GREAT PERSONALITIESTelugu Special Stories

నవయుగ వైతాళికుడు, తొలి తెలుగు సాంఘిక నవల రచయిత..  కందుకూరి వీరేశలింగం.

పిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేస్తారెందుకు?

ఆడపిల్లల్ని చదువుకోనివ్వరెందుకు? అడుగు బయటికి పెట్టనివ్వరెందుకు? 

చిన్న వయస్సులో భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేయరెందుకు?

లంచం ఇవ్వకుండా ఉద్యోగం రాదెందుకు?

కులమతాల అడ్డుగోడలెందుకు అవినీతి ఎందుకు? అబద్ధాలెందుకు?

కళ్ల ముందే ఇన్ని నచ్చని విషయాలు జరుగుతుంటే మనుషుల్లో ఇంత మౌనం ఎందుకు?…

ఇలాంటి ప్రశ్నలతో ఒక పదేళ్ల కుర్రాడి జీవితం అనేక సంఘర్షణలతో, అనేక సందర్భాలతో, అనేక క్షణాలతో మొదలైంది. పదేళ్ల వయస్సు వరకు ఆ కుర్రాడి జీవితం బాగుంది. తన పదేళ్ల వయస్సు తరువాత సమాజంలో స్త్రీలు, పిల్లల జీవితం బాగోలేదన్న విషయం కొద్దికొద్దిగా అర్థమౌతున్న కొద్దీ అతడి జీవితమూ బాగోలేకుండా పోయింది. ఏం చేసి వీళ్లను కాపాడాలి? చిన్న వయస్సుకు పెద్ద సమస్య. కేశవ్ చంద్రసేన్ అనే వ్యక్తి బెంగాల్ రచయిత. తాను రచించిన పుస్తకాలు ఆ పిల్లవాడు చదివాడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ వ్రాశాడు. అది ఆ కుర్రాడి మస్తిష్కానికి బాగా పట్టేసింది. ఆ పిల్లవాడు అనుకుంటున్నదే రచయిత వ్రాశాడు. ఆ పిల్లవాడే కందుకూరి వీరేశలింగం పంతులు గారు.

అయితే వీరేశలింగం పంతులుగారు తమ నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయటం, సంస్కరణలను ప్రవేశపెట్టడం, సాహిత్య కృషి చేయడం ద్వారా సంస్కర్తల సాహిత్యవేత్తలలో ఒకడు మాత్రమే కాగలిగేవాడు. తెలుగుదేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి, తెలుగుదేశాన్ని ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి ఇంతవరకు ఇంకొకరు లేరు. వీరేశలింగం గారికి, సమాజానికీ అస్సలు పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా తాను శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తీసుకురాగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి ఎంతో సమయం పడుతుంది. అప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని ఏవిధంగా భద్రపరచాలి? సమాజం ఉలిక్కిపడి లేచేలా ఎలాగైనా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నారు వీరేశలింగం పంతులు గారు.

వీరేశలింగం పంతులు గారు నిజంగా మహా పురుషుడు. దీనుల పట్ల ఆయన మనస్సు పరమార్ద్రంగా,  సత్కార్యచరణ పట్ల ఆయన గుండె వజ్రకాఠిన్యంగా ఉండేది. ఏదైనా ఒక పనిని పూనితే ఆయన సాధించకుండా ఎప్పుడూ విడిచిపెట్టలేదు. లోకంలో మహాయుద్ధాల్లో పాల్గొన్న ఏకవీరుడికీ, లోకక్షేమాన్నే కోరి తన తనువులనే అర్పించిన మహాత్ములకు పంతులు గారు ఎందులోనూ తీసిపోరు. వీరేశలింగం పంతులు గారికి గొప్పతనం తెచ్చి పెట్టిన మహాత్తరమైన యోగ్యతల్లోకెల్లా మహాత్తరమైనది ఆయన యొక్క త్రికరణశుద్ధి. తను నమ్మిన దానిని ఆచరణ పెట్టడంలో ఆయన నిర్భీకత్వం, సాహసం, పట్టుదల చాలా ఆశ్చర్యాన్ని, గగుర్పాటుని కూడా కలిగిస్తాయి. పంతులు గారు గొప్ప మానవతావాది. ఒంటరిగా రంగంలోకి దూకి మహా భయంకరంగా యుద్ధం చేశారు. అన్యాయాలపై కత్తి దూసి, తన ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు, చేతనైనంతవరకు వాటిని రూపుమాపారు. ఎక్కడ అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని  సహించి ఊరుకోలేదు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :  కందుకూరి వీరేశలింగం పంతులు

