అక్కడ పాండవు లుండవచ్చునని అనుమానించిన కౌరవులు, వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి కౌరవులు, భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.

“అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా ఫరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తాన”ని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తర కుమారునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇదీ కథ.

పాత్రలు..

అర్జునుడు, బృహన్నల..  నందమూరి తారక రామారావు

ద్రౌపది…     సావిత్రి..

కీచకుడు..   ఎస్. వి. రంగారావు..

ధర్మరాజు…    మిక్కిలినేని…

భీముడు…  దండమూడి రాజగోపాలరావు…

ఉత్తర కుమారుడు…  రేలంగి…

విరాటరాజు…   ముక్కామల       ..

అభిమన్యుడు…   శోభన్ బాబు…

ఉత్తర…   ఎల్. విజయలక్ష్మి..

సుధేష్ణ…   సంధ్య..

దుర్యోధనుడు…  ధూళిపాళ…

కర్ణుడు…    ప్రభాకర రెడ్డి..

వాల (వాలతుల్య)…  అల్లు రామలింగయ్య…

  శ్రీ కృష్ణుడు (అతిథిపాత్ర).. కాంతారావు..

సుభద్ర…   సి.లక్ష్మీరాజ్యం…

దుశ్శాసనుడు…  కైకాల సత్యనారాయణ..

వంగర.. బాలకృష్ణ.. సీతారాం..

నర్తనశాల కథపై పలు చిత్రాలు…

భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం తీసిన వారు “దాదాసాహెబ్ ఫాల్కే”. తెలుగులో “రఘుపతి వెంకయ్య”, మలయాళం లో జె.సి.డేనియల్, తమిళంలో ఆర్.నటరాజ మొదలియార్ గార్లు మొట్టమొదటిగా మూకీ చిత్రాలు తీశారు.

నర్తనశాల కథలో భాగంగా ఆర్.నటరాజ మొదలియార్ గారు తమిళంలో “కీచకవధ” తీశారు. 1918 వ సంవత్సరం జనవరిలో ఈ “కీచకవధ” అనే చిత్రాన్ని విడుదల చేశారు.

తర్వాత 20 సంవత్సరాలకి 1937లో “విజయదశమి” అనే సినిమా వచ్చింది. ఇది తెలుగు వారే తీశారు.

ఆ తర్వాత 1963 లో “నర్తనశాల” సినిమా ను రాజ్యం పిక్చర్స్ లక్ష్మీ రాజ్యం గారు నిర్మించారు.

ఆ తర్వాత 16 సంవత్సరాలకు 1979లో “శ్రీమద్విరాటపర్వం” సినిమాను ఎన్టీఆర్ గారు తీశారు.

ఇందులో ఐదు పాత్రలు ఎన్టీఆర్ గారే వేశారు. 2004లో “నర్తనశాల” పేరుతో నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించారు. పరచూరి లాంటి వారు రచయితలుగా పనిచేశారు.

ఏప్రిల్ 14 నాడు సౌందర్య గారి మరణం ఆ తర్వాత కొన్ని రోజులకు బాలకృష్ణ గారు కాలికి గాయం అవ్వడంతో ఆ సినిమాను ఆపేశారు.

మూడు నట శిఖరాలు..

“నర్తనశాల” లో హేమా హేమీలైన కళాకారులు శిఖరాగ్రస్థాయి అభినయం ప్రదర్శించారు. ఈ సినిమా లో మూడు నట శిఖరాలుగా ప్రసిద్ధి చెందిన ఎస్వీ రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు కీచక, బృహన్నల (అర్జున), సైరంధ్రి పాత్రలో అనితర సాధ్యంగా ఒదిగిపోయారు. తమ తమ నటనా కౌశలం తో ఎంతో చెలరేగిపోయారు. సింహబలుడైన కీచకుడి పాత్రను ఎస్వీ రంగారావు గారు “నభూతో న భవిష్యత్తు” అన్న తీరులో పోషించారు.

