GREAT PERSONALITIES

అగ్గిపిడుగు.. ‘అల్లూరి సీతారామరాజు’!

బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవకారుడు…

మన్యం ప్రజల బాగుకోసం.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా.. సైన్యాన్ని సిద్దంచేసిన యోధుడు… 

పోలీస్ స్టేషన్ లపై వరుస దాడులు జరిపి.. చరిత్రలో అగ్గిపిడుగుగా నిలిచిపోయాడు.

స్వతహాగా బలశాలి అయిన అల్లూరి.. 

సాహసం, ధైర్యానికి పెట్టింది పేరుగా అన్నిచోట్ల స్థావరాలు ఏర్పరిచి, అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. విలువిద్యలో ఆరితేరినవాడు. సహజంగా నేర్పరులైన కొండజాతి ప్రజలను మించిన నేర్పరిగా.. ఆధునిక ఆయుధాలైన తుపాకీ, పిస్తోలును సైతం అవలీలగా ఉపయోగించడం ఆయన ప్రత్యేకత.

అటువంటి ధీశాలి.. అదే మన్యం ప్రజలను హింస నుంచి తప్పించేందుకు స్వతహాగా లొంగిపోయి.. చంపబడ్డాడు..

1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్దించిన నేపథ్యంలో ఆ సమరయోధుల చరిత్రలను స్మరించుకోవాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా పరాక్రమం, శౌర్యం కలిగిన అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం… 

అల్లూరి సీతారామరాజు.. అసలు పేరు, వేగిరాజు సత్యనారాయణరాజు. భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం వీరిది. తల్లిదండ్రుల్ని చిన్ననాడే కోల్పోయి, దేశసంచారం చేస్తూ ఉండేవాడు. గెరిల్లా పోరాటంలో ఆరితేరినవాడు గనుక ఇతన్ని అగ్గిరాజు అని పిలిచేవారు. గొప్ప విలుకాడు, కొండలెక్కడం, దిగడం వెన్నతో పెట్టిన విద్య. 

బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసెందుకు మన్యం ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడి అడువుల్లో, కొండల్లో, కోనల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలనీ, అందుకు తగిన అనుచరుల్ని పోగు చేయాలని భావించాడు. ఆ అడవుల్లోనే నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 

అలా మన్యం ప్రజలు అక్కడ పడుతున్న బాధల్ని దగ్గరుండి గమనించిన సీతారామరాజు వారికి అండగా నిలిచారు. అతికొద్ది కాలంలోనే వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.    

జ్యోతిషం, సాముద్రికం, మూలిక వైద్యo… చేసేవాడు. ఆయన జీవనశైలి భిన్నంగా ఉండేది రోజులో భాగంగా కాళీఉపాసన, అగ్నిఆరాధన, ధ్యానం చేసి.. నియమబద్దమైన జీవనాన్ని సాగించేవారు. ఇది చూసి మన్యం ప్రజలు సీతారామరాజును దైవసమనంగా భావించేవారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే మందులిచ్చి, జాతకం రాసి వారిని నిత్యజీవనానికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ, తీరిక సమయంలో రామాయణ, భారతగాథల్ని వినిపించడం, వారిచేత జాతరలు చేయించడంతో మన్యం ప్రజలను విశేషంగా ఆకర్షించారు. తను యోగిగా జీవిస్తూ వారిలో తనపట్ల భక్తి విశ్వాసాలను సంతరింపజేసుకున్నాడు. మన్యంలో సీతారామరాజు కీర్తి ప్రతిష్టలు కొద్దికాలంలోనే  వ్యాపించాయి. సీతారామరాజు పేరు మన్యప్రాంతంలో రామనామం అయింది. 