జననం    :    16 ఏప్రిల్ 1848

స్వస్థలం   :  రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

తండ్రి  :  సుబ్బారాయుడు

తల్లి  :  పున్నమ్మ

జీవిత భాగస్వామి   :   బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ)

వృత్తి      :   సంఘసంస్కర్త, రచయిత

బిరుదు   :   నవయుగ వైతాళికుడు

మరణ కారణం   :   ఉబ్బసం వ్యాధి కారణంగా 

మరణం   :   27 మే 1919, 

చెన్నై , తమిళనాడు

నేపథ్యం…

వీరేశలింగం పంతులు గారు 16 ఏప్రిల్ 1848 నాడు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీరి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారి ఇంటి పేరు కందుకూరిగా స్థిరపడిపోయింది. అనుకోకుండా వీరేశలింగం గారు నాలుగేళ్ళ వయస్సులో ఉండగానే తన తండ్రి మరణించారు. దాంతో తండ్రి లేని ఈ పిల్లాడిని పెదతండ్రి, నాయనమ్మలు అల్లారుముద్దుగా పెంచారు. ఐదో యేట బడిలో చేరిన వీరేశలింగం గారు బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నారు. తనకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఆంగ్ల విద్యను అభ్యసించడానికి రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో చేరారు.

అత్యంత ప్రతిభావంతుడైన వీరేశలింగం గారు చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. బాల్య వివాహాలు అత్యంత ప్రభావితమైన ఆ రోజులలో తన పదమూడు సంవత్సరాల వయస్సులో బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో వీరేశలింగం గారికి బాల్యవివాహమయ్యింది. ఆ బాల్య వివాహమే రానున్న రోజులలో తాను పెద్దయ్యాక వీరేశలింగం గారు ఇటువంటి దురాచారాల నిర్మూలనకే అత్యంత కృషి చేశారు. తాను చదువుకునే రోజులలో “కేశుబ్ చంద్ర సేన్” గారు వ్రాసిన పుస్తకాలు చదివి ప్రభావితులైన వీరేశలింగం గారికి విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గింది. దాంతో దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి తాను వచ్చారు. ఈ విషయం ప్రజలకు నిరూపించడానికి తాను అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవారు.

ఉపాధ్యాయ వృత్తి…

వీరేశలింగం గారి పెదనాన్న 1867 లో మరణించారు. దాంతో తమ కుటుంబ పోషణకై ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరేశలింగం గారి మంచి స్వభావం మరియు అధ్యయనశీలత అతనికి తన పాఠశాలలో ఉత్తమ విద్యార్థి అవార్డును సంపాదించిపెట్టాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వీరేశలింగం గారికి కోరంగి గ్రామంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించారు. దీనికంటే ముందుగానే తాను వేరే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని ప్రయత్నించారు. కానీ లంచం ఇవ్వనిదే ఉద్యోగం రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నారు వీరేశలింగం గారు. తాను న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించారు. కానీ న్యాయవాద వృత్తిలోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, ఆ వృత్తి ప్రయత్నం కూడా మానుకుని తనకు ఉపాధ్యాయ వృత్తినే సరైనదని భావించిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వాటితో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించేవారు వీరేశలింగం గారు.

