CINEMATelugu Cinema

భారతీయ సినీచరిత్రలో విజయవంతమైన చిత్రాల దర్శకులు.. కోవెలమూడి బాపయ్య.

తెలుగు సినిమా వయస్సు 92 ఏళ్ళు. అందులో దాదాపు 85 ఏళ్లుగా ఈ రంగంతో మమేకమైన కుటుంబం కోవెలమూడి వారిది. నటుడుగా మొదలై నిర్మాతగా మారి దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాలలో పేరు తెచ్చుకున్న ఘనత స్వర్గీయ కే.ఎస్.ప్రకాష్ రావు గారిది. ఆయన కుమారుడు కె.రాఘవేందర్రావు శతాధిక చిత్ర దర్శకుడై తెలుగు సినిమా వారికి జగత్ స్వరూపాన్ని చూపెట్టారు.  మరో కుమారుడు కృష్ణమోహన్ రావు నిర్మాతగా భారీ చిత్రాలను అందించారు. ఇంకొక కుమారుడు స్వర్గీయ కే.ఎస్.ప్రకాష్ ఛాయాగ్రహకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక తాత పేరు పెట్టుకున్న మనవడు సూర్య ప్రకాష్ కొవెలమూడి అచ్చంగా తాత లాగానే ఇప్పుడు నటుడు నిర్మాత. అలాంటి కుటుంబం నుండి వచ్చిన మరో ప్రముఖ దర్శకులు కోవెలమూడి బాపయ్య గారు.

ప్రముఖ అనుభవజ్ఞ దర్శకులు శ్రీ కె.బాపయ్య గారు పరిచయం అవసరం లేని లబ్ద ప్రతిష్టలైన దర్శకులు. తాను సినీరంగప్రవేశం చేసిన తరువాత తీసిన మొదటి సినిమా “ద్రోహి” అంతగా విజయవంతం కాకపోయినా కూడా తరువాత రోజులలో అనేక విజయాలతో చరిత్ర సృష్టించిన సినిమాలకి బాపయ్య గారు దర్శకత్వం వహించారు. ఎదురులేని మనిషి” సినిమాతో ఎన్టీఆర్ కి కుర్ర కారులో పునర్ వైభవాన్ని కలిగించింది బాపయ్య గారే. సోగ్గాడు అన్న పదానికి శోభన్ బాబు గారు పర్యాయపదం అన్నంతగా ఆ సినిమాని కూడా అద్భుతంగా మలిచింది బాపయ్య గారే కావడం విశేషం. 1980 వ దశకంలో భారతదేశం మొత్తం మీద అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకులు బాపయ్య గారు. మల్టీస్టారర్ సినిమాలలో అత్యధిక శాతం విజయవంతం చేసిన ఖ్యాతి కూడా బాపయ్య గారిదే.

కేవలం మన దేశంలోనే కాక మధ్య, తూర్పు దేశాలలో కూడా బాపయ్య గారి పేరు సుపరిచితం. అ కాలపు ప్రముఖ పాకిస్తానీ నటి బాబ్రా షరీఫ్ బాపయ్య గారి సినిమా విడుదల అయ్యిందంటే చాలు ఎలానో ఆ సినిమా క్యాసెట్ సంపాదించి చూసి, ఫోన్ చేసి బాబాయ్య గారిని అభినందించేవారు. ప్రముఖ కథానాయిక శ్రీదేవి గారికి ఎంత ప్రాధాన్యత ఉండేదో, దర్శకుడిగా బాపయ్య గారికి కూడా అంతే ప్రాధాన్యత ఉండేది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు చేసిన సినిమా “నా దేశం” సినిమాని బాపయ్య గారు కేవలం 21 రోజులలో నిర్మించారు. ఇటు దక్షిణాదినా, అటు ఉత్తరాదినా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన శ్రీ బాపయ్య గారు 15 సంవత్సరాల క్రిందటే స్వచ్ఛందంగా చిత్రరంగం నుంచి విరమించుకొని విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :  కోవెలమూడి బాపయ్య 

జననం    :    24 ఏప్రిల్ 1938

స్వస్థలం   :  హైదరాబాదు, భారతదేశం 

తండ్రి  :  కోవెలమూడి సత్యనారాయణ 

తల్లి  :  సుమతి 

జీవిత భాగస్వామి  :    కె. భారతి

పిల్లలు   :   పద్మ, చాముండేశ్వరి

వృత్తి      :      చిత్ర దర్శకుడు

నేపథ్యం.. 

