GREAT PERSONALITIES

తెలుగు భాషకు అలుపెరుగని సాహితీ హాలికుడు..  సి. నారాయణ రెడ్డి

“నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని తెలుగు అనే మృదుమధురమైన భావాలని వింటుంటే హాయిగా మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. “మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది” అంటూ ప్రేయసి తన మనోభావాలను చిలిపిగా ప్రియుడ్ని పాటలో ప్రశ్నిస్తుంటే.. ప్రియుడు కంగారు పడకుండా నిండైన సంతోషంతో నిజాయితీ సమాధానాలు ఇవ్వడం ఎంత అద్భుతం. “రా వెన్నెల దొరా కన్నియను చేరా” అంటూ మది వీణియపై పలికిన మధుమోహన రాగాల భావతరంగిణి ని, ఇంత గొప్ప ప్రేమ సాహిత్యాన్ని తేలిక పదాలతో అచ్చమైన ప్రేమభాషలో వ్రాయడం ఎంతటి సాహసం.

“దాన వీర శూర కర్ణ”       చిత్రంలో నందమూరి తారకరామారావు గారు దుర్యోధనుడి పాత్రకు డ్యూయెట్ పెట్టడం సంచలనం అయితే, ఆ డ్యూయెట్ కు “చిత్రం భళారే విచిత్రం”.. అంటూ సాహిత్యం సమకూర్చడం ఇంకా అద్భుతం. ఇంతటి అత్యద్భుత సాహిత్యానికి పదాలు ఎవరు కూర్చగలరు? ఇంతటి అందమైన సాహిత్య మాలను ఎవరు అల్లగలరు? ఇలాంటి కవిత్వాన్ని ఎవరు వ్రాయగలరు? విశ్వంభర కవి సి.నారాయణరెడ్డి గారు తప్ప.

అప్పుడప్పుడు దుఃఖమన్నది అంటుకోనీ మనసును..

ఎప్పుడూ సుఖమైతే మనిషి భరించగలడా బతుకు మంచును..

స్థిరం కాదని తెలిసినా తెగ మరులు కలిగిస్తుంది దేహం..

కాస్త జారితే పగిలిపోయే కడవపై ఎంతెంత మొహం..

అని శాశ్వతం కాని ఈ దేహం గురించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ సి.నారాయణ రెడ్డి గారు తన కలం ద్వారా తెలియ పరిచారు. వారు ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుండి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, తదితరాలు వెలువడ్డాయి.

సి. నారాయణ రెడ్డి గారు మహావక్తలు, విద్యావేత్తలు. తన వాచిక ప్రతిభ అనన్య సాధ్యం. తన కలం ఎంత శక్తిమంతమైనదో, గళం కూడా అంత సమ్మోహనాత్మకమే. తాను నిత్యసభావ్రతులు. తాను తెలుగు సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు. కథాగేయ కావ్యాలు సృష్టించడంలో, గేయ సూక్తులు రచించడంలో, “మాకందా”లను అందించడంలో, వచన కవిత్వంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో “ప్ర”పంచపదులను నిర్మించడంలో, తెలుగు గజళ్ళకు మానవీయ దృక్పథాన్ని అనుసంధించడంలో, ప్రతీకాత్మకంగా వచన కవితలో ఇతిహాస కావ్యాన్ని “విశ్వంభర”ను నిర్మించడంలో, “మట్టీ మనిషీ ఆకాశం” వంటి వచన కవితా “కావ్యేతి హాసాన్ని” సంవిధాన సంపన్నంగా సృజించడంలో మహాకవి నారాయణ రెడ్డి గారి ప్రయోగశీలం ప్రస్ఫుటమవుతుంది. వక్తృత్వ ప్రతిభకు ప్రాణం భాష. ఆ భాష నారాయణరెడ్డి గారి ఇంటి వివృత గవాక్షం. తన కంటి వినిర్మల కటాక్షం. భాష తాను “తెచ్చుకున్న తీయని వరం”. తాను కట్టుకున్న జీవన గోపురం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    సింగిరెడ్డి నారాయణ రెడ్డి