నాటి సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి…

ఆ రోజులలో ప్రజలలో విద్యావంతుల శాతం తక్కువగా ఉండేది. స్త్రీలలో చదువుకున్న వాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉండేవారు కాదు. సంఘంలో బాల్యవివాహాలు, వృద్ధ వివాహాలు చాలా ప్రాచుర్యం పొంది ఉండేవి. సాంఘికమైన భద్రతను, కుటుంబ జీవన సౌఖ్యాన్ని భగ్నం చేసే వేశ్యా వృత్తి ప్రబలంగా సాగుతూండేది. ఇదేమిటని ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ వచ్చేది కాదు. అదీకాక వేశ్యలను ఉంచుకోవడం ఒక సాంఘిక హోదాగానూ, కళాపోషణం గానూ రాసిక్యానికి గుర్తు గాను చలామణి అయ్యేది.  ఉద్యోగస్తులలో లంచగొండితనం సర్వసామాన్యంగా అమలులో ఉండేది. ఇంటింటికి వితంతువులు ఉండేవారు. అదికూడా దయనీయమైన హృదయ విదారకమైన బాలవితంతువులు వాళ్ళు.

హిందూ సమాజంలో స్త్రీ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒక వితంతువుగా ఉండేవారని రఘుపతి వేంకటరత్నం నాయుడు గారు చెప్పారు. ఆ రోజులలో కన్యాశుల్కం ఎక్కువగా ఉండేది. ఏడాది, రెండేళ్లలోపు పిల్లలకు కూడా శుల్కం చెల్లించిన ఉదంతాలు  ఉన్నాయి. కడుపులో ఉన్న బిడ్డకు కూడా ముందే భయానా చెల్లించిన సంఘటనలు కూడా తమ పరిశీలనలో నమోదైనట్లు గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఇక ఇంత లేత వయసున్న ఆడపిల్లలకు మధ్య వయస్కులను, ముసలి వాళ్లని ఇచ్చి పెళ్లి చేస్తే సంఘంలో వితంతుల సమస్యకు కొదవేముంటుంది. అందుకనే గురజాడ అప్పారావు గారు ఆనాటి భయంకరమైన, సాంఘికమైన దుస్థితిని వివరిస్తూ “such a scandalous state of things is a disagrace to society” అన్నారు.

వివేక వర్థిని పత్రిక స్థాపన…

వీరేశలింగం గారు సంఘ సంస్కరణ భావాలను భోదించడానికి అనేక కారణాలు ఉన్నాయి. తన జీవితం అనేక సంఘర్షణలతో, అనేక సందర్భాలతో, అనేక క్షణాలతో మొదలైంది. పిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు ఎందుకు చేస్తారో తనకు అర్థమయ్యేది కాదు. ఆడపిల్లల్ని చదువుకోనివ్వకుండా, ఇంటినుండి బయటకు అడుగు పెట్టకుండా ఆంక్షలు ఎందుకు విధించేవారో తనకు తెలిసేది కాదు. చిన్న వయసులో భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేయకపోవడం, ఉద్యోగం పొందాలంటే లంచం తప్పనిసరిగా ఇవ్వాల్సి రావడం, కులమతాల అడ్డుగోడలు, అవినీతి వీటన్నీటిని చూసి సమాజంపై, సంఘంపై తనకు కోపం వచ్చేది. కళ్ల ముందే నచ్చని విషయాలు జరుగుతుంటే మనుషుల్లో ఇంత మౌనం ఎందుకో అని తాను మదనపడేవారు. ఇన్ని ఆలోచనలతో వీరేశలింగం గారు సంఘంతో గొడవకు, ఘర్షణ దిగారు. ఉన్నత విద్యానంతరం వీరేశలింగం అధ్యాపక వృత్తిని చేపట్టిన తాను రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులలోని కొన్ని పాఠశాలల్లో పని చేశారు.

అధ్యాపకుడిగా పనిచేస్తుండడం వలన “పంతులు” గారు అని, వీరేశలింగం పంతులు గారు అని ప్రాచుర్యంలోకి వచ్చారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి 1876లో తాను ఉపాధ్యాయ వృత్తి నుండి పాత్రికేయునిగా మారి “వివేకవర్థిని” అనే మాసపత్రికను ప్రారంభించారు. మొట్టమొదటగా ఈ పత్రిక మద్రాసు నుండి వచ్చేది. ఆ తరువాత కొంతమంది మిత్రులతో కలిసి రాజమండ్రిలోనే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి పత్రిక నిర్వహిణ చేసేవారు. ఆ రోజులలోనే మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, లంచగొండితనం ఇలా ఎన్నో అన్యాయాలు జరుగుతుండేవి సమాజంలో.  వాటిపైకి తన పత్రిక “వివేకవర్థిని” ని తాను ఎక్కుపెట్టారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలన నిర్ములనకు వీరేశలింగం గారు అకుంఠిత దీక్షతో పనిచేశారు. ఆ రోజులలో పాతుకుపోయిన వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా “వివేకవర్ధని” లో వ్యాసాలు వ్రాశారు.

