Telugu Cinema

శంకరాభరణం శంకరశాస్త్రి… జె.వి.సోమయాజులు..

అభినయం అనేది రెండు రకాలు. కొందరు నటనను వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే, మరికొందరు దానిని ఒక అలవాటుగా చేసుకుని బ్రతికేస్తుంటారు. మొదటి కోవకు చెందిన వారు శంకరాభరణం శంకరశాస్త్రి జె.వి.సోమయాజులు గారు. గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు. ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). సోమయాజులు గారికి ఈ మూడు సరిగ్గా సరిపోయాయి.

దేవతలు అమృతం తాగడం వల్లే మరణం లేకుండా నిత్య యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటారని పురాణాలు చెబుతాయి. కానీ వాటికి ఆధారాలు లేవు. తెలుగు సినిమా నిత్య సజీవంగా ఉండటానికి అప్పుడప్పుడు “శంకరాభరణం” లాంటి వెండితెర అమృతాలు అరుదుగా వస్తుంటాయి. శంకరశాస్త్రి లాంటి అద్భుతమైన పాత్రలు కూడా అరుదుగానే వస్తుంటాయి. అందుకే తరాలు మారినా సాంకేతికత అభివృద్ధి చెందినా వాటికి కాల దోషం ఉండదు. చూసిన ప్రతిసారి అద్వితీయమైన పులకరింతను కలిగిస్తాయి. పరవశాల డోలికల్లో మనల్ని ముంచెత్తుతాయి. అనిర్వచనీయమైన అనుభూతిని పదే పదే ఆస్వాదించాలంటే శంకరాభరణంను చూడాల్సిందే.

డిప్యూటీ కలెక్టరు ఉద్యోగాన్ని తోసిరాజని, తన అమోఘమైన నటనా చాతుర్యంతో పాత్రలను రక్తి కట్టించేస్తూ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు వ్రాయించేసుకున్న ఘనులు జె.వి. సోమయాజులు గారు. శంకరాభరణం లో శంకర శాస్త్రి గా, త్యాగయ్య లో త్యాగరాజు గా, సప్తపది లో యాజులు పాత్రలో ఇలా అనేకమైన గుర్తింపు ఉన్న పాత్రలలో నటించి ఎనలేని కీర్తి గడించారు జె.వి. సోమయాజులు గారు. 24 ఏప్రిల్ నాడు తన వర్థంతి సందర్భంగా తనని ఒక్కసారి స్మరించుకుందాం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    జొన్నలగడ్డ వెంకట సోమయాజులు

ఇతర పేర్లు  :   శంకరాభరణంలో శంకరశాస్త్రి , త్యాగయ్యలో త్యాగరాజు

జననం    :   30 జూలై 1928

స్వస్థలం   :   శ్రీకాకుళం జిల్లా , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశంలో

తండ్రి   :  వెంకట శివరావు

తల్లి    :   శారదాంబ

వృత్తి      :    సినిమా నటుడు, రంగస్థల కళాకారుడు

మతం     :    బ్రాహ్మణ హిందూ

ఉద్యోగం    :     డిప్యూటీ కలెక్టరు..

పిల్లలు   :   మురళీకృష్ణ

బంధువులు  :   జెవి రమణ మూర్తి (సోదరుడు

మరణం   :  27 ఏప్రిల్ 2004

జననం..

శంకరాభరణం శంకరశాస్త్రి గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ నటులు జె.వి.సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సోమయాజులు) గారు 30 జూన్ 1928 నాడు శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శారదాంబ, వెంకట శివ రామ మూర్తి లు. ఈయన సోదరుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి.రమణమూర్తి. సోమయాజులు గారి తండ్రి జె.వి. శివ రామ మూర్తి  ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్.  జె.వి. శివ రామ మూర్తి గారికి అయిదుగురు అబ్బాయిలు , ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు గారు రెండో సంతానమైతే, జె.వి.రమణమూర్తి గారు నాలుగో సంతానం.

నాటకరంగం లో కళాకారునిగా…

జె.వి.సోమయాజులు గారు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో తన కుటుంబం  ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), భారత స్వాతంత్య్ర సంగ్రామం, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని తట్టుకుని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. తొలిసారిగా విజయనగరంలో  20 ఏప్రిల్ 1953 ‘కన్యాశుల్కం’ వేశారు.

అప్పటినుండి మొదలుకొని 22 సెప్టెంబర్  1995 ఆఖరు ప్రదర్శన వరకు సుమారు 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ నాటకాన్ని కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. సోమయాజులు గారితో పాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు.

ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి, ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు గారు. దీని తర్వాత ఆంధ్రనాటక కళా పరిషత్తు లో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు. ఆత్మవిశ్వాసం తో పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవారు..

తొలి రోజులలో రంగస్థలం  పై…

సోమయాజులు గారు, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశారు. అది సోమయాజులు గారి తొలి నాటక నటనానుభవం. ఆ తర్వాత సోమయాజులు గారు తన తమ్ముళ్ళు రమణమూర్తి గారు, శ్రీ రామ మూర్తి గార్ల తో కలిసి “కవిరాజు మెమోరియల్ క్లబ్” స్థాపించారు.  ఆత్రేయ “ఎన్జీఓ”, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ – ఇలా ఎన్నెన్నో నాటకాలు పట్టుదలగా, ఉత్సాహంగా వేసేవాళ్ళు. ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు గారు ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్.

