CINEMATelugu Cinema

తెలుగు వెండితెరపై సహజ నటనకు మారు పేరు.. జయసుధ..

కురిసే చినుకు చేసే ధ్వనికి ప్రత్యామ్నాయం లేదు, ఆ చినుకుకు తడిసిన మట్టి వాసనకు ప్రత్యామ్నాయం లేదు, విరిసే పువ్వు చూపే సొగసుకు ప్రత్యామ్నాయం లేదు, ఆ పూవు వెదజల్లే సువాసనకు ప్రత్యామ్నాయం లేదు, సెలయేటి అందానికి, కోకిల గానానికి, నెమలి నాట్యనికి, చీకటి మౌనానికి, పక్షుల కిలకిలలకి, చివరికి కారే కన్నీటి చుక్కకూ ప్రత్యామ్నాయం లేనే లేదు. ఎందుకంటే అవన్నీ సహజసిద్దమైనవి, ప్రత్యేకమైన అలంకారాలు అవసరం లేనివి, అనుకరించడానికి వీలు కానివి. జయసుధ కూడా సినీ పరిశ్రమకు ప్రత్యామ్నాయం లేనివారు. ఆ రకంగానే చిత్ర పరిశ్రమలో నిలబడ్డారు. తనకు ప్రత్యామ్నాయం సాధ్యం కాని విధంగా ముద్రవేశారు. నటన కోసం తాను ప్రత్యేకంగా కష్టపడలేదు. ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకమైన పాఠాలనూ తాను నేర్వలేదు. ఆమె నటి కావడం అనేది ఒక సహజమైన పద్ధతి. సహజమైనది ఏదైనా సహజసిద్ధంగా ఉంటుంది. జయసుధ నటన నిన్నటికి, రేపటికి, ఎప్పటికీ స్థిరమైనది.

ఆడపిల్లకు చెప్పలేని హద్దులుంటాయి. పెళ్లి, కాపురం, పిల్లలు అంటూ ఇళ్లకే పరిమితం అయ్యే పరిస్థితి ఉన్న రోజుల్లో జయసుధ గారు జన్మించారు. కానీ తన అదృష్టం కొద్దీ ఆ పరిస్థితుల ప్రభావం తన మీద పడలేదు. స్వేచ్ఛని హరించే హద్దులు కూడా తన ఎదుగుదలకు అవరోధం కాలేదు. దానికి కారణం జయసుధ గారి నాన్న గారు రమేష్ చందర్ గారు. జయసుధ గారి నాన్న తరుపు వారంతా బ్రహ్మ సమాజానికి చెందినవారు. దాంతో వారి ఇంటి వాతావరణం మిగతావారి కంటే భిన్నంగా ఉండేది. కులమతాల ప్రస్తావన ఉండేది కాదు. ఎక్కువ తక్కువ అన్న తారతమ్యాలు లేవు. ఆడ మగ అన్న లింగ బేధాలు తెలియవు. జయసుధ గారి అమ్మ నాన్నలది కులాంతర వివాహం. బంధువుల్లో ఎక్కువ శాతం వేరే కులస్తుల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. జయసుధ గారి అత్తయ్య పిల్లలైతే బ్రిటిష్ వారిని పెళ్లి చేసుకున్నారు. కులమత లింగ వివక్షలు అంటే ఏమిటో తెలియని అలాంటి ప్రపంచంలో పుట్టి ఆనందంగా పెరిగారు జయసుధ గారు.

జయసుధ గారు సహజమైన నటనకు ప్రతిరూపం, అపూర్వమైన అభినయానికి తాను ప్రతిబింబం. అప్పుడే విరిసినట్టుగా అనిపించే కళ్లు, జలతారు మీటినట్టుగా అనిపించే నవ్వు. మనసులపై మంత్రంలా ప్రభావం చూపే ప్రత్యేకమైన గొంతు జయసుధ గారి స్వంతం.  ప‌దమూడేళ్ళ వ‌యస్సులోనే చిత్ర పరిశ్ర‌మలోకి అడుగుపెట్టిన జయసుధ గారు త‌న స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1972లో వ‌చ్చిన “పండంటి కాపురం” సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన జయసుధ గారు అన‌తి కాలంలోనే అప్ప‌టి అగ్ర క‌థానాయ‌కుల‌తో జోడీ క‌ట్టి అగ్రకథానాయిక గా వెలుగొందారు. ఐదు ద‌శాబ్ధాల పాటు తాను న‌టిగా ఎన్నో వైవిధ్య భ‌రిత పాత్రలు పోషించి చిత్ర పరిశ్రమలో త‌న కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర‌చుకున్నారు.

