CINEMAGREAT PERSONALITIESTelugu Cinema

వెండితెర పై జగజ్జేయంగా వెలిగిన అందాల తార.. నటి కాంచన..

పురాణం వసుంధరాదేవి  ( కాంచన 16 ఆగస్టు 1939 )..

ఓ దేవదాసి కూతురు జీవితంలో అనుకోకుండా ఓడిపోయి ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోలేని దుస్థితిలో తల్లి ఒడిలో తల పెట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏమిటమ్మా ఇదంతా అంటూ తల్లి దీనంగా అడిగిన ప్రశ్నకు తాను ఇచ్చిన జవాబు “తక్కువ పూజలు చేసి ఎక్కువ ఫలితాలు ఇవ్వమంటే ఆ దేవుడు మాత్రం కరుణిస్తాడా,  అందుకే వచ్చే జన్మ అయినా బాగుండాలని ఆ పరమాత్ముడు మనసారా వేడుకుందాం, సేవించుకుందాం” అని. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం “కల్యాణ మండపం” సినిమాలో చెప్పిన సంభాషణలు నటి కాంచన గారి ప్రస్తుత జీవితానికి దగ్గరగా వాస్తవంగా ఉండడం యాదృచ్ఛికం. అందుకే డబ్బు మీద వ్యామోహాన్ని తోసిరాజని పరమాత్ముని సేవకే అంకితమయ్యారు నటి కాంచన గారు.

మల్లీశ్వరి చిత్రంలో అంతర్నాటకం లో బాలగోపికగా తలుక్కుమని, ఆ తరువాత ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం దక్కించుకుని, ఆపై నటిగా అవకాశాలు అందిపుచ్చుకుని అగ్ర కథనాయకుల సరసన సినిమాలలో నటించి, తన అందంతో, అభినయంతో మెప్పించి అశేష ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి కాంచన గారు. డాక్టర్ ఆనంద్ సినిమాలో “నీల మోహన రారా” పాటతో ప్రేక్షకుల హృదయాలను ఉర్రూతలూగించిన నటీమణి కాంచన గారు 1964 నుంచి 1980 వరకు ఒకటిన్నర దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినీ వినీలాకాశంలో ఓ మెరుపు మెరిశారు.

కాంచన గారు ఎక్కువగా ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ గార్ల వంటి అగ్ర కథనాయకుల సరసన పలు సినిమాలలో నటించారు. నిజ జీవితంలో తన తల్లిదండ్రులే కాంచన గారిని ఆర్థికంగా మోసం చేసి, తనకు పెళ్లి కాకుండా తన జీవితాన్ని సమస్యల వలయంలోకి నెట్టివేయడంతో అజ్ఞాతంలో కి వెళ్లిపోయి, అవివాహితగా మిగిలిపోయి, తాను అందరినీ కాదని ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరి జీవనం గడుపుతోంది. తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేసిన కాంచన గారికి తన తల్లిదండ్రులు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దాంతో తల్లిదండ్రులపై కోర్టులో కేసు వేసి కొన్ని ఆస్తులను దక్కించుకోగలిగారు.

“ఎవరికోసమైతే ఇంటికి కొడుకుగా మారిపోయి కష్టపడి సంపాదించానో, ఆ తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు. ఆదరించలేదు. నా ఆస్తుల కోసం నాకు పెళ్లికాకుండా చేశారనేది నిజం. నా జీవితంలో గుండె పోటు వచ్చి చనిపోవలసిన కష్టాలు ఎన్నో వచ్చాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను” అని చెబుతూనే, నా మాటను కాదని వేరే వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో అప్పట్లో అమ్మానాన్నలు ఉన్నారు. ఆ సమయంలో నిలదీయకపోవడం,  సహనంతో సర్దుకుపోవడం నేను చేసిన తప్పు. మారతారేమోనని ఎదురుచూడటం కూడా పొరపాటైంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు. భగవంతుడు తన పాదాలు పట్టుకుంటే అంతా తానే చూసుకుంటానని అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే” అంటూ కాంచన గారు చెప్పుకొచ్చారు.

తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేసిన కాంచన గారు తాను న్యాయపోరాటంలో గెలిచి మద్రాసులోని కోట్ల విలువైన ఆస్తిని కాంచన గారు దక్కించుకున్నారు. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉన్న తాను ఆస్తి మీద మమకారం చంపుకుని తన సోదరి శ్రీమతి గిరిజ పాండే తో కలిసి చెన్నైలో ఉన్న తమ ఆస్తి సుమారు 80 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి 2010లో విరాళంగా సమర్పించారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    పురాణం వసుంధరాదేవి

ఇతర పేర్లు  :    కాంచన 

జననం    :   16 ఆగస్టు 1939 

స్వస్థలం   :    కరవది గ్రామం, ప్రకాశం జిల్లా

తండ్రి       :    రామకృష్ణ శాస్త్రి 

తల్లి       :      విద్యుద్వల్లి తాయారు 

వృత్తి      :    నటి

భర్త     :    అవివాహిత 

పిల్లలు    :    లేరు

@ నేపథ్యం…

నటి కాంచన గారు 16 ఆగస్టు 1939 నాడు మద్రాసులో జన్మించారు. తన సొంతూరు విజయవాడ. కానీ తన తల్లిదండ్రులు మద్రాసు లోనే స్థిరపడ్డారు. తన తండ్రి వి.రామకృష్ణశాస్త్రి, తల్లి విద్యుద్వల్లి తాయారు. తనకు ఒక చెల్లి కూడా ఉంది. తన పేరు గిరిజ. విజయా సంస్థ చిత్రం “పెళ్లి చేసి చూడు” లో బాలనటిగా వేషం కూడా వేసింది గిరిజ. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కాంచన గారికి చిన్నప్పుడే నటన, సంగీతం అంటే చాలా మక్కువ ఉండేది. రేడియోలో వచ్చే పాటలు వింటూ, ఆ పాటలకు తన గొంతు కలిపి పాడుతూ ఆనందించేవారు. తనకు ఇష్టమైన పాటలు వస్తే నృత్యం కూడా చేసేవారు. తనకు తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడు వడయార్ రామయ్య పిళ్ళై గారి వద్ద నాట్యం నేర్చుకున్నారు.

@ మల్లీశ్వరి లో బాల నటిగా…

 బి.యన్.రెడ్డి గారు చిన్నప్పటి మల్లేశ్వరి వేషం కోసం కాంచన గారిని అడిగారు. తాను ఒప్పుకున్నారు. మొదట్లో ఆయన మల్లీశ్వరి పాత్రను పద్మిని చేత చేయించాలనుకున్నారు. కాంచన గారిలో మల్లీశ్వరి బాల నటి పోలికలు ఉన్నాయని, చిన్నప్పటి మల్లిగా తాను సరిపోతుందని భావించారు. కానీ ఆ పాత్రను భానుమతి గారు వేయడంతో, భానుమతి గారికి కాస్త దగ్గర పోలికలున్న బేబీ మల్లిక చేత చిన్నప్పటి మల్లి పాత్ర వేయించారు. దాంతో ఆ అవకాశం చేజారినందుకు కాంచన గారికి నాట్య ప్రదర్శన సన్నివేశంలో వచ్చే గోపిక వేషం ఇచ్చారు. బాల మల్లి పాత్ర తప్పిపోయినా కూడా అంత గొప్ప చిత్రంలో నటించే అరుదైన అవకాశం వచ్చింది. అలా మల్లీశ్వరి చిత్రం లో తనకు తొలి అవకాశం వచ్చింది.

@ ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం…

పాఠశాల విద్య పూర్తయ్యాక మద్రాసులోని ఎతిరాజ్ కళాశాలలో చేరారు. కళాశాల నాటకాలలో వేషాలు వేసి మంచి నటిగా కూడా ప్రశంసలు దక్కించుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక తాను చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. కాంచన గారిది మంచి సంపన్న కుటుంబమే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆర్థికంగా చితికిపోయారు. ఆ సమయంలో ఇల్లు నిలబెట్టాల్సిన పరిస్థితి తన దాకా వచ్చింది. దాంతో చేసేది లేక తాను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరోజు ఇదే విషయం గురించి ఆలోచిస్తూ అకాశం వంక చూస్తూ పడుకున్నారు. ఒక విమానం గాలిలో వెళుతుండడం గమనించారు.