మన్యం ప్రజల పరిస్థితి…

ఇదిలా ఉంటే… బ్రిటిషు అధికార్లు, కాంట్రాక్టర్లు.. అనేక విధాలుగా మన్యప్రజల్ని దోపిడి చేస్తున్నారు. వారిని పలురకాల బాధలకు గురిచేశారు. ప్రజలు కష్టపడి పండించుకున్న పంటల్ని, పళ్లు, కాయల్ని… పోలీసులు, ఉద్యోగులు, ఫారెస్టు ఉద్యోగులు, ముఠాదార్లు డబ్బు ఇవ్వకుండానే బెదిరించి లాక్కుపోయేవారు. అడవుల నుంచి మన్యప్రజలు కష్టపడి సేకరించుకొనే కలపను అధికార్లు కైవసం చేసుకొనేవారు. కొండల్ని ఎక్కవలసి వచ్చినప్పుడు అధికారుల్ని డోలీలపై మోయవలసిన భారంకూడా వారిదే. ఇందుకు ప్రతిగా కూలీని పూర్తిగా ఇచ్చేవారు కాదు. ఆ రోజుల్లో కూలీలకిచ్చే ధర ఆరు అణాలు, అందులో రెండు అణాలు మాత్రమే కూలీలకిచ్చి, మిగిలిన నాలుగు అణాల్ని కాంట్రాక్టర్లు, ముఠాదార్లు కాజేసేవారు. వీటికి తోడు మన్యంలో పంటలు కూడా సరిగ్గా పండవు. అక్కడి ప్రజలు ఆకులు, అలములు, దుంపలు, పళ్లు తిని బతకవలసి వచ్చేది. చింత అంబలి, మామిడి, జీడి అంబలి తాగి వారి జీవితాలను నిలబెట్టుకోవడం అక్కడ పరిపాటి అయింది. అందువల్ల ఎల్లప్పుడూ రోగాలతో అంటు వ్యాధులతో ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఈ కష్టాలకు తోడు అధికార్లు, పోలీసుల దౌర్జన్యాలు గోరుచుట్టుపై రోకలిపోటుగా ఉండేవి. అంతేగాక తాగడం అక్కడి ప్రజలకు నిత్యకృత్యమైంది. వ్యసనంగా మారిన కల్లు, సారా తాగకుండా ఉండలేరు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి ముందుగా అక్కడి ప్రజల నిత్య జీవితాల్లో మార్పు తెచ్చాడు. తాగడం మానాలని ప్రజలకు బోధించాడు. పోలీసులకు, అధికారులకు ఉచితంగా వెట్టిచాకిరీ చేయవద్దని చెప్పాడు. మూలికా వైద్యంతో ప్రజల జబ్బుల్ని నయంచేసేవాడు. కొద్దికాలంలోనే అందర్నీ ఏకతాటి పైకి తెచ్చాడు.

ఇవన్నీ ఆంగ్లేయులకు మింగుడు పడలేదు. ప్రజలు పండించుకొనే పాలు, తేనె, పళ్లు మొదలైన వాటిని డబ్బు ఇవ్వనవసరం లేకుండా దోచుకొనిపోయే అధికారుల ఆటలు కట్టడిఅయ్యాయి. దీంతో వారంతా సీతారామరాజుపై పగబట్టారు. అంతేకాక లేనిపోనివి మోపి, పైఅధికారుల దృష్టిలో రాజును దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తిగా చిత్రీకరించారు.

అల్లూరి విప్లవం…

తన విప్లవ కార్యక్రమాలకు సీతారామరాజు కొండజాతి ప్రజల నుంచే తగిన అనుచరులను ఎంపిక చేసుకున్నాడు. ఆవిధంగా సీతారామరాజుకు తోడైన అనుచరుల్లో గంటందొర, మల్లుదొరలు ముఖ్యులయ్యారు. అయితే వీరు రాజుకు అనుచరులని పసిగట్టిన బాస్టియన్ వారి భూములను లాగేసుకొని, ఉద్యోగాల నుంచి తొలగించాడు. వరుసగా రెండురోజులు రెండు పోలీసు స్టేషన్లపై సీతారామరాజు దాడులు చేయడంతో బ్రిటీషు అధికారులు కలవరం చెందారు. మద్రాసు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా పోలీసు అధికారులకు కొత్త ఆజ్ఞలు జారీ చేయడంతో.. వారిలో చర్చలు ప్రారంభమయ్యాయి.

ఫలితంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడింపబడింది. రంపచోడవరం ఏజన్సీలో చింతపల్లి ఒక కీలక స్థావరం. ఈ స్థావరంపై సీతారామరాజు మూడువందల మంది అనుచరులతో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశాడు. స్టేషన్ లో ఉన్న ముగ్గురు పోలీసులు కొయ్యబారి అచేతనంగా నిలబడిపోయారు. రాజు అనుచరులు పోలీసుల్ని స్తంభాలకు కట్టి వేశారు. స్టేషన్ లో ఉన్న ఆయుధ సామగ్రిని తీసుకున్నారు.   తొలిముట్టడి సునాయాసంగా జరిగింది. మరునాడు కృష్ణదేవిపేట పోలీసు స్టేషన్ పైన దాడి చేశాడు. ఏజన్సీ ప్రాంతంలో కృష్ణదేవిపేట ముఖ్యమైంది. ప్రభుత్వానికి కీలకమైన స్థావరం. ముందుగానే పోలీసు స్టేషన్ కు కబురు పంపి, దాడికి వస్తున్నామని చెప్పాడు. సీతారామరాజు ఇందుకు సాయుధ పోరాటమే ముఖ్యసాధనం అని గ్రహించారు. ఈ చర్చలు జరుగుతుండగానే రాజు తయారుచేసిన విప్లవ సైన్యాలు మూడవ రోజు  రాజవొమ్మంగి స్టేషన్ పై దాడి చేశాయి. అక్కడ కూడా పోలీసులు లొంగిపోయారు. అంతకుముందు ఆ స్టేషన్ లో నిర్బంధించి ఉంచిన వీరయ్య దొరను విడిపించడం కోసమే ఈ దాడి ఇంత పకడ్బందీగా జరిగింది. ఈ వార్త అంతటా దావానంలా రాష్ట్రం అంతా వ్యాపించింది. పోలీసువర్గాల్లో ఆందోళన పెరిగింది. వెంటనే కలెక్టర్, సూపరిండెంట్ లు.. చింతపల్లి, కోటనందూరు, అడ్డతీగెల తదితర చోట్లకు రిజర్వ్ డ్ సైనికులు వచ్చిపడ్డారు. 

సీతారామరాజు, ఆయన అనుచరుల గురించి సమాచారం చెప్పవలసిందిగా సైనికులు మన్యం ప్రజల్ని తీవ్రంగా హింసించడం మొదలెట్టారు. అడిగిన ప్రతిసారీ ప్రజలు వారికి తప్పుడు సమాచారాన్ని అందించేవారు. బ్రిటీషు సైనికులకు సీతారామరాజు గురించి విని భయం పట్టుకుంది. 

సీతారామరాజును బంధించడానికి ప్రత్యేకంగా నియమితులైన ఇన్ స్పెక్టర్ జనరల్ ఆర్మీ కృష్ణదేవి పేటలో మకాంవేసి, కొంత సైన్యాన్ని రాజు ఉన్నాడని చెప్పబడే స్థావరాలపైకి దాడికి పంపాడు. రాజు దమనపల్లి అడవుల్లో ఉన్నాడని తెలిసి, బ్రిటీషు సైన్యాలు ఆ దిశగా బయలుదేరాయి. ప్రభుత్వ సైనికుల కదలికల గురించి వేగుల ద్వారా తెలుసుకున్న రాజు, తన అనుచరులతో మకాం మార్చి రంపోలు, మొగిలిదొడ్డి గ్రామాల నడుమ బ్రిటిషు సైనికులు వచ్చే దారికి పైఎత్తున కొండల ఏటవాలులో పొంచివున్నారు. ఆ ప్రాంతమంతా అరణ్యమయంగా ఉంది. బ్రిటీష్ సైనికులు కొండకిందుగా రావడంతోనే, కొండ పైభాగంలో ఉన్న రాజు ఆదేశంతో తుపాకీ గుళ్లవర్షం కురిపించి బ్రిటిషు సైనికులపై దాడి ప్రారంభించారు. బ్రిటీషు సైన్యాధికారులు నలుగురు అక్కడికక్కడే నేలకొరిగిన వెంటనే మిగతా సైనికులు చెల్లాచెదురై పారిపోయారు. చివరికి రాజును మధ్యవర్తుల ద్వారా రప్పించి, అయిదువందల రూపాయల జరిమానాను రాజుకు చెల్లించి, మృతదేహాలను తెప్పించుకొని నర్సీపట్నం శివార్లలో వాటిని పూడ్చిపెట్టి వాటిపై సమాధులను కట్టించాడు.

