ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగార మోగడానికి ఇంకా కొద్ది కాలం మాత్రమే ఉంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో పలు పార్టీలు వారి ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం అయ్యారు. అయితే వైసీపీ మాత్రం సింగిల్ ఎజెండాతో వస్తుంటే.. మిగతా పార్టీలు మాత్రం గెలుపే లక్ష్యాంగా పొత్తులతో ముందుకొస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇది మాత్రం ఆఖరి పోరాటంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంతేకాదు పొరపాటున చంద్రబాబుకి ఈ ఎన్నికలలో ఓటమి ఎదురైతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతుందంటున్నారు. కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతం మరచి ఒకే కూటమితో జతకట్టి.. సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించి ముందడుగు వేశారని రాజకీయ నిపుణులు అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక శాతం మించి కూడా ఓటు బ్యాంకులేని బీజేపీ పొత్తు కోసం ఇరువురు నాయకులు తాపత్రయపడటం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. బహుశా మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీనే అధికారం చేపడుతుందని, నరేంద్రమోడీయే ప్రధానమంత్రి అవుతారని మీడియా ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ వారిని కాదని మొండిగా రాజకీయ రంగులరాట్నం సినిమా మొదలు పెడితే దివంగత జయలలిత నెచ్చలి శశి కళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాల ముహూర్తంలోనే జైలు ఊచలు లెక్క పెట్టినట్లు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీతోపాటు నిలువు దోపిడీకి గురైనట్లు అనుభవాలు ఏపీ నేతలకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది ఊహించే సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలను విభజనలు అంటూ ఇబ్బంది పెట్టకుండా సన్నిహితంగా మెదులుతున్నాడు అని రాజకీయ నిపుణులు అంటున్నారు.
అయితే కటిక చీకటిలో చిరుదీపం మాదిరి చంద్రబాబు బీజేపీ పొత్తుపై ఒక ఆశ అంటూ లేకపోలేదు. బీజేపీతో పొత్తుఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కూడా పొత్తుకు కలసిరావాలని, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలలో పోటీ చేయాలని అగ్ర నాయకత్వాన్ని కోరుతున్నాడు వార్తలు కూడా వస్తున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా చంద్రబాబుతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో ఉన్న బాబు శ్రేయోభిలాషులది కూడా ఇదే అభిప్రాయం. కాబట్టే జగన్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకపోదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ఫలించి, బీజేపీ అగ్రనేతలు చివరి నిమిషంలో పొత్తుకు అంగీకరించే అవకాశం ఉంది. ఇలా జరిగిన టీడీపీ జనసేన, బీజేపీ కూటమికి సానుకూల ఫలితాలు లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ నాయకత్వం ఏపీకి మొండిచేయి చూపింది. అయితే ఈ వైఫల్యం మొత్తం బీజేపీపై నెట్టివేయడం సరైనది కాదు. జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈవైఫల్యంలో భాగంగా ఉందని అంటున్నారు. అయినా సరే ఈ మూడు పార్టీలు కలిస్తే.. జగన్ వ్యతిరేక ఓట్లతో పాటు అభిమాన ఓట్లు వల్ల భారీగా సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పొత్తుల్లో పార్టీల తృణీకారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.