సాంప్రదాయ స్త్రీలు ఎవరైనా విమానంలో పనిచేస్తుంటారా అనే ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా సరే తాను కూడా విమానం లో ఉద్యోగం చేయాలనుకుని 1960 లో ఎయిర్ లైన్స్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ కి పిలుపు వచ్చింది. ఎంపికయ్యారు, ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం వచ్చింది. రెండు సంవత్సరాలు ఎయిర్ హోస్టెస్ గా పని చేశారు. తనకు ఎంతో మంది ప్రముఖులు కనిపించేవారు.

@ సినీ రంగ ప్రవేశం…

ఒకసారి తాను ఎయిర్ హోస్టెస్ గా ఉన్న విమానంలో సంఘం థియేటర్ (బెంగుళూరు) యజమాని మాంద్రే, హిందీ నటులు దిలీప్ కుమార్ గార్లు ప్రయాణం చేస్తున్నారు. వారు కాంచన గారిని గమనించి   సినిమాలో నటించడానికి మీకు ఆసక్తి ఉందా అని అడిగారు. నటిగా శ్రీకృష్ణ లీలలు (1959), భట్టి విక్రమార్క (1960) చిత్రాలలో చేసిన అనుభవం తనకు ఎలాగూ ఉంది. కాబట్టి అవకాశం వస్తే తప్పక నటిస్తాను అని చెప్పారు.

బొంబాయిలో తనకు మేకప్ టెస్ట్ జరిగింది. ఓకే అయ్యింది. మహేష్ కౌల్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం అది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరినపుడు తాను కొంత మొత్తం డబ్బు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ వెనక్కి తీసుకొని బొంబాయి వచ్చేయమని మాంద్రే గారు చెప్పడంతో కాంచన గారు సరే అన్నారు.

@ నాయికగా తొలి చిత్రం వీరాభిమన్యు.. 

దర్శకులు శ్రీధర్ గారు “దిల్ ఏక్ మందిర్” చిత్ర నిర్మాణం పని మీద బొంబాయి వెళుతుండగా అదే విమానంలో ఉన్న కాంచన గారిని చూశారు. కోవైచెలియన్ అనే తమిళ సినిమా నిర్మాత కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ నిర్మాత గారు కాంచన గారిని పిలిచి దర్శకులు శ్రీధర్ గారికి పరిచయం చేసి తమ సినిమాలో నటిస్తావా అని అడిగారు. కాంచన గారు సినిమా పని మీదే బాంబే వెళ్తున్న విషయం చెప్పారు. బాంబే పిక్చర్ లేకపోతే నా సినిమాలో పని చేయండి అని నిర్మాత గారు చెప్పడంతో అన్నీ ఆలోచించుకున్న కాంచన గారు శ్రీధర్ గారి చిత్రంలో పనిచేయడానికి ఒప్పుకున్నారు.

తెలుగులో కాంచన గారు అంగీకరించిన మొదటి చిత్రం రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వారి వీరాభిమన్యు. కానీ ముందుగా విడుదలైన చిత్రం “ప్రేమించు చూడు”. వీరాభిమన్యు చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ చిత్రీకరించారు. రెండు భాషల్లోనూ తాను “ఉత్తర” పాత్రలో నటించారు. అభిమన్యు పాత్రను తెలుగులో శోభన్ బాబు గారు ధరిస్తే, తమిళంలో ఏ.వీ.ఎం రాజన్ గారు నటించారు. వీరాభిమన్యు చిత్రం ఘనవిజయం సాధించింది. కాంచన గారి చలనచిత్ర జీవితానికి పునాదులు వేసిన చిత్రం అది.

