GREAT PERSONALITIESTelugu Special Stories

నవభారత నిర్మాణానికి కృషిచేసిన మహనీయులు..  మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

బ్రిటిషు వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో భారతదేశంలో ఒకసారి ఓ రైలు వెళ్తోంది. అందులో అధికశాతం బ్రిటిషు వారే ఉన్నారు. వారితో పాటు ఒక భారతీయుడు కూడా ఆ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ వ్యక్తి బక్కపలుచగా ఉండి, నల్లటి చర్మరంగు కలిగి, తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషువారు అతడో నిరక్షరాస్యుడని, తెలివితక్కువవాడని వేళాకోళం చేయసాగారు. అవన్నీ గమనిస్తున్న అతను అవేమీ పట్టించుకోలేదు. తన ధ్యాసంతా దేనిమీదో ఉన్నది.

ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి నిలబడి  ప్రయాణిస్తున్న రైలు గొలుసు లాగాడు. వేగంగా వెళ్తున్న ఆ రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. గొలుసు ఎవరు లాగారని ప్రశ్నించాడు. అప్పుడు “నేనే” అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. ఎందుకు లాగావని గార్డు మరలా ప్రశ్నించగా దానికి సమాధానమిచ్చిన ఆ వ్యక్తి “కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది” అని చెప్పాడు.

నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరందూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవే విడిపోయి ఉన్నాయి. అలా ఆ వ్యక్తి రైలులో ఉన్నవారి ప్రాణాలను కాపాడారు. 

ఈ ఘటనలో గొలుసు లాగిన వ్యక్తి పేరు “మోక్షగుండం విశ్వేశ్వరయ్య”.

మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆనకట్టలు, రిజర్వాయర్లు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారు. అలాంటి వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ “మోక్షగుండం విశ్వేశ్వరయ్య”. ఇంజినీర్‌గా తాను మన దేశ ఖ్యాతిని నలుమూలలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను తాను ఆవిష్కరించారు. ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు ఈరోజుకీ, అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతి (సెప్టెంబరు 15)ని దేశవ్యాప్తంగా “ఇంజినీర్స్ డే” జరుపుకుంటారు. ఈరోజు తన వర్థంతి సందర్భంగా…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కూడా పిలువబడే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశపు అత్యంత విశిష్టమైన ఇంజనీర్లలో ఒకరు. తాను చాలా ఉన్నతమైన నీతి మరియు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. కర్ణాటక లోని మాండ్యలో కృష్ణ రాజ సాగర ఆనకట్ట నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన వాస్తుశిల్పి. ఈ ఆనకట్ట చుట్టుప్రక్కల గల బంజరు భూములను, బంజరు ప్రాంతాలను ఉత్పాదక వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడంలో తన సహకారం చాలా ఉంది. మోక్షగుండం గారు సరళంగా జీవించచేవారు మరియు లోతుగా ఆలోచించేవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తండ్రి సంస్కృత పండితులు. తన బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలని తపనపడేవారు. తన తల్లిదండ్రులు సంపన్నులు కానప్పటికీ, చిన్నప్పటి నుండే తాను సంస్కృతి మరియు సంప్రదాయాలతో కూడిన వాతావరణంలో పెరిగాడు. విశ్వేశ్వరయ్య గారు యుక్తవయసులోనే తండ్రి చనిపోవడంతో తన కుటుంబంలో విషాదం నెలకొంది.

మహారాష్ట్ర లోని పూణేలో విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రపంచ జలాశయాల్లో ఒకటైన సుక్నూర్ ఆనకట్ట నిర్మాణానికి విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్ గా పనిచేశారు. సింధూ నది యొక్క నీటిని సుద్నోరుకు చేరేలా విశ్వేశ్వరయ్య గారు చాలా కృషి చేశారు. నది నీటిని శుభ్రం చేయడానికి తాను ఎంతో కృషి చేశారు. నంబ నది మీద సైఫన్ పద్ధతిలో కట్టిన కట్ట నిర్మించి ఆటోమెటిక్ గేట్లు నిర్మించి అందరితో మన్ననలు పొందారు. దీంతో మైసూర్ ప్రభుత్వం మోక్షగుండం గారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించింది. హైదరాబాదు నగరంలో సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించిన మురుగు నీటి వ్యవస్థ కూడా విశ్వేశ్వరయ్య గారు రూపొందించిందే. విశాఖ పట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ మోక్షగుండం గారు ప్రధాన పాత్ర పోషించారు. తాను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” అవార్డును మోక్షగుండం గారికి ప్రధానం చేసింది.

