CINEMAGREAT PERSONALITIESTelugu Cinema

తెలుగు చిత్రసీమలో అద్భుత కళాఖండాలకు చక్రాధారి చక్రపాణి

ఆలూరు వెంకట సుబ్బారావు (05 ఆగష్టు 1908 – 24 సెప్టెంబరు 1975 )

తక్కువ వ్యయం తో సినిమా తీయాలంటే ఎలా సార్ మంచి కిటుకు చెప్పండి నిర్మాత సదరు దర్శకుడిని అడిగారు. ఎగ్గొట్టడం అన్నారు దర్శకులు. నువ్వు తీసే సినిమా కొత్తిమీర, కొబ్బరి చెట్టు అనేది ముందు చూసుకో. కొత్తిమీర సువాసన, కొబ్బరి చెట్టు పది కాలాలపాటు ఫలాన్ని ఇస్తుంది. దాన్ని బట్టి నీ బడ్జెట్ కథ, స్క్రిప్టు కచ్చితంగా వ్రాసుకుని బరిలోకి దిగితే అది లక్షలు అయినా, కోట్లు అయినా లో బడ్జెట్. అలా కాకుండా గాడి తప్పితే కొత్తిమీర సినిమా కూడా హై బడ్జెట్ అప్పుడు ఎగ్గొట్టడం తప్పదు. ఆ మాటలు అన్నది ఆలూరి వెంకట సుబ్బారావు గారు అలియాస్ చక్రపాణి గారు అలియాస్ చెక్కన్న. 

బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు, బాల సాహితీవేత్తలకు మార్గదర్శి, చందమామ చక్రపాణి గారు. టూకీ మాటలు, అమిత మితభాషి, ముక్కుకి సూటి వ్యక్తి అయినా కూడా గుడ్డిగా వెళ్లి గోడకి గుద్దుకోలేదు. నెగ్గుకొచ్చారు. ఏ శుభముహూర్తంలో బి.నాగిరెడ్డి గారితో చక్రపాణి గారికి పరిచయం కలిగిందో (1944 ప్రాంతం) గానీ అది నాగిరెడ్డిగారి బి.ఎన్.కె. ప్రెస్ అభివృద్దికి, తెలుగు సాహిత్యంలో విప్లవాన్ని సృష్టించిన “చందమామ” ఆవిర్భావానికి, తెలుగు సినీ అభిమానులు ముచ్చటపడి మురిసిపోయే మహత్తర దృశ్యకావ్యాల్ని అందించిన విజయా సంస్థ ప్రారంభానికి దారితీసింది.. 

తొలి దశలో కళ అనేది కల కోసమా, కాసుల కోసమా అని మీమాంసలు చెలరేగే రోజులలో “షావుకారు” సినిమా తీశారు. చేయి కాల్చుకోలేదు. కానీ కళాఖండం అనిపించింది. “షావుకారు” సినిమాకు మాత్రం పదహారణాల తెలుగు సినిమా అనే పేరొచ్చింది. చిత్ర నిర్మాణ పథంలో అదొక మైలురాయిగా నిలబడింది. లాభాలు రాక పెట్టుబడి, పొగడ్తలు వస్తే చాలదు, పనికిరాదు. కళ కాసుల కోసమే అయితే కాసులంటే మనుషులు అని అర్థం తోచింది. ఆ మనుషుల కోసం పాతాళ భైరవి తీశారు. ఆ తర్వాత ఎన్నో తీశారు అన్నీ కూడా సొమ్ముతో పాటు గొప్ప పేరుని తీసుకొచ్చాయి. అన్నిటిలో కూడా చక్రపాణి గారిది అదృశ్య హస్తమే.

ఒక అత్తగారు గయ్యాలి కోడల్ని బాధలు పెడుతుంది అని సినిమాలో చూపించాలంటే వెయ్యి అడుగులు రీళ్ళు తీయాలి. దానికి బదులు సూర్యకాంతాన్ని ఆ పాత్రలో నిలబెడితే పట్టుమని పది అడుగులు కూడా పట్టదు. పైగా ఆవిడ బొమ్మ రాగానే హాల్లో చప్పట్లు పడతాయి అనేవారు చక్రపాణి గారూ.