తొలిసారి సైరంధ్రిని చూడడంతోనే మరులుగొని సెగలు కక్కుతున్న మోహావేశాన్ని తన ముఖ కవళికల్లో ఎంతగా ప్రతిఫలించారో ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. సైరంధ్రి రాక కోసం ఎదురుచూపుల విరహంతో వేగిపోతూ తనలో తాను మాట్లాడుకుంటూ యస్వియార్ గారు చేసిన అభినయం, అక్క సుధేష్ణతో, సైరంధ్రితో, వలలునితో పలికిన సంభాషణలోని వైవిధ్యం గొప్పగా ఉంటాయి.

సావిత్రి గారి నటన వివిధ ఘట్టాల్లో పరాకాష్ట నందుకుంటుంది. సుధేష్ణ దగ్గర అణుకువ, నిస్సహాయత, నిప్పులు చెరిగే కళ్ళతో కీచుకుని తిరస్కరించడం, రక్షణ కోసం కొలువులోకి పరిగెత్తుకొని వచ్చి అవమానంతో, ఆవేదనతో ఆక్షేపించడం. ఇలా ప్రతీ ఘట్టంలోనూ ఆమె తన పాత్రను అద్భుతంగా పండించారు.

ఎన్టీఆర్ సాహోసోపేత నిర్ణయం..

ఎన్టీఆర్ గారు అగ్రనటులు. తాను అప్పటికే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో దీరోదాత్త, ధీరోద్ధత పాత్రలో గొప్పగా రాణిస్తున్న దశలో నపుంసకుడైన బృహన్నల వేశం వేయడానికి ఒప్పుకుని నందమూరి తారకరామారావు గారు పెద్ద సాహసమే చేశారు. పేడి రూపంతో వయలొలికించాల్సిన బృహన్నల పాత్ర లోపం జరిగి అటుదిటైతే తన గొప్ప ఇమేజ్ కి పెనువిఘాతం ఏర్పడే ప్రమాదం ఉన్నదని తన శ్రేయోభిలాషులు ఈ పాత్ర వేయొద్దని వారించారు. అప్పటికి ఎన్టీఆర్ గారు లెక్క చేయలేదు.

నాట్యంలో ప్రసిద్ధి చెంది వేగంగా నర్తించడంలో ప్రఖ్యాతి ఉన్న ఎల్.విజయలక్ష్మి గారికి నాట్యం నేర్పే పాత్ర కాబట్టి ఆమెతో సమానంగా నాట్యం చేయలేననే ఉద్దేశంతో ఈ వేషం వేయడానికి మొదట ఎన్టీఆర్ గారు నిరాకరించారట. నిర్మాత లక్ష్మీరాజ్యం గారు ఎన్టీఆర్ గారికి నచ్చ చెప్పారు. ఎన్టీఆర్ గారు వెంపటి సత్యం గారి దగ్గరికి ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్లి నాట్యాభ్యాసం చేశాక గాని బృహన్నల పాత్రధారణకు ఎన్టీఆర్ గారు అంగీకరించలేదట. నపుంసకుల నడక, హావభావాల కోసం వారిని పరిశీలించి కష్టపడి సాధన చేశారట. పాత్రధారణ పై తనకున్న అంకిత భావమది.

వేషం బృహన్నలదే అయినా వేసేది ఎన్టీఆర్ గారు కాబట్టి ఆ రూపం మరీ ఎబ్బెట్టుగా కాకుండా కొంత ఠీవీగా కనబడడం కోసం కళాదర్శకులు టీ.వీ.ఎస్.శర్మ గారు, మేకప్ మ్యాన్ హరిబాబు, పీతాంబరం, భక్తవత్సలం తదితరుల సాయంతో చాలా స్కెచ్ వేసి శ్రమించారు. ఎన్టీఆర్ గారు చేసిన సాహసం, కృషి దిగ్విజయంగా ఫలించాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటనకు ప్రేక్షకులు ఘనంగా జేజేలు పలికారు. చివర్లో శాప విముక్తుడై నిజరూపంలో గాండీవం ధరించి, శంఖం పూరించి, యుద్దానికి కదిలినప్పుడు బృహన్నల, అర్జున ల పాత్రల మధ్య విభ్రాంతిగొలిపే తారతమ్యం చూస్తారు ప్రేక్షకులు.