మొట్టమొదటి బాలికల పాఠశాల..

ఆంధ్రదేశంలో 1870వ దశకంలో వెలువడుతున్న “ఆంధ్ర భాషా సంజీవని”, “పురుషార్ధ ప్రదాయిని” అను పత్రికల్లో స్త్రీ విద్యను గురించిన వివాదం చెలరేగింది. “పురుషార్ధ ప్రదాయిని” పత్రికను ఉమారంగ నాయకులు నాయుడు గారు నడిపేవారు, ఆయన మచిలీపట్టణం వాసి. “ఆంధ్ర భాషా సంజీవని” పత్రికను సాంప్రదాయవాది అయిన మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు సంపాదకుడిగా ఉండేవారు. 1871లో ప్రారంభించబడ్డ “ఆంధ్ర భాషా సంజీవని పత్రిక” గ్రాంధిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషావాదాన్ని విమర్శించేది. ఈ నేపథ్యంలోనే స్త్రీ విద్యను సమర్థిస్తూ వీరేశలింగం పంతులు గారు  పై వివాదంలో భాగస్వామి అయ్యారు. తాను నమ్మిన సిద్ధాంతాలను విస్తృతంగా, సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు 1874లో రాజమండ్రిలో “వివేకవర్ధిని” అనే పత్రికను   ప్రారంభించిన వీరేశలింగం గారు “స్త్రీ విద్య” ను వ్యతిరేకించేవారిని అపహాస్యం చేస్తూ కవిత్వాన్ని చెప్పడమే కాక నాటికలు కూడా రచించారు.

“బ్రహ్మ వివాహం” అనే తన రచనలో బాల్య వివాహాల్ని, కన్యాశుల్కాన్ని తీవ్రంగా విమర్శించారు. తన ఆశయాన్ని ఆచరణలో పెట్టేందుకు సెప్టెంబరు 1874 లో వీరేశలింగం గారు రాజమహేంద్రవరంకు దగ్గరలో గల ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించారు. ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా ఇదే కావడం విశేషం. ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా “మల్లాది అచ్చన్న శాస్త్రి” ని నియమించారు. రాజమండ్రి లోని ఇన్నీస్ ( ఇంగ్లీష్ ) పేటలో 1881లో మరొక బాలికల పాఠశాలను వీరేశలింగం గారు స్థాపించారు. సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో తనకు చేదోడువాదోడుగా ఉంటుందని తన భార్య రాజ్యలక్ష్మికి కూడా చదువు నేర్పించారు. కేవలం బాలికల పాఠశాలలే కాకుండా శ్రామికులకై రాత్రి పాఠశాలల్ని, హరిజన పాఠశాలలను కూడా వీరేశలింగం గారే స్థాపించారు. సహవిద్యను ఆంధ్రదేశంలో మొదట ప్రోత్సహించింది కూడా వీరేశలింగం పంతులు గారే.

భర్త బాటలో భార్య…

ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి వీరేశలింగం వంటి ప్రముఖుల విషయంలో అక్షరాలా రుజువైంది. ఫిబ్రవరి 1907 లో హిందూ సమాజాన్ని స్థాపించి దాని ఆధ్వర్యంలో ఎన్నో సంస్థలను, ఆస్తులను కూడబెట్టారు వీరేశలింగం పంతులు గారు. తన సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ కూడా సంఘ సేవాభిలాషి కావడం వలన తన భర్త ప్రారంభించిన సంఘ సంస్కరణోద్యమానికి ఆమె పూర్తి సహాయ సహకారాలను అందించారు. రాజ్యలక్ష్మమ్మ గారు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి కోసం విశేషమైన కృషి చేశారు. రాజమహేంద్రవరం లోని వంకాయలవారి వీధిలో ప్రస్తుతం ఉన్న పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న మ్యూజియం వీరేశలింగం గారి ఇల్లు. ప్రస్తుతం మ్యూజియం గా నిర్వహించబడుతున్న ఆ ఇంటి నుండే ఎన్నో సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వీరేశలింగం, రాజలక్ష్మమ్మ దంపతులు నివాసం ఉండిన ఆ ఇంట్లోనే ముద్రణాలయం, పరిశోధనా కేంద్రం ఇప్పటికీ నెలకొన్నాయి.

