GREAT PERSONALITIES

‘ఝాన్సీ’కి రాణి.. లక్ష్మిబాయి..!

ఝూన్సీలక్ష్మి తన దత్తపుత్రుడ్ని వీపుకు కట్టుకొని.. పంచకళ్యాణి గుర్రం మీద.. మరో చేత్తో కత్తిపట్టి..  అపరకాళీదేవిలా బ్రిటీషు సైన్యంపై విరుచుకుపడింది…

బుద్ధికుశలత, కార్యదక్షత, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీరనారీమణిగా చరిత్ర పుటలలో విశిష్టస్థానం సంపాదించుకున్న వీరవనిత ఝాన్సీ లక్ష్మిబాయి. 

అత్యంత సాహసి, ధైర్యశాలి..

ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రథమ స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికిన ధీశాలి కూడా.

కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీర నారీమణిగా.. స్ఫూర్తి నింపింది. కేవలం 23 ఏళ్ల వయసుకే యుద్ధంలో పోరాడి, ఓడి చనిపోయింది.

1947 ఆగస్టు నెల 15న స్వాతంత్య్రం సిద్దించిన నేపథ్యంలో ఆ సమరయోధుల చరిత్రలను స్మరించుకోవాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా నేడు ఝాన్సీ రాణి లక్ష్మిబాయి జీవిత విశేషాల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం… 

1835 నవంబర్ 19న జన్మించింది లక్ష్మిబాయి. 1842లో ఝాన్సీకి చెందిన రాజు గంగాధరరావుతో వివాహమైంది. వివాహం కాకముందు వరకు పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. పెళ్ళయ్యాక ఝాన్సి లక్ష్మీబాయిగా మారిపోయింది. ఝాన్సీ అనే రాజ్యం  ఉత్తరప్రదేశ్ లోని ఒక జిల్లా కేంద్ర పట్టణం. 1851లో మహారాణి లక్ష్మీబాయికి కుమారుడు జన్మించాడు. దురదృష్టవశాత్తు మూడు నెలలలోపే చనిపోయాడు. దీంతో ఆనందరావు అనే మరో బాలుడిని దత్తత తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు గంగాధరరావు కూడా కాలం చేశాడు. దీంతో రాజ్యపు బాధ్యత లక్ష్మీబాయిపై పడింది. ఇదిలా ఉంటే, దత్తత ద్వారా వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం రాజ్య అధికారులైన గంగాధరరావుకి, లక్ష్మీబాయికి లేదంటూ బ్రిటిష్ ప్రభుత్వం, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చెయ్యాలని నిర్ణయించింది. కానీ రాణి లక్ష్మీబాయి ఇందుకు తిరస్కరించింది. ఆపై దినచర్యలో భాగంగా గుర్రపు స్వారీ చేయడం, తుపాకీ, ఖడ్గం, బల్లెం ప్రయోగించడం నేర్చుకుంది. 

“అత్యాచారాలు, అన్యాయాలను మౌనంగా సహించేవారు మరణించినవారితో సమానం. న్యాయాన్ని గౌరవించడమే నీతి. అన్యాయం ముందు తలవంచడం పిరికితనమే” అని పలికేది.  స్వాతంత్ర్యవీరుడు తాంత్యతోపెతో బ్రిటీషు వారిని ఎదిరించే విషయమై, ఝాన్సీ లక్ష్మి నిరంతరం రహస్య మంతనాలు జరిపేది. 

1857 మే 31న దేశమంతటా ప్రజలు ఒకేసారి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అది మొదలు 19- 20 నెలలపాటు పోరాటం సాగుతూనే ఉంది. అయితే ఈ పోరాటం విషయం ముందుగానే తెలుసుకున్న ఆంగ్లేయ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ అణచివేయాలనుకుంది. మూకుమ్మడి పోరాటం ద్వారా బ్రిటిష్ వారికి ఊపిరి సలపకుండా చేసి దేశం నుంచి తరిమివెయ్యాలనేది భారతీయుల యోచన. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. 