అప్పట్లో బ్రిటిషు సైనికుల వద్ద నుంచి జరిమానాను వసూలు చేసిన ఘనత ఒక్క అల్లూరి సీతారామరాజుకే చెల్లింది. ఈ ఘటన భారత స్వాతంత్య్ర పోరాట ఘట్టంలో గుర్తుండిపోయే అంశం. అనంతరం అడ్డతీగెల పోలీసు స్టేషన్ పై దాడికి వస్తున్నానంటూ ముందుగానే రాజు మిరపకాయ టపా పంపాడు. ఈ టపా అందుకున్న బ్రిటిషు పోలీసులకు గుండెలు జారాయి. అంతకుమునుపే రాజు గురుంచి ఒక పెద్ద పుకారు ప్రచారంలోకి వచ్చింది. సీతారామరాజు గొర్తేడు అడ్డతీగెల, రంపచోడవరం, పాపికొండల మీదుగా బస్తరు వెళ్లి.. పెద్ద సైన్యంతో వచ్చి బ్రిటిషువారిని దేశం నుంచి తరిమివేయనున్నాడని వచ్చిన ఓ వార్తతో బెంబేలెత్తి, పోలీసు స్టేషన్ ఖాళీ చేసి అక్కడి సిబ్బంది అంతా పరారయ్యారు. 

సీతారామరాజు తనతో తొంభైమంది అనుచరులతో కలిసి వచ్చి, తెల్లవార్లూ స్టేషన్ లోనే ఉండిపోయాడు. రాజు వెళ్లిపోయిన తర్వాత, అధికార్లు ఒక్కరొక్కరై వచ్చి అడ్డతీగెలకు ఏ ప్రమాదమూ జరగలేదని పైఅధికారులకు రిపోర్టు పంపారు. 

మిరపకాయటపా రాకముందే, ఎందుకైనా మంచిదని, ఆ ప్రాంతాలలోని పోలీసు స్టేషన్ లలో ఎలాంటి ఆయుధ సామగ్రిని ఉంచకుండా, దాచిపెట్టి ఉంచేవారు. అప్పట్లో రాజును పట్టుకొనే శక్తి చాలక, తమని తాము కాపాడుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నించింది. దీంతో మన్యప్రాంతంలో బ్రిటిషు ప్రభుత్వం అంతరించిపోయిందని రాష్ట్రంలో ప్రచారం జరిగింది. ఎలాగైనా సీతారామరాజును అరెస్టు చేయాలనీ అవసరమైతే కాల్చివేయాలనే పట్టుదల బ్రిటిషు అధికారుల్లో పెరిగింది.

ఈ పరిణామానికి మన్యం అంతటా పోలీసు పటాలాలను దించి.. పెద్ద సైనిక శిబిరంగా మార్చివేయడమైంది. 

ఈ పర్వ్యవసానం మన్యం ప్రజలపై తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు కారణాలు అయ్యాయి. “విప్లవకారులెవరికీ ఇతరులు సహాయం చేయకూడదు. వారికి తిండి పెట్టరాదు. వసతి సమకూర్చకూడదు. గ్రామాలలో కాపలా ఉన్న పోలీసు పటాలాలకు ప్రజలే సమిష్టిగా వారి ఖర్చులన్నీ భరించి, తిండిపెట్టాలి. విప్లవకారులుగానీ, విప్లవంతో సంబంధం ఉన్నట్టు భావించేవారెవరు తారసపడినా.. ప్రజలు వెంటనే ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. అలా ప్రభుత్వంతో సమీకరించని ప్రజల ఆస్తిపాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా మన్యం విప్లవాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సర్వవిధాలా సమాయత్తమైంది. ప్రజలపై ప్రభుత్వ నిర్బంధకాండ ఎక్కువైంది.

ఇలాంటి పరిస్థితుల్లో పెదగడ్డపాలెంవద్ద రాజు తన అనుచరులతో విప్లవ కార్యక్రమాల గురుంచి మాట్లాడేందుకు విడిది చేసి ఉండగా.. సేనాధిపతి జాన్ అకస్మాత్తుగా దాడి చేశాడు. అప్పుడు విప్లవకారులకి.. బ్రిటిషు సైనికులకు పెద్ద యుద్ధమే జరిగింది. రాజు తప్పించుకొని అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. తనను అన్నవరం వచ్చి కలుసుకోవాల్సిందిగా రాజు కలెక్టర్ కు మిరపకాయటపా పంపించాడు. కానీ ధైర్యం చాలక కలెక్టర్ రాజును కలుసుకోకుండానే కాకినాడ వెళ్లిపోయాడు.

హింస.. లొంగుబాటు..! 