కోవెలమూడి బాపయ్య గారు 24 ఏప్రిల్ 1938 నాడు కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించారు. వారి నాన్నగారి పేరు కోవెలమూడి సూర్యనారాయణ, అమ్మ గారి పేరు సుమతి. బాపయ్య గారి నాన్నగారు గుత్తేదారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టులు పనులు చేస్తుండేవారు. బాపయ్య గారి అమ్మానాన్నలకు ముగ్గురు సంతానం. ఒక అక్క, ఒక చెల్లి,  మధ్యలో వారే బాపయ్య గారు. దురదృష్టవశాత్తు ఆయన మూడేళ్ల వయస్సులో ఉండగానే వాళ్ళ అమ్మ గారు చనిపోయారు. ఆమె ఎలా ఉంటుందో ఆ రూపురేఖలు కూడా బాపయ్య గారికి సరిగ్గా గుర్తులేని వయస్సులో ఆవిడ చనిపోయారు. 

వాళ్ళ అమ్మ గారు పోయాక ఆ ముగ్గురుని బాపయ్య గారి అమ్మమ్మ తీసుకెళ్లి వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. అలా బాపయ్య గారు కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటివద్దనే పెరిగారు. అందువలన బాపయ్య గారి బాల్యమంతా కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో గల గుంటుపల్లి లో గడిచిపోయింది. అక్కడే తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. బాపయ్య గారి పెదనాన్నగారు వెంకట్రామయ్య గారు బాపయ్య గారి ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం కోసం విజయవాడలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. వెంకట్రామయ్య ఆ రోజులలో కృష్ణాజిల్లా రెవెన్యూ బోర్డు అధికారిగా పనిచేస్తుండేవారు. బాపయ్య గారు అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు.

బాల్యం…

తన 12 సంవత్సరాల వయస్సులో వాళ్ళ బాపయ్య గారి నాన్నగారు చనిపోయారు. విజయవాడలో బాపయ్య గారి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యాక తన పై చదువుల కోసమని వాళ్ళ బాబాయి కోవెలమూడి సూర్య ప్రకాశరావు గారు బాపయ్య గారిని మద్రాసు పిలిపించుకున్నారు. కోవెలమూడి సూర్య ప్రకాశరావు గారు అప్పటికే తెలుగు చిత్ర రంగంలో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. నిజానికి ఊహతెలిసే నాటికే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబాయి కోవెలమూడి సూర్య ప్రకాశరావు గారు గారిని బాపయ్య గారు నాన్నగారు అని పిలుస్తుండేవారు. 

ప్రకాశరావు గారి పిలుపు మేరకు వెళ్లిన బాపయ్య గారు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. డిగ్రీలో చేరబోయేముందు వచ్చిన వేసవి సెలవుల్లో బాపయ్య గారిని ఖాళీగా ఉంచడం ఇష్టంలేని వాళ్ళ నాన్నగారి (కోవెలమూడి సూర్య ప్రకాశరావు) మిత్రుడు కె.బి.తిలక్ వద్ద బాపయ్య గారిని సహాయకుడిగా చేర్పించారు. ప్రకాశరావు గారు తన వద్ద కంటే బయటివారు వద్ద అయితే పని నేర్చుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయనే ఉద్దేశంతో బాపయ్య గారిని తిలక్ గారి వద్దకు చేర్పించారు.