గుణచిత్ర నటిగా తల్లి, అత్త, అమ్మమ్మ లాంటి పాత్రలలో నటిస్తూ తీరిక లేని నటిగా కొనసాగుతున్న జయసుధ గారు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తున్నారు. అల్లరి, ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, విరహం,  విన్నపం, విషాదం. ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారలా జయసుధ కలిసి పోయారు. ప్రేక్షకుల మనసు పాత్రలోకి తాను మంచుబిందువులా జారిపోయారు. “అడవిరాముడు”, “అనురాగదేవత”, “ప్రేమాభిషేకం”, “మేఘసందేశం”, “శక్తి”, “భార్యామణి”, “ఇల్లాలి కోరికలు”, “కటకటాల రుద్రయ్య”, “త్రిశూలం”, “గృహప్రవేశం” వంటి చిత్రాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. నవరసాలనే నిధులు జయసుధ గారి కళ్లలో నిక్షిప్తమై ఉన్నాయనే విషయాన్ని సుస్పష్టం చేస్తాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం   :    జయసుధ

ఇతర పేర్లు    :    సుజాత 

జననం    :    17 డిసెంబరు 1958  

స్వస్థలం   :    మద్రాసు

వృత్తి      :   నటి, రాజకీయ నాయకుడు

పదవి      :      శాసనసభ్యులు, సికింద్రాబాదు  (2009–2014)

తండ్రి       :     రమేష్ చందర్

తల్లి      :     జోగాబాయి 

జీవిత భాగస్వామి :    నితిన్ కపూర్

పిల్లలు      :   నిహార్, శ్రేయాన్

నేపథ్యం

జయసుధ గారు 17 డిసెంబరు 1958 నాడు తమిళనాడులోని మద్రాసులో నిడుదవోలు రమేష్ చందర్, జోగా బాయి లకు జన్మించారు. జయసుధ అసలు పేరు సుజాత నిడుదవోలు. సుజాత పుట్టింది పెరిగింది మద్రాసు లోనే. నాన్న రమేష్ చందర్ మద్రాసు కార్పొరేషన్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేసేవారు. అమ్మ జోగాబాయి గృహిణి. ఆమె చిన్నప్పుడు బాలానంద సంఘంలో సభ్యురాలు. ప్రముఖ దర్శకులు కే.బి.తిలక్ గారు ఒక సినిమాలో జోగాబాయి మరి కొందరు పిల్లల చేత ఒక పాటలో నటింప చేశారు. సుజాత తల్లి జోగా బాయి బాలానందం (1954), కాళహస్తి మహత్యం (1954) వంటి చిత్రాలలో గుణచిత్ర నటిగా నటించారు. దాంతో సుజాత వాళ్ళ అమ్మ నటి అనే ప్రచారం జరిగింది. నిడుదవోలు రామేశ్వరరావు, జోగా బాయి దంపతులు తెలుగు మాట్లాడే కుటుంబానికి చెందినవారు. వారి కుటంబంలో సుజాత నే పెద్ద. తనకు ఇద్దరు తమ్ముళ్లు మరియు ఒక చెల్లెలు (నటి సుభాషిని). తెలుగు సినిమా నటి మరియు దర్శకురాలు విజయనిర్మల గారు సుజాత తండ్రికి దగ్గరి బంధువు. సుజాత యొక్క తాత ప్రముఖ పండితుడు మరియు సాహిత్య చరిత్రకారుడు, నిడుదవోలు వెంకటరావు. చిన్నప్పుడు సుజాతకు పెద్దగా చదువు పెద్దగా వంట పట్టలేదు. దాంతో నటి విజయనిర్మలతో పాటు సుజాత కూడా సినిమా చిత్రీకరణకు వెళ్ళేది.