జ్వరంతో బాధపడుతున్న శోభన్ బాబు గారు ఎంతో శ్రమపడి నటిస్తున్నప్పటికీ సరైన నటన వచ్చేది కాదు. నిర్మాత డూండీ గారికి విసుగొచ్చి ఈ పాత్రకి వెరెవరినైనా పెట్టుకుందాం అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా కుర్రాడి భవిష్యత్తు దెబ్బతింటుంది. మరో అవకాశం ఇచ్చి చూడండి అని సలహా ఇచ్చారు. ఆ మర్నాడు మళ్ళీ అదే సన్నివేశాన్ని శోభన్ బాబు గారి మీద చిత్రీకరించడం ఆ షాట్ ఓకే అవ్వడం జరిగింది. జి.వరలక్ష్మి, యస్.వరలక్ష్మి, ఎన్టీ రామారావు గార్ల వంటి మహా నటునటుల మధ్య తాను కాంచన గారు మొదట్లో తడబడినా తరువాత మంచి నటనతో మెప్పించారు.

@ విమర్శ నుండి ప్రశంస…

నిజానికి వీరాభిమన్యు పౌరాణిక చిత్రం. పాత్రల హావభావాలు, విన్యాసాలు, సంభాషణలను ఉచ్చరించడంలో కాంచన గారు చాలా కష్టపడ్డారు. తెలుగు అమ్మాయివై ఉండి తెలుగులో సంభాషణలు చెప్పలేకపోవడం ఏమిటి అన్న మధుసూదన్ రావు గారి మాటలకు తనని షాక్ కు గురిచేశాయి. అయినా కుంగిపోకుండా విమర్శనాస్త్రాన్ని సవాలుగా స్వీకరించి పవిత్ర బంధం, ఆత్మగౌరవం, కళ్యాణమండపం చిత్రాల్లో మంచి పాత్రలు వేసే స్థితికి తీసుకువెళ్లింది.

ఆనాటి నుండి ఆఖరి సినిమా వరకు తాను ఏ పాత్రలో నటిస్తున్నా, మధుసూదన రావు గారు నేర్పిన మార్గదర్శక సూత్రాలను మననం చేసుకుంటూనే ఆ పాత్ర స్వభావాన్ని నిశితంగా పరిశీలించడం, అందులో నుండి ఉత్పన్నమయ్య రసావేశావస్థల్ని పసిగట్టడం, శ్రమించి వాటిని సొంతం చేసుకోవడం,ఆ అవస్థలకు అనుగుణమైన విధంగా సంభాషణలు చెప్పడం, అలాంటి అన్ని విషయాల్లోనూ కాంచన గారు పరిణితి చెంది ప్రగతి సాధించారు. వి.మధుసూదన్ రావు గారి దర్శకత్వంలోనే మనుషులు మారాలి (1969), పేదల బ్రతుకులు (1981) లాంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు.

@ అక్కినేని నాగేశ్వరావు గారితో..

ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలోని కళాకారులు అందరికీ ఏవో ఒక వేషాలు ఉండేవి. అప్పుడు రామారావు, నాగేశ్వరావు, శోభన్ బాబు, కృష్ణ గార్లు నలుగురు కథనాయకులు మాత్రమే ఉండేవారు. సినిమా అంటే ఒక కుటుంబం లాంటిది. సూర్యకాంతం, నిర్మలమ్మ, జగ్గయ్య గార్లు ఇలా అందరూ కలిసి ఒకే సినిమాలో విభిన్న భూమికల్ని పోషించేవారు. ఫలానా పాత్రకు, ఫలానా కళాకారులు అని దర్శక, నిర్మాతలే నిర్ణయించేవారు. ఆ విధంగా నిర్మాతల్ని, దర్శకులని కాదనలేక కాంచన గారు అతిథి పాత్రలు కూడా వేశారు. పేరున్న కథానాయికలు అతిథి పాత్రలు పోషించడం అప్పటికి విచిత్రమే. దర్శకులు తాతనేని రామారావు గారు అతిథి పాత్రలలో తొలిసారిగా చూపించారు.

కాంచన గారు అక్కినేని నాగేశ్వరావు గారి సరసన నటించిన మొదటి చిత్రం ఆత్మగౌరవం (1966). కె.విశ్వనాథ్ గారు తొలిసారిగా దర్శకుడు పరిచయమైన చిత్రం అదే కావడం విశేషం. ఆ చిత్రంలో తనది అందం మరియు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్ర అది. మంచి కుటుంబం (1968) లో జానకి గారి చెల్లెలుగా నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన “మనసే అందాల బృందావనం పాట” ఇప్పటికీ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నది. “ఇక అక్కినేని నాగేశ్వరావు గారు మాకు ఒక బడి పంతులు లాంటివారు. జోక్స్ బాగా వేసేవారు. అవసరమైన చోట వాత కూడా పెట్టేవారు” అని కాంచన గారు చెబుతుండేవారు.