చిత్ర రంగ ప్రవేశం…

కె.బి.తిలక్ గారు కూర్పు (ఎడిటర్) విభాగంలో పనిచేస్తున్న సమయంలో ఆయన వద్ద బాపయ్య గారు ఎడిటర్ గా పనిలో చేరి, ఆయన వద్ద ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి ఎడిటర్ గా ఉన్న కె.బి.తిలక్ గారు అనుకోకుండా మిత్రులతో కలిసి అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి దర్శకులు అయ్యారు. ఆ నిర్మాణ సంస్థలో మొదట తీసిన సినిమా ముద్దుబిడ్డ. బాపయ్య గారు ఇంటర్మీడియట్ చదివుకున్నారు గనుక తనకు దర్శకత్వ శాఖలో పట్టు ఉండాలని కె.బి.తిలక్ గారే బాపయ్య గారిని ప్రోత్సహించి తన వద్ద దర్శకత్వ శాఖలో చేర్చుకున్నారు. వేసవి సెలవులు అయిపోయాయి. అందువలన వాళ్ళ నాన్నగారు ప్రకాశరావు గారు పిలిచి డిగ్రీ సీటు కోసం కొన్ని కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ బాపయ్య గారి ధ్యాసంతా కూడా సినీ విభాగం పైనే ఉంది. దాంతో తనకు చదువు అబ్బడం లేదు.

కె.బి.తిలక్ వద్ద సహాయకుడిగా…

ఒకరోజు కాస్త ధైర్యం తెచ్చుకొన్న బాపయ్య గారు తన నాన్న గారితో “నాకు చదువు మీద కంటే సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉందని” చెప్పారు. డానికి కొద్దిసేపు ఆలోచించిన ప్రకాశరావు గారు సరే అలానే కానిచ్చెయ్ అన్నారు. అలా బాపయ్య గారు నాన్న ప్రకాశరావు గారి ఆశీస్సులతో కె.బి.తిలక్ గారి వద్ద దర్శకత్వ శాఖలో కొనసాగిపోయారు. కె.బి.తిలక్ గారి మొదటి సినిమా “ముద్దుబిడ్డ” విజయవంతం అవ్వడంతో, ఆయన రెండవ సినిమాగా ఎమ్మెల్యే తీశారు. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వ విభాగంలోనూ, కూర్పు (ఎడిటింగ్) విభాగంలోనూ అప్రెంటిస్ గా చేశారు. కేవలం పని నేర్చుకోవడానికి అవకాశం మాత్రమే, అంతే కానీ జీతం ఏమీ ఉండేది కాదు. కె.బి.తిలక్ గారి మూడవ సినిమా “అత్తా ఒకింటి కోడలే”. ఈ సినిమా నుండి బాపయ్య గారికి పని నేర్పడంతో బాటుగా పారితోషికం ఇవ్వడం మొదలుపెట్టారు.

తాపీ చాణక్య వద్ద సహాయ దర్శకుడిగా…

ఈ మూడు సినిమాలు పూర్తయిన తరువాత బాపయ్య గారి నాన్నగారు కె.ఎస్.ప్రకాశరావు గారు తాను సొంతంగా తీసిన “రేణుకా దేవి మహత్యం” సినిమాకి బాపయ్య గారు వాళ్ళ నాన్నగారి వద్దనే సహాయకుడిగా చేరారు. నాన్నగారి బంధువు అయిన భాస్కర రావు గారు (అప్పటికే “బ్రతుకు తెరువు”, “రేపు నీదే” ఇలాంటి సినిమాలు తీసి ఉన్నారు) తీసిన మోహిని రుక్మాంగద చిత్రానికి కూడా బాపయ్య గారు వారి నాన్నగారి వద్దనే పనిచేశారు. అంతలో నాన్నగారు ప్రకాశరావు గారికి స్టూడియో వ్యవహారాల్లో ఒకరకమైన ఒడిదుడుకులు వచ్చాయి.

