హిందూ మతంలో భక్తులు పూజింపబడి, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం “శివ లింగము”. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించే వారు. కానీ ఆ పరమాత్మని “లింగ” రూపంలో పూజించడానికి “వరాహపురాణం” లో ఓ చరిత్ర ఉంది. అది ఏంటంటే వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ గాథలో “భృగు మహర్షి” శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.
అప్పటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తారు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవని తెలుస్తుంది. ఆ శాపం కారణంగానే శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెపుతుంటారు. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. శివుడికి రూపం కూడా ఉండటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు.
సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే ఆంధ్రప్రదేశ్లో ఐదు శివక్షేత్రాలు, ఆ శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. పంచ అనగా ఐదు, ఆరామం అనగా నివాస స్థలం అని అర్థం. పంచారామాలు అనగా పరమేశ్వరుడు కొలువైన ఐదు స్థానములు అని అర్థం..
★ భీమేశ్వరుడు- దక్షారామం (ద్రాక్షారామం, కోనసీమ జిల్లా)
★ అమరేశ్వరుడు- అమరారామం (అమరావతి, పల్నాడు జిల్లా)..
★ రామలింగేశ్వరుడు- క్షీరారామం (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)
★ సోమేశ్వరుడు- సో
మారామం (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
★ భీమేశ్వరుడు- కుమారారామం (సామర్లకోట, కాకినాడ జిల్లా)..
మన దేశమంతా విస్తరించి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి తరచూ వింటూనే ఉంటాము. ఈ క్షేత్రాలన్నింటినీ కలుపుతూ ఏదో ఒక పురాణగాథ ఉండటమూ తెలిసిందే. కానీ పంచారామాలుగా పేరొందిన ఓ అయిదు శైవక్షత్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటమే ఆశ్చర్యం. ఆ పంచారామాలు ఏమిటో, అవి ఎక్కడెక్కడ ఉన్నయో, వాటి వెనుక ఉన్న గాథ ఏమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
సంక్షిప్త కథ…
పూర్వం కృతయుగములో “తారకాసురుడు” అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దానికి శివుడు మెచ్చుకుని ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొనమని తరకాసురుడు అడిగాడు. దానికి పరవశించిన తారకాసురుడు తాను స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత మాత్రమే తన చావు ఉండేటట్లుగా శివుడిని వరం కోరుకున్నాడు. దాంతో సంతృప్తి చెందక నీలకంఠుని ఆత్మలింగాన్ని కూడా కావాలని తారకాసురుడు అడుగగా దానికి శివుడు సరే అని వరమిచ్చాడు. ఆ ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వరబల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడు ఎవరా అని ఆలోచించగా “కుమారస్వామి” అని తెలిసింది. అప్పుడు విష్ణుమూర్తి తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించెను.
కుమారస్వామి “శక్తి ఆయుధం” చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని చేధించడంతో ఆ అమృతలింగము బాణపు దెబ్బతలిగి ఐదు ముక్కలుగా పడెను. ఆ భాగములలో ఒక దానిని క్షీరపురి (పాలకొల్లు) యందు విష్ణుమూర్తి ప్రతిష్ట చేసెను. రెండవది ద్రాక్షారామమున “దక్షుడు” ప్రతిష్ట చేసెను. మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమారభీమేశ్వరుడిగా ప్రతిష్ట చేసేను. నాలుగవది భీమవరంలో “చంద్రుడు” తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ట చేసెను. ఐదవది అమరావతిలో “ఇంద్రుడు” తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ట చేసెను. తరువాత త్రేతాయుగ కాలంలో ఈ “పాలకొల్లు” క్షేత్రమున శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునః ప్రతిష్ట గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషంగా భావించుట కూడా కలదు.
ద్రాక్షారామము…
ద్రాక్షారామంలో గల “శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం” అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి అత్యంత సమీపంలో ఉండే ద్రాక్షారామం. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందంటారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7, 8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మూలవిరాట్ శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్పటికాకార లింగం. శ్రీ భీమేశ్వర స్వామి దేవేరి “శ్రీ మాణిక్యాంబ అమ్మవారు” యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా వెలిసియున్నది. అంతేకాదు దక్షిణకాశిగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా (ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రైశైలం) ఈ ఆలయాన్ని గౌరవిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 33 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం క్షేత్రం ఉంది. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయానికి క్షేత్రపాలకులుగా లక్ష్మీనారాయణలు ఉన్నారు. శివాలయంతో పాటు విష్ణు ఆలయం, శక్తిపీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందని శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో చేర్చాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి సప్తర్షులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహిణిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు ఎనిమిదో శతాబ్దం నుంచి ఉన్నవిగా ఉన్నాయి.