అక్కినేని గారి కలయికలో కాంచన గారు కథానాయికగా పది చిత్రాలలో నటించారు. ధర్మదాత (1970), పవిత్ర బంధం (1971), మంచివాడు (1974) లాంటి చిత్రాలు మావీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అక్కినేని గారి కలయికలో వచ్చిన “మంచి రోజులు వచ్చాయి” (1972) చిత్రంలో చాలా కాంచన సంఘర్షణాత్మక పాత్రను పోషించారు. అహంకారం, రోషం, పశ్చాతాపం లాంటి భావాలన్నీ ఏకకాలంలో పలికించేందుకు అవకాశం ఉన్న పాత్రలో కాంచన గారు అద్భుతంగా అభినయించారు. తనకు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది.

@ నందమూరి తారకరామారావు గారితో…

నందమూరి తారకరామారావు గారి సరసన కాంచన గారు డాక్టర్ ఆనంద్ (1966), శ్రీకృష్ణ అవతారం (1967), కలిసొచ్చిన అదృష్టం (1968), తాతమ్మకల (1974), పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) తదితర చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన దానవీరశూరకర్ణ (1977) చిత్రంలో సుభద్ర గా నటించారు. అంకితభావం గల నటి జమున గారితో కలిసి రాష్ట్రమంతా తిరుగుతూ శ్రీకృష్ణతులాభారం నాటకంలో నటించారు. అందులో కాంచన గారితో పాటు సుజాత గారు, రమోలాల లాంటి మరికొందరు పాల్గొనడం విశేషం.

ఒకసారి ఆ నాటకం ఆడుతుంటే ప్రేక్షకుల్లో ఎవరో ఒకరు తుంటరి రాయి విసిరారు. అది సరాసరి జమున గారి ముఖం మీద పడి చిన్న గాయం అయ్యింది. అయినా నాటకం రసాభాస కాకుండా బాధను ఓర్చుకుని నాటకాన్ని రక్తి కట్టించారు. “హైదరాబాద్ వెళ్తే తన ఇంట ఆతిథ్యం ఇవ్వకుండా ఏ  కళాకారిణిని వదిలిపెట్టదావిడ, పాతవాళ్లంటే అంత ప్రేమ జమున గారికి పైగా మేమంతా పుట్టపర్తిలో తరచూ కలుసుకునే వాళ్ళం” అని కాంచన గారు చెబుతుండేవారు.

@ అవే కళ్ళు సినిమా..

ఏ.సి.త్రిలోక్ చందర్ గారి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో చిత్రీకరించిన చిత్రం ఏ.వి.యం వారి అవేకళ్ళు (1967). తెలుగులో కృష్ణ గారు హీరో అయితే, తమిళంలో రవిచంద్రన్ గారు హీరో. రెండు భాషల్లో కాంచన గారే కథానాయిక. కాంచన గారు చాలా కష్టపడ్డారు. వేరే ఏ చిత్రం లో కూడా నటించడానికి వీలు లేకుండా పోయేది. విశ్రాంతి లేకుండా నటించారు. కృష్ణ గారు అప్పుడే కొత్తగా సినిమాలలోకి వచ్చారు. కాంచన గారు తెలుగులో సుమారు 80 చిత్రాల్లో నటించారు.

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం హిందీ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 150 చిత్రాలలో నటించేశారు. తెలుగు లో తన ఆఖరి చిత్రం ఆనంద భైరవి (1984). ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా వంశీ అవార్డు గెలుచుకున్నారు. కథనాయికగా ఓ వెలుగు వెలుగున్న రోజుల్లో కేవలం ఒక్క సన్నివేశం లో మాత్రమే కనిపిస్తూ నృత్యాలు చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ దర్శకుల మీద, నిర్మాతల మీద ఉన్న అభిమానంతో అడిగిన వెంటనే కాదనలేక నటించారు. వాటిల్లో సరిసరి వగలు తెలుసెరా గడసరి, పూజకు వేళాయరా (భక్తతుకారం), సుధ నీకే నీకే ఇవ్వనా (మాయమశ్చీంద్ర), మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల (దేవుడు చేసిన మనుషులు), ఏడు రంగుల ఇంద్రధనస్సు (ఇంద్రధనస్సు) లాంటివి కొన్ని ఉన్నాయి.