జననం    :    29 జూలై 1931 

స్వస్థలం   :     హనుమాజిపేట, వేములవాడ మండలం, కరీంనగర్ జిల్లా, 

తండ్రి   :   మల్లారెడ్డి 

తల్లి     :   బుచ్చమ్మ 

 వృత్తి      :    కవి, నాటక రచయిత, స్వరకర్త, కళాకారుడు, ప్రొఫెసర్, రాజకీయవేత్త

భార్య        :    సుశీల

పురస్కారాలు  :   సాహిత్య అకాడమీ అవార్డు (1973)

పద్మశ్రీ (1977) కళా ప్రపూర్ణ (1978) జ్ఞానపీఠ అవార్డు (1988) పద్మ భూషణ్ (1992)

మరణం   :              12 జూన్ 2017 (వయస్సు 85)

జననం…

కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలో గల హనుమాజీ పేటలో మల్లారెడ్డి,బుచ్చమ్మ దంపతులకు 29 జులై 1931లో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. దేవుని మొక్కు వల్ల కొడుకు పుట్టాడని, సత్య నారాయణ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో మల్లారెడ్డి తన కొడుకును చేర్పించే సమయాన “సి.నారాయణరెడ్డి” అని నమోదు చేయించడం చేత, అదే పేరు స్థిరపడింది. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది.

హనుమాజి పేటలో ఆ కాలంలో ప్రభుత్వ పాఠశాల లేనందు వలన వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు నడిపే వీధి బడిలో తాను చదువుకు శ్రీకారం చుట్టి, ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. తరువాత సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో తెలుగును ఒక ఐచ్ఛిక విషయంగా గ్రహించి, మాధ్యమిక స్థాయి విద్యను అభ్యసించారు. 1948లో కరీంనగర్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. తనలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, చిన్ననాటి నుండే ఉన్నాయి.

ఉన్నత విద్య…

 చిన్నప్పటినుండి మట్టిలో పుట్టిన జానపదగీతాలను ఆలపించే వారు. హరికథలు, బుర్రకథలంటే చెవి కోసుకునే వారు. హరికథా కథనాన్ని ఆశువుగా, సంగీతాత్మకంగా అనుకరించే వారు. వేములవాడ చెందిన చౌటి నరసయ్య హరికథా గానం నారాయణ రెడ్డి గారికి ఛందస్సు పట్ల మక్కువ, అభిరుచి కలగడానికి ప్రేరకమైంది. ఛందస్సంటే తెలియని దశలో ఆరేడు తరగతుల నుండే కవితలు వ్రాయడం మొదలు పెట్టారు. ఏడవ తరగతిలో సీస పద్యమని తెలియని దశలో ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవిలో పొట్ట కోసర మెటో పోవుచుండె’ అనే పంక్తితో ప్రారంభించి పద్యం వ్రాస్తే – అది సీసపద్యమని తెలిసి దూపాటి వేంకట రమణాచార్యులు ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను నారాయణ రెడ్డి గారికి తెలిపారు.

సినారె తొలి గేయం తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వ్రాసిన “మారుటెన్నడో విషంపు గుండెలీ జగాన మారుటెన్నడో” అనేది. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడు “వెన్నవంటి మనసున్నవానికి, అన్నమేమొ కరువాయె ఉన్నవాని కింతన్న వీడుదామన్న గుండె లేదాయె” వంటి పాటలు వ్రాశారు. “విజయంబు సాధించినావా విద్యార్థి, నీ వీర భావాలు నింగి వ్యాపించగా.. నీ వైరి చిత్తాల నేల కంపించగా” వంటి గేయాలు రచించి కరీంనగర్ విద్యార్థి మహాసభలో పాడారు. హైదరాబాదు ఛాదర్ఘాట్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ మీడియట్ (1948-49) పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.

కుటుంబం…

సి.నారాయణ రెడ్డి గారిది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నారాయణ రెడ్డి గారి భార్య శ్రీమతి సుశీల దివంగతురాలు. ఆమె స్మృత్యంకంగా ‘‘శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు’’ను స్థాపించారు నారాయణరెడ్డిగారు. ప్రతి ఏటా ఆ ట్రస్టు తరుపున ఉత్తమ రచయిత్రికి 50 వేల రూపాయల నగదు పురస్కారం అందజేస్తున్నది. ఆమె పేరిట డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు బంగారు పతకాలు ఏర్పాటు చేయబడినాయి.