అందువలన బాపయ్య గారిని తాపీ చాణక్య గారి వద్దకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పంపించారు. అలా చాణక్య గారి వద్ద సహాయకుడిగా చేరిన బాపయ్య గారి మొదటి సినిమా “రాముడు భీముడు” (సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారికి కూడా అదే మొదటి సినిమా). తాపీ చాణక్య గారి వద్ద అలా మొదలై మరికొన్ని సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. అలాగే “సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ” లో “శ్రీకృష్ణతులాభారం”, అలాగే వారి నాన్న గారు దర్శకత్వం వహించిన “స్త్రీ జన్మ” చిత్రాలకి బాపయ్య గారు సహాయకుడిగా పని చేశారు.

  నిరాశను మిగిల్చిన తొలి సినిమా “ద్రోహి”… 

అలా సహాయ దర్శకుడిగా సుదీర్ఘ ప్రయాణం అనంతరం “సురేష్ ప్రొడక్షన్స్” అధినేత రామానాయుడు గారు బాపయ్య గారికి “ద్రోహి” అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం అవకాశం ఇచ్చారు. జగ్గయ్య, దేవిక ప్రధాన పాత్రధారులుగా నటించిన “ద్రోహి”సినిమా 31 డిసెంబరు 1974 నాడు విడుదలైంది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. వాస్తవానికి ఆ సినిమా యొక్క కథ, కథనం, చిత్రీకరించిన విధానం అంతా బాగానే ఉన్నా కూడా ప్రేక్షకుల్ని అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా దర్శకుడిగా బాపయ్య గారికి, నిర్మాతగా రామానాయుడు గారికి,  నిరాశనే మిగిల్చింది. భారీ తారాగణంతో ఆ సినిమా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని తరువాత కొంతమంది బాపయ్య గారికి చెప్పారు.

ఎస్వీ రంగారావు, నందమూరి తారకరామారావు గార్ల లాంటి నటులయితే చిత్రానికి బలం చేకూరేదని చాలా మంది తనతో అన్నారు. భూతకాలాన్ని మార్చలేరు కదా. ఆ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకం తనకు తొలి సినిమా అనుభవంగా ఉపయోగపడింది. ద్రోహి సినిమా పరాజయం తరువాత బాపయ్య గారు తిరిగి వాళ్ళ నాన్నగారి వద్దనే “ప్రేమనగర్” సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఒకసారి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నాక తిరిగి మళ్ళీ సహాయ దర్శకుడిగా వెనక్కి రావడం మనసుకు నచ్చనిదే అయినా తనకు తప్పలేదు. అందులోనూ వాళ్ళ నాన్న గారి దగ్గర కాబట్టి సహాయ దర్శకుడిగా చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. అలా సహాయ దర్శకుడిగా పనిచేసిన “ప్రేమనగర్” సినిమా అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు మళ్ళీ తెలిసిందే.

శారద నటిగా “ఊర్వశి”… 

నిర్మాతగా మారిన నటి వాసంతి బాపయ్య గారికి సినిమా దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. దాంతో తన రెండవ సినిమాగా బాపయ్య గారు “మేము మనుషులమే” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. పాతకాలం కులం కట్టుబాట్లను, అంతస్తుల భేదాలను నిర్మూలించాలని ప్రబోధించే ఉత్తమ చిత్రాన్ని కొత్త తరహాలో ప్రభోదాత్మకంగా చిత్రీకరించారు దర్శకులు కె.బాపయ్య గారు. జగ్గయ్య, కృష్ణంరాజు, జమున, చంద్రమోహన్ గార్లు నటించిన ఆ సినిమా బాగానే ఆడింది. ఆ సినిమా చూసిన నిర్మాత క్రాంతి కుమార్ గారు తాను నిర్మించబోయే “ఊర్వశి” చిత్రానికి దర్శకత్వం చేయమని బాపయ్య గారిని అడిగారు. ఆ చిత్ర కథ తనకి బాగా తెలిసిన కుటుంబాల్లో జరిగిన నిజమైన కథ అని బాపయ్య గారితో చెప్పారు.

