TRAVEL

కిన్నెరసాని” అందాలు చూసొద్దామా…

మనసు దోచే ప్రకృతి నిలయం.. పరవళ్ళు తొక్కే నదీ..

“కిన్నెరసాని” ఈ పేరు వింటేనే చాలామందికి తెలియని ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. కిన్నెరసాని అంటే అందరికీ ముందుగా గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి. శైలజ పాడిన ‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి’ అనే పాట గుర్తుకొస్తుంది. ఈ పాటను కిన్నెరసాని నదివద్దనే చిత్రీకరించారు. తెలంగాణ పర్యాటక ప్రదేశంగా కిన్నెరసాని పేరు పొందింది. రోజుకు వందలాదిమంది పర్యటకులు కిన్నెరసాని చేరుకొని ఆనందంగా గడుపుతారు.

కిన్నెరసాని అంటే ఏంటి ? కథ వృత్తాంతం, ఇది ఎక్కడుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కిన్నెరసానికి అర్థం…

కిన్నెర అంటే ఒక తెగ.

సాని అంటే స్త్రీ అని అర్థం. దేవా, దాన, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు ఇవి వినే ఉంటారు కదా. కిన్నెర స్త్రీలు అందం, లైంగిక పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన వారిగా చెబుతారు. కిన్నెరసాని ఆ తెగకు చెందిన మహిళ.

“కిన్నెరసాని” కథ వృత్తాంతం...

కిన్నెరసాని అనేది ఒక వాగు. ఇది గోదావరి నదికి ఉపనదిగా మారింది. గోదావరిలో  వాగు కిన్నెరసాని. ఈ కథ వృత్తాంతంలో కిన్నెరసాని అనే ఒక మహిళ ఒక గొప్పంటి గృహిణి. ఆమెకు అత్తతో పోరు 

ఉండేది. భర్త మీద ప్రేమను ఒదులుకోక అత్తమీద పెత్తనం చలాయించలేక ఏమీ చేయలేక ఇంటిని వదలి కోపంతో కిన్నెర అడవుల వెంట పరుగెడుతుంది. కిన్నెరను వెతుకుతూ.. తన భర్త ప్రేమతాపంతో ఇద్దరూ కలుసుకొని ఒకరి ఎడబాటును ఇంకొకరు సహించలేకపోతారు. అపుడు అతను ఏమి చేయలేని పరిస్థితిలో శోకంతో ఆమెను విడిచి కొండగా మారతాడు. ఆ సమయంలో కిన్నెరసాని తొడిమలేని పువ్వులా, మిక్కిలి సిగ్గుగల రాచకన్నెలా, కాంతిలేని రత్నంలా నడుస్తుంది. ఆ సమయంలో ఆమె ఒక నదిలా మారుతుంది. రాయిలా పడివున్న భర్తను విడువలేక సాగుతుంది. కిన్నెరసాని వగపు తీగలా తిరుగుతుంది. తాను కూడా రాయిని కాలేక నదిని అయినందుకు లోలోపల దిగులు చెందుతుంది. విషాద గీతికల్లా శబ్దం చేస్తూ నడుస్తుంది. ఒకచోట నిలబడలేక అటుఇటు ఉరుకుతుంది.

పోనీ తిరిగి కిన్నెరసానిగా ప్రవహించ వలెనని భావిస్తుంది. ఆ కోరిక ఆవహించగా తనను విడిచి భర్త ఉండలేడని, ఇక చెలిమి లేదని తలపోస్తుంది. అటువంటి భర్తతో కాపురం లేనందుకు ఏడుస్తుంది కిన్నెరసాని. జలదేవతలు వచ్చి కిన్నెరసానిని పదమని బలవంత పెట్టగా పతిని వదలలేక వదలలేక కదలిపోతుంది. కిన్నెరసానిని చూచి కడలిరాజు మోహించి ఉప్పొంగుతాడు. కిన్నెరసాని తను తొందరపాటును, తెలివితక్కువ తనాన్ని తలచుకుని భోరున విలపిస్తుంది. ఆమె ఏడుపును చూసి అడవిలోని ఎలుగులు, పులుగులు, మృగములు, గాలులు రోదిస్తాయి. ఈ వార్త విని గోదావరి కరిగిపోయి తన కెరటాలను చాచి కిన్నెరసానిని ఆదుకుని కడలిరాజు నీ జోలికి రాడు అని అభయమిస్తుంది. గోదావరీనది ఆశ్రయంలో కిన్నెరసాని తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ విధంగా కిన్నెరసాని గోదావరి నదికి ఉపనదిగా మారుతుంది. అనేది కథ వృత్తాంతము.