1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..

జీవిత విశేషాలు…

జన్మ నామం :  మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఇతర పేర్లు   :    సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

జననం    :    15 సెప్టెంబరు 1861

స్వస్థలం   :  ముద్దేనహళ్ళి, చిక్కబళ్ళాపూర్, మైసూర్ రాజ్యం (ప్రస్తుత కర్ణాటక)

తండ్రి  :  శ్రీనివాస శాస్త్రి,

తల్లి  :  వెంకట లక్ష్మమ్మ

వృత్తి      :   ఇంజనీరు, దివాను

మరణ కారణం   :   వృద్దాప్యం కారణంగా 

మరణం   :   14 ఏప్రిల్ 1962, 

బెంగళూరు , మైసూర్ రాష్ట్రం , భారతదేశం (ప్రస్తుత కర్ణాటక , భారతదేశం)

నేపథ్యం…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 15 సెప్టెంబరు 1861 నాడు కర్ణాటక రాష్ట్రములోని అప్పటి మైసూరు రాజ్యంలో గల ముద్దెనహళ్లిలో ( ప్రస్తుత కర్ణాటకలోని చిక్కబల్లాపుర జిల్లాలో ) జన్మించారు. వీరి తండ్రి మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి మరియు తల్లి వెంకటలక్ష్మమ్మ లు. వీరు తెలుగు మాట్లాడే కుటుంబానికి చెందినవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు ఆయన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. వారు విశ్వేశ్వరయ్య గారు జన్మించడానికి చాలా సంవత్సరాల ముందు మైసూరు రాజ్యానికి వలస వచ్చారు. విశ్వేశ్వరయ్య గారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వీరిది అతి పేదకుటుంబం.

వీరు ఉదర పోషణార్ధం కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి వలస వెళ్ళారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. సంపాదనకోసం ఎక్కువగా ఇతర గ్రామాలను సంచరించేవారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయటం విశ్వేశ్వరయ్యగారి తల్లి మీద పడింది. ఆమె గొప్ప భక్తిపరాయణురాలు. విశ్వేశ్వరయ్య గారు తల్లి సంరక్షణలో విద్యాబుద్ధులు పొందటమే కాకుండా ఋజువర్తన, క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకున్నారు. ఆ మహాతల్లి కొడుకును చక్కగా తీర్చిదిద్దింది. కానీ అనుకోకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తండ్రి 12 ఏళ్ల వయస్సులోనే మరణించారు. అప్పటినుండి విశ్వేశ్వరయ్య గారు ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో పాఠశాల విద్యనభ్యసించడం చేసేవారు.

విద్యాభ్యాసం…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కుటుంబం బాల్యంలోనే చిక్ బళ్ళాపూరుకి మకాం మార్చడంతో అయన ప్రాధమిక విద్య చిక్ బళ్ళాపూరులోనే సాగింది. చిన్నప్పటినుండే ఉపాధ్యాయులు విశ్వేశ్వరయ్య గారి ప్రతిభను గుర్తించి, అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. తనకు గణిత శాస్త్రమంటే ఎక్కువ మక్కువ. ఈ విషయాన్ని గ్రహించి తన గురువుగారు శ్రీ నాదముని నాయుడు గారు విశ్వేశ్వరయ్య గారిని గణిత శాస్త్రంలో బాగా తర్ఫీదునిచ్చి, ప్రవీణుడిని చేసారు. తన మేనమామగారైన శ్రీ రామయ్య గారి ఆర్ధిక సహాయంతో బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో బి.ఎ లో చేరారు. సరిగ్గా  అదే సమయంలో విశ్వేశ్వరయ్య గారికి పితృవియోగం కలిగింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారి వయస్సు సుమారు 15 సంవత్సరాలే.