సినిమా అంతా పూర్తయ్యాక ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు అంతగా లేవు. వాణిజ్యపరంగా నిరాశను మిగిల్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తోంది అని బాపయ్య గారు నిర్మాత క్రాంతి కుమార్ గారికి చెప్పారు. దానికి బదులుగా కానీయ్యండి బాపయ్య గారు, ఇది మనకు మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది, విజయవంతం అయితే మంచిది, లేదంటే ఒక ఉత్తమ అభిరుచి గల చిత్రాన్ని తీశానన్న సంతృప్తి మిగులుతుంది అని క్రాంతికుమార్ గారు అన్నారు. ప్రయత్నం లోపం లేకుండా బాపయ్య గారు శారద గారు నటించిన “ఊర్వశి” ని మంచి సినిమాగా తీర్చిదిద్దారు.

ఊర్వశి సినిమా నిర్మాణ సమయంలో పరిచయమైన నటి “శారద” గారి ద్వారా నిర్మాత రామకృష్ణారెడ్డి గారు తన మొదటి సినిమాకు దర్శకత్వం చేయమని బాపయ్య గారి దగ్గరికి వచ్చారు. రంగనాథ్, శారద గార్లు నాయక, నాయికలుగా నటించిన “వైకుంఠపాళి” అనే చిత్రం బాపయ్య గారికి నాలుగో సినిమా. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో బాపయ్య గారి స్థానం చిత్ర పరిశ్రమలో సుస్థిరమైపోయింది.

వెనువెంటనే రెండు సినిమాలు..

బాపయ్య గారి సినీజీవితం లో మరుపురాని అనుభవం అంటే ఓకేసారి రెండు సినిమాలకు చిత్రీకరణ చేయడం. అప్పటికే నందమూరి తారకరామారావు గారు వయస్సు మళ్ళిన పాత్రలలో నటిస్తూ వస్తున్నారు. “తాతమ్మకల”, “బడిపంతులు” లాంటి సినిమాలలో వయస్సు మళ్ళిన హుందా పాత్రలు పోషించారు. దసరా బుల్లోడు లాంటి సినిమాతో అక్కినేని నాగేశ్వరావు గారు కథనాయకుడిగా వెలుగుందుతున్నారు. ఆయనను అక్కున చేర్చుకున్న ప్రేక్షకులు నందమూరి తారకరామారావు గారిని కూడా ఆమోదిస్తారన్నది బాపయ్య గారి అభిప్రాయం. ఆ ఉద్దేశ్యంతోనే నిర్మాత అశ్వినీదత్ గారు మొదటిసారి సినిమా తీద్దామని బాపయ్య గారి నాన్నగారి వద్దకు వచ్చినప్పుడు ఆయనతో ఇదే విషయం చెప్పి నందమూరి తారకరామారావు గారితో డాన్సులు చేసే స్కోప్ ఉన్న యువ హీరో కథ తయారు చేసుకున్న విషయం బాపయ్య గారు చెప్పారు.

వృద్ధుపాత్రల నుండి యువ పాత్రలవైపు ఎన్టీఆర్…

ఎక్కడో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఆ కథను వ్రాసుకున్నారు బాపయ్య గారు. ఆ సినిమా చిత్రీకరణ మొదలైంది. చిత్రీకరణ మొదటిరోజు మొదటి పాట తీశారు. సన్నివేశం ఏమిటంటే గుడిసెలని కబ్జా చేద్దామని వచ్చిన రౌడీలని ఎన్టీఆర్ గారు తరిమేస్తారు. దానికి ఆనందపడిన ఆ గుడిసెలు వాసులు రామారావు గారిని పైకి ఎత్తేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అక్కడ ఒక పాట వస్తుంది. నటి వాణిశ్రీ గారితో పాటు ఎన్టీఆర్ గారు కూడా స్టెప్పులు వేస్తూ డాన్స్ చేయాలి. అప్పుడు ఎన్టీఆర్ గారు “ఏం బ్రదర్ నేను స్టెప్ వేయడమేంటి? నేను, జనాలు కూర్చొని చూస్తుంటే వాణిశ్రీ బృందం డాన్స్ చేసినట్టు తీయొచ్చు కదా” అన్నారు. దానికి బదులుగా బాపయ్య గారు “ఈ సినిమాతో ప్రేక్షకులు ఊహించని యాక్షన్ చూపించి మీలో కొత్త ఎన్టీఆర్ ని వాళ్లు చూసుకునేలా చేయాలనేది నా ప్రయత్నం.