కిన్నెరసాని జన్మస్థలం…

కిన్నెరసాని అనేది ఒక నది. ఇది గోదావరి నదికి ఉపనది. ఈ కిన్నెరసాని తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం – తాడ్వాయి కొండకోనల్లో జన్మించింది. ఆగ్నేయ దిశగా ప్రవహించి ఒకప్పుడు ఖమ్మం జిల్లా.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  భద్రాచలం పట్టణానికి ఇదిగోన ఉన్నటువంటి  బూర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరు గ్రామాల మధ్యన గోదావరి నదిలో కలుస్తుంది. కిన్నెరసాని నది 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసానికి కూడా ఉపనది ఉంది. అది మొర్రేడు. మొర్రేడు నది కొత్తగూడెం పట్టణం గుండా ప్రవహించి సంగం అనే గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.

కిన్నెరసాని ప్రాజెక్టు…

గోదావరి నదికి ఉపనదిగా మారిన కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో విస్తరిస్తుంది. కిన్నెరసాని నదిపై అతి పెద్ద ప్రాజెక్టు నిర్మించబడింది. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో కిన్నెరసాని ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. విద్యుత్ ఉత్పాదనకై, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశయాన్ని నిర్మించారు. 1972లో నిర్మాణము పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు రూ. 558 లక్షల వ్యయమైనది. 1998 ఏప్రిల్ నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది. 2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు. ఇటు రైతులకు సాగునీరు అందిస్తూ.. ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న కిన్నెరసాని ప్రాజెక్టు దేశస్థాయిలో గుర్తింపు పొందింది.

అటవీ సంపదకు పేరుగాంచిన కిన్నెరసాని…

కిన్నెరసాని నది అటవీ సంపదకు పేరుగాంచింది. కిన్నెరసాని ప్రాంతం దట్టమైన అడవులతో కూడుకొని ఉంటుంది.

అటు పాపికొండల నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతం వరకు  కిన్నెరసాని అభయారణ్యం విస్తరించి ఉంది. 1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో  నిర్మించబడింది. ఈ అభయారణ్యంలో టేకు, మద్ది, వెదురు వంటి వృక్షాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.  ఈ అభయారణ్యంలో చిరుత, ఎలుగుబంట్లు, మనుబోతులు, మచ్చలజింక, సింహాలు, కృష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, సరీసృపాలు, తుట్టె పురుగులు, గుర్రాలు, కొంగలు, కింగ్‌ఫిషర్‌, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి. ఇక్కడ జీవించే గిరిజన జాతి ప్రజలు అటవీ సంపదలోని పండ్లను, కలపను సేకరించి వాటిని అమ్ముతూ తమ జీవనాన్ని కొనసాగిస్తారు.

పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన కిన్నెరసాని…

తెలంగాణ పర్యాటక ప్రదేశంగా కిన్నెరసాని పేరుగాంచింది. అటవీ శాఖ ఆనకట్టకు ఎదురుగా జింకల పార్కును ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకం అభివృద్ధి చేసింది. కిన్నెరసాని అభయారణ్యం అన్యదేశ వన్యప్రాణుల స్వర్గధామంగా పేరొందింది. కిన్నెరసాని ప్రాజెక్టు అందాలను చూస్తూ, కిన్నెరసాని నది ఒంపులు, పరవళ్ళు చూస్తూ పర్యటకులు పరవశించిపోతారు. కిన్నెరసాని నదిలో బోటింగ్ చేస్తూ కేరింతలు కొడతారు. కిన్నెరసాని వద్ద ఏర్పాటుచేసిన జింకల పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. జింకల ఉరుకులు, పరుగులు గెంతులు వేస్తూ పర్యాటకులను మరింత అలరిస్తాయి. ఇవన్నీ చూస్తూ  పర్యటకులు వారి సందర్శనను ఆనందిస్తారు. ఈ అభయారణ్యంలో చీతల్, చింకారా, అడవి పందులు, చౌసింగ్‌లు, సాంబార్, గౌర్స్, హైనా, నక్కలు, స్లాత్ బేర్, టైగర్స్ పాంథర్స్, బ్లాక్ బక్స్‌లకు నిలయం. నెమలి, పిట్టలు, పార్త్రిడ్జ్‌లు, టీల్స్, నుక్తాస్, స్పూన్‌బిల్స్ జంగిల్ ఫౌల్, పావురాలు అభయారణ్యంలో కనిపించే సాధారణ పక్షులు. దట్టమైన ఆటతో కూడి ఉన్న కిన్నెరసాని నదిలో ప్రమాదకరమైనటువంటి మొసల్లు కూడా ఉన్నాయి.

అద్దాలమేడా…

కిన్నెరసాని అందాలలో ముఖ్యమైనది అద్దాలమేడ. ప్రత్యేకంగా ఈ అద్దాల మేడను చూడడం కోసమే కిన్నెరసానికి వెళ్లేవారు. చుట్టూ అద్దాలతో ఈ భవనం ఉండేది. ఒకప్పుడు పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ కాలంలో మావోయిస్టుల చర్యలు ఎక్కువగా కొనసాగేవి. ఆ సమయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులో అద్దాలమేడను ధ్వంసం చేశారు. అయితే అదే స్థానంలో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం నూతన అద్దాలమేడ నిర్మాణాన్ని ప్రారంభం చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అద్దాలమేడ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ కిన్నెరసాని వెళ్లిన పర్యటకులు నిర్మాణంలో ఉన్నటువంటి అద్దాల మేడను కూడా చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.

కిన్నెరసానిలోని ద్వీపం…

గోదావరి నదికి ఉపనదిగా ఉన్నటువంటి కిన్నెరసాని మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం ఎత్తైన కొండతో దట్టమైన అటవీతో కూడుకొని ఉంటుంది. పర్యాటకులు బోటింగ్ ద్వారా ఆద్వీపం వద్దకు చేరుకుంటారు. అయితే ఆ ద్వీపం వద్ద బోటును నిలపరు. ఆ దట్టమైన అటవీ ప్రాంతం కలిగి ఉన్న ద్వీపంలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండడంతో ద్వీపం వద్ద బోటును నిలపకుండా ఆ ద్వీపం చుట్టూ నిర్వాహకులు బోటింగ్ చేయిస్తారు. కిన్నెరసాని అభయారణ్యం ప్రదేశంలో వివిధ రకాల పక్షుల రాగాలు, వాటి అరుపులు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పర్యాటకులు వాటి అరుపులు వింటూ మైమరిచిపోతారు.

కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే…

రోడ్డు మార్గం ద్వారా కిన్నెరసానిని చేరుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ముందుగా చేరుకోవాలి. అక్కడనుండి పాల్వంచ పట్టణానికి చేరుకుంటే.. 12 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆహారానికి ఇబ్బంది పడకుండా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలలో మంచి భోజనాన్ని అందించే రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. బస చేయాలి అనుకునే పర్యటకులు కిన్నెరసాని నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న  భద్రాచలం పట్టణంలో హరిత హోటల్ అందుబాటులో ఉంది. ఇది తెలంగాణ టూరిజం ద్వారా నిర్వహించబడుతుంది. సౌకర్యవంతమైన రిసార్ట్ కోసం వెతుకుతున్న పర్యాటకులకు హరిత హోటల్ అనువైన వసతి.

Show More
Back to top button