సంగీతం…

ఈ చిత్రానికి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరిచిన పాటలన్నీ మధురమైనవే. ముఖ్యంగా “నరవరా ఓ కురువరా”, “జననీ శివకామినీ”, “సలలిత రాగ సుధా రస సారం”, “సఖియా వివరించవే”, “దరికి రాబోకు రాబోకు రాజా” (సముద్రాల రాఘవాచార్య),  “ఎవ్వరి కోసం ఈ మందహాసం” (శ్రీ శ్రీ) లాంటి పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.

మహాభారతంలో తిక్కన గారు వ్రాసిన పద్యాలను ఔచిత్యవంతంగా ఉపయోగించడం వలన చిత్రానికి ప్రామాణికత, నిండుదనం వచ్చాయి. సైరంద్రి కీచకుని హెచ్చరించిన “దుర్వారోద్యమ బాహుబల విక్రమ” (సుశీల), యుద్ధ భూమిలో బృహన్నల కౌరవ ప్రముఖుల వర్ణన “కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల”, అర్జునుడి రాకతో పరవశుడై ద్రోణుడి నోటి నుంచి వెలువడిన “సింగంబాకటితో గుహాంతరమున చేర్పాటుమైయుండి”, భీష్మడు పలికిన “వచ్చినవాడు ఫల్గుణుడు” మొదలైన అద్భుతమైన పద్యాలను రసవత్తరంగా చిత్రీకరించారు. రచయిత సముద్రాల రాఘవాచార్య గారు వ్రాసిన మాటల్లో తెలుగుదనం గూబాళించింది.

దర్శకులు కమలాకర కామేశ్వరరావు…

సినీ వ్యాసుడు గా ప్రసిద్ధికెక్కిన కమలాకర కామేశ్వరరావు గారు నర్తనశాలలో ఎక్కువ భాగం మద్రాసు (ప్రస్తుతం చెన్నై )లోని వాహిణీ మరియు భరణి స్టూడియోలలో వేసిన సెట్‌లలో చిత్రీకరించారు. సినిమాలో ఉపయోగించిన అన్ని సంగీత వాయిద్యాలు మద్రాసు సంగీత విద్యాలయం నుండి తెప్పించారు. పతాక సన్నివేశాలలో యుద్ధ సన్నివేశాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని గూడూరులో చిత్రీకరించరించారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి ఏకకాలంలో రెండు కెమెరాలను ఉపయోగించారు. గోగ్రహణం (కిడ్నాప్ చేయబడిన ఆవులను తిరిగి పొందడం) ఎపిసోడ్ కోసం , గోగినేని వెంకటేశ్వరరావు గారి సహాయంతో ఐదు వేల పశువులను తీసుకువచ్చారు.

174 నిమిషాలు నిడివి గల నర్తనశాల సినిమాను 4,00,000 రూపాయలబడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్ర రచయిత సముద్రాల రాఘవాచార్యులు అనారోగ్యం పాలైనప్పుడు, తన కుమారుడు సముద్రాల రామానుజాచార్యులు ( సముద్రాల జూనియర్ అని పిలుస్తారు ) “సంధాన సమయమిది ఇంకా సైరంధ్రి రాలేదే…” (ఏకీభవించే సమయం వచ్చింది మరియు సైరంధ్రి ఇంకా మారలేదు …) అనే ఏకపాత్రను వ్రాశారు. వెంపటి సత్యం గారు శోభన్ బాబు గారి కోసం విజయలక్ష్మితో కలిసి మూడు రోజుల రిహార్సల్స్ కూడా నిర్వహించాడు. సైరంధ్రిని స్తంభానికి కట్టి బండిపై ఈడ్చుకెళ్లిన సన్నివేశం కోసం, చిత్రీకరణ సమయానికి అనుకున్న కళాకారుడు రాకపోవడంతో మరొకరిని నియమించి సన్నివేశాన్ని చిత్రీకరించారు.