మన్యం ప్రజలపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రజలను హింసిస్తే రాజు లొంగి వస్తాడన్న దుర్మార్గమైన ఎత్తుగడతో బ్రిటిషు సైన్యం ప్రజలను విపరీతమైన బాధలకు గురి చేసింది. ఇంతలో మల్లుదొరను బ్రిటిషు సైనికులు పట్టుకున్నారు. మల్లుదొరను అరెస్టు చేసి బ్రిటిషు సైనికులు విశాఖపట్నం తీసుకొనిపోయి సెంట్రల్ జైలులో నిర్భంధించారు. అనంతరం ప్రభుత్వంపై తిరుగుబాటు జరిపాడన్న నేరంమోపి మల్లుదొరను బ్రిటిషు ప్రభుత్వం అండమాన్ జైలుకు తరలించింది.

ఆపై సీతారామరాజు కోసం గ్రామాలన్నీ గాలిస్తున్న బ్రిటిష్ సైన్యాలకు కొండపల్లి అనే పల్లెలో రాజు ఉన్నట్లు తెలిసింది. వెంటనే సాయుధ సైన్యాలను వెంటబెట్టుకొని ఉపేంద్ర పట్నాయక్ అను సేనాని ఆ గ్రామంపై దాడి చేశాడు. కానీ అగ్గిరాజు బ్రిటీషు సైన్యంపై కాల్పులు జరిపి ఎదిరించాడు. చివరకు కాలికి దెబ్బతగిలి పడిపోయాడు. ప్రభుత్వ సైన్యాలు అగ్గిరాజును బంధించి, అండమాన్ జైలుకు పంపింది. ఈ ఘటనతో రాజు అనుచరులు చాలామంది అరెస్టు అవ్వడమో, చనిపోవడమో జరిగింది. గ్రామగ్రామాన నిర్బంధం విధించడంతో, విప్లవవీరులకు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కష్టమైపోయింది. అదీకాక ప్రజలపై హింసాకాండ ఎక్కువైంది. ప్రభుత్వ సైనికులతో పాటు, పెత్తందార్లు ప్రభుత్వ తాబేదార్లు ప్రజలను నానావిధాలుగా హింసిస్తున్నారు. వ్యవసాయ పనులు స్తంభించి, ప్రజలు తిండి లేక కటకటలాడిపోయారు. మన్యంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని భయాందోళనలకు గురయ్యారు.

సీతారామరాజుకు పరిస్థితి అంతా అర్ధమవుతోంది. ఏ ప్రజల కోసం తాను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడో, ఆ ఉద్యమమే ప్రజలపాలిట శాపంగా మారడం రాజును మానసికంగా క్షోభపెట్టింది. పర్లాకిమిడి నుంచి సీతారామరాజు కొంత బలగాన్ని వెంటబెట్టుకొని మన్యం చేరాడు. తాను బతికిఉన్నంత కాలం తనకోసం బ్రిటీషు సైన్యం ప్రజలను వెంటాడుతూనే ఉంటుందని గ్రహించాడు. వారిని ఈ  హింస నుంచి శాశ్వత విముక్తి చేయాలనీ, తన ఉనికి కారణంగా ప్రజలు బాధలు పడకూడదనీ నిశ్చయంచుకున్నాడు. తాను ప్రభుత్వానికి లొంగనంతవరకూ ప్రజలకు ఈ కష్టాలు తప్పవని గ్రహించి, వెంటనే ఆయుద్ధాలను వదిలేశాడు. తన ఉనికి గురుంచి సమీప సైనిక శిబిరానికి తెలియజేశాడు. పోలీసు అధికారులు అతన్ని బంధించి, సార్జంట్ గుడాల్ వద్దకు తీసుకెళ్లారు. అది 1927, మే 27.

ఆయన రాజుకు కరచాలనం చేయగా.. వద్దని, బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమర్శించి, తక్షణం బ్రిటీష్ వారంతా భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని, తన పోరాటం అందుకేనని గట్టిగా చెప్పాడు. దీంతో మేజర్ ఆగ్రహంతో రాజును కాల్చి వేయమని ఆజ్ఞాపించాడు.

మలబార్ స్పెషల్ పోలీసులు రాజును అక్కడున్న చెట్టుకి చేతులు కట్టేశారు. గుడాల్ తన రివాల్వర్ తో రాజు గుండెకు గురిచూసి కాల్చి వేశాడు. రాజు తల ఒక్కసారిగా ఒరిగిపోయింది.

స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకంగా మారిన అగ్గిపిడుగు జీవన విధానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం..!!

Show More
Back to top button