తెలుగుకు ఆ పేరు త్రిలింగం అన్న పదం నుండి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రంలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తిపీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షరామానికి ప్రశస్తి ఉంది. శిల్పకళాభిరామమై, శాసనాల భాండాగారమై, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఒప్పారుతోంది. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి తీరంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది.
సూర్య భగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను వేద వ్యాసుడు ఓదార్చి తాను సప్త గోదావరులను పుష్కరిణితో చేర్చినానని అది సప్త గోదారిగా పిలవబడుతుందని, ఈ తీర్థంలో స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవ ఆలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి, వేపవృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకర నారాయణస్వామి అని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో తెలుపు నలుపు రంగులలో ఉంటుంది.
అమరారామము (అమరావతి)…
పంచారామ క్షేత్రాలలో మొదటిది అమరారామము. ఇక్కడ స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివ లింగం చుట్టూ రెండు అంతస్థులు ఉంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. గుంటూరు నుండి 35 కి.మీ దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇక్కడి లింగం సాక్షాత్తూ ఆ ఇంద్రుని చేతనే ప్రతిష్టింపబడిందన్నది స్థలపురాణం కథ. అందుకే కాబోలు ఇంద్రలోకపు రాజధాని అయిన అమరావతి పేరుతోనే ఈ క్షేత్రమూ ప్రచారంలో ఉంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి రాజధానిగా మారింది. పది అడుగులకు పైబడి ఉండే ఇక్కడి అమరలింగేశ్వరుని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండంతస్తులుగా ఉన్న మెట్లను ఎక్కాల్సిందే!
నిజానికి అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమై ఉన్నది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్తేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరి దేవి ఆలయాలతో బాటుగా కళ్యాణమండపం, కృష్ణా నదికి దారి కూడా ఈ ప్రాకరం లో ఉన్నాయి. రెండో ప్రాకరంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలతో బాటుగా నవగ్రహ మండపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడో ప్రాకారంలో శ్రీశైలం మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యుడు ఆలయాలు ఉన్నాయి.
క్షీరరామము…
క్షీరారామం పార్వతీ సమేతుడైన “శ్రీ రామలింగేశ్వరుడు” వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వుంది. దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులను కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తినే క్షేత్రపాలకుడు. త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రమున శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునః ప్రతిష్టించారని ప్రతీతి. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని “కొప్పు రామలింగేశ్వరుడు” అని కూడా పిలుస్తారు.
పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.
ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో 10 – 11 శతాబ్దములలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న సా.శ. 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే క్షీరారామ ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో పాలకొల్లులోని క్షీరారామ ఆలయం ఒకటి.
ఇక్కడ స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనుడు. తొమ్మిది అంతస్తులతో ఇరవై అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం, చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోన మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతీ యేడు ఉత్తరాయన దక్షిణాన ప్రారంభంలో సూర్యోదయ సమయములో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగం పైన పడతాయి. ఈ ప్రాంతం వారు ఈ ఆలయంలో వివాహం చేసుకుంటే వారి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని ప్రగాఢ విశ్వాసం.
సోమారామము…
పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయిందని పురాణ కథనం. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.
దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణానికు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల, కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తులో ఆదిదేవుడు సోమేశ్వరుడు ఉంటే, అదే గర్భాలయ పైభాగాన ఉన్న రెండవ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నినిర్మించాడనటానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు. ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలుస్తారు.
ఈ ఆలయము ముందున్న కోనేరులోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి. దానితో బాటు మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండడం వలన ఈ ఆలయానికి పంచ నందీశ్వరాలయంగా మరో పేరు ఉంది. శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ క్షేత్ర పాలకుడు జానార్ధనుడు. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.
కుమారభీమారామం..
పంచారామాలలో ఒకటి ఈ “కుమారభీమారామం” క్షేత్రం. ఈ ఆలయం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉండి సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోని ఈశ్వరుడు “కుమార భీమేశ్వరుడు” గా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి.
ఈ ఆలయ నిర్మాణం సా.శ. 892 లో ప్రారంభమై సుమారు సా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణంలో చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. 1147 – 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.
గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుంటుంది. అక్కడిలాగానే ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తయిన ప్రాకారాలను కలిగివుంది.
ప్రాకారాపు గోడలు ఇసుక రాయి చే కట్టబడ్డాయి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరు మీదుగా ఇక్కడి శివున్ని కుమారారామ అని వ్యవహారిస్తుంటారు. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. కాకినాడ నుండి సామర్లకోట 15 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.