ఈ విషాద ఘట్టం విశ్వేశ్వరయ్య గారిని మానసికంగా బాగా కృంగతీసింది. తనను తానే ఓదార్చుకొని, గుండె నిబ్బరపరచుకొని, పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కష్టపడి బి. ఎ ను పూర్తిచేసారు. అదృష్ట వశాత్తు మైసూరు మహారాజావారి దృష్టిలో పడ్డారు. రాజావారి ఆర్ధిక సహాయంతో అతను పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చదువుకుని ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (DCE) పొందారు. ఆ సమయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దక్కన్ క్లబ్‌ లో సభ్యునిగా చేరి దానికి మొదటి కార్యదర్శిగా ఉన్నారు. ఆ క్లబ్ కు సభ్యులుగా ఉన్న సర్ ఆర్‌.జి భండార్కర్ , గోపాల్ కృష్ణ గోఖలే మరియు జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడేతో సహా పూణేలోని అభ్యుదయవాదులతో విశ్వేశ్వరయ్య గారికి బాగా పరిచయం ఏర్పడింది.

ఉద్యోగం…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పూణెలో తన ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత, తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో సహాయక ఇంజనీరుగా చేరారు. చేరడమే కాదు ఆ సమయంలో వీరు బొంబాయిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. కొంతకాలం తరువాత తనను భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. దాంతో అందులో చేరిన తాను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను  రూపొందించారు. ఈ వ్యవస్థను మొదటిసారిగా 1903 వ సంవత్సరంలో పుణె దగ్గరలో గల ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.

నిజాం ప్రభుత్వంలో దివాన్ గా…

ఆ తరువాత 1906-1907 మధ్య కాలంలో విశ్వేశ్వరయ్య గారిని భారత ప్రభుత్వం యెమెన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. దాంతో విశ్వేశ్వరయ్య గారు తాను నిర్దేశించిన పథకం ప్రకారం యెమెన్ లోని ఆడెన్ లో ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది. 1908 వ సంవత్సరంలో నిజాం నవాబు ఆహ్వానం మేరకు, విశ్వేశ్వరయ్య గారు నిజాం ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరి పలు రిజర్వాయులను నిర్మించటమే కాకుండా, హైదరాబాదును ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. విశ్వేశ్వరయ్య గారి మేధస్సును గుర్తించిన నిజాం నవాబు 1912 లో దివాన్ గా పదోన్నతిని కల్పించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఉంది. ఏ పనిని విశ్వేశ్వరయ్య గారికి ఎవరు అప్పగించినా కూడా ఆయన ఆ పనిని ఒక తపస్సులాగా చేపట్టేవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రోజుకు 18 గంటలు పనిచేసేవారు. ఈ క్రమశిక్షణ, పట్టుదల, నీతీనిజాయితీలే విశ్వేశ్వరయ్య గారిని ప్రఖ్యాత వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

మైసూరు సంస్థానంలో చీఫ్ ఇంజనీర్ గా…

విశ్వేశ్వరయ్య గారి ఉన్నతమైన అర్హతలు, విశిష్ట సేవలను దృష్టిలో ఉంచుకొని మైసూరు మహారాజా వారు మైసూరు సంస్థానానికి తన సేవలు అత్యవసరమని భావించి మైసూర్ సర్వీస్‌లో చేరమని మైసూరు మహారాజా వారు విశ్వేశ్వరయ్య గారికి లేఖ వ్రాశారు. కానీ మైసూర్ సర్వీస్‌లో వెంటనే చేరే ఉద్దేశం లేని విశ్వేశ్వరయ్య గారు పక్షం లేదా మూడు వారాల సమయం అడిగారు. ఆ తరువాత 15 నవంబరు 1909 నాడు మైసూర్ సర్వీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా చేరారు. అప్పటికే దివానుగా ఉన్న టి. ఆనందరావుతో కలిసి పనిచేశారు విశ్వేశ్వరయ్య గారు. మొదట్లో తన శాఖలో నియామకాలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్వేశ్వరయ్య గారు కూలంకషమైన విచారణ, పరిశీలన తర్వాత అభ్యర్థుల ఖచ్చితమైన సాంకేతిక, విద్యార్హతలకు అనుగుణంగా సాధ్యమైనంతవరకు ప్రతిభకు, అర్హతలకు ప్రాధాన్యత ఇచ్చి విచారణ, పరిశీలన, చర్చల అనంతరం తుది జాబితాను తయారు చేశారు. మైసూరులో పెద్ద సంఖ్యలో చక్కటి జలాశయాలు, చెరువులు ఉన్నాయి. అవి తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవి. అందువలన రాష్ట్రం ఉత్తర సరిహద్దు సమీపంలో మరికనవే అనే ప్రదేశంలో రాతి ఆనకట్టతో రాష్ట్రం లోనే అతి ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించారు.

