మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘గీతాంజలి’. అప్పట్లో ఎన్నో అవార్డులను సాధించిన ఈ మూవీ ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి ముందు కవిత్వాన్ని చదవడం మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ, కవిత్వంతో వెండితెర మీద సినిమాను తీయొచ్చని మణిరత్నం నిరూపించారు. మణిరత్నం హాలీవుడ్ మూవీ అయినా “డైయింగ్ యంగ్” అనే సినిమా ప్రేరణతో ఒక కథను సిద్ధం చేసుకుని సినిమా తీయాలనుకున్నారు. సినిమాకు ఏం పేరు పెట్టాలి..? అని ఆలోచిస్తున్నప్పుడు..
ఢిల్లీకి చెందిన 11ఏళ్ల గీతాంజలి అనే అమ్మాయి క్యాన్సర్‌తో బాధపడుతూ తన మానసిక వేదనను ఒక పుస్తకంగా రాసింది. ఆ పుస్తకం చదివిన మణిరత్నం తాను రాసుకున్న కథకు టైటిల్ ‘గీతాంజలి’ అని పెట్టాలని ఫిక్స్ అయ్యారు. 1988 అక్టోబర్ 12న ఊటీలో గీతాంజలి షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో అత్యధిక భాగాన్ని ఊటీలోనే షూట్ చేశారు. ఊటీలో ఉన్న ప్రకృతి సోయగాలను ప్రేక్షకుల కంటికి అద్భుతంగా, ఎంతో ఇంపుగా ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్ చూపించారు. సుమారు 60 రోజుల్లో పూర్తయిన ఈ సినిమాకు అప్పట్లోనే రూ. కోటి వరకు ఖర్చయింది. 1989 మే 12న 42 ప్రింట్లతో గీతాంజలి విడుదలైంది.
‘గీతాంజలి’ విడుదలైన తొలి వారం రోజులు కలెక్షన్లు చప్పగా సాగిన.. తర్వాత అసలైన ప్రభంజనం మొదలైంది. ఏ వైపుకి చూసిన గీతాంజలియే టాపిక్. కంటిన్యూగా మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో చూసిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలో నాగార్జున డీ గ్లామరైజ్‌గా కనిపిస్తారు. కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి పాత్ర చేయడమంటే సాహసమనే చెప్పాలి. కానీ, నాగార్జున ఆ పాత్రలో ఎంతో అవలీలగా నటించి యువతరం మనసులను దోచుకున్నారు. ఈ సినిమా మరింత సక్సెస్ కావడానికి ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు మరో కారణమయ్యాయి.
ఈ సినిమాలో నాగార్జున చెప్పిన చావు డైలాగ్ ఓ గొప్ప సత్యంగా కన్పిస్తుంది. ఈ సినిమా 7 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. అంతేకాకుండా, 1989లో ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్, కథారచయితగా మణిరత్నం, హాస్యనటుడిగా సుత్తివేలు, డాన్స్ మాస్టర్‌గా సుందరం మాస్టర్, కళాదర్శకునిగా తోట తరణిలు నంది అవార్డులను సాధించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా గీతాంజలి స్వర్ణ కమలంను పొందింది. తర్వాత ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో అనువదించగా అక్కడ కూడా ఘన విజయాలను నమోదు చేసింది.