నారాయణరెడ్డి గారికి నలుగురు కూతుళ్ళు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. అల్లుళ్ళు భాస్కరరెడ్డి, సురేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి లు. నారాయణరెడ్డి తల్లి బుచ్చమ్మగారే నారాయణరెడ్డి పెద్ద కూతురు “గంగ”గా పుట్టిందా అన్నట్లుగా, పెద్ద కూతురు శ్రీమతి గంగ, నారాయణరెడ్డి గారితో పాటు, అందరినీ కంటికి రెప్పలా చూసుకునేవారు. అందుకే నారాయణ రెడ్డి గారు తమ ‘సినారె గజళ్ళు’ కావ్యాన్ని శ్రీమతి ‘గంగ’కు అంకితం చేశారు.

మనుమలతో, ముని మనుమళ్ళతో, మనుమరాళ్ళతో, ముని మనుమరాళ్ళతో నారాయణ రెడ్డి గారి ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆచార్యునిగా, ఇంకా పదకొండు సంవత్సరాల భాషా సాహిత్యసేవ చేయవలసిన కాలం ఉండగా, నారాయణ రెడ్డి గారి జీవితం ఒక మలుపు తిరిగింది. ఆచార్య నారాయణరెడ్డిగారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అధికార భాషా సంఘాధ్యక్ష పదవిని జన్మదినోత్సవ  ఉపాయనంగా అందించింది. ఆ జన్మదినోత్సవ సన్మాన సభలో నారాయణ రెడ్డి గారు..

ఎవరికి ఈ సన్మానం

ఎందుకు ఈ సన్మానం

చెట్టంతటి పేరొందిన

చిగురుకు ఈ సన్మానం

అని ప్రారంభించి

పేరేమో సింగిరెడ్డి

నారాయణ రెడ్డి కాని

కులం కీళ్ళు విరిచే నా

కలానికీ సన్మానం

అంటూ ఒక గేయకవిత చదివారు. దాంతో సభంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

సినీ ప్రయాణం…

నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే 1962 లో ఎన్టీఆర్ గారి ఆహ్వానం మేరకు చలనచిత్ర రంగప్రవేశం చేశారు. కాశీ మజిలీల ఆధారం గా 1962లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా “గులేభకావళి కథ” తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రచయితగా నారాయణ రెడ్డి గారికి తొలి సినిమా”గులేభకావళి కథ”. ఆ చిత్రం లోని “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని” తెలుగు సినీ పాటల్లోని ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.

అలా ప్రారంభమైన తన ప్రస్థానం మూడు వేల పై చిలుకు పాటలతో తన సాహిత్యానికి వన్నెలద్ది సినీ వినీలాకాశంలో వెన్నల వసంతాలను పూయించారు. ఎక్కడా తాను వెనుదిరిగాల్సిన అవసరం లేకపోయింది. తెలుగు సినీ సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించారు. నన్ను దోచుకుందువటే, తెలిసిందిలే తెలిసిందిలే, పగలే వెన్నెల, చాంగురే బంగారు రాజా,   భలే మంచి రోజు,   ఎంతవారు గానీ, తెలుగు జాతి మనది,    ఈ రేయి తీయనది,  గున్న మామిడి కొమ్మ మీద,  ఈ జీవన తరంగాలలో, వస్తాడు నా రాజు   , నా మది నిన్ను పిలిచింది,   చిత్రం భళారే విచిత్రం, సిపాయి ఓ సిపాయి లాంటి ఎన్నో ఆణిముత్యాలతో తెలుగు సినిమాను అలంకరించారు.

తన సినీ ప్రస్థానంలో కొన్ని వేల పాటలను రచించిన నారాయణ రెడ్డి గారు ఒక రకంగా పాత తరం సినీ సాహిత్యానికి, ప్రస్తుత సినీ సాహిత్యానికి మధ్య వారధిని నిర్మింపజేశారు. దాదాపుగా తెలుగు సినీరంగంలోని అందరి అగ్ర హీరోలతోపాటు, ఎందరో వర్ధమాన హీరోలకు పాటలు రాసిన ఖ్యాతిని దక్కించుకున్నారు. అంతేగాకుండా ఉర్దూ సాహితీ ప్రక్రియలో గజల్‌ కవిగా కూడా పేరుగాంచారు. ఎన్నని చెప్పేది.. ఏవని చెప్పేది.. ఆయన రచనల్లోని సూపర్ హిట్ సినీ గీతాలు ఎన్నో. సినిమా పాటలు రాసినా.. సాహితీ విలువలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకున్నారు. తెలుగు సినీ సాహిత్యంపై శాశ్వత ముద్రను వేశారు.