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు వీరేశలింగం గారి సంస్కరణ ఉద్యమానికి ఎంతో చేయూతనిచ్చారు. వీరేశలింగం గారు ఆస్తికోన్నత పాఠశాలను స్థాపించడంలో, స్త్రీ విద్యా వ్యాప్తిలో చిలకమర్తి వారు వీరేశలింగం గారికి  ఎంతో సహాయం అందించారు.  వీరేశలింగ గారి ఆస్తికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి మామూలు చదువుతోపాటు దైవ ప్రార్థన కూడా అలవాటు చేసేవారు. వీరేశలింగంగారు రూపొందించిన ప్రార్థన నామరూప రహితుడైన పరమాత్మ గురించి మాత్రమే కానీ ఒక మతానికీ, ఒక కులానికీ సంబంధించినది కాదు. వీరేశలింగం పంతులుగారు రచించిన ఆ ప్రార్థన గీతం అన్ని మతాల వారికీ వర్తించే విధంగా ఉంటుంది. అంతేకాక పిల్లలకు బాల్యం నుంచి సంఘ సేవాభిలాషను అలవర్చుకునేందుకు ఆ పాఠశాలలో తగిన వాతావరణం నెలకొల్పుతారు. వీరేశలింగం గారి ఆస్తికోన్నత పాఠశాల జూనియర్‌, డిగ్రి కళాశాలలతో ఏటా వేలాది విద్యార్ధులకు విద్యా దానం చేస్తున్నాయి. రాజ్యలక్ష్మమ్మ గారి పేరిట ఒక మహిళా కళాశాలను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా మహిళా విద్యా వ్యాప్తి చేస్తున్నారు.

వితంతు పునర్వివాహ సంఘం…

దివాన్ బహదూర్ ఆర్ రంగనాథరావు, పి చంచల్రావు వంటి మద్రాసు నగర ప్రముఖులు సభ్యులుగా 1874లో మద్రాసులో వితంతు పునర్వివాహాల సంఘాన్ని ప్రారంభించారు. కానీ అది ప్రారంభించిన రెండేళ్లకే ఈ సంఘం కనుమరుగైంది. విశాఖపట్నం వాసియైన మహా మహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు 1875లో వితంతు వివాహాన్ని సమర్థిస్తూ “పునర్వివాహ సంగ్రహం” అనే గ్రంథాన్ని రచించారు. అది చూసి కొక్కొండ వెంకటరత్నం పంతులు తట్టుకోలేకపోయారు. రంగాచార్యుల గారికి వ్యతిరేకంగా ప్రచారం కూడా సాగించారు. అందుకు మద్దతుగా వీరేశలింగం గారి సహాయాన్ని అర్థించాడు. కానీ వీరేశలింగం గారి మద్దత్తు వితంతువుల వైపే ఉంది. తన ఆశయాల్ని ఆచరణలోకి తీసుకురావాలనేది వీరేశలింగం గారి ఆరాటం. సెప్టెంబరు 1878 లో రాజమండ్రిలో “సంఘ సంస్కరణ సమాజం” స్థాపించబడింది.