సినీ రంగ ప్రవేశం…

బాలనటిగా…

నటి విజయనిర్మల గారు జయసుధ గారికి బంధువు అవ్వడం వలన తనకు చిన్నప్పుటి నుండి సినిమా వాతావరణం తెలుసు. తాను సరిగ్గా పన్నెండు ఏళ్ల వయస్సులో అంటే 1972లో కృష్ణగారి “పండంటి కాపురం” లో బాలనటిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో జయసుధ గారు జమున గారికి కూతురుగా నటించారు. ఆ సినిమా జయసుధ గారికి తన జీవితంలో తొలి మలుపు. పండంటి కాపురంలో జయసుధ గారి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఒక ప్రక్క సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇంకో ప్రక్కన వాళ్ళ నాన్నగారు జయసుధ గారిని చదువుకోమని చెప్పారు. సంవత్సరం గడిచినా కానీ  తన చదువులో ఎలాంటి మార్పు లేదు.

కథానాయిక తొలి సినిమా “అపూర్వ రాగంగళ్”…

అదే సమయానికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. అనేక సినిమాలలో చెల్లెలు పాత్రలో నటించారు. బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో జయసుధ గారు కమల్ హాసన్ గారికి చెల్లెలుగా నటించారు. వీరిద్దరూ కలిసి హిందీ సినిమా “ఆయేనా” లో కూడా బాల నటులుగా కలిసి పని చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత బాలచందర్ గారు అపూర్వ రాగంగల్ (1975) సినిమా తీశారు. ఇందులో కమలహాసన్, జయసుధ, శ్రీవిద్య ముఖ్య భూమికలు పోషించారు. ఈ సినిమా తమిళంలో అద్భుతమైన విజయం సాధించింది. ఇదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు గారు “తూర్పు పడమర” పేరుతో తీశారు.

మలుపు తిప్పిన “జ్యోతి” సినిమా…

ఆ సినిమాలో నటి మాధవి గారు తమిళంలో జయసుధ పాత్రను వేశారు. ఇక తెలుగులో కథానాయిక గా జయసుధ గారికి తొలి అవకాశం వచ్చింది “లక్ష్మణ రేఖ”. ఈ సినిమా జయసుధ గారి సినీ జీవితాన్ని మలుపు తిప్పలేకపోయింది. ఆ తర్వాత తాను కే.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో జ్యోతి అనే చిత్రంలో నటించారు. జయసుధ గారి జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. అప్పుడు తన వయస్సు 17 సంవత్సరాలు. ఈ సినిమా చూసిన అక్కినేని నాగేశ్వరావు గారి సతీమణి అన్నపూర్ణ గారు సావిత్రి తర్వాత అంత సహజంగా నటించింది ఈ అమ్మాయే. తప్పకుండా పైకి వస్తుందని అక్కినేని గారికి జయసుధ గారి గురించి కితాబిచ్చారు.

సుజాత నుండి “జయసుధ” గా.. 

జయసుధ గారు నటించిన జ్యోతి విజయవంతం అయ్యింది. దాంతో ఆమె అవకాశాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం రాలేదు. నిజానికి జయసుధ గారి అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళం నుంచి “సుజాత” అనే నటి ఉన్నారు. ఓకే పేరు మీద ఇద్దరు కథానాయికలు ఉండడం సరికాదని తన పేరు మార్చాలని తమిళ దర్శకుడు గుహనాథన్ అనుకున్నారు. అప్పుడంతా జయ హవా నడుస్తుంది. కాబట్టి సుజాత పేరును జయసుజ గా మార్చాలి అనుకున్నారు. పలకడానికి “జయసుజ” కన్నా “జయసుధ” బాగుంటుందని అనిపించడంతో అదే పేరును ఖరారు చేశారు.

దాసరి దర్శకత్వంలో అత్యధిక సినిమాలు…

జయసుధ గారు అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. జయసుధ గారి సమకాళీనులు,  సహచరులు జయప్రద, శ్రీదేవి గార్లు జయసుధ కన్నా అందంగా ఉండేవారు. కనుక వారికి గ్లామర్ పాత్రలు లభించేవి. జయసుధ గారిని నటనకు ఆస్కారమున్న పాత్రలకు ఎక్కువగా తీసుకునేవారు. కాబట్టి తెలుగు చిత్ర సీమలో జయసుధ గారికి మాత్రమే రకరకాల పాత్రలు చేసే అవకాశం లభించింది. తాను చేసినన్ని పాత్రలు ఏ కథానాయిక కూడా చేయలేదు. “కలియుగ స్త్రీ” లో రోడ్డు ప్రక్కన బీడీలు తాగే వేశ్యగా, “సీతే రాముడైతే” లో మగవాడిలాగే సిగరెట్ తాగుతూ ఇలా సుమారు 300 సినిమాల్లో వివిధ రకాల భిన్నమైన పాత్రలను పోషించారు. దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో 26 సినిమాలలో జయసుధ గారు కథనాయికగా నటించారు.