నిర్మాతలు లక్ష్మీరాజ్యం, శ్రీధర రావు… 

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా నిర్మాత దాసరి కోటి రత్నం గారు. 1935లో తన నాటక బృందంతో సహా కలకత్తా వెళ్ళి అక్కడ ఆరోరా ఫిలింస్‌ కంపెనీలో భాగస్వామిగా, బి.వి.రామానందం, తుంగల చలపతిరావు గార్లతో కలిసి “భారతలక్ష్మి ఫిలింస్‌” అనే సంస్థను నెలకొల్పి, “సతీసక్కుబాయి” అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దాసరి కోటిరత్నం గారు టైటిల్ పాత్రలో సక్కుబాయిగా, తుంగల చలపతిరావు గారు కృష్ణుడిగా నటించారు. టైటిల్‌ పాత్ర పోషించిన తొలి మహిళ కూడా దాసరి కోతిరత్నం గారే కావడం గమనార్హం.

ఆవిడ తర్వాత కన్నాంబ మరియు కడారు నాగభూషణం గార్లు, భానుమతి రామకృష్ణ గార్లు, అంజలీదేవి ఆదినారాయణ రావు గార్లు, కృష్ణవేణి, మీర్జాపురం రాజా వారు మంచి సినిమాలు తీశారు.

ఆ కోవకే చెందిన లక్ష్మీరాజ్యం గారు తన భర్త శ్రీధర రావు గార్లతో కలిసి “నర్తనశాల” సినిమాను నిర్మించారు.

లక్ష్మీరాజ్యం గారు 1922లో కర్నూలు జిల్లా కోయిలకుంట లో జన్మించారు. తాను 1941లో శ్రీధర రావు గారిని వివాహం చేసుకున్నారు. 1951 వ సంవత్సరంలో అక్కినేని, ఎన్టీఆర్ గార్లతో సంసారం చిత్రంలో నటించారు. డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రం నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు సదరు నిర్మాత.

దాంతో లక్ష్మీరాజ్యం గారు తాను కథానాయికగా నటించిన సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో లక్ష్మీరాజ్యం గారు తన భర్త శ్రీధర రావు గారిని సంప్రదించారు.

తన భర్త ఒప్పుకోవడంతో మిగతా సినిమా నిర్మాణం వీరిద్దరు చేపట్టారు. ఈ సినిమా విజయవంతమైంది.

ఆ తర్వాత “దాసి” సినిమా తీశారు. ఆ తర్వాత సత్య హరిచంద్ర, శ్రీకృష్ణ లీలలు తీశారు.

ఈ మూడు సినిమాల తరువాత లక్ష్మీరాజ్యం గారు, శ్రీధర్ రావు గారు కలిసి “నర్తనశాల” సినిమాను నిర్మించారు.

వాస్తవానికి శ్రీకృష్ణ లీలలు తర్వాత “ద్రౌపది” అనే సినిమా తీయాలనుకున్నారు. నిడివి ఎక్కువగా ఉండటంతో కుదరక “నర్తనశాల” సినిమా తీశారు.

నెల్లూరు దగ్గరలోని ఇందుకూరు వద్ద వై.బి.రెడ్డి గారు లక్ష్మీరాజ్యం గారికి నర్తనశాల అనే నాటక పుస్తకం తెచ్చి ఇచ్చారు.

అందులో ద్రౌపది పాత్ర ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను ఎంచుకున్నారు.

విడుదల…

నర్తనశాల సినిమా 11 అక్టోబరు 1963 నాడు 26 కేంద్రాలలో విడుదలైంది. ఈ చిత్రం పంపిణీ హక్కులను నవయుగ ఫిల్మ్స్ దక్కించుకుంది.