మహారాజా బాలికల పాఠశాలలో వితంతు వివాహం పై 03 ఆగస్టు 1879 నాడు వీరేశలింగం గారు మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చారు. ఆంధ్ర దేశమంతా ఈ ఉపన్యాసం సంచలనం సృష్టించింది. ఇదే ప్రాంతంలో 12 అక్టోబరు నాడు మరో ఉపన్యాసం ఇచ్చారు. దాంతో సాంప్రదాయవాదులలో కలవరం పుట్టింది. వీరేశలింగం గారి వాదనల్ని ఎదుర్కోవడానికి పోటీగా రాజమండ్రి, కాకినాడ లలో  సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ వితంతు వివాహం శాస్త్ర సమ్మతం కాదని నిరూపించలేకపోయారు. దీంతో వీరికి ఆవేశం కట్టలుతెంచుకుంది. వీరేశలింగం గారిని కొట్టించడానికి రౌడీలను కూడా ఉపయోగించారు. కానీ వీరేశలింగం గారికి ఉక్కు కవచంలా ఉన్న తన శిష్య బృందం తనని కాపాడింది. 1880 వ సంవత్సరంలో తన స్నేహితులైన బసవరాజు, చల్లపల్లి బాపయ్య, గవర్రాజుల సహకారంతో “వితంతు పునర్వివాహం సంఘం” ను వీరేశలింగం పంతులుగారు స్థాపించారు.

తొలి వితంతు పునర్వివాహం…

వీరేశలింగం గారు తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి తనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని ఉపక్రమించారు. వితంతువుల్ని వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకు తన శిష్య బృందాన్ని పంపి ఆ వ్యక్తుల కోసం వెతికించారు. కానీ వితంతువుల తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాలా కష్టసాధ్యమైంది. చివరకు ఒక వితంతువు తల్లి తన కుమార్తెకు వివాహం చేయడానికి ఉత్సాహం    చూపింది. వెంటనే ఆ వితంతువు నివసించే పల్లెకు తన శిష్యుల్ని పంపించి అతి కష్టం మీద ఆమెను రాజమండ్రికి తీసుకువచ్చారు. ఆ వితంతువు పేరు సీతమ్మ. 11 డిసెంబరు 1881 నాడు రాజమండ్రిలో గోగుల పాటి శ్రీరాములతో, సీతమ్మ వివాహం జరిగింది. ఈ విధంగా ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు వివాహం అగ్రకులంలోనే జరిపించడం విశేషం. ఈ పెళ్లి సవ్యమైన వాతావరణంలో జరగలేదు. సాంప్రదాయవాదులు రాజమండ్రిలో ఈ పెళ్లిని చెడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

ఏ పరిణామాలైనా ఎదుర్కోవడానికి వీరేశలింగం పంతులు గారితో పాటు ఆయన శిష్య బృందం కూడా సిద్ధపడ్డారు. ఆ వివాహం జరిగే ప్రాంతం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు చేయబడింది. తమ ప్రయత్నంలో విఫలురైన సాంప్రదాయవాదులు పెళ్లిలో పాల్గొన్న 31 కుటుంబాల్ని కులం నుండి వెలివేశారు. ఈ మొదటి వితంతు వివాహం జరిగిన నాలుగు రోజులకే 15 డిసెంబరు 1881 నాడు రత్నమ్మ అనే వితంతువును రాచర్ల రామచంద్రయ్య వివాహం చేసుకున్నాడు. ఇది వీరేశలింగం గారు జరిపించిన రెండో వితంతు వివాహం. ఆ విధంగా 1892 నాటికి వీరేశలింగం గారు సుమారు 20 వితంతు వివాహాల్ని జరిపించారు. ఈ కార్యకలాపాలంన్నింటిలోనూ వీరేశలింగం గారిని ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కాకినాడ చెందిన వ్యాపారవేత్త పైడి రామకృష్ణయ్య. వివిధ సందర్భాలలో ఆ రోజులలోనే మొత్తం 30 వేల రూపాయలు ఇచ్చి వీరేశలింగం గారిని ప్రోత్సహించారు. పెళ్ళికాని వితంతువులకు గానీ, తల్లిదండ్రుల చేత విడవబడ్డ వితంతువులకు గానీ మద్రాసులోనూ ( 1897), రాజమండ్రిలోనూ (1905 ) వితంతు శరణాలయాల్ని నిర్మించారు. 1883లో స్త్రీలకోసమే ప్రత్యేకంగా “సతి హిత బోధిని” అను మాసపత్రికను ప్రారంభించారు వీరేశలింగం పంతులు గారు.