ఈ పరిణామం అనంతరం 1858 మార్చి 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ రోజ్.. ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. 10,12 రోజుల వరకూ చిన్న రాజ్యమైన ఝాన్సీ గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. ఆ సమయంలో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడం రాణి గమనించింది. ఝాన్సీ నుంచి బయటకు దూసుకుపోయింది. అక్కడినుంచి కాల్పికి చేరి తాంత్యాతోపె, రావు సాహెబ్ లను కలుసుకుంది. కాల్పీలో కూడా రాణి సైన్యాన్ని సమీకరించింది. ఇది తెలిసిన రోజ్ తన సైన్యంతో కాల్పీని సైతం ముట్టడించాడు. ఇక ఓటమి తప్పదని రాణికి అర్ధమైంది. వెంటనే రావు సాహెబ్, తాంత్యాతోపెలతోపాటు మరికొందరు యోధులు రాణితో కలిసి గ్వాలియర్ కోటని వశపరచుకొన్నారు. తెల్లవారుఝామున అయ్యేసరికి గ్వాలియర్ కోటను ముట్టడించారు. అంతేకాక రాణి పురుష వేషం ధరించి యుద్ధానికి సిద్ధమైంది. రాణి వద్ద సైన్యం సంఖ్యాపరంగా తక్కువే… అయితేనేం అసాధారణ సాహసం, యుద్ధ వ్యూహం, పరాక్రమం కారణంగా ఆ రోజు ఆంగ్లేయ సైన్యం భారీగా దెబ్బతింది. మరునాడు కొందరు సైనికులు ఆంగ్లేయులతో చేయి కలిపారు. అప్పుడు ఆ క్షణంలో.. రాణి లక్ష్మీబాయి తన సర్దారులతో ఇలా పలికారు.. “నేడు యుద్ధానికి చివరి రోజేమోననిపిస్తోంది. ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుడు ఆనందరావు జీవితాన్ని నా జీవితం కంటే గొప్పగా భావించి, జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి అంది.. ఒకవేళ నేను మరణించినా.. నా శవం అంగ్లేయు(విధర్మీయు)ల చేతుల్లో పడరాదు” అని కోరింది.

రోజ్ వద్ద సైనిక శక్తి అధికంగా ఉండటం.. ఈ తాకిడితో విప్లవకారుల సైన్యం వారిముందు నాశనమైపోవడంతో… రాణికి తప్పించుకునిపోవడం మినహా మరొక మార్గం కనిపించలేదు. ఆమె ఒక్కసారిగా ముందుకి దూకింది. ఆంగ్లేయుల సైన్యం ఆమెను చుట్టుముట్టింది. ఆమె చెయ్యి ఒకటి తెగిపడింది. కడుపులోనుంచి రక్తం కారుతోంది. ఒళ్లంతా గాయాలయ్యాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆమె దురవస్థని చూసి.. అంగరక్షకుడైన కుల్ మొహమ్మద్ కూడా విలపిస్తున్నాడు. రాణిని భుజానికి ఎత్తుకుని గంగాదాస్ ఆశ్రమంవైపుకి పరుగు తీశాడు.

ఆ రోజు 1858, జూన్ 28.. చుట్టూ చిమ్మచీకటి. ఆ చీకట్లోనే బాబా గంగాదాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గుర్తు పట్టాడు. చల్లని నీటితో ఆమె ముఖాన్ని కడిగాడు, ఆపై గంగాజలం తాగించాడు. రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్కసారి, “హర హర మహాదేవ్” అని మాత్రం అంది. ఆ తర్వాత ఆమె శరీరం తిరిగి చైతన్యాన్ని కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత అతికష్టం మీద కళ్లు తెరిచింది. బాల్యంలో తాను నేర్చుకున్నప్పటీ భగవద్గీత శ్లోకాలను నెమ్మదిగా ఉచ్చరిస్తూ వుండగానే… గొంతు అంతకంతకూ క్షీణించసాగింది. అంతే.. ఝాన్సీ రాజ్యపు భాగ్యరేఖ అంతటితో అంతరించింది.

1857నాటి సిపాయిల తిరుగుబాటు… 

స్వరాజ్యం ఉద్యమానికి ప్రాతిపదిక అయ్యింది.  ఆనాటి నుంచి బ్రిటిషువారి పరిపాలన నేరుగా ఇండియాలోనే ప్రారంభమైంది. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన దేశం అంతటా కొనసాగుతూ వస్తోంది. 

భారతదేశంలో 500కి పైగా సంస్థానాలు ఉండేవి అప్పట్లో. సంస్థానాధీశులందరూ స్వతంత్రులే. వీరిపై ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం ఉండేదికాదు. కానీ సంస్థానాధీశుల స్థితిగతులను బట్టి, కంపెనీతో సంబంధబాంధవ్యాలు సాగేవి. పూర్వం రాజులు, తమ రాజ్యపాలన చేసుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా రాజ్యాలు చిన్నచిన్న రాజ్యాలుగా, తదుపరి.. సంస్థానాలుగా కుచించుకుపోయాయి.