కవి గా…

పౌర్ణమి రోజున పుట్టిన వాళ్లు కవులవుతారనేది మన సంప్రదాయంలోని ఒక నమ్మకం. బహుశా నారాయణ రెడ్డి గారి వంటి వాళ్లు పుట్టిన తిథిని బట్టే అలాంటి నమ్మకం ఏర్పడిందేమో! పుట్టిన రోజులను తేదీలతో గాక తిథి, నక్షత్రాలతో గుర్తుంచుకునే రోజులవి. తాను పుట్టింది 1931 వ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున అని ఒకసారి చెప్పారు నారాయణ రెడ్డి గారు.

అలా పౌర్ణమి రోజున పుట్టి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహితీ లోకంలో నిండు చంద్రుడిగా వెలిగారు. ఆచార్య నారాయణ రెడ్డి గారు సామాజిక చైతన్య ప్రబోధాన్ని తమ కవిత్వ ప్రధాన లక్ష్యంగా చేసికొని, ప్రగతిశీల మానవతా వాదాన్ని ఎంచుకొని, ఆనాటి ‘‘నవ్వని పువ్వు’’ (1953) మొదలుకొని, ఈనాటి “అలలెత్తే అడుగులు” (2013), నింగికెగిరే చెట్లు (2014) వరకు 18 ప్రక్రియలలో సుమారు 90 గ్రంథాలు రచించారు.

నారాయణ రెడ్డి గారు 1953లో నవవని పువ్వు అనే కవితా సంకలనం, వెన్నెల వాడ (1959), జలపథం, దివ్వెల మువ్వలు (1959), రుతు చక్రం (1964), మధ్యతరగతి మందహాసం (1968), మంటలు మానవుడు (1970). 1980లో ప్రచురించబడిన కవితా రచన విశ్వంభర ( ది ఎర్త్ ) వంటి రచనలు చేశారు. 

నారాయణ రెడ్డి గారు బౌద్ధమతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చి శిల్పి “పద్మాదేవ”తో ప్రేమలో పడిన శాంతిశ్రీ అనే మహిళ హృదయ విదారకమైన ప్రేమకథ ఆధారంగా రూపొందించబడిన బౌద్ధ పురాణ కవిత్వం “నాగార్జున సాగరం” కూడా వ్రాశారు. కాకతీయ రాజవంశం ఆధారంగా రామప్ప (1960) అనే సంగీత నాటకం కూడా వ్రాశారు.

సి.నా.రె రచనలు…

కవిత్వం…

విశ్వంభర

మనిషి – చిలక

ముఖాముఖి

భూగోళమంత మనిషి

దృక్పథం

కలం సాక్షిగా

కలిసి నడిచే కలం

కర్పూర వసంతరాయలు

మట్టి మనిషి ఆకాశం

మంటలూ – మానవుడూ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1973)

తేజస్సు నా తపస్సు

నాగార్జున సాగరం

విశ్వనాథ నాయకుడు

కొనగోటి మీద జీవితం

రెక్కల సంతకాలు

వ్యక్తిత్వం

వ్యాసాలు…

పరిణత వాణి

విశ్వంభర…

డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము “విశ్వంభర”. ఈ పద్య గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు నారాయణ రెడ్డి గారు. ఈ “విశ్వంభర” కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా ప్రవేశపెట్టాయి. దీనిని ఆచార్య భీమసేన్ నిర్మల్ గారు హిందీలోకి, డాక్టర్ అమరేంద్ర గారు ఆంగ్లములోకి అనువదించారు. దీనిని స్టెర్లింగ్ పబ్లిషర్స్ 1986లో ముద్రించారు. నారాయణ రెడ్డి గారు విశ్వంభర కావ్యాన్ని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. ఈ కావ్యాన్ని మొదటిసారిగా 1980లో ముద్రించారు. దీనిపై డాక్టరేటు పరిశోధనలు కూడా జరిగాయి. నారాయణ రెడ్డి గారు కలకత్తా భారతీయ భాషా పరిషత్తు నుండి “భిల్వారా” పురస్కారాన్ని, త్రివేండ్రం నుండి కుమారన్‌ ఆసాన్‌ పురస్కారాన్ని, సోవియెట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డును పొందింది.