వాణిశ్రీ డాన్స్ చేయడం ప్రేక్షకులకు కొత్తగా ఏమి ఉండదండి వాళ్ళకు అది అలవాటే. అయితే వాళ్ళు ఊహించని విధంగా మీరు కూడా డాన్స్ వేసేస్తే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు, థ్రిల్ గా ఉంటుంది” అని వివరించారు. దానికి ఒక్క క్షణం పాటు ఆలోచించి “సరే బ్రదర్ నేను సిద్ధమే” అని చిత్రీకరణకు వెళ్లారు. అలా మొదలైంది “ఎదురులేని మనిషి” పాటల చిత్రీకరణ. పాటల వరకు అయిన ఫిల్మ్ ను ల్యాబ్ కి పంపించి ప్రాసెస్ చేయించిన బాపయ్య గారు, అదంతా రామారావు గారికి చూపించారు. అప్పుడు ఎన్టీఆర్ గారు తన సొంత సినిమా “వేములవాడ భీమకవి” సినిమా చిత్రీకరణ లో ఉన్నారు. తన డాన్సులు చూసుకున్నాక ఎన్టీఆర్ గారికి థ్రిల్ గా అనిపించింది.

బెల్ బాటమ్ పాయింట్లతో ఎన్టీఆర్…

సినిమా మిగతా పాటలో కూడా కొత్తరకం దుస్తులు, బెల్ బాటమ్ పాయింట్లు. రామారావు గారు సరికొత్త గెటప్ లో హుషారుగా నటించేశారు. అయితే సినిమా నిర్మాణం జరుగుతున్నంత సేపు మద్రాసులో చిత్ర పరిశ్రమలో విపరీతమైన ప్రతికూల వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. బాపయ్య గారు రామారావు గారితో స్టెప్పులు వేస్తున్నారట. సినిమా కచ్చితంగా నష్టాల్ని మిగులుస్తుంది అన్నారు. ప్రతీరోజు కొత్త కొత్త రకం దుస్తులతో చిత్రీకరణ నుండి నేరుగా ఇంటికి వెళుతుంటే, ఇంట్లో వాళ్ళు కూడా ఈ వయస్సులో మీకు ఈ వేషాలు అవసరమా అంటున్నారు అని ఎన్టీఆర్ గారు చెప్పేవారు. కానీ నిర్మాత అశ్వినీదత్ గారికి మాత్రం “ఎదురులేని మనిషి” విజయం మీద సంపూర్ణ విశ్వాసం ఉండేది. ఎదురులేని మనిషి సినిమా పూర్తయిన తరువాత బాపయ్య గారు ఆ సినిమాను వాళ్ళ నాన్న గారు ప్రకాశరావు గారికి చూపించారు. దానికి మెచ్చుకున్న ప్రకాశరావు గారు సినిమా ప్రివ్యూలు ఎక్కువగా వేయొద్దు ప్రతికూల సమీక్షలు ఎక్కువ అవుతాయని సలహా ఇచ్చారు.