గుండమ్మ కథలో జమున ఇంటికి నాగేశ్వరరావు తొలిసారిగా వెళ్ళాడు. వెళ్ళగానే డ్యూయేట్ పాడాడు. అదేంటి సార్ వాళ్ళు ప్రేమించుకున్నారని చూపాలి కదా అని అడిగితే, ఆడు నాగేశ్వరరావు. ఆడు జమున తో గాక నీతో పాడుతారా డ్యూయెట్లు అన్నారు.

గుండమ్మ కథ తీస్తున్నప్పుడు పూర్ణచంద్రరావు గారు ఈ సినిమా ఎప్పుడు విడుదల చేద్దాం అని అడిగారు. పూర్తయిన వెంటనే అన్నది చక్రపాణి గారి ముక్తసరి జవాబు. అదే ఎప్పుడు అనుకుంటే పబ్లిసిటీ మొదలెట్టుకోవాలి కదా, దీపావళికి విడుదల చేస్తే అన్నారు పూర్ణచంద్రరావు గారు. దీపావళి కాకపోతే సంక్రాంతికి అవుతుంది జనం చూడరా. సినిమా బావుంటే ఎప్పుడు వచ్చినా చూస్తారు. అంతే పూర్ణచంద్రరావు మాట్లాడలేకపోయారు.

గుండమ్మ కథ విడుదలైంది పేపర్లో మంచి రివ్యూ వచ్చింది అన్నారు చక్రపాణి గారితో. పేపర్ చెప్పేది ఏముంది, జనం చెబుతున్నారుగా. రివ్యూలు చదివి జనం సినిమాలకు వెళ్లరు. సినిమా చూసి సినిమాలు చూస్తారన్నారు చక్రపాణి గారు.

నాగిరెడ్డి చక్రపాణి ద్వయంలో ఒకరు చక్రపాణి గారు. తాను ఎక్కువ సినిమాలకు రచనలు చేయలేదు. సొంతంగా సినిమాలకు స్క్రీన్ ప్లే వ్రాయలేదు. అయినా సినిమా రంగంలో ప్రసిద్ధి పొందారు. తన ఇరవై ఆరవ సంవత్సరంలో క్షయ వ్యాధి వచ్చినప్పుడు తన రెండు ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తును తీసేసారు. అయినా కూడా ఆ తరువాత 40 సంవత్సరాలు జీవించారు. అద్భుతమైన కళాఖండాలు ఇచ్చి, ప్రేక్షకుల హృదయాలలో జీవించారు.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఆలూరు వెంకట సుబ్బారావు

ఇతర పేర్లు  :    చక్రపాణి

జననం    :   05 ఆగష్టు 1908 

స్వస్థలం   :     గుంటూరు జిల్లా తెనాలి 

తండ్రి       :    గురవయ్య

తల్లి       :      వెంకమ్మ

వృత్తి      :    బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత , దర్శకుడు

పత్రిక    :    చందమామ మాస పత్రిక

భార్య     :    శ్రీమతి రంగమ్మ

మతం    :    హిందూ మతం

మరణ కారణం  :   సహజ మరణం

మరణం    :  24 సెప్టెంబరు 1975

@ నేపథ్యం…

చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు) గారు తెనాలి దగ్గర గల ఐతనగరంలో 05 ఆగస్టు 1908 గురువయ్య మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. చక్రపాణి గారి బాల్యం ఐతనగరం లోనే గడిచిపోయింది. పాఠశాల చదువులో భాగంగా ఐదవ తరగతి వరకు ఐతనగరం లోనే చదువుకున్నారు. తరువాత పదవ తరగతి వరకు తెనాలిలో చదువుకున్నారు. ఆలూరు వెంకట సుబ్బారావు గారు వినోదిని, చిత్రగుప్త లాంటి పత్రికలకు తన పేరుతో కథలు వ్రాసేవారు.