విశ్వంభర రచన నుండి ఉదాహరణలు…

ఆరంభం..

నేను పుట్టక ముందే

నెత్తి మీద నీలి తెర

కాళ్ళ కింద ధూళి పొర

ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో

మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి

చిచ్చుముద్దల్లోంచి

చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు

పాలమీగడల్లా పరుచుకున్నాయి

ఇంకా..

బురద నవ్వింది కమలాలుగా

పువ్వు నవ్వింది భ్రమరాలుగా

పుడమి కదిలింది చరణాలుగా

జడిమ కదలింది హరిణాలుగా

నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది

నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

వేయి తోటలను నరికిన చేయి

పూయిస్తుందా ఒక్క పువ్వును

ఉర్వీతలాన్ని వణికించిన శక్తి

ఒక్క హృదయాన్ని జయిస్తుందా…

ముగింపు…

మనసుకు తొడుగు మనిషి

మనిషికి ఉడుపు జగతి

ఇదే విశ్వంభరా తత్వం

ఇదే అనంత జీవిత సత్యం….

విశ్వంభర కావ్యానికి “మానవుడు” నాయకుడు. రంగస్థలం విశాల “విశ్వంభర”. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. 

“మనశ్శక్తులే” మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు . అలెగ్జాండర్, యేసు క్రీస్తు, అశోక చక్రవర్తి, సోక్రటీస్, గౌతమ బుద్ధుడు, అబ్రహం లింకన్, లెనిన్, కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ మనిషికి ఇలా ఎన్నెన్ని రూపాలో. కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

ఆదిమ దశ నుండీ ఆధునిక దశ వరకు కూడా మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలో వ్రాయబడ్డ ప్రకరణాలు. కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం అనేవి మూడు కూడా మనిషి సాధన త్రిముఖాలు. ఈ సాధనలో మనిషికి అడుగడుగునా ఎదురు దెబ్బలు. క్షతుడైనా కూడా మనిషి తిరోగతుడు కాలేకాపోయాడు.

ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖా చిత్రమే నారాయణ రెడ్డి గారికి “విశ్వంభర” కావ్య రచనకు పునాది.

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు…

నారాయణ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలని అన్ని పార్టీలూ ఆహ్వానించాయి. కాసు బ్రహ్మనందరెడ్డి గారు కాంగ్రెస్ తరపు నుంచి కరీంనగర్ లో నారాయణ రెడ్డి గారిని పోటీ చేయాలని  కోరారు. నందమూరి తారకరామారావు గారు నారాయణ రెడ్డి గారిని పార్టీలోకి చేరాలని, ప్రత్యక్షంగా పోటీ చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. కానీ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల వైపు రాలేదాయన. ఆఖరికి రాష్ట్రపతి కోటాలో 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

రాజ్యసభా సభ్యత్వ కాలపరిమితి ఆరేళ్ళు. కనుక నారాయణ రెడ్డి గారు 27.8.1997 నుండి 26.8.2003 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. దక్షిణ భారతం నుండి రాజ్యసభ సభ్యులుగా నియమింపబడిన ప్రప్రథమ కవి నారాయణ రెడ్డి గారే కావడం విశేషం. తనతో పాటు రాజారామన్న, షబానాఅజ్మీ కులదీప్ నయ్యర్ – వంటి సుప్రసిద్ధులు పన్నెండుమంది రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. దక్షిణాది భాష కవుల్లో తొలి సారి ఈ గౌరవం పొందిన కవి సి.నారాయణ రెడ్డి గారు.

రాజ్యసభ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాలకు గానూ నారాయణ రెడ్డి గారికి “ఎంపిలాడ్స్”, పథకం కింద 11 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించింది.  నారాయణ రెడ్డి గారు వివిధ పథకాలకు ఆ నిధి నుండి ఆర్థిక సహాయం చేశారు.