సాహిత్యం…

వీరేశలింగం పంతులు గారు సంఘసేవలో ఎంత కృషి చేసారో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు. తాను చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు వ్రాశారు. పత్రికలకు వ్యాసాలు కూడా వ్రాస్తూ ఉండేవారు. తన పత్రిక “వివేకవర్ధని” లో సులభశైలిలో రచనలు చేసేవారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో వీరేశలింగం పంతులు గారు ఒకరు. 130 కి పైగా గ్రంథాలను వీరేశలింగం గారు వ్రాసారు. అన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. ఆయన రచనలలో ప్రముఖమైనవి రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు. 

వీరేశలింగం గారు అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసారు. స్వీయ చరిత్ర వ్రాసారు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించారు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం గారు పూర్తి చేసారు. కందుకూరి వీరేశలింగం గారు వ్రాసిన కథలు అధికంగా స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉండేవి. కొన్ని కథలు ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవే కానీ అధికంగా స్వతంత్ర రచనలే ఉండేవి. వాటిని ఎక్కువగా “సతీ హిత బోధిని” అనే పత్రికలో  ప్రచురించేవారు. “నీతి కథా మంజరి” అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా కందుకూరి వీరేశలింగం గారు వెలువరించారు.

తొలి తెలుగు సాంఘిక నవల “రాజశేఖర చరిత్రము”…

తొలి తెలుగు సాంఘిక నవల “రాజశేఖర చరిత్రము” కందుకూరి వీరేశలింగం పంతులు గారు వ్రాశారు. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన “వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్” అనే నవలకూ దీనికీ కొన్ని దగ్గర పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కానీ అనుకరణ కానీ కాదని వీరేశలింగం గారు చెప్పారు. ఈ నవల “పంతులుగారి మహాయశస్సునకు శరత్కౌముది వంటిది” అని అక్కిరాజు రమాపతిరావు గారు ఒక సందర్భంలో అన్నారు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించారు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచారు.

ఆంగ్లంలో “జోనాథన్ స్విఫ్ట్” వ్రాసిన “గల్లివర్స్ ట్రావెల్స్” ఆధారంగా వీరేశలింగం గారు “సత్యరాజా పూర్వదేశ యాత్రలు” వ్రాశారు. ఇందులో సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశారు. “ఆడ మళయాళం” అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది. అలాగే తాను వ్రాసిన “సత్యవతీ చరిత్రము” (1883) – స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవలగా ఆ రోజులలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది. అదేవిధంగా తాను వ్రాసిన మరో నవల “చంద్రమతీ చరిత్రము” (1884) – మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవలగా ప్రసిద్ధిపొందింది.

విశిష్టతలు..

వీరేశలింగం గారికి ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా  అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. తాను అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు.  

వీరేశలింగం గారి ఇతర విశిష్టతలు…

★ మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి..

★ మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు

★ తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే

★ తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే

★ తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూ

★ ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది.

చివరి రోజులు…

కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంస్కరణల బాటలో అడుగులో అడుగు వేస్తూ ఆయనకు కొండంత అండగా నిలబడిన తన భార్య రాజ్యలక్ష్మి 1910వ సంవత్సరంలో మరణించటం ఆయన తట్టుకోలేక పోయారు. అప్పటికి ఆయనకు వయస్సు 60 సంవత్సరాలు దాటింది. తనకు బాల్యం నుండి తనవెంటే ఉండే ఉబ్బసం వ్యాధి రాజమండ్రి వాతావరణం స్థితిగతులకు మరింత ఇబ్బంది పెట్టేది. రాత్రిళ్ళలో నిద్రపోలేకపోయేవారు. అటువంటి అనారోగ్య సమయంలో భార్య రాజ్యలక్ష్మి తనవెంటే ఉండి బెంగళూరుకు తీసుకువెళ్లి సేవలు అందిస్తుండేవారు.