నవయుగ ఫిల్మ్స్ చెందిన కాట్రగడ్డ నర్సయ్య గారు ఈ సినిమా పోస్టర్లు మరియు ప్రచారానికి పనిచేశారు.

ఈ చిత్రం వాణిజ్యపరంగా అద్భుతమైన విజయం సాధించింది. నర్తనశాల చిత్రం 19 కేంద్రాలలో 100 రోజులు పూర్తిచేసుకుంది.

ఈ చిత్రం హైదరాబాదు మరియు విజయవాడలలో 200 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడింది.

ది హిందూ పత్రిక కథనం ప్రకారం నర్తనశాల చిత్రం 25 వారాల పాటు ప్రదర్శింపబడింది.

ఈ చిత్రం యొక్క బెంగాలీ మరియు ఒడియా డబ్బింగ్ వెర్షన్‌లు ఒరిజినల్‌తో సమానంగా వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి.

నర్తనశాల సినిమా 11వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండవ ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది. ఇది ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం గెలుచుకుంది. 1964లో జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నర్తనశాల రెండు పురస్కారాలను అందుకుంది.

ఉత్తమ పురుష నటుడు (రంగారావు) మరియు ఉత్తమ కళా దర్శకుడు (టి.వి.యస్.శర్మ). బృహన్నల పాత్రలో రామారావు గారి నటనకు ప్రశంసలు దక్కాయి.

సైరంధ్రిగా సావిత్రికి అత్యంత సంతృప్తికరమైన నటనను అందించిందనే ప్రశంస పొందారు.

సినిమా విడుదలయ్యి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 45వ వార్షికోత్సవంలో తెలుగు వార్తాపత్రిక సాక్షి , నందమూరి తారక రామారావు మరియు యస్వీ రంగారావు గార్ల బృహన్నల మరియు కీచక పాత్రలను ప్రశంసించింది.

ఈ సాక్షి వార్తాపత్రిక ఎన్టీఆర్ గారి స్టార్‌డమ్‌ను పరిగణనలోకి తీసుకుని తనను “విచిత్రమైన సాహసం”గా పేర్కొంది.

విశేషాలు…

★ రాజ్యం పిక్చర్స్ సంస్థ వారు నిర్మించిన 11 సినిమాలలో ఐదింటిలో నందమూరి తారకరామారావు గారు హీరోగా నటించారు.

★ రాజ్యం పిక్చర్స్ అధినేతలలో ఒకరైన లక్ష్మీరాజ్యం గారు తన నటజీవితంలో మొత్తం 35 సినిమాలలో నటించారు.

నందమూరి తారకరామారావు గారి సరసన రెండు చిత్రాలలో హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత తన వివాహం కె.శ్రీధరరావు గారితో జరిగింది.

★ బృహన్నలగా ఆడంగి వేషం వేయడానికి నందమూరి తారకరామారావు గారు మొదట నిరాకరించాడు. కానీ లక్ష్మీరాజ్యం గారు తనకు నచ్చజెప్పి ఒప్పించారు.

నిజానికి ఎన్టీఆర్ గారు ఆ పాత్రకు నిరాకరణకు కారణం ఆ పాత్ర రూపం కాదు, ఉత్తరగా మంచి నర్తకి అయిన విజయలక్ష్మితో సమానంగా తాను నాట్యం చేయలేనని తన అభ్యంతరం.

★ నెలరోజుల పాటు ఎన్టీఆర్ గారు తెల్లవారుజామున వెళ్ళి వెంపటి పెదసత్యం వద్ద నృత్యం నేర్చుకొని ఆ తరువాతే బృహన్నల పాత్రను అంగీకరించారు.

★ బృహన్నల పాత్ర మేకప్ విషయమై మేకప్ మన్ హరిబాబు, కళాదర్శకులు టి.వి.ఎన్.శర్మ గారు ఎంతో శ్రమించారు.

ఎబ్బెట్టుగా కాకుండా ఠీవిగా కనిపించేలా చేయడానికి ఎన్నో స్కెచ్‌లు వేశారు.