ఉదయం నుండి సాయంత్రం వరకు  కార్యాలయంలో ఉండేవారు. కాబట్టి, రిహార్సల్స్ ఇబ్బందిగా ఉండేది. అందుకే సోమయాజులు గారు భోజనం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉన్న రమణమూర్తి గారు స్క్రిప్టు చదివి వినిపించేవారు అవన్నీ బాగా గుర్తు పెట్టుకొనేవారు. సోమయాజులు గారు తన సోదరుడు రమణమూర్తి గారితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం “కన్యాశుల్కాన్ని” 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో “రామప్ప పంతులు” పాత్రకు సరిగ్గా సరిపోయారు.

సోమయాజులు  గారిని తన తల్లి శారదాంబ వారిని ప్రోత్సహించింది.

చలన చిత్ర పరిశ్రమలో….

శంకరాభరణం సినిమాలో “శంకరశాస్త్రి” పాత్రతో ప్రసిద్ధుడయిన సోమయాజులు గారు “వంశవృక్షం”, “త్యాగయ్య” వంటి చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమయాజులు గారి కి మరుపురాని అనుభూతినిచ్చింది. తాను నటించిన త్యాగయ్య , వంశవృక్షం సినిమాలలో తనను బాపు, రమణ గార్లు ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అని పలుమార్లు చెప్పుకొచ్చారు సోమయాజులు గారు.

త్యాగయ్య చిత్రం ఆర్థికంగా నష్టపోయినా సోమయాజులు గారికి నటుడిగా మంచి  గుర్తింపును తీసుకొచ్చింది. “శంకరాభరణం”, “సప్తపది”, “వంశవృక్షం”, “పెళ్ళీడు పిల్లలు”, “సితార”, “స్వాతిముత్యం”, “దేవాలయం”, “విజేత”, “తాండ్ర పాపారాయుడు”, “శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం”, “కళ్యాణ తాంబూలం”, “ఆలాపన”, “ప్యార్ కా సింధూర్” (హిందీ), “మగధీరుడు”, “చక్రవర్తి”, “స్వయంకృషి”, “ఇడు నమ్మ అలు”, “స్వరకల్పన”, “ప్రతిబంధ్ (హిందీ)”, “అప్పుల అప్పారావు”, “ఆదిత్య 369”, “రౌడీ అల్లుడు”, “అల్లరి మొగుడు”, “ముఠా మేస్త్రీ”, “గోవిందా గోవిందా”, “సరిగమలు”, “కబీర్ దాస్”, “ఒండగోన బా” చిత్రాల్లోనూ నటించారు.

దురదర్శిని ప్రసారం కోసం కన్యాశుల్కాం నాటకాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించారు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి “రసరంజని” అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి జె.వి. సోమయాజులు గారు స్థాపించారు.

రాత్రికి రాత్రే స్టార్ హోదా…

రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు సోమయాజులు గారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన ‘రాధాకృష్ణయ్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా కూడా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. “శంకరాభరణం” (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ప్రతీ ఇంటిలోనూ పాటలు మారుమ్రోగేసరికి రాత్రికి రాత్రి గొప్ప నటుడైపోయారు సోమయాజులు గారు.

శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా సోమయాజులు గారు ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీని తర్వాత 150 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో సోమయాజులు గారు ముఖ్యపాత్ర పోషించినా కూడా ఈ చిత్రంకు వచ్చిన రాలేదు.

అలాగే “సప్తపది” చిత్రానికి కూడా ఆయన ప్రతిభకు సరైన గుర్తింపు తీసుకురాలేదు. ‘వంశవృక్షం’ సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి కొంతమంది ఫిర్యాదు చేశారు. చెన్నారెడ్డి గారే ఆ  సినిమా ను స్వయంగా చూసి, ఇలాంటి వారు మన ప్రభుత్వ అధికారి గా ఉండటం మన అదృష్టం అని, ప్రత్యేకంగా సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులు గారిని నియమించారు.

శంకరాభరణం లో శంకర శాస్త్రి గా…

సరిగ్గా 44 ఏళ్ళ క్రితం 1979 లో శంకరాభరణంలో శంకర శాస్త్రి గా అభినయించిన సోమయాజులు గురించి, అందులోని పాత్రల గురించి.. 

ఏంటి ఈ సినిమాలో ఎవరికి తెలియని ఓ ముసలాయన హీరోనా ? “

” హవ్వ, వేశ్య పాత్రను హీరోయిన్ గా చూపించడం ఏమిటో విడ్డూరం కాకపోతే “

” 12 పాటలు పెడితే ఎవడు చూస్తాడు స్వామి “

” శాస్త్రీయ సంగీతం మీద కథనా, నిర్మాత ఎవరో పాపం “

” మసాలాలు లేకుండా తీస్తారా, ఏంటి ఇండస్ట్రీలో ఉండాలనే “

ఇలాంటి వ్యాఖ్యనాలు, కథనాలు ఎన్నో వినాల్సి వచ్చింది దర్శక, నిర్మాతలు. కానీ కథ, కథనం ముందు ఆ మాటలన్నీ తేలిపోయాయి.