అలాంటి సంస్థానాలలో ఝాన్సీ.. ఒకటి. 

ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లో నెలకొని ఉండేది. భారతదేశంలోని బలవత్తరమైన కోటలలో ఝాన్సీ కోట మేటిదని చెప్పాలి. కొండమీద శత్రువులకు ప్రవేశించటానికి వీలులేనిది. బలోపేతమైన కోటగోడలు, లోపల విశాలమైన రాజమందిరాలు, అంతఃపుర మందిరాలు, స్నానవాటికలు, దుర్గాదేవి దేవాలయం, సైనిక శిబిరాలు, అశ్వ, గజశాలలు, సిబ్బంది వసతి గృహాలతో ఝాన్సీ కోట పకడ్బందీగా నిర్మితమై ఉంది.

ఝాన్సీని పాలించిన రాజులంతా పరాక్రమవంతులే.. పట్టుదలకు, సాహసానికి పెట్టింది పేరు. ప్రజల్ని తమ కన్నబిడ్డల్లా పరిపాలించేవారు. ఝాన్సీరాజు అకాల మరణం చెందిన తరువాత ఝాన్సీరాణి లక్ష్మీబాయి రాజ్య పరిపాలకురాలైంది. అప్పట్లో రాణి పరిపాలన ప్రజలకు ప్రీతిపాత్రంగా మారింది.

ఝాన్సీ లక్ష్మీబాయి స్వతహాగా దుర్గాదేవి భక్తురాలు. ఆమె రాజ్యపాలన సాటి రాజులకేమాత్రం తీసిపోకుండా ఉండేది. ఝాన్సీ రాజదంపతులకు సంతానం లేదు. ఆమె తర్వాత తన రాజ్యానికి వారసులు లేకపోవడం వల్ల ఝాన్సీరాణి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంది. 

స్వదేశీ సంస్థానాలు…

క్రీ.శ. 1846లో గవర్నర్ జనరల్ గా వచ్చిన డల్ హౌసీ కాలంలో స్వదేశీ సంస్థానాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇతడు గొప్ప సామ్రాజ్యవాది. యుద్ధాల ద్వారా రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా ఇతడు అనేక స్వదేశీ సంస్థానాలను బ్రిటీషు పాలన కిందకు తీసుకొచ్చాడు. కొందరు స్వదేశీ రాజుల అసమర్ధత, దుష్పరిపాలన ఇతనికి అనుకూలమయ్యాయి. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని మొదట ఇతనే అమలులోకి తెచ్చాడు. మొగలాయిల కాలంలోనే సరైన వారసుడు లేని సామంతరాజ్యాలను సార్వభౌములు ఆక్రమించుకుంటూ ఉండేవారు. ఈ ప్రాతిపదిక మీదనే డల్ హౌసీ స్వదేశీ సంస్థానాలను బ్రిటీషు పాలనలో చేర్చడానికి కుయుక్తితో రాజ్యసంక్రమణ పద్ధతిని రూపొందించాడు. డల్ హౌసీ కాలంనాటికే సైన్య సహకార ఒడంబికల ద్వారా స్వదేశీ రాజులు చాలామంది ఆంగ్లేయులకు సామంతులయ్యారు.

ఇదే సమయంలో స్వదేశీ సంస్థానాధిపతులలో చాలామందికి తగిన వారసులు లేకపోవడం కూడా జరిగింది. దత్తత స్వీకార పద్ధతిని సైతం రద్దు చేయడమైంది. అందువలన సంతానంలేని స్వదేశీ రాజుల సంస్థానాలకు ముప్పు వాటిల్లింది. ఈ విధానం ద్వారా సతారా, ఝాన్సీ, జబ్బల్లాపూర్, నాగపూర్, ఉదయపూర్, సంబల్ పూర్ వంటి తదితర సంస్థానాలను డల్ హౌసీ ఆంగ్ల సామ్రాజ్యంలో చేర్చాడు. రెండవ బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ కు భరణం ఇవ్వడం ఆపేశాడు. 