అలా కందుకూరి వీరేశలింగం వారి అవసరాలన్నింటిననీ అర్థం చేసుకుని తీర్చే భార్య రాజ్యలక్ష్మి హఠాన్మరణం ఆయనను ఒంటరివాడిని చేసింది. జీవిత భాగస్వామి లేని జీవితం కందుకూరి వారు జీర్ణించుకోలేకపోయారు. మానసికంగా ఒంటరి వాడయ్యారు. తనకు ఏ సమయంలో ఏం కావాలో అడగాల్సిన అవసరం లేకుండా గడిచిపోయింది ఆయన జీవితం. అటువంటిది తన భార్య మరణం తరువాత తన జీవితం ఎలా గడుస్తుందోనన్న భయం తనను వెంటాడింది. కందుకూరి గారు ఆదుకున్న కుటుంబాలు హితకారిణి సమాజంలోనే కాపురం ఉండేవి. కానీ వారు ఎవ్వరూ ఆయనకు సహాయం అందించలేదు.

తాను దగ్గరుండి వితంతు వివాహం జరిపించిన మంగమ్మ అనే ఆమె కందుకూరి గారికి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో స్థానిక పత్రికలలో కందుకూరి గారికి మంగమ్మతో అక్రమ సంబంధం అంటూ వార్తలు ప్రచురించారు గిట్టని వారు. అది ఆయన మనసును బాధించింది. అప్పుడే కందుకూరి గారికి ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. నాటి వరకు విరాళాలతో ఆదుకున్న రాజమండ్రి ప్రముఖులు ముఖం చాటేయసాగారు. గతంలో తన సాహిత్యం సేవలు ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోయింది. అటువంటి సమయంలో ఆయన మిత్రుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పిఠాపురం రాజా గారి ద్వారా 3000 రూపాయలు విరాళం ప్రతినెల 60 రూపాయలు వచ్చే ఏర్పాటు చేయించడంతో కొంత కుదుటపడగలిగారు. తన వయస్సు 70 లకు చేరుతుండగా తెలుగు కవుల జీవితం అనే పుస్తకం సరిదిద్ది ప్రచురించాలనే ఆలోచన కలిగింది. అయితే తగిన సమాచారం మద్రాసు ప్రయాణమయ్యారు.

మరణం…

శరీరం బలహీనతకి చేతులు వణుకుతున్నా కూడా తాను చేపట్టిన “కవుల చరిత్ర” వ్రాయడం మానలేదు. తాను వ్రాసిన వ్యాసాలను 104° జ్వరంతో కూడా అతి కష్టం మీద చదివి తప్పులు దిద్దేవారు. జ్వరంతో కళ్ల వెంట నీరు కారుతున్నా తుడుచుకుంటూ పుస్తకం పూర్తి చేయాలన్న తపనతో పని చేస్తూనే ఉన్నారు. 26 మే రాత్రి పరిస్థితి విషమించింది డాక్టరు లక్ష్మీపతి ఆయుర్వేద మందును అప్పటికప్పుడు తయారు చేసి పాలతో కలిపి నోట్లో వేస్తున్నారు. ఆ రాత్రి అందరి మనస్సులో భయం, దిగులు. అర్ధరాత్రి సమయంలో వేసిన మందు గొంతులోకి జారడంతో ఇక పరవాలేదు అనుకున్నారు. కానీ ఇంతలోనే ఎగస్వాస మొదలైంది. గొంతులో ఏదో తెలియని శబ్దాలు ఆరంభమయ్యాయి.

22 మే 1919 తెల్లవారుజామున 04:20 నిమిషాలకు కందుకూరి వీరేశలింగం గారు కాలం చేశారు. కందుకూరి గారి జీవితం ముడిపడి ఉన్న రాజమహేంద్రవరంకు ఆయన పార్థీవదేహం తరలించాలనుకున్నా కూడా సాధ్యపడలేదు. చివరికి మద్రాసులోనే అంత్యక్రియలు జరిపించి ఆస్థికలను రాజమహేంద్రవరం తెచ్చి కందుకూరి గారు ముందుగా చెప్పినట్టు తన భార్య రాజ్యలక్ష్మి సమాధి పక్కనే పాతిపెట్టి అక్కడే ఆయనకు స్మారక చిహ్నం నిర్మించారు. జీవితాంతం కలిసే ఉంటాం అనే పెళ్లినాటి ప్రమాణానికి నిలువెత్తుని నిదర్శనంగా కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి గార్లు కనిపిస్తారు.

Show More
Back to top button