రైలు మార్గాలు…

విశ్వేశ్వరయ్య గారు మైసూరులో ప్రజా పనుల శాఖ చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన కాలంలో తాను ప్రభుత్వానికి రైల్వే శాఖ సెక్రెటరీగా కూడా వ్యవహరించాను. రాష్ట్రంలో రైలు మార్గాల నిర్మాణ పనులు అంతకుముందే 15 సంవత్సరాల క్రితం పూర్తిగా నిలిచిపోయాయి. రైలు మార్గాలను పొడిగించాలని ప్రభుత్వం భావించింది. నిర్మాణం పూర్తి అయిన తరువాత రైల్వే వ్యవస్థ నిర్వహణను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆలోచన. ఇవి అప్పటి వరకు మద్రాస్, సదరన్ మహరట్ట రైల్వే కంపెనీ అధీనంలో ఉండేవి. ఇప్పుడవి నేరుగా మైసూర్ ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. తదనుగుణంగా మైసూర్ ప్రభుత్వం రైల్వేలపై ఒక మెమోరాండంను రూపొందిందించింది. ఇందులో రైల్వేలపై అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. అదనపు రైల్వేల నిర్మాణం, భవిష్యత్ లో వీటి నిర్వహణ రాష్ట్ర ఏజెన్సీ ద్వారా జరపడం, అప్పటి వరకు ఈ ఓపెన్ లైన్ల నిర్వహణకు వీటిని రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ అధీనంలో ఉంచడం తదితర అంశాలు ఈ మెమోరాండంలో పొందుపరచడం జరిగింది.

కావేరీ నదిపై జలాశయం (కృష్ణరాజసాగరం):

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్ కావేరి నదికి అడ్డంగా ఒక రిజర్వాయర్ డ్యాం నిర్మాణం. సుమారు 1902 సంవత్సరంలో శివసముద్రం జలపాతం వద్ద కావేరీ నది సహజ ప్రవాహాన్ని ఉపయోగించుకొని జల విద్యుత్ ఉత్పాదనకు సంబందించిన పనులు పూర్తి చేశారు. సగటున సుమారు 13,000 హార్స్ పవర్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో 11,000 హెచ్.పి.ల విద్యుత్తు శివసముద్రం ఆనకట్ట నుండి దాదాపు 90 మైళ్ల దూరంలో ఉన్న కోలార్ బంగారు గనులకు సరఫరా చేయడం జరుగుతున్నది. శివసముద్రం వద్ద నీటి సరఫరా హెచ్చుతగ్గులకు లోనౌతూ ఉంటుంది. కొన్నిసార్లు నీటి ప్రవాహం 100 క్యూసెక్కుల కంటే తక్కువకు దిగజారిపోతుంది. 

దీనితో శివసముద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తి కుంటు పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సేరింగపట్నంకు (శ్రీరంగ పట్నం) పశ్చిమాన 10 మైళ్ల దూరంలో ఉన్న కన్నాంబడి అనే గ్రామం వద్ద ఒక పెద్ద జలాశయంను నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నది. కానీ శాస్త్రీయంగా సమగ్ర సర్వేల ఆధారంగా డిజైన్ లను సిద్ధం చేయలేదు. కావేరి లోయలో విస్తృత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి పారుదల కోసం నీటి నిల్వను ఉపయోగించుకునే ఉద్దేశంతో ఒక పెద్ద జలాశయాన్ని నిర్మించడానికి తాజాగా సర్వేలు చేపట్టినారు. ఆ అనుభవంతో కావేరి లోయ అవసరాలకు తగినట్లుగా నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం కావేరీ డ్యాం డిజైన్‌ చేసి , ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు విశ్వేశ్వరయ్య గారు.