విశ్రాంతి లేని నటిగా…

1985 లో ఏడాది పట్టాయ బీచ్ లో జరిగిన ప్రమాదం జయసుధ గారి జీవితాన్ని మరో మలుపు తిప్పింది.  నీళ్లలో తాను మునిగిపోతుండగా తనకు హఠాత్తుగా జీసస్ కనిపించాడు. జయసుధ గారు బ్రతికి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి జీసస్ దీవెనలు కారణమని ఆమె బలంగా నమ్ముతారు. నిజానికి జయసుధ గారు నటిగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఇప్పటిదాకా రాలేదు. తన భర్త నిర్మాతగా మారడంతో  అనేక సినిమాలు తీశారు. “కలికాలం” అంటే సినిమాలో జయసుధ గారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే జయప్రద, శ్రీదేవి లాంటి అందాల తారలు ఉన్నప్పటికీ ఒక పత్రిక నిర్వహించిన సర్వే లో జయసుధ గారినే సూపర్ స్టార్ గా ఎంపిక చేశారు.

అప్పటివరకు ఏడుపు పాత్రలు, డీ గ్లామర్ పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న తనకు “ఆంటీ” అనే సినిమా సరికొత్త పేరును తీసుకువచ్చింది. “మనీ మనీ” లాంటి సినిమాలు తనను యువతరానికి దగ్గర చేశాయి. జయసుధ గారు తన 40వ సంవత్సరంలో తన సినీ ప్రస్థానం సరికొత్త మలుపులు తిరిగింది. రకరకాల పాత్రలు వేయడానికి ఈ సినిమాలే తనకు ఎనలేని ఉత్సాహం అందించాయి. తన తొలి అడుగులు తమిళంలో పడ్డప్పటికీ తాను నడక నేర్చుకుని ప్రేక్షభిమానాన్ని చురగొన్నది తెలుగు చిత్రసీమలోనే. 36 సంవత్సరాలుగా తనను అభిమానిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎన్నో సినిమాలలో తల్లిగా నటించినప్పటికీ వారు బోర్ గా భావించకుండా “అమ్మా నాన్న తమిళ అమ్మాయి” లో తన పాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తన సినీ ప్రస్థానంలో మరో మలుపు.

శోభన్ బాబు తో అత్యధిక సినిమాలలో…

జయసుధ గారు తన సినీ జీవితంలో అనేక పురస్కారాలతో పాటు ప్రేక్షకుల అభిమాన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక పర్యాయాలు నంది పురస్కారాలను, ఐదు సార్లు ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. శోభన్ బాబు గారి సరసన అత్యధికంగా 31 సినిమాలలో నటించారు. నిజానికి జయసుధ గారు సినిమాల్లోకి వచ్చిన మూడు, నాలుగేళ్లకు నటించడం మానేయాలి అనుకున్నారు. కానీ దైవ సంకల్పమో లేక ప్రేక్షకుల అభిమాన బలమో తెలియదు గాని ఇన్నేళ్లపాటు తెరపై వివిధ పాత్రలను పోసిస్తున్నట్లుగా జీవితాన్ని కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలలో జీవితాలను సమాతూకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

వ్యక్తిగత జీవితం…

జయసుధ గారి మొదటి వివాహం సినీ నిర్మాత వడ్డే రమేష్ గారి బావమరిది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్‌ గారితో జరిగింది. అయితే ఆ వివాహం విడాకులతో ముగిసింది. జయసుధ గారు దాసరి గారితో పని చేస్తున్నప్పుడు ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసే నితిన్ కపూర్ ఏర్పడిన పరిచయమే ప్రేమకు దారి తీసింది. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ 1985లో జయసుధ, నితిన్ కపూర్ ల వివాహం జరిగింది. నితిన్ కపూర్‌ నటుడు జీతేంద్రకు బంధువు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారులు నిహార్ (1986లో జన్మించారు) మరియు శ్రేయాన్ (1990లో జన్మించారు). నితిన్ కపూర్ అనారోగ్య కారణాల వల్ల 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జయసుధ గారు ఆ తర్వాత ఆమె ఒక విదేశీయుడిని మూడవ వివాహం చేసుకున్నారు.