వారం తేడాలో రెండు సినిమాలు విడుదల…

ఇదిలా ఉండగా మరోవైపు “సోగ్గాడు” సినిమా చిత్రీకరణ జోరుగా సాగుతోంది. దానికి నిర్మాత రామానాయుడు గారు. విజయా నాగిరెడ్డి గారి కోసం “ఎదురులేని మనిషి” ప్రివ్యూ షో వేస్తున్నప్పుడు ఆ సినిమాను రామానాయుడు గారు కూడా చూశారు. బాపయ్య గారు సోగ్గాడు సినిమా చివరిదశలో ఆడియో మిక్సింగ్ లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి తనకు ఆ విషయం చెప్పారు.  కచ్చితంగా ఈ సినిమా వారం కంటే ఎక్కువ ఆడదని నిర్ణయానికి వచ్చిన రామానాయుడు గారు “సోగ్గాడు” సినిమాని “ఎదురులేని మనిషి” విడుదలకు కచ్చితంగా వారం తరువాత ఖరారు చేశారు. 05 డిసెంబరు 1975 “ఎదురులేని మనిషి” విడుదల అయితే 12 డిసెంబరు 1975 నాడు “సోగ్గాడు” విడుదలకి సిద్ధమైంది. ఒకటి లక్ష్మీ ఫిలిమ్స్ ది, మరొకటి నవయుగ వాళ్ళది. సోగ్గాడు విడుదలను వాయిదా వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ థియేటర్స్ బుక్ అయిపోయి ఉండడంతో వీలు కాలేదు.

ఎదురులేని మనిషి సిల్వర్ జూబ్లీ…

ఎదురులేని మనిషి సినిమా విడుదల సమయం దగ్గరకొచ్చింది. సాధారణంగా బాపయ్య గారు తన సినిమాలు విడుదల రోజునాడు చూసే అలవాటు లేదు. ఆ రోజు బాపయ్య గారు, అశ్వినీ దత్ గారు మద్రాసు లో ఉన్నారు. వాళ్ళ సహాయకులు అందరూ ముందు రోజు రాత్రి కారులో బయలుదేరి ఉదయం 9:30కు ఆట కోసమని నెల్లూరు వెళ్లారు. అయితే 9:30 కంటే ముందుగానే ఉదయం 7 గంటలకే ఒక ఆట వేసేశారు. బాపయ్య గారి సహాయకులు సినిమా థియేటర్ కు వెళ్లేసరికి జనాలు అంతా థియేటర్ లో నుంచి ఈలలు వేసుకుంటూ బయటికి వచ్చి, మళ్లీ తొమ్మిదిన్నర ఆటకి టికెట్ల కోసం వరుసలో నిలుచున్నారట. ఆంధ్రరాష్ట్రమంతటా అదే ట్రెండ్ అలా మొదలైంది. మొదటిరోజు మొదటి ఆటతోనే మొదలైన “ఎదురులేని మనిషి” ప్రభంజనం సిల్వర్ జూబ్లీ దాకా సాగింది.

విజయవంతమైన సోగ్గాడు సినిమా…

“ఎదురులేని మనిషి” సినిమా విడుదలైన వారం రోజులకు “సోగ్గాడు” సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా వసూళ్లు తొలిరోజు నెమ్మదిగా ఉన్నా, తరువాత ఊపందుకున్నాయి. సోగ్గాడి పికప్ పై శతదినోత్సవం చిత్రంగా శోభన్ బాబు గారి నటన జీవితంలో ఒక మరుపురాని చిత్రంగా ఘనవిజయం సాధించింది.  ఎదురులేని మనిషి శతదినోత్సవ సభలో ఎన్టీ రామారావు గారు మాట్లాడుతూ “ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నంత సేపూ నాకు అనిపిస్తూ ఉండేది, ఈ డ్రెస్సులు ఈ స్టెప్పులు వేస్తూ శోభన్ బాబు, కృష్ణలాంటి యువ హీరోలతో పోటీ పడగలనా అనిపించేది. అయితే యూనిట్ అంతా యువకులే, దర్శకుడు మరీ యువకుడు. దాంతో వాళ్ళ ఉత్సాహాన్ని కాదనడం ఎందుకులే అని వాళ్ళని ప్రోత్సహిస్తూ నా శాయాశక్తుల కృషిచేసి కొత్తదనాన్ని చూపించాను. ఈ సినిమా విజయవంతం అయితే 60 ఏళ్ల వరకు ఇంకా వృద్ధ పాత్రలు వెయ్యకూడదని అనుకున్నాను. అది ఇప్పుడు నా విషయంలో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ జంట సినిమాల విజయం తర్వాత బాపయ్య గారికి, రామారావు గారికి, శోభన్ బాబు గారికి చిత్రసీమలో చాలా సంవత్సరాల వరకు ఎదురు లేకుండాపోయింది.