కర్ణాటక లోని మాండ్య జిల్లాలో 38 మీ ఎత్తులో, 3.5 కి.మీ పొడవు లో కృష్ణ రాజ సాగర రిజర్వాయర్ ను నిర్మించారు. దీనిని కె.ఆర్.యస్ అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణరాజసాగర స్థావరానికి సమీపంలో ఉంది. ఈ ఆనకట్ట భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో కావేరీ నదికి అడ్డంగా ఉంది. ఆనకట్టకు అనుబంధంగా బృందావన్ గార్డెన్స్ అని పిలువబడే ఒక అలంకారమైన ఉద్యానవనం కూడా ఉంది. ఈ డ్యామ్ 1924లో కావేరీ నదిపై నిర్మించబడింది. ఇది మైసూర్ మరియు మాండ్య జిల్లాలకు నీటికి ప్రధాన వనరుగా ఉంది.

ఈ నీటిని మైసూరు మరియు మాండ్యలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారు. అలాగే ఇది మైసూరు, మాండ్య మరియు కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన దాదాపు మొత్తం బెంగళూరు నగరానికి త్రాగునీటికి ప్రధాన వనరు. ఈ డ్యాం నుండి విడుదల చేయబడిన నీరు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది మరియు సేలం జిల్లాలోని మెట్టూరు ఆనకట్టలో నిల్వ చేయబడుతుంది. ఈ ఆనకట్ట నిర్మాణానికి చీఫ్ ఇంజనీర్ గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వ్యవహారించారు, పనిచేశారు. ఆనకట్టకు అప్పటి మైసూర్ రాజ్యం పాలకుడు నాలుగవ కృష్ణరాజ వడయార్ పేరు పెట్టారు.

కర్ణాటక పితామహుడు…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908లో తాను తన పదవులకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తరువాత, మైసూరు మహారాజా వారి సంస్థానంలో దివానుగా చేరి మైసూరు సంస్థాన అభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు. క్రింద పేర్కొన్న పలురకాల సంస్థల ఏర్పాటులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కీలక పాత్ర పోషించారు.

★ పారాసిటాయిడ్ లేబొరేటరీ

★ మైసూరు సబ్బుల కార్మాగారం..

★ శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్

★ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి

★ బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

★ ద సెంచురీ క్లబ్

★ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

★ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

★ మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1917వ సంవత్సరంలో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలను స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆ తరువాత ఈ కళాశాలకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరే పెట్టడం జరిగింది. ఈరోజుకీ కూడా కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఉంది. పరిశ్రమలు అతి వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించారు విశ్వేశ్వరయ్య గారు.

పురస్కారాలు & పదోన్నతులు…

★ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1911లో “కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్” గా నియమితులయ్యారు.

★ 1915 లో మైసూరు దివానుగా ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం తనకు “నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్” అనే బిరుదును ఇచ్చి సత్కరించింది.

★ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను తనకు ప్రధానం చేశారు.

★ లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ [7] యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. 

★ భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.

★ 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (Indian science congress)కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తుదిశ్వాస…

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన కఠోర శ్రమ, చిత్తశుద్ధి, సమయపాలన మరియు తన లక్ష్యం పట్ల ఎల్లపుడు అంకితభావంతో ఉంటారు. విశ్వేశ్వరయ్య గారు మాంసాహారం గానీ, గుడ్లు గానీ ఎప్పుడూ తినేవారు కారు. తాను కఠినమైన లాక్టో- శాకాహారి. తాను ఆ అలవాట్లకు దూరంగా ఉంటూ సంయమనం పాటిస్తూ ఉండేవారు. తాను ఎప్పుడూ కూడా ధూమపానం చేసేవారు కాదు. తాను టీటోటల్లర్ కూడానూ. విశ్వేశ్వరయ్య గారు స్వభావంలో కూడా చాలా మంచి మనిషి. కన్నడ భాషపై తనకు వల్లమాలిన ప్రేమ. కన్నడ అభివృద్ధి కోసం కన్నడ పరిషత్‌ను కూడా తాను ఏర్పాటు చేశారు. కన్నడ మద్దతుదారుల కోసం కన్నడలోనే సెమినార్లు ఏర్పాటు చేసి సభలను నిర్వహించేవారు. ఎన్నో విశిష్టమైన సేవలు చేసి, ఎన్నో పేరుప్రఖ్యాతులు, మరెన్నో పురస్కారాలు అందుకొన్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 14 ఏప్రిల్ 1962న 101 వ ఏట అనంతలోకాలలో మమేకమయ్యారు.

Show More
Back to top button