పురస్కారాలు…

★ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్…

1976 వ సంవత్సరానికి గానూ జ్యోతి (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.

1977 వ సంవత్సరానికి గానూ ఆమె కథ (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు.

1982 వ సంవత్సరానికి గానూ గృహప్రవేశం (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని పొందారు.

1976 వ సంవత్సరానికి గానూ జ్యోతి (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.

2004 వ సంవత్సరానికి గానూ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు.

2008 వ సంవత్సరానికి గానూ కొత్త బంగారు లోకం (తెలుగు) సినిమా కు గానూ ఫిల్మ్‌ఫేర్ సహాయ నటిగా పురస్కారాన్ని పొందారు.

2010 వ సంవత్సరంలో తెలుగు చిత్రసీమ కు చేసిన సేవకు గానూ ఫిల్మ్‌ఫేర్ సౌత్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్) పురస్కారాన్ని దక్కించుకున్నారు.

★ నంది అవార్డులు…

1976 వ సంవత్సరానికి గానూ జ్యోతి (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1979 వ సంవత్సరానికి గానూ ఇది కథ కాదు (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు.

1981 వ సంవత్సరానికి గానూ ఇదిప్రేమాభిషేకం (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.

1982 వ సంవత్సరానికి గానూ మేఘసందేశం (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

1983 వ సంవత్సరానికి గానూ ధర్మాత్ముడు (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని పొందారు.

★ ఇతర అవార్డులు..

1982 వ సంవత్సరానికి గానూ మేఘసందేశం (తెలుగు) సినిమా కు గానూ ఉత్తమ నటిగా కళాసాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.

2007 వ సంవత్సరానికి గానూ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని దక్కించుకున్నారు.

2008 వ సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ అసోసియేషన్ – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని పొందారు.

2008 వ సంవత్సరానికి గానూ ANR జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

రాజకీయ నేపథ్యం…

జయసుధ గారు సుమారు 300లకు పైగా సినిమాలలో నటించారు. అందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో జయసుధ గారు నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ గారు నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. జయసుధ గారు 2001లో బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి తాను ఇటీవల ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. జయసుధ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు శాసనసభ్యులు గా గెలుపొందారు. ఆ తరువాత టిడిపిలోకి చేరారు. 2018 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్న జయసుధ గారు 03 ఆగస్టు 2023  నాడు బీజేపీ పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.

విశేషాలు…

★ విజయనిర్మల బంధువైన జయసుధ గారు కృష్ణ గారికి చెల్లెలు వరుస అవుతుంది. అందుకని చాలాకాలం పాటు తనని కృష్ణ ప్రక్కన ఎవ్వరూ కథనాయికగా తీసుకోలేకపోయారు. దాంతో విజయనిర్మల గారు సాహసం చేసి 09 ఏప్రిల్ 1982 నాడు విడుదలైన డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రక్కన జయసుధను నటింపజేశారు.

★ జయసుధ గారు తన సినీ ప్రస్థానంలో ఎక్కువ కృష్ణంరాజు గారితో జోడిగా ఎక్కువ సినిమాలలో నటించారు.  అమరదీపం (1977) తో వీరి కలయికలో సినిమా మొదలుపెట్టారు.

★ చంద్రమోహన్ గారితో కూడా జయసుధ గారు ఎక్కువ సినిమాలు చేశారు. చంద్రమోహన్ గారి సినీ కెరీర్ తొలినాళ్ళలో శ్రీదేవి, జయప్రద గార్లు ఇద్దరు చంద్రమోహన్ కు జోడిగా చేశారు. అగ్రతారలుగా పేరు సంపాదించుకున్నాక మాత్రం వాళ్ళు చంద్రమోహన్ తో నటించడం దూరమయ్యారు. జయసుధ గారు ఒక్కరే మొన్నటివరకు తనకు జోడిగా నటిస్తూనే వచ్చారు. పక్కింటి అమ్మాయి, సత్యభామ, గోపాలరావు గారి అమ్మాయి, కలికాలం, శ్రీమతి ఒక బహుమతి, అల్లరి పెళ్ళాం, చిల్లర మొగుడు,  రేపటి కొడుకు తదితర చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి..

