HISTORY CULTURE AND LITERATURE

అందరిబంధువయ్యా.. భద్రాచల ‘ రామయ్య’..!

తండ్రి మాటను జవదాటని పుత్రుడిగా…

తల్లి కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలిగా.. ధర్మం కోసం పోరాడిన యోధుడిగా…

ప్రజల సంక్షేమానికి విలువనిచ్చిన పాలకుడిగా.. 

ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సద్గుణాలను కలిగిన 

ఆదర్శ మూర్తి.. ఆయనే శ్రీరామ చంద్రమూర్తి..

పుణ్యం కొద్దీ పురుషులు అన్నట్టు.. ఆయన జన్మ సార్ధకాన్ని ప్రజల్లో చాటిన పావన మూర్తి.

అందరి మేలు కోరే బంధువుగా.. భద్రాచల రాముడయ్యడు.

కోర్కెలు తీర్చే కోదండ రామయ్యగా..

పురుషోత్తమ రాముడిగా.. వైకుంఠ రాముడిగా.. రఘు రాముడిగా… చతుర్భుజ రాముడిగా.. భద్రగిరి నారాయణుడుగా.. ఇలా ఎన్నో రకాలుగా కొలిచే.. రామ చరితను వినడం, రామ నామాన్ని జపించడం పుణ్యకార్యంతో సమానం.. కావున ఈ నెల 30న శ్రీరామనవమి సందర్భంగా..

శ్రీరాముడి జననం, చరిత్ర.. ఆయన వెలసిన భద్రాచలం, ఒంటిమిట్ట వంటి ముఖ్య పుణ్యక్షేత్రాల ప్రాశాస్త్యాల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

పురాణాల ప్రకారం

శ్రీమహావిష్ణువు ఎత్తిన పది అవతారాల్లో ఏడవ అవతారమే ఈ శ్రీ రామావతారం..

చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు కనుకే.. ప్రతి ఏటా ఈరోజున శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం.

శ్రీ మహా విష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు.. అయోధ్యలో మానవ రూపంలో అవతరించిన రోజే రామనవమి. చైత్ర మాసంలో ఉగాది తర్వాత సరిగా ఎనిమిది రోజులకు నవమి రోజున రాముడు పుట్టాడు. ఆయన పెళ్లి కూడా ఇదే రోజున జరిగింది. అందుకే దేశమంతటా కొలువై ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమిరోజున సీతారాముల కళ్యాణ ఉత్సవాలు జరిపిస్తారు.

రాముడిని విష్ణువు అర్ధాంశంగా పురాణాలు చెబుతున్నాయి. విష్ణువులోని సగంపైగా దైవిక లక్షణాలు రాముడిలో ఉంటాయి. ‘రామ’ అంటే దివ్యమైన ఆనందం.. ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవాడని అర్థం. ఆయన కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధి కలిగిన.. స్వభావాల వల్లే రుషులు సైతం పురుషోత్తముడుగా కీర్తిస్తుంటారు.  రామాయణం ఒక గొప్ప ఇతిహాసం. 

శ్రీరామ జననం రోజున శ్రీరాముని జయంతి జరపడం వేరు.. అలాంటిది ఈరోజున సీతారాముల కళ్యాణం జరపడం గొప్ప విశేషం! ఎందుకంటే శ్రీరాముని పుట్టుకకు గల కారణం రావణ వధ.. లోక కళ్యాణం కోసం సీతాదేవితోనే ముడిపడిన కారణంగా ఈరోజున వివాహం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈరోజున కార్యకలాపాలన్ని మధ్యాహ్నం 12 గంటలకు చేయాలని పురాణ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మిరియాల పొడి వేసిన బెల్లం పానకం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.

రాముని జననం

అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజుకు వారసులు లేరు. సంతానం కోసం యాగం చేయాలి అనుకున్నాడు. రుషి రుష్యశృంగుడు చేత యాగం జరిగింది.  ఈ సమయంలోనే లంకారాజు రావణుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఎవరినీ లెక్క చేయకుండా అందర్నీ ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే.. దేవతలు, గంధర్వులు, రాక్షసుల చేతిలో తనకు చావు ఉండకూడదని.. బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందాడు. అందువల్లే ఎవరూ… ఏమీ చేయలేరనే గర్వం పెరిగిపోయింది రావణుడికి…

ఇది తెలిసి, ‘రావణుడికి చావు ఎలా వస్తుందో చెప్పమ’ని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ… ‘రావణుడు మనిషి చేతిలో చనిపోతాడ’ని హితవు పలుకుతాడు. అప్పుడు దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి ‘దశరథ మహారాజు కొడుకుగా పుట్టి, రావణుడిని చంపాల’’ని కోరతారు. 