ఒరిస్సాలోని కటక్ లో నేతాజీ జన్మించిన “జానకీనాథ్” భవనం పునరుద్ధరణకూ, ఒరిస్సా వరద బాధితుల సహాయనిధికీ, గుజరాత్ భూకంప బాధితుల సహాయనిధికీ, షోలాపూర్లోని పద్మశాలి విద్యాసంస్థ భవన నిర్మాణానికీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “నీరు మీరు” పథకానికీ, కరీంనగర్లో “సారస్వత సదన్” భవన నిర్మాణానికీ

వేములవాడలో “సాహితీసదన్” భవన నిర్మాణానికి, కరీంనగర్ వట్టెపల్లెలో “అంబేడ్కరు కమ్యూనిటీ” హాలు నిర్మాణానికీ

సిరిసిల్లలో “పురపాలక సంస్థ ఆడిటోరియం” నిర్మాణానికీ

హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు పండిత శిక్షణ కళాశాల భవన నిర్మాణానికీ, వేగేశ్న వికలాంగుల సంస్థ భవన నిర్మాణానికీ,

కడపలో సి.పి. బ్రౌన్ గ్రంథాలయ భవన నిర్మాణానికీ, నారాయణ రెడ్డి గారు తమ ఎంపిలాడ్స్ నిధుల నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పురస్కారాలు…

★ 1988 వ సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు..

★ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం..

★ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం..

★ భారతీయా భాషా పరిషత్ పురస్కారం..

★ 1988 లో రాజలక్ష్మీ పురస్కారం..

★ 1982 లో సోవియట్-నెహ్రూ పురస్కారం..

★ అసాన్ పురస్కారం..

★ 1977 లో పద్మశ్రీ పురస్కారం..

★ 1992 లో పద్మభూషణ్ పురస్కారం…

★ ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ..

★ (ప్రేమించు) చిత్రంలో “కంటే నే అమ్మా అని అంటే ఎలా..” అనే గీతానికి సాహిత్యం అందించినందుకు గానూ ఉత్తమ పాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు..

★ సీతయ్య (2003) చిత్రములోని “ఇదిగో రాయలసీమ గడ్డ” గేయానికి సాహిత్యం అందించినందుకు గానూ ఉత్తమ పాటల రచయిత గా నంది పురస్కారం అందుకున్నారు..

★ 2011వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం..

★ డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం – 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)..

★ ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు నారాయణ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి…

పదవులు…

నారాయణ రెడ్డి గారు విద్యారంగంలోనూ, పాలనా పరంగానూ ఎన్నో పదవులు నిర్వహించారు.

★ 1981 ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గా…

★ 1985 లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు..

★ 1989 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు…

★ 1992 లో ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు..

★ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు..

★ 1997 లో భారత రాష్ట్రపతి అతన్ని  రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి…

★ 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి గారు విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు…

మరణం…

నారాయణ రెడ్డి గారికి ఆరోగ్యం విషమించడంతో పాటు, ఛాతిలో విపరీతంగా నొప్పి రావడంతో హైదరాబాదు లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. నారాయణ రెడ్డి గారు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన 85 సంవత్సరాల వయస్సులో 12 జూన్ 2017 సోమవారం నాడు ఉదయం గుండెపోటుతో మరణించారు.

విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించిన నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981), అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989), ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992), రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు,  1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వహించి, విలక్షణ కార్యక్రమాలను రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడిన నారాయణ రెడ్డి గారి మరణం తెలుగు భాషా అభ్యున్నతికి తీరని లోటు అనే చెప్పాలి.

సి. నారాయణ రెడ్డి ప్రపంచ పదుల నుండి…

తవ్వగలిగితే గుండె పొరలను రవ్వలెన్నో యెదుట పడవా 

ఇవ్వగలిగితె నాదలయలను మువ్వలెన్నో వెంట పడవా 

చెక్కుచెదరని లక్ష్యముంటే చేతకానిది మనిషి కేదీ

చూడగలిగితె పట్టపగలే చుక్కలెన్నో కంటపడవా

కదపగలిగితె పెనుయెడారిని గంగలెన్నో బయటపడవా…

వెళ్ళితే కాదనను కాగేకళ్ళ ఆవిరి చూసిపో

వీడితే కాదనను మూల్గేనాడి ఊపిరి చూసిపో

అన్నీ తెలిసే తెంచుకొని పోతున్న నీకో విన్నపం

నవ్వితే కాదనను మునిగే నావ అలజడి చూసిపో

కాల్చినా కాదనను మంటను కాస్త నిలబడి చూసిపో

ఉప్పెనలో తలఒగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం..

ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం

చచ్చేదాకా బతికుండడం జాతకాలలో ఉన్నదే

ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం

ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవితం..

Show More
Back to top button