★ శ్రీదేవితో కలిసి జయసుధ గారు చాలా సినిమాలు చేశారు. ముద్దుల కొడుకు, బంగారు తల్లి, ఊరంతా సంక్రాంతి, గజదొంగ, ఇల్లాలు, ప్రేమాభిషేకం ఇలా…

★ జయప్రద, జయసుధ గార్ల కలయికలో అయితే సుమారు పాతిక సినిమాలు వచ్చాయి. అడవి రాముడు, రామకృష్ణుడు, శ్రీవారి ముచ్చట్లు, మహాసంగ్రామం, బంగారు కాపురం, నాయుడు బావ, జీవిత నౌక, తాండ్రపాపారాయుడు వాటిలో కొన్ని..

★ విజయశాంతి, రాధిక, సుహాసిని, రాధా లాంటి నటీమణుల హవా మొదలయ్యే సమయానికి జయసుధ గారు ఓ బిడ్డకు తల్లి అయ్యారు. 1985లో తన రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 1995లో ఆమె మూడవ ఇన్నింగ్స్ మొదలెట్టారు. 1993 జూన్ నెలలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడు మూడు రకాలు. జూన్ నాలుగో తేదీన విడుదలైన బావ బామ్మర్ది లో సంప్రదాయిక గృహిణి పాత్ర పోషిస్తే, జూన్ 11 వచ్చిన మనీ మనీ లో ఆధునిక స్త్రీ గా కనిపించారు. ఇక జూన్ 18న విడుదలైన ఇన్స్పెక్టర్ ఝాన్సీలో పక్కా మాస్ పాత్రలో నటించారు.

★ జయసుధ గారు తన సినీ ప్రస్థానంలో వేరే వారి గాత్రంతో నటించిన సినిమా ఎన్టీఆర్ గారి “వెంకటేశ్వర కళ్యాణం”. ఇది పౌరాణిక చిత్రం. అందులో పదాలను పలకడం కాస్త కష్టం అవ్వడంతో ఆ పాత్రకు ఎన్టీఆర్ గారు వేరే వారితో సంభాషణలు చెప్పించారు.

★ చిరంజీవి గారితో జయసుధ గారు నాలుగు సినిమాలు చేశారు. ఇది కథ కాదు, మగధీరుడు, రిక్షావోడు, హ్యాండ్సప్. జయసుధ గారు తానే సొంతంగా నిర్మించిన హ్యాండ్సప్ లో చిరంజీవి గారు అతిథి పాత్రలో నటించారు.

★ జయసుధ తల్లి జోగాబాయి బాలనటిగా ఓ సినిమా చేశారు దర్శక, నిర్మాత కే.ఎస్.ప్రకాష్ రావు గారు. బాలానందం సభ్యులతో బాలల చిత్రం చేశారు. అప్పుడు జోగాబాయి “బాలనందం”లో సభ్యురాలు. ఆమె అలా సినిమాలో కనిపిస్తారు.

★ జయసుధకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చెల్లెలు సుభాషిణి సినిమాలలోకి వచ్చారు. కానీ తమ్ముళ్ళు సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన “బ్రహ్మముడి” లో తమ్ముడు శ్రీనాథ్ హీరోగా నటించారు. ఆ తర్వాత మళ్లీ తాను నటించలేదు.

★ జయసుధ తన 14వ సంవత్సరంలో శంకు మార్కు లుంగీ కి మోడల్ గా చేశారు. అలాగే లక్స్ సోప్ కి మోడలింగ్ చేశారు. మద్రాసులో జన్మించి, మద్రాసు వాతావరణంలో పెరగడం వలన జయసుధ గారికి తెలుగు చదవడం, వ్రాయడం రాదు. అప్పటికే సుజాత అనే పేరుతో వేరే నటి ఉండటంతో తమిళ దర్శకుడు గుహనాథన్ ఆమె పేరును “జయసుధ” గా మార్చాడు.

Show More
Back to top button