ఐతనగరం లోని నిష్కర్ష పాఠశాలకు  ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ గారు వచ్చారు. తన దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు చక్రపాణి గారు. “చక్రపాణి” గారి ప్రావీణ్యాన్ని గమనించిన వ్రజనందన వర్మ గారు ఆలూరి వెంకట సుబ్బారావు పేరును చక్రపాణి గా మార్చారు. తర్వాత కొద్దిరోజులకు తన జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. 1934లో చక్రపాణి గారికి తన 26 వ సంవత్సరంలో తనకు దగ్గు, ఆయాసం రావడం ప్రారంభమైంది.  ప్రారంభమైంది 1935లో దావాఖానలో చేరారు.

చక్రపాణి గారికి తన ఊపిరితిత్తుల్లో ఒక ఊపిరితిత్తి పాడయ్యింది. దాంతో శస్త్ర చికిత్స చేసి ఒక ఊపిరితిత్తును తీసేసారు. ఆ తర్వాత తన జీవిత దశలోని 40 సంవత్సరాల కాలం కేవలం ఒకే ఒక ఊపిరితిత్తుతోనే జీవించగలిగారు. మనిషి ఏదైనా సాధించాలంటే అనారోగ్యం ఎప్పటికీ అవరోధం కాదు. సాధించాలనే పట్టుదల ఉంటే చాలు. దావాఖానాలో తన మంచం పక్కన ఉన్న మంచం మీద ఉన్న ఒక బెంగాలీలతో పరిచయం ఏర్పడి బెంగాలీ నేర్చుకున్నారు. దాంతో బెంగాలీ మీద అభిమానం ఏర్పడిన తాను బెంగాలీలో ఉన్న నవలలను, పుస్తకాలను తెప్పించుకుని చదివేవారు. ఆ బెంగాలీ పుస్తకాలను చదువి వారిని తెలుగులోకి అనువాదం చేసేవారు.

@ బెంగాలీ అనువాదాలు…

1930 వ దశకంలో బెంగాల్ సాహిత్యం బాగా ప్రాచుర్యంలో ఉండేది. బెంగాలీ నవలలను బాగా ఇష్టంగా చదివే చక్రపాణి గారు బడదీబి, దేవదాసు, పరిణీత మొదలగు శరత్ బాబు నవలలను 1934 – 35 సంవత్సరాలలో  తెలుగులోకి అనువదించారు. శరత్ చంద్ర గారు తెలుగు వాడే అనేంతలా చక్రపాణి గారు అనువాదాలు చేశారు. ఈదర లక్ష్మీనారాయణ గారు చక్రపాణి గారికి అనువాదంలో సహాయం చేశారు. శరత్ చంద్ర గారి నవలలే కాకుండా ఇతర బెంగాలీ రచయితలు వ్రాసిన వాగ్దత్త, దేవదాసు, పల్లెలు నవవిధాన్, పతివ్రత, నిష్కృతి, కాశీనాథ్, సుభదత్తా, పరిణీతి, బడదీబి, చంద్రనాథ్, హేమాంగి, మహేష్ లాంటి చాలా నవలలను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించారు చక్రపాణి గారు. అక్కినేని నాగేశ్వరావు గారు చక్రపాణి గారు అనువాదించిన నవలలే తనకు సినిమా కథలుగా ఉపయోగపడేవి. చక్రపాణి గారి అనువదించిన బడదీబి నవలను బాటసారిగా అక్కినేని గారితో తెరకెక్కించారు.

@ సినీ నేపథ్యం…

కొడవకంటి కుటుంబరావు గారి పరిచయంతో తెనాలిలో యువ అనే పత్రికను మొదలుపెట్టారు. అలా మొదలైన ఈ పత్రిక ఆ తరువాత సుమారు 40 సంవత్సరాల వరకు నడిచింది. తెనాలిలో మొదలుపెట్టిన ఆ పత్రిక ప్రచురణ ఆ తరువాత కాలంలో మద్రాసుకు, ఆ తర్వాత హైదరాబాదుకు మార్చబడింది. 1940 సంవత్సరంలో కొల్లాపూర్ వెళ్లారు ధర్మపత్రి సినిమా నిర్మాణం జరుగుతుంది. సినిమా స్క్రిప్టు రాసే సమయంలో మొదట ఒక వ్యక్తిని రచయితగా పెట్టుకుని వ్రాయించుకున్నారు. అయితే వారు వ్రాసిన సంభాషణలు దర్శకులు పుల్లయ్య గారికి తృప్తికలిగించలేదు. వారు ఇంకొక రచయిత కోసం వెతుకులాట ప్రారంభించగా ప్రొడక్షన్ ఇన్ ఛార్జి బి.ఎస్.రామారావు గారి సలహామేరకు తెనాలి నుంచి చక్రపాణిని గారిని పిలిపించారు.

