
వానకాలం వచ్చేసింది. ఈ సమయంలో బెస్ట్ టూర్ ప్లాన్ చేయాలంటే తప్పకుండా తమిళనాడులో ఉన్న తిరుమేయచ్చుర్ ఆలయానికి వెళ్లాల్సిందే. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఈ ఆలయ అందాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇవి చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి ఆలయం గురించి, అక్కడకు ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయాల్సిందే. ఒకానొక నాడు పండాసురుడు అనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసిస్తుండగా వారందరూ కలిసి జగన్మాతకు విన్నవించుకున్నారట.
వారి కోరిక మన్నించి ఆమె పండాసురుడిని సంహరించింది. దాని తర్వాత కూడా జగన్మాత శాంతించకపోవడంతో తనను భూలోకంలోకి వెళ్లి మనోన్మని అనే పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడట. ఇలా జగన్మాత ఈ తిరుమేయచ్చుర్ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమెనే ఈ లలితాంబికా అని పురాణ కథనం. అంతేకాదు, మొదటగా లలితా పారాయణం చేసిన క్షేత్రం కూడా ఇదే.
ఈ ప్రదేశం గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారు కదా..! దీని కోసం మన తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవాలంటే మైలాదుత్తురై స్టేషన్‌కి వీక్లీ డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మైలాదుత్తురై నుంచి తిరుమేయచ్చుర్ ఆలయం 20కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు మార్గం ద్వారా అక్కడికి చేరుకుని ఆలయాన్ని దర్శించుకోండి.
తిరుమేయచ్చుర్‌లో చూడవలసిన ప్రదేశాలు..!
మేఘనాథ స్వామి ఆలయం
మయూరనాథ స్వామి ఆలయం
క్షేత్ర పురాణేశ్వర్ స్వామి ఆలయం
సకల భువనేశ్వర ఆలయం
తిరుమేయచ్చుర్ టూర్ బడ్జెట్..!
*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.
*ఆహారానికి ఒకరికి రూ.400 నుంచి రూ.500 వరకు అవుతుంది.
*రూంకు డిమాండ్ బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.
*క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకుంటే రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కావచ్చు.
*ఒకవేళ బస్సు టికెట్ బుక్ చేసుకుంటే రూ.300 వరకు అవుతుంది.
*వివిధ ఎంట్రీ టికెట్లకు దాదాపు రూ.300 వరకు అవుతాయి.