దాంతో దశరథుడి యాగం ఫలించి.. కొన్నాళ్లకు దశరథుడి భార్యలు అయిన.. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణశత్రుఘ్నులు జన్మిస్తారు. అలా రాముడు పుట్టిన రోజుని ‘రామనవమి’గా భావిస్తున్నాం.

రామ వంశానికి సూర్యుడు మూల పురుషుడు. అందుకే వాళ్ల వంశాన్ని రఘుకులం, రఘువంశం అంటారు. ‘రఘు’ అంటే సూర్యుడు అని అర్థం…  రాముడిని రఘునాథ, రఘుపతి, రాఘవేంద్ర పేర్లతో సైతం పిలుస్తారు. అందుకే కొన్నిచోట్ల రామనవమి రోజున రాముడి కంటే ముందుగా సూర్యుడికి పూజలు చేస్తారు. 

భద్రాచలం

తెలుగువారికి.. శ్రీరామనవమి అంటే రాముడు కొలువుదీరిన భద్రాచలమే గుర్తుకు

వస్తుంది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం ప్రతి ఏటా ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. స్థలపురాణం ప్రకారం, రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారట. మహర్షి ఆతిథ్యాన్ని అందుకున్న స్వామి.. తాను సీతమ్మను రక్షించిన అనంతరం.. తిరిగి ఇటువైపుగా వచ్చి పునర్దర్శనాన్ని అందజేస్తానని భద్ర మహర్షికి మాట ఇచ్చారట. 

అదే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీరాన పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలసింది. 

శ్రీరాముడు సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం చెబుతోంది. 

ఆలయ చరిత్ర

ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. గొప్ప చరిత్ర కూడా కలిగి ఉంది. 

భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే మహిళ భక్తిశ్రద్ధలతో శ్రీరాముడ్ని కొలుస్తుండేది. ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన ఓ వరం ప్రకారం… భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు సైతం సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండని.. ఈ  క్రతువులో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశించారట. ఆ మేరకు గ్రామ పెద్దలందరికీ విషయం తెలియజేయగా.. భద్రగిరిపైన  స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి.. స్వామి వారికి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ఆ ప్రకారమే ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా ఇక్కడ నిర్వహించేవారని పురాణాల్లో ఉంది. 

భక్త రామదాసు.. కంచర్ల గోపన్న..

భక్త రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న.. భద్రాచలంలో శ్రీరాముడికి ఆలయాన్ని నిర్మించాడు. 

ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామంలో ఉండేవాడు గోపన్న. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా.. కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఇతను మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకాకు తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. అదే సమయంలో భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి మహా భక్తుడిగా మారుతాడు. 

ఆపై కబీర్‌దాస్‌ శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో ఆలయం లేదని గ్రహించి.. ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలను.. భద్రాచల శ్రీరామచంద్రుడికి కానుకగా ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి.

ఈ విషయం తెలుసుకున్న నవాబ్‌ తానీషాకి ఆగ్రహించి.. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. అప్పుడు రామదాసు.. నా వద్ద ఉన్న సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా… ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు. దీంతో తానీషా గోల్కొండ బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానాశిక్షలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు.. సినిమా రూపంలోనూ వచ్చి, అలరించాయి.

చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడే స్వయంగా లక్ష్మణసమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తి చేశాడట..  

దీంతో శ్రీరాముని విశిష్టత గురుంచి తెలుసుకొని,

శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణస్వాములకు పలు ఆభరణాలు చేయించాడు.

తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. ఇతర పరికరాలు నేటికీ ఆలయంలో సందర్శించుకోవచ్చు. 

ఇక్కడినుంచి సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉండే.. పర్ణశాల.. రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలు ఇప్పటికీ ఇక్కడ ఆధారాలుగా సాక్షాత్కరిస్తాయి.