@ చిత్ర సమాహారం…

సువర్ణ సుందరి

సీత

కాదలిక్క నేరమిల్లై

ప్రేమించి చూడు

మంచి కుటుంబం

వీరాభిమన్యు

ఆత్మ గౌరవం

నవరాత్రి

తంగై

ప్రైవేటు మాస్టారు

ప్రాణమిత్రులు

శ్రీకృష్ణావతారం

ఫర్జ్

అత్తే కంగళ్

తీన్ బహురాణియా

నేనంటే నేనే

వింత కాపురం

జరిగిన కథ

నాటకాల రాయుడు

భలే మాష్టారు

ధర్మదాత

కళ్యాణ మండపం

దేవుడు చేసిన మనుషులు

భక్త తుకారాం

ప్రేమనగర్

సెక్రటరీ

మహాకవి క్షేత్రయ్య

అర్జున గర్వభంగం

ఇంద్రధనుస్సు

సిగప్పు రోజాక్కళ్

గడసరి అత్త సొగసరి కోడలు

ఆనంద భైరవి

శ్రీ దత్త దర్శనం

వక్త్ కా షెహెన్‌షా

గాంధర్వం

అర్జున్ రెడ్డి

@ వ్యక్తిగత జీవితం..

తెరమీద తారల జీవితాలు  అద్భుతంగా పండుతాయి. ప్రేమించిన వాడిని పెళ్ళాడుతారు. ప్రేక్షకులను మనోరంజితుల్ని చేయడానికి దర్శకులు వ్రాసుకునే కథే కదా, దానిని మూడు గంటల సమయంలో ఎన్ని మలుపులైనా తిప్పేస్తారు. కానీ నిజ జీవితంలో తారల జీవితం ఉహించినట్లు ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా సాధారణ మనుషులే కదా. దానికి కాంచన గారి జీవితం కూడా మినహాయింపేమి కాదు. అందం, అభినయం, నటన, ఆస్తి ఎందులోనూ తీసిపోలేదు. కానీ అనుకున్నది దక్కలేదు. తానొకటి తలిస్తే, దైవమొకటి తలచినట్టు తాను వివాహం చేసుకోలేదు. తన ప్రేమ ఓడిపోవడమే తాను అవివాహితగా మిగలడానికి కారణంగా చెప్పుకొచ్చారు.

తాను నటించిన “కళ్యాణమండపం” చిత్రంలో ఓ సంభాషణ ఆవిడ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. అందులో తాను దేవదాసి కూతురు పాత్రను ధరించారు. జీవితంలో ఓడిపోయి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోలేని దుస్థితిలో తల్లి ఒడిలో తల పెట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కారణం అడిగిన తల్లికి తాను ఇచ్చిన జవాబు “అమ్మా తక్కువ పూజలు చేసి ఎక్కువ ఫలితాలు ఇవ్వమంటే దేవుడు మాత్రం కరుణిస్తాడా? అందుకే వచ్చే జన్మయినా బాగుండాలని పరమాత్ముడిని మనసారా వేడుకుందాం, సేవించుకుందాం”. యాభై ఏళ్ల క్రితంతాను సినిమాలో చెప్పిన సంభాషణలు. తన జీవితానికి చాలా దగ్గరగా, వాస్తవంగా ఉండటం చాలా విచిత్రం.

@ తల్లిదండ్రులతో విబేధాలు…

నిజానికి మన జీవితం లో అపజయాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి అనుకుంటాము. కానీ కొన్నిసార్లు మనం సాధించే విజయాలు కూడా మనకు హానినే చేస్తాయి. అసూయలు, ఈర్ష, బంధుమిత్రుల ఆశ్రయింపులు, వీటితో విజయానికి ఆనందించే బదులు కృంగిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాంచన గారికి సరిగ్గా ఇలానే జరిగింది. తాను తన తల్లిదండ్రుల ప్రేమను, అనురాగాన్ని, అనుబంధాన్ని ఆశిస్తే, వారు మాత్రం తన ద్వారా లభించే ఆస్తి, అంతస్తులు మాత్రమే వారు ఆశించారు. వాళ్ళ ధన దాహార్తిని తీర్చలేక తాను అలసిపోయారు. 1988 తరువాత సినిమాల నుండి విశ్రమించారు.

సినిమా రంగం నుండే కాకుండా మనం ఊహించని విధంగా ఈ లోకం నుండి అజ్ఞాతంలోకి వెళ్లి పోవాల్సి వచ్చింది. తనకు పరిస్థితులు అలా దాపురించాయి. తన అమ్మా నాన్నలు నిరంతరం వాళ్లలో వాళ్లే పోట్లాడుకునేవారు. డబ్బును వృధాగా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసేవారు. దేనికి ఖర్చు చేస్తారో అర్థమయ్యేది కాదు. సినీ తారగానే కాకుండా ఒక స్త్రీగా కూడా తాను చాలా కోల్పోయారు. తాను గాఢంగా ఆశించింది ఏది కూడా తనకు దక్కకపోవడమే తన జీవితంలో గొప్ప విషాదంగా భావిస్తారు కాంచన గారు. తాను పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా తన తల్లిదండ్రులు తనకు దూరం చేశారు. దాంతో తన బ్రతుకు ఎడారిలో ఎండమావి అయ్యింది. తన తల్లిదండ్రులకు తన బాగోగుల కన్నా తన ఆస్తి మీదనే చాలా మక్కువ అని కాంచన గారు ఊహించలేకపోయారు.

కాంచన గారు ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులతో తన పెళ్లి సంగతి ప్రస్తావిస్తే వాళ్ళు తిరస్కరించడం చూసి తాను అవాక్కయ్యారు. ఆ సందర్భంలో తాను అగాధంలో ఉన్నానని తనకు అర్థమైంది. అప్పులు, ఆస్తుల తాకట్టులు. ఇదంతా చూసిన తనకు దిమ్మ తిరిగిపోయింది. తన వల్ల కాదని చెప్పి, వాళ్లకు దూరంగా ఉండాలని 1989 డిసెంబర్లో బెంగళూరు వచ్చేశారు. తాను కన్నడంలో చాలా సినిమాలు చేశారు గనుక భాష గానీ, ప్రదేశం గానీ తనకు అస్సలు సమస్య కాలేదు. తన సోదరి కూడా బెంగుళూరు లో ఉండడం తో తాను కూడా అక్కడికే వెళ్లిపోయారు.

@ దాతృత్వం…

నిజ జీవితంలో పెళ్లి విషయంలో ఓడిపోయాక, అవివాహితగా ఉన్న తన మనస్సును ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించారు. తనకు డబ్బు మీద వ్యామోహం లేదు. పరమాత్మ సేవకే అంకితం అయ్యారు. అందుకే తాను ఎక్కువగా గుళ్ళు, గోపురాలు తిరుగుతూ యాత్రలతోనే తన శేష జీవితాన్ని గడిపేసేవారు. తన తండ్రి ఆస్తులు మొత్తం పోగొట్టే స్థితికి వచ్చారు. దాంతో విసుగుచెందిన కాంచన గారు 1980 తర్వాత సినిమాల నుంచి వైదొలిగారు.

తన ఆస్తి కోసం తండ్రితో పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. న్యాయపోరాటంలో గెలిచిన తాను మద్రాసులోని కోట్ల విలువైన ఆస్తిని కాంచన గారు దక్కించుకున్నారు. కానీ జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉన్న తనకు ఆస్తి మీద ఆశ కలగలేదు. కేవలం తమ తండ్రి వృధా చేస్తుంటే దాన్ని కాపాడారు. తన సోదరి శ్రీమతి గిరిజ పాండే తో కలిసి చెన్నైలో ఉన్న తమ ఆస్తి సుమారు 80 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి 2010లో విరాళంగా సమర్పించారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు.

Show More
Back to top button