బి.యన్.రెడ్డి గారు దర్శక, నిర్మాణంలో తెరకెక్కించే “స్వర్గసీమ” కు కే.వీ.రెడ్డి గారి ద్వారా చక్రపాణి గారిని పిలిపించి కథ, సంభాషణలను వ్రాయించుకున్నారు. ఆ సినిమాలో కథ వ్రాస్తున్న సమయంలో చక్రపాణి గారికి బి.నాగిరెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. బి.యన్.కె.ప్రెస్ మద్రాసు లో నడుపుతున్న బి.నాగిరెడ్డి గారు అక్కడికి చక్రపాణి గారిని ఆహ్వానించారు. ఆ సమయంలో చక్రపాణి గారి భార్య చనిపోయారు. ఇద్దరు చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ గారి వద్ద ఉంచి చక్రపాణి గారు మద్రాసు వెళ్లారు. మూతపడిపోతున్న ఆంధ్రజ్యోతి పత్రికను నాగిరెడ్డి గారు కొనేసి 1945 జూలైలో నాగిరెడ్డికి, చక్రపాణి గార్ల ద్వయంలో ఆంధ్రజ్యోతిని మాసపత్రిక గా నడిపారు. ఆ పత్రిక తరువాత కాలంలో 1955 వరకు కొనసాగింది.

@ చందమామ పత్రిక…

సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డి గారితో కలసి1947 జూలై లో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. అయితే చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణి గారిదే. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. మొదట తెలుగు, తమిళం రెండు భాషలలో, రెండు రంగులలో 64 పేజీలతో, ఆరు అణాల ధరతో 6000 పుస్తకాలు ముద్రించారు. రెండో విడతలో 20,000 కాపీలు ముద్రించాల్సి వచ్చింది. పేరుకు చిన్నపిల్లల పత్రికనే గాని డెబ్భై, ఎనభై సంవత్సరాల వయస్సు పిల్లలు కూడా దానిని చదువుతుండేవారు.

ఆ రోజులలో కన్నడ, హిందీ, మరాఠీ, మలయాళ, గుజరాతి భాషలలో ప్రచురించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో రాజ్యాంగం గుర్తించినటువంటి 11 భాషలుండగా వాటిల్లో ఏడు భాషలలో చందమామ మాస పత్రిక వెలువడుతుండేది. 1947 ఆగస్టులో స్వాతంత్ర్యం రావడంతో స్వాతంత్ర్యం గురించి చిన్న పిల్లలకు అర్థమయ్యేలా సంపాదకీయాలు కూడా వ్రాస్తుండేవారు. చందమామ కథలలో పౌరాణికం, సాంఘికం, జానపదాల భాష, శైలి ఒకేలా ఉంటుంది. కారణం వచ్చిన కథలను యదాతథంగా వ్రాయకుండా వాటిని చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో చిన్న చిన్న పదాలతో, చిన్న పిల్లలకు అర్థం అయ్యేలా ఉండాలనే నియమంతో కథల్ని తిరగ వ్రాసేవారు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు, రామారావు గారు చందమామ పత్రికకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. చందమామ లో జానపదాలు, పౌరాణికాలలో ఎక్కడ కూడా మూఢనమ్మకాలను ప్రోత్సహించేవారు కాదు. ప్రతీ కథలో చిన్న పిల్లలకు ఏదో ఒక నీతి చెప్పేవారు. చక్రపాణి గారు బ్రతికి ఉన్నంతకాలం ఆ పత్రికకు సంచాలకులుగా, సంపాదకులుగా ఉండేవారు. 1978లో సింహాళీ భాషలో ప్రచురించబడింది. సంస్కృతంలో ప్రచురించబడిన మొట్టమొదటి బాలల మాసపత్రిక చందమామ.