హైదరాబాద్‌ నుంచి సుమారు 310 కి.మీ.ల దూరంలో వుండే భద్రాచలం దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. జిల్లాకేంద్రం ఖమ్మం నుంచి సుమారు 115కి.మీ.ల దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంది.

శ్రీ కోదండ రామాలయంఒంటిమిట్ట

శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం…

ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది. 

త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. 

16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఒంటెడు, మిట్టడు అనే సోదరులు నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ ప్రాంతం తర్వాతి రోజుల్లో విశేష ఖ్యాతి పొందింది. వీరి విగ్రహాలను ఆలయప్రాంగణంలో చూడవచ్చు. విజయనగరవాస్తుశైలిలో అద్భుతమైన నిర్మాణం.. పైన మూడు గోపురాలతో సుందరంగా ఉంటుంది.

ఆలయం లోపలి స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను కన్నులారా వీక్షించవచ్చు. 

ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని కూడా తెలుస్తోంది. ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం మరో విశేషం.

ఇక్కడ వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడట. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

ఉత్తరాంధ్ర భద్రాద్రి.. రామతీర్థం

మామూలుగా అయితే రామాలయాల్లో ఆరోజున మాత్రమే శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయి. కానీ ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రం మాత్రం ఒక్క ఈ రామతీర్థమే. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులను ఒకేచోట కొలవడం మరో విశేషం.

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది.. ఈ క్షేత్రం. 

ఇక్కడి రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని చెబుతారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలను చూడొచ్చు.

ఇక చరిత్రలోకి వెళ్తే.. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడి భీముని ఇల్లే.. దృఢమైన ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు. 

ఈ రామతీర్థాన్ని శివక్షేత్రంగానూ భావించే భక్తులు మహాశివరాత్రి నాడు ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూసేందుకు పలు జిల్లా, రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాక మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిన చోటు(పర్ణశాల), లక్ష్మణుడు, సూర్పణఖ ముక్కు కోసిన చోటు (నాసిక్), రావణ లంక.. ఇలా ప్రతి చోటు.. దేనికదే ప్రత్యేకం..

రామరాజ్యం

రాముడి హృదయం, వ్యక్తిత్వం.. అంతా దైవత్వం, ప్రేమ, దాతృత్వం, వినయం, కర్తవ్య భావంతో నిండి ఉంది. అందుకే రాముడ్ని దేవునిగా కొలుస్తున్నాం. 

తండ్రి ఏం చెప్పినా.. గౌరవం, ప్రేమతో పాటించాడు. ఆయన గౌరవ మర్యాదలను నిలబెట్టేందుకు తన సౌకర్యాలన్నీ వదిలి అడవులకు వెళ్లిన గొప్ప కొడుకు…

సవతి తల్లి.. రాముడి మీద ఏ కాస్త ప్రేమ చూపించకపోయినా, తన సొంత బిడ్డకు అనుకూలంగా ప్రవర్తించినా.. ఆమెను ఎప్పటికీ సొంత తల్లిలాగే చూశాడు. ఆమె కోరికలను సైతం గౌరవించాడు. 

భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఆమె రక్షణ, స్వేచ్ఛ కోసం రావణుడితో యుద్ధాన్ని జయించాడు.  

ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాజు రాముడు. సొంత సుఖాలు, ఆనందం, అవసరాల కంటే రాజ్య సంరక్షణే ముఖ్యమని చాటాడు. 

ఇలా కొడుకుగా, భర్తగా, పాలకుడిగా.. ప్రతి పాత్రలో నిదర్శనంగా నిలిచాడు.

అప్పటినుంచి ఇప్పటివరకు రాముడిలాంటి రాజు పుట్టలేదు. కాబట్టే ఇప్పటికీ రామరాజ్యమే గొప్పదని చెప్తుంటారు.

పితృవాక్య పరిపాలనకు.. ధర్మాచరణకు.. 

సత్య దక్షతకు.. ఏకపత్నివ్రత నిష్టకు… 

మారుపేరుగా నిలిచిన శ్రీరాముడు… సర్వలోకాలకు ఆదర్శప్రాయమే!

Show More
Back to top button