Telugu Politics

ఈ సారి తెలంగాణ సింహం ఎవరో..!

రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో ఎన్నికల పర్వం మొదలవనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమంటే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతాడో ఈసారి కొంచెం చెప్పడం క్లిష్టంగానే ఉంది. కేసీఆర్ వ్యవహార శైలి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. అందుకే మా వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హోరా హోరీ పోరు ఖాయమనే అంచనాలు ఉన్నా..

కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని సెఫాలజిస్టులు(ప్రజా నాడి విశ్లేషకులు) చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ మధ్యకు వచ్చి చెబుతున్న అంశాల పైన ప్రజల్లోనూ ఆదరణ కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో పాటు కేసీఆర్ గతంలో వాగ్దానం చేసి అమలు చేయని హామీలను గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి రావటం ద్వారా.. వచ్చే ప్రయోజనాలను వివరిస్తున్నారు.

ఇక బీఆర్‌ఎస్ విషయానికి వస్తే.. ఈసారి మళ్లీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతతో ప్రజలకు కాస్త దూరంగా ఉన్నా… మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు  ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు బీఆర్‌ఎస్‌ నేతలు వివరిస్తున్నారు. అటు ప్రచారంలో కొత్తకొత్త పోకడలతో కేటీఆర్ దూసుకెళ్తున్నారు. విద్యార్థులతో, నిరుద్యోగులతో కలిసి మాట్లాడడం, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలను తన స్టైల్ లో వినియోగించడాన్ని ఈ ప్రచారంలో హైలెట్‌గా చెప్పుకోవచ్చు.


అయితే రాష్ట్రంలో తాజా ఓటరు జాబితా చూస్తే.. ఏడు లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా… 35 ఏళ్ల లోపు ఓటర్లు 30శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను త‌మవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3.14 కోట్ల మంది ఓటర్లలో.. దాదాపు ఏడు లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారే. అలాగే 75 లక్షల మంది ఓటర్లు 19 నుంచి 35 ఏళ్ల వయసువారున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న ఓటర్లలో మార్పులు రావడంతో… ఫలితాలు ఎలా ఉంటాయనేది డిసెంబర్ 3 వరకూ వేచి చూడాల్సిందే.

బీజేపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా కేవలం ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించింది. దీనిని బట్టి అర్థమవుతుంది బీజేపీ తమ స్థానాలను పెంచుకోవడంలో తీవ్రంగా కృషి చేస్తుందని. అంతేకాదు బీజేపీ మేనిఫెస్టో వల్ల బీజేపీకి కొంతవరకు సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ బలం తగ్గిందనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కొన్ని సర్వే సంస్థల ఫలితాలు కూడా ఉండడం గమనార్హం.  

*
మేలుకో ఓటరు మహాశయ
ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఆయుధం ఓటు. బ్యాలెట్‌ పోరు వచ్చిన ప్రతిసారీ వినిపించే మాట ఇది. నిజంగా సామాన్యుడు ఈ ఆయుధాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నాడు? యువత మేల్కొని అధిక పోలింగ్‌ నమోదుతో ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదాలని పలువురు కోరుతున్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది నీ భవిష్యత్తుకు నువ్వు ఉపయోగించే వజ్రాయుధం అని భావించాలి. మనల్ని ఎవరు పరిపాలించాలో మనమే నిర్ణయించుకునే సదావకాశం ఓటు. అందుకే.. అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగాన్ని భారంగా కాకుండా.. బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. నిజాయితీపరులు.. దార్శనికులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాలు వర్ధిల్లుతుంది.

Show More
Back to top button