అంత గొప్ప కథేముంది ఇందులో ?

ఇది సినిమాగా తీద్దామని ఎవరైనా కథగా చెబితే రచయితని పైనించి కింది దాకా ఎగాదిగా చూడటం ఖాయం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన శంకర శాస్త్రి సాంఘిక ఉద్దేశాలకు వ్యతిరేకంగా తల్లి చేసే వృత్తి ససేమిరా ఇష్టం లేని ఓ వేశ్య కూతురికి అండగా నిలబడతాడు. అప్పటికే బలాత్కారానికి బలైన ఆమె తనవల్ల శంకర శాస్త్రి గారికి అప్రతిష్ట రాకూడదని భావించి దూరంగా వెళ్ళిపోతుంది. కాలచక్రంలో శంకరశాస్త్రి గారి వైభవం తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల్లో పడతారు.

జీవం పోసిన పాత్రలు…

నిజానికి శంకరాభరణంలో గొప్ప కథ కన్నా మహోన్నతమైన పాత్రలు ఉన్నాయి. అవి ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దారులు వేస్తాయి. మనం చూసిందే ప్రపంచం, మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటూ ఈగోల మధ్య పోరులో నిత్యం ఓడిపోయే మనం అసలు మనిషిగా బ్రతకాలంటే కావాల్సిన ప్రాధమిక లక్షణాలు ఏమిటనేవి ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. ఇందులో నేల విడిచి సాము చేసే గారడీ కమర్షియల్ అంశాలు ఉండవు. గుండెను సుతిమెత్తగా తాకే సన్నని దారపు పోగు లాంటి భావోద్వేగాలు ఉంటాయి. ఇందులో సగటు తెలుగు సినిమా హీరో హీరొయిన్లు ఉండరు. మన ఎదురింట్లోనో పక్క వసారాలోనో నిత్యం మనకు ఎదురయ్యే సగటు మనుషులు ఉంటారు. కానీ ఈ సినిమాకు స్థంభాల్లాంటి ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకరు శంకర శాస్త్రి, మరొకరు తులసి.

శంకరశాస్త్రి…

విశిష్ట వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. తనను ఇంతవాడిని చేసిన సమాజం కుల కట్టుబాట్ల పేరుతో నిలదీస్తున్నా తాను చేసింది తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన పనిలేదన్న ధృడ నిశ్చయం ఎంతటి వాడికైనా స్పూర్తినిస్తుంది. పాశ్చ్యాత సంగీత హోరులో సంప్రదాయానికి తూట్లుపడి తన జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారినా నమ్మిన విలువలు వదిలి పెట్టకుండా కళాసరస్వతికి జీవితాన్ని అంకితం చేసిన చరితార్ధుడు శంకరశాస్త్రి. అందరూ పాప పంకిలంగా భావించే పడుపు కుటుంబానికి చెందిన యువతిని చేరదీసి మానవత్వానికి అర్థం చెప్పిన మహోన్నతుడు. ఆచార వ్యవహారాల పేరిట ఇంట్లో వాళ్ళతో సహా ఊరంతా కాకులై పొడుస్తున్నప్పుడు చెక్కు చెదరకుండా తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్ళే శాస్త్రి ప్రయాణం ఎందరి గమ్యానికో దారి చూపుతుంది. చివరి శ్వాస వరకు సంగీతానికే అంకితమైపోయి రాజీ లేని బ్రతుకుకు సరైన నిర్వచనం చెబుతుంది.

సప్తపది (1981)….

ముందుగా చెప్పినట్టుగా చిత్రానువాదం ఈ సినిమాకి బలం అనిపిస్తుంది. విశ్వనాథ్ గారి చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీసిన సినిమా సప్తపది. ఏ బ్రాహ్మణ కులమైతే మిగతా కులాలను చిన్నచూపు చూస్తుందో అందులో ఉన్న వ్యక్తే , తన మనమరాలిని వేరే కులం వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయడం ఈ సినిమా కథ. మనుషుల కన్నా కులాలు ముఖ్యం కాదని నిరూపించడానికి చేసిన ప్రయత్నం. జె.వి. సోమయాజులు, సబిత, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రలు చేశారు. ఇది కూడా సంగీతం, నృత్యం ప్రధానంగా ఉండే చిత్రం.

చిత్రానువాదం తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. కె.వి.మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఆపాత మధురాలే. సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాథ్ గారికే చెల్లింది. “అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ”, “ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ” లాంటి చమక్కులు చూపారు వేటూరి. “గోవుల్లు తెల్లన” పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండలేము. జంధ్యాల పదునైన సంభాషణలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి.. సోమయాజులు గారు ఈ చిత్రంలో కూడా మహాద్భుతంగా నటించారు.

జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అనేక