బ్రెయిలీ లిపిలో మొట్టమొదటిగా ప్రచురింపబడిన మాసపత్రిక చందమామ. 2004లో గిరిజన భాష సంతాళీలో వెలువడిన మొట్టమొదటి మాసపత్రిక కూడా చందమామే కావడం విశేషం. వి.వి.గిరి, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వారు చందమామ పత్రికను చదివే వారు. రాకాసిలోయ, జ్వాలాదీప రహస్యం, కంచుకోట లాంటి సీరియల్స్ నేడు సినిమాల్లో వస్తున్న హాలీవుడ్ గ్రాఫిక్స్ కి ఏమాత్రం తీసుకోవు. వాటిని దాసరి సుబ్రహ్మణ్యం గారే వ్రాసేవారు. ప్రస్తుతం 17 భాషల్లో చందమామ ప్రచురింపబడుతూ వస్తుంది.

@ వాహిని స్టూడియోస్…

వాహిని స్టూడియోస్ అధినేత మూలనారా స్వామి గారికి ఆదాయపు పన్ను ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో మూల నారాయణస్వామి గారు నాగిరెడ్డి, చక్రపాణి గార్ల ద్వయంలను సంప్రదించి ఆ స్టూడియో వారికి లీజుకు ఇచ్చినట్లు వ్రాయించుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు వాహినీ స్టూడియోస్ ను చక్రపాణి గారి సలహాతో నాగిరెడ్డి గారు కొనుగోలు చేశారు.

@ మొదటి సినిమా “షావుకారు”..

నాగిరెడ్డి, చక్రపాణి గార్ల ద్వయం సొంతంగా సినిమాలు తీయాలనుకున్నారు. దాంతో షావుకారు సినిమాకు చక్రపాణి గారు సంభాషణలు వ్రాశారు. పల్లెటూరు నుంచి వచ్చిన చక్రపాణి గారే మాటలు వ్రాసి, స్క్రిప్ట్ తయారు చేశారు. ఎన్టీఆర్ గారు కథానాయకులు. గరికపాటి రాజారావు గారు స్థాపించిన ప్రజానాట్యమండలి కమ్యూనిస్టుకు అనుగుణంగా పనిచేసేది. తెలంగాణలో దీనిపై నిషేధం ఉండడం వలన అందరూ మద్రాసుకు వెళ్ళిపోయారు. అందులో పని చేసే వాళ్ళని కొందరిని సినిమా రంగంలోకి తీసుకున్నారు. అందులో పనిచేసిన జానకి గారిని తీసుకున్నారు.

అప్పటికీ జానకి వయస్సు పదిహేను సంవత్సరాలు, పెళ్లయ్యి ఒక పాప కూడా. విలన్ పాత్రకు ఎస్వీ రంగారావు గారు (సున్నం రంగడు పాత్రకు) తీసుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చక్రపాణి గారు సంభాషణల రచయిత కావడంతో కథను కూడా పల్లెటూరి నేపథ్యం లోనే వ్రాసుకున్నారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను నెల జీతంకు తీసుకునేవారు. 07 ఏప్రిల్ 1950 నాడు “షావుకారు” విడుదలైంది. ఎన్టీఆర్ గారికి ఘంటసాల గారు మొదటి సారి నేపథ్య గానం పాడారు. ఎన్టీఆర్ గారు సోలో హీరోగా చేసింది ఈ సినిమాలోనే. షావుకారు జానకి గారికి మొట్టమొదటి సినిమా కూడా “షావుకారు”. సినిమా బావుంది. మంచి విలువలున్న సినిమా ఇది. కానీ డబ్బులు రాలేదు.