హిందీ చిత్రరంగ ప్రవేశం…

నిర్మాత రామానాయుడు గారు “సోగ్గాడు సినిమాను హిందీలో “దిల్దార్” అనే పేరుతో నిర్మిస్తూ బాపయ్య గారిని దర్శకుడిగా పెట్టుకున్నారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారి దర్శకత్వంలో హిందీ “ప్రేమనగర్” చిత్రీకరణ జరిగేటప్పుడు దానికి బాపయ్య గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అందువలన బాపయ్య గారికి “దిల్దార్” సినిమా కంటే ముందే హిందీ చిత్ర రంగంలో పరిచయం ఉంది. దిల్దార్ సినిమా విజయం తరువాత రామానాయుడు గారికే దిల్ ఔర్ దీవార్ (1978 తీశారు. ఆ తరువాత పద్మాలయ ప్రొడక్షన్స్ వారికి “దేవుడు చేసిన మనుషులు” హిందీ వర్షన్ “టక్కర్” తీశారు. ఇది పద్మాలయ ప్రొడక్షన్స్ వారికి మొదటి హిందీ సినిమా. అంతా భారీ తారాగణంతో తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

ఆ తరువాత మరొకసారి రామానాయుడు గారికి “బందిష్” అనే సినిమా చేశారు. ఇలా వరుస విజయాలు రావడంతో హిందీలో అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. బాపయ్య గారు దాదాపు 40 వరకు హిందీ చిత్రాలకు దర్శకత్వం చేశారు. అలా కొన్నేళ్లు హిందీ, తెలుగు రెండు భాషల్లోనూ సమాంతరంగా అనేక సినిమాలు చేస్తూవచ్చారు. వాటిలో ఎక్కువశాతం రెండు చోట్ల ఘనవిజయాలు సాధించాయి. తెలుగులో బాపయ్య గారి చివరి సినిమా 1987లో విడుదలైన “మావూరి మగాడు”. తనకు హిందీలో అవకాశాలు ఎక్కువ అవ్వడంతో బాపయ్య గారికి రెండు పడవల మీద ప్రయాణం కష్టం అనిపించింది. ఆ తరువాత కేవలం హిందీ మీదే దృష్టి కేంద్రీకరించారు.

సినీరంగ విరమణ..

బాపయ్య గారు దర్శకుడిగా హిందీలో చివరి సినిమా 1995లో వచ్చిన “దియా అవుర్ తుఫాన్”. అప్పటికే తరాలు మారాయి. “కొత్త ట్రెండ్ మొదలైంది. ధర్మేంద్ర, జితేంద్ర లాంటి వాళ్ళు తరంలో నటులందరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్లకు ఉండే విలువలు, మనుషులంటే గౌరవం అంతా ఒక బంగారు శకం. గోవిందా, మిథున్ చక్రవర్తి లాంటి వాళ్లు కూడా మొదటి రోజు దర్శకుడి కాళ్లకు దండం పెట్టి గానీ సెట్ లోకి వెళ్లేవారు కాదు. అదే తరువాత తరం వచ్చేసరికి వాళ్లంతా గోల్డెన్ స్కూన్ తో వచ్చిన వాళ్ళు. వాళ్లకు దర్శకులుగా వాళ్ళ వయస్సు ఉన్నవాళ్లే కావాలని అనుకుంటున్నారు. మారిన ఈ పరిస్థితుల్లో నాకే హుందాగా రిటైర్ అవుదాం అనిపించింది. 1995 తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్నాను” అని బాపయ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Show More
Back to top button