HISTORY CULTURE AND LITERATURE

పురాణాల్లో వ్యక్తుల పేర్లు మీకు తెలుసా??

పురాణాలు అందరికీ తెలుసు, దాదాపు అందరి పేర్లు అందరికి తెలిసే ఉంటాయి.కానీ అందరి పేర్లకు ఉన్న అసలు అర్ధం ఏమిటి అనేది ఎవరికీ తెలియక పోవచ్చు,కాబట్టి మనం ఈ రోజు పురాణాలలో ఉన్న కొంతమది మహనీయుల పేర్లకు ఉన్న అసలు అర్ధాలు తెలిస్తే మీరు,నేనూ ఆశ్చర్య పోతాం,ముందుగా నేనే తెలుసుకుని ఆశ్చర్యపోయి,మీతో పంచుకోవడానికి,మీక్కూడా తెలియాలని చెప్తున్నా, చూసి కాదు చదివి ఆశ్చర్య పొయి, మీ పేరుకున్న అర్ధం ఏమిటో తెలుసుకోండి మరి..ఇక అసలు విషయంలోకి వెళ్దాం పదండి..

*పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు*

అనసూయ – అసూయ లేనిది.

అర్జునుడు – స్వచ్చమైన ఛాయ కలవాడు.

అశ్వత్థామ – గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.

ఆంజనేయుడు – ‘అంజన’ కు పుట్టినవాడు.

ఇంద్రజిత్తు – ఇంద్రుని జయించినవాడు.

ఊర్వశి – నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.

కర్ణుడు – పుట్టుకతో ‘కర్ణ’కుండలాలు కలవాడు.

కుంభకర్ణుడు – ఏనుగు యొక్క ‘కుంభస్థల’ ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.

కుచేలుడు – చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).

కుబేరుడు – నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).

గంగ – గమన శీలము కలది. భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.

గరుత్మంతుడు – విశిష్టమైన రెక్కలు కలవాడు.

ఘటోత్కచుడు – కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ).

జరాసంధుడు – ‘జర’ అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

తుంబురుడు – తుంబుర (వాద్య విశేషము) కలవాడు.

దశరధుడు – దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.

ధృతరాష్ట్రుడు – రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.

త్రిశంకుడు – 1. తండ్రిని ఎదిరించుట 2. పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు శంకువులు (పాపాలు) చేసినవాడు.

దమయంతి – 1. ‘దమనుడు’ అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది(అణచునది).

దుర్వాసుడు – దుష్టమైన వస్త్రము కలవాడు (వాసమనగా వస్త్రము).

దుర్యోధనుడు – (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.

దుశ్శాసనుడు – సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.

ద్రోణుడు – ద్రోణము (కుండ) నుండి పుట్టినవాడు.

ధర్మరాజు – సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన (యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధము నందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.

నారదుడు – 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.

ప్రద్యుమ్నుడు – ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)

ప్రభావతి – ప్రభ (వెలుగు) కలది.

ప్రహ్లాదుడు – భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు

బలరాముడు – బలముచే జనులను రమింపచేయువాడు.

బృహస్పతి – బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి).

భరతుడు – అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

భీముడు – భయమును కలిగించువాడు.

భీష్ముడు – తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.

మండోదరి – పలుచని ఉదరము కలది (మండ-పలుచని).

మన్మధుడు – మనస్సు కలత పెట్టువాడు.

మహిషాసురుడు – 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు

2. ‘మహిష్మతి’ అనే ఆమె శాపం వలన మహిషమై (గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.

యముడు – యమము (లయ)నుపొందించువాడు.

యశోద –  యశస్సును (కీర్తి) కలిగించునది.

రాముడు – రమంతే యోగినః అస్మెన్ = రామ (రమ్ – క్రీడించుట)

యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.

రావణాసురుడు – కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)చేసినవాడు.

రుక్మిణి – రుక్మము (బంగారము) కలది.

వాల్మీకి – ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు.

వ్యాసుడు – వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.

విదురుడు – బుద్ధిమంతుడు , తెలివిగలవాడు.

విభీషణుడు – దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు.

శంతనుడు – శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు.

ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము).

శకుంతల – శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.

శూర్పణఖ – చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు).

సగరుడు – విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు).

సత్యభామ – నిజమైన కోపము కలది ( భామ – క్రోధే).

సీత – నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది).

ఇవండీ పురాణాల వ్యక్తులలో కొందరి పేర్లు,వాటి అర్ధాలు, మీకు ఇప్పుడు మీ పేరు అర్ధం తెలుసుకోవాలని ఉంది కదా? వెంటనే తెలుసుకోండి మరి..

Show More
Back to top button