ఈ విధానం ద్వారా స్వదేశీ సంస్థానాల పాలకులు, మతపరమైన ఆచారాలకు ఇబ్బందులు తలెత్తే చర్యల వలన సిపాయిలు, ప్రజలు కూడా బ్రిటిష్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి కనబరిచారు. ఈ అసంతృప్తియే.. 1857 తిరుగుబాటుగా అవతరించింది.

*ఇండియా పూర్తిగా ఆంగ్లేయుల పరమైంది.  ఆంగ్లేయులు తమ సొంత సైన్యంతో భారత్ పైన దండెత్తినా జయించలేదు. అందుచేత వ్యాపార వాణిజ్యాల కోసం వచ్చి, కోటలను కట్టుకొని.. క్రమంగా దేశ రాజకీయాల్లో తలదూర్చి, కుటిల పద్ధతుల ద్వారా భారత్ పై పెత్తనం సంపాదించారు. అందువలన దేశ పరిపాలన నిర్వహణకు కావాల్సిన సిపాయిల కోసం భారతీయులనే నియమించుకున్నారు.

సిపాయిలపట్ల ఆంగ్లేయులు సరైన పద్ధతులను, సామరస్యపూర్వక విధానాలను అవలంబించకపోవడం వల్ల సిపాయిలలో నెమ్మదిగా అసంతృప్తి మొదలైంది. దీంతో ఆంగ్లేయులపై సిపాయిలు తిరగబడ్డారు. అయితే 1857 తిరుగుబాటు దేశ చరిత్రనే కొత్త మలుపు తిప్పింది.

ఇతరాంశాలు…

*1857 తిరుగుబాటుకు సారథ్యం వహించింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె సాటి స్వదేశీ రాజులను ప్రోత్సహించి, సిపాయిలను రెచ్చగొట్టి 1857 తిరుగుబాటును ధైర్యసాహసాలతో ఎదుర్కొంది. 

ఆనాటి పరిస్థితుల దృష్ట్యా స్వదేశీ రాజులకే కాక ఇండియాలో అన్ని తరగతుల ప్రజలకు ఆంగ్ల ప్రభుత్యం పట్ల ద్వేషం ఏర్పడింది. మొగలుల కాలంలో వంశపారంపర్యంగా ఉద్యోగాలను చేస్తుండేవారు. బ్రిటీషువారు భారీ పరిశ్రమలను నెలకొల్పడం వల్ల గృహాపరిశ్రమలు, చేతివృత్తులు చేసేవారి సంఖ్య తగ్గి, నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. ఎందుకంటే ఆ ఉద్యోగాలు చేసేది కూడా

జమీందారులు, తాలూకాదారులు, ఠానేదారులు ఇతరులు… అంతేకాక బ్రిటిష్ వారు ఇంగ్లీష్ భాషను రాజభాషగా చేసినందున… దేశభాషలు స్వయం ప్రపత్తిని కోల్పోయాయి.  పాఠశాలలో, కార్యాలయాల్లో ఇంగ్లీష్ భాష వాడుక భాషగా మారింది. 

*దీనికితోడు క్రిస్టియన్ ఫాదర్స్..

హిందూ ముస్లిం మతాలను తీవ్రంగా విమర్శిస్తూ, అక్కడి ప్రజల్ని క్రిస్టియన్ మతంలోకి చేరమని ఒత్తిడి చేసేవారు. మతం మార్చుకోవాలని ప్రజలను ప్రలోభ పెట్టేందుకు పెద్దఎత్తున క్రిస్టియన్ సంస్థలు పూనుకున్నాయి. దీంతో తమ మతానికి ముప్పు కలుగుతుందని హిందూ, ముస్లిం మతస్తులు భావించారు.

*ఆమె మరణించిన ప్రదేశంలో గుర్రం మీద కూర్చొని ఉన్న ఝూన్సీరాణి నల్లని కంచు విగ్రహం చూడొచ్చు.   ఇదే విధంగా ఢిల్లీ, బహుదూర్ షా, నానాసాహెబ్, తాంతియాతోపేలు సైతం వీరమరణం చెందారు. దీంతో సిపాయిలు ప్రారంభించిన 1857 తిరుగుబాటు విఫలమైంది.

భారతీయ జాతీయోద్యమానికి అంకురార్పణ చేయడానికి 1857 తిరుగుబాటు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

*భారతీయ మహిళల శౌర్యసాహసాలకు ఝాన్సీ రాజ్యపు లక్ష్మిబాయి జీవితం.. నిదర్శనం!!

Show More
Back to top button