★ కళాదర్శకులు టి.వి.ఎన్.శర్మ గారికి చిన్నపుడు ప్రమాదంలో ఒక చేయి పోయింది. కాని పట్టుదలతో శ్రమించి ఒక చేతి నైపుణ్యంతో కళాదర్శకుడయ్యారు.

జకార్తాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో నర్తనశాల చిత్రం ప్రదర్శింపబడగా శర్మకు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారం వచ్చింది.

అప్పుడు తనకు మద్రాసులో జరిగిన సన్మాన సభలో “నేను ఈ స్థాయికి చేరుకోడానికి కారణం ఎందరో మహానుభావులు.

వారికి ఈ సందర్భంలో రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టుకొనే అవకాశం ఇవ్వలేదు ఆ భగవంతుడు” అన్నారు.

★ కీచకునిగా ఎస్. వీ. రంగారావు గారు ఆ పాత్రకే వన్నె తెచ్చారు. అయితే వినయశీలి అయిన ఎస్. వీ. రంగారావు గారు ఆ ఘనత అంతా సముద్రాల గారు వ్రాసిన సంభాషణల బలమని చెప్పుకొన్నారు.

★ 1964 లో జకార్తా లోని ఆఫ్రో ఆసియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు, ఎస్వీఆర్, రేలంగి గార్లు హాజరయ్యారు.

ఎస్వీఆర్ స్వయంగా ఇండొనీషియా అధిపతి సుకర్నో గారి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకొన్నారు. ఈ చిత్రం యూనిట్‌కి సుకర్నో గారు విందు కూడా ఇవ్వడం మరో విశేషం.

★ అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు.

అస్త్రం పైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు (పిచికారీలాంటి సాధనంతో) సైన్యంపై చల్లుతుంది. అంతా వివశులైనాక విజయవంతంగా అందరివంకా కలయజూస్తుంది.

★ ఈ సినిమాలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ శంఖం పూరిస్తున్న చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టిన క్రొత్తలో ప్రచారానికి వాల్‌పోస్టరుగా వాడారు.

★ వంటవాడైన భీముడు కీచకవధ చేశాడని భారతంలో ఉంది.

ఆ కథని స్వీకరించి ఉత్తర నాట్యశాలలో కీచకవధ జరిగినట్లు, కొన్ని మార్పులతో విశ్వనాథ సత్యనారాయణ నర్తనశాల పేరుతో వ్రాశారు.

ఆ నర్తనశాల నాటకం, ఈ నర్తనశాల సినిమాకు స్ఫూర్తి అంటారు.

★ జయగణనాయక విఘ్న వినాయక” అనే పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే తెలుగునాట నృత్యపూజలు ఈ పాటతోనే జరగటం సంప్రదాయంగా మారింది.

★  “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు పొందిన “బాడీ బిల్డర్” దండమూడి రాజగోపాల రావు గారు ఈ చిత్రంలో భీముడుగా నటించారు. ఈయన పేరుతో విజయవాడలో స్టేడియం ఉంది.

ఈ చిత్ర విజయం కారణంగా ఆయనకు రెండేళ్ల తర్వాత వచ్చిన “వీరాభిమాన్యు” లో కూడా భీముని పాత్ర దక్కింది.

★ ప్రసిద్ధ ప్రతి నాయకుడు పహిల్వాన్ “నెల్లూరు కాంతారావు” గారు జీమూతమల్లుడి పాత్ర వేశారు.

అతడికీ, భీముడికీ జరిగిన పోరాటం రోమాంచితంగా తీశారు.

★ అభిమన్యుడు పాత్రలో మెరిసిన శోభన్ బాబు గారు “వీరాభిమన్యు” (1965) లో పూర్తిస్థాయి నాయక పాత్ర వేసే అవకాశం దక్కించుకున్నారు.

★ అలనాటి అందాల తార కాంచనమాల, నటి సూర్యకాంతం లు ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనబడతారు.

Show More
Back to top button