@ చంద్రహారం…

షావుకారు సినిమా ఆర్థికంగా విజయం సాధించక పోవడంతో, ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చిపెట్టే చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పాతాళభైరవి (1951), పెళ్లి చేసి చూడు (1952) చిత్రాలను నిర్మించారు. ఆ చిత్రాలు ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కె.వి.రెడ్డి గారితో సినిమా కుదరకపోవడంతో చక్రపాణి గారు కె.వి.రెడ్డి గారి సహచరుడు కమలాకర కామేశ్వర రావు గారిని పరిచయం చేస్తూ “చంద్రహారం” సినిమా మొదలుపెట్టారు. వాహిని స్టూడియోస్ 20 సెట్ లు వేసి, అప్పట్లో 25 లక్షలు ఖర్చుపెట్టి సినిమా నిర్మించారు. పబ్లిసిటీకి కూడా బాగా ఖర్చయింది. ఈ సినిమా సగంలోనే పరాజయం పాలవుతుందని నాగిరెడ్డి గారికి అనుమానం వచ్చింది.

కానీ చక్రపాణి గారు ఏదైనా మొదలు పెడితే దానిని ఆపేవారు కాదు. దాంతో చక్రపాణి కి మిత్రులయిన ఈదర లక్ష్మీనారాయణ గారితో చెప్పించి చక్రపాణి గారిని ఈ చిత్రం ఆపే ప్రయత్నం చేశారు నాగిరెడ్డి గారు. అయినా చక్రపాణి గారు వినలేదు. సినిమా పూర్తయింది. చక్రపాణి, నాగిరెడ్డి గార్లు ఆ సినిమా విడుదల రోజున నెల్లూరు వెళ్లారు. నెల్లూరులో నాగిరెడ్డి గారి మామ గారికి ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ థియేటర్లో సినిమా చూశారు. సినిమా ఫ్లాప్ అని తేలింది. దాంతో నాగిరెడ్డి గారి మామ గారి ఇంటికి వెళ్లకుండా నేరుగా ఇద్దరు మద్రాసుకు కు వెళ్లారు. చక్రపాణి గారికి తెలుసు తన ప్రయోగం వికటించిందని. నాగిరెడ్డి గారికి తెలుసు తాను చెప్పింది చక్రపాణి గారరు వినకపోవడం వల్లనే ఇలా జరిగిందని.

@ మిస్సమ్మ…

రవీంద్రనాథ్ మైత్రా యొక్క బెంగాలీ నాటకం “మన్మోయీ గర్ల్స్ స్కూల్” ను ఉదర నిమిత్తం అని 1942 లో తెలుగులోకి అనువాదం చేశారు చక్రపాణి గారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు భార్య భర్తలుగా నటించి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చక్రపాణి గారు ఈ సినిమాకు సరిపడా రెండు కథలు వ్రాసుకున్నారు. ఎన్టీఆర్ కథనాయకుడు, భానుమతి గారు కథానాయిక. నాలుగు రీళ్ళు చిత్రీకరణ జరిగింది. ఒకసారి భానుమతి గారు చిత్రీకరణకు ఆలస్యంగా వచ్చారు.

దాంతో భానుమతి గారి నుండి క్షమాపణ కోరారు చక్రపాణి గారు. కానీ భానుమతి గారు చెప్పలేదు. దాంతో భానుమతి గారిని మిస్సమ్మ నుండి కథానాయికగా తీసేశారు. ఆ తర్వాత సావిత్రి గారికి కథనాయికగా అవకాశం ఇచ్చి చూశారు. ఎల్‌.వి.ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన ఈ హాస్య ప్రధాన చిత్రంలో ఎన్టీ రామారావు , సావిత్రి , అక్కినేని నాగేశ్వరరావు , జమున గార్లు నటించారు. జనవరి 12న మిస్సమ్మ థియేటర్లలో విడుదలైంది. రెండు వెర్షన్లు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. 100 రోజుల ప్రదర్శింపబడ్డాయి. ఈ ద్విభాషా చిత్రం అందులో తారాగణంకు మరియు వాహినీ స్టూడియోకి గుర్తింపు తెచ్చింది.

@ గుండమ్మ కథ…

బి.నాగిరెడ్డి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో ముగ్గురు సినిమాల్లో ఉంటే, ఒకరు వ్యాపారం చేసేవారు. తాను చేసిన వ్యాపారం నష్టాల్లో ఉంటే ఆ బాకీ మొత్తం నాగిరెడ్డి గారే తీర్చేశారు. దాంతో ఆ అప్పు తీర్చిన డబ్బులు సమకూరాలంటే ఒక మంచి చిత్రం తీసి లాభాల్లోకి రావాలని చక్రపాణి గారితో నాగిరెడ్డి గారు కోరారు. కన్నడ చిత్రం “మన్నె తుంబిద హెన్ను” చిత్రాన్ని తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నారు. చక్రపాణి గారు నరసరాజు గారితో స్క్రిప్టు వ్రాయించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, సావిత్రి, జమున గార్లు నటించారు.

కథ వ్రాయడం ఆలస్యం అవ్వడంతో ప్రధాన నటుల డేట్లు సర్దుబాటు కాలేకపోవడంతో వీలున్న నటులతో చిత్రీకరించడం, ఆ తర్వాత మిగతా వారితో చిత్రీకరణ జరపడం జరుగుతుంది. నందమూరి తారకరామారావు గారికి 100 వ సినిమా, ఏ.ఎన్.ఆర్ కు 99వ సినిమా. వీళ్ళిద్దరు కలిసి నటించిన పదవ సినిమా ఈ గుండమ్మ కథ. ఈ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా సినిమా బాగాలేదని అన్నారు. కానీ సినిమా విడుదలయ్యి విజయవంతం అయ్యింది. కె.వి.రెడ్డి గారికి సినిమా నచ్చలేదు. ఆ సినిమా ఎందుకు విజయవంతం అయ్యిందో అర్థం కాలేదు. విజయా ప్రొడక్షన్స్ వారి విజయవంతం అయిన అఖరు చిత్రం “గుండమ్మ కథ”.

@ కుటుంబం..

చక్రపాణి గారూ తన మేనమామ నెలజాల తిరుపతి నాయుడు గారి కుమార్తె రంగమ్మ గారిని ఇచ్చి 1932 లో పెళ్లి చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. 1940 వ సంవత్సరంలో ధర్మపత్రి చిత్రానికి సంభాషణలు వ్రాయడానికి కొల్హాపూర్ వెళ్లారు. ఆ సమయంలో నాగిరెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. తనతో కలిసి బి.యన్.కే.ప్రెస్ మద్రాసు లో నడిపిస్తూ అక్కడికి చక్రపాణి గారిని ఆహ్వానించారు. ఆ సమయంలో చక్రపాణి గారి భార్య చనిపోయారు. ఇద్దరు చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ గారి వద్ద ఉంచి చక్రపాణి గారూ మద్రాసు వెళ్లారు. తరుచూ సినిమాల పనిమీద తీరికలేకుండా ఉన్న చక్రపాణి గారూ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో నాగిరెడ్డి గారి సలహా మేరకు ఆ ఇద్దరు పిల్లల్ని నాగిరెడ్డి గారి ఇంట్లోనే వుంచారు. నాగిరెడ్డి గారు తన భార్యకు చెప్పి వాళ్ళను కూడా తమ సొంత బిడ్డల్లాగే చూసుకున్నారు.

@ చిత్ర సమాహారం..

★ రచయితగా…

స్వయంవరం (1980) (కథ)

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (రచయిత)

జూలీ (1975) (చిత్రానువాదం)

గుండమ్మకథ (1962) (కథ)

మనిదన్ మారవిల్లై (1962) (చిత్రానువాదం)

రేచుక్క పగటిచుక్క (1959) (చిత్రానువాదం)

అప్పుచేసి పప్పు కూడు (1958) (చిత్రానువాదం)

మాయాబజార్ (1957/II) (చిత్రానువాదం)

మిస్సమ్మ (1955) (రచయిత)

మిస్సియమ్మ (1955) తమిళం (రచయిత)

చంద్రహారం (1954) (రచయిత)

పెళ్లిచేసి చూడు (1952) (రచయిత)

షావుకారు (1950) (రచయిత)

స్వర్గసీమ (1945) (మాటలు, కథ)

ధర్మపత్ని (1941/I) (మాటలు)

ధర్మపత్ని (1941/II) (మాటలు)

చక్రదత్త (బెంగాలీ నవలకు అనువాదం)

★ నిర్మాతగా…

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (నిర్మాత)

జూలీ (1975) (బి.నాగిరెడ్డి-చక్రపాణిగా నిర్మాత)

గంగ- మంగ (1973) (నిర్మాత)

రామ్ ఔర్ శ్యామ్ (1967) (నిర్మాత)

సి. ఐ. డి (1965)(నిర్మాత)

గుండమ్మ కథ (1962) (నిర్మాత)

మనిదన్ మారవిల్లై (1962) (నిర్మాత)

రేచుక్క పగటిచుక్క (1959) (నిర్మాత)

అప్పుచేసి పప్పుకూడు (1958) (నిర్మాత)

మాయా బజార్ (1957/I) (నిర్మాత)

మిస్సమ్మ (1955) (నిర్మాత)

చంద్రహారం (1954) (నిర్మాత)

పెళ్ళి చేసి చూడు (1952) (నిర్మాత)

పాతాళ భైరవి (1951) (నిర్మాత)

షావుకారు (1950) (నిర్మాత)

★ దర్శకుడిగా…

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)

అరస కత్తలి (1967)

మనిదన్ మారవిల్లై (1962)

@ నటరాజ సాయుజ్యం…

చిత్రంలోని ప్రతి శాఖనూ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో గమనించడం, జనాన్ని రంజింపజేసేలా తీర్చిదిద్దడం చక్రపాణి గారి ప్రకృతి. పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలని ఆకట్టుకునేలా ఉండాలని మెలొడీకి ప్రాధాన్యం ఇచ్చేలా సంగీత దర్శకుడితో, రచయితతో చర్చించి, సూచనలిచ్చి పాటల రూపకల్పన ఉండేలా చూసేవారు. అందుకే విజయా వారి పాటలు ఈనాటికీ సంగీత ప్రియుల గుండెల్లో, అజరామరంగా భద్రంగా ఉన్నాయి. పసుమర్తి కృష్ణ మూర్తి లాంటి నృత్య దర్శకుడికి కూడా ”ఏందదీ, ఆ కాలు ఇలా తిప్పితే పోలా? బాగుంటది” అని సలహాలిచ్చేవారు చక్రపాణి గారూ. సి.పుల్లయ్య గారి ధర్మపత్ని చిత్రానికి, బి.ఎన్‌.రెడ్డి గారి స్వర్గ సీమ చిత్రానికి కథలను అందించారు చక్రపాణి గారు.

చక్రపాణి గారూ, నాగిరెడ్డి గారితో కలిసి విజయా ప్రొడక్షన్స్‌ ద్వారా షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్‌, గుండమ్మ కథ, సి.ఐ.డి, గంగ మంగ అప్పు చేసి పప్పు కూడు, పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ వంటి మరపురాని చిత్రాలను నిర్మించారు. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, పాత్రికేయునిగా, పత్రికా సంచాలకులుగా తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను తెలుగు ప్రజలకు రుచి చూపించి, ”చేతికందిన చందమామ”గా పిల్లల హృదయాలలో సైతం చోటు సంపాదించిన శ్రీ చక్రపాణి గారూ 24 సెప్టెంబర్ 1975 లో నటరాజ సాయుజ్యం పొందారు.

తెలుగులో “గుండమ్మ కథ” అద్భుతమైన విజయం సాధించగా, తమిళ “మనిదన్ మారవిల్లై” పరాజయం పాలయింది. పద్నాలుగేళ్ళ తరువాత “మిస్సమ్మ” కథను అటుఇటుగా మార్చి, “శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్” రూపొందించాలనుకున్నారు. బాపును తన సహాయ దర్శకులుగా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే చెక్కన్న కన్నుమూశారు.

తరువాత బాపు నిర్దేశకత్వంలో “శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్” రూపొందింది. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. చక్రపాణి గారి మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి గారు కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. నాగిరెడ్డితో కలసి చెక్కన్న నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్, డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. వారి తలపులు మాత్రం జనం మదిలో ఇప్పటికీ చెదరని జ్ఞాపకాలుగా మిగిలేవున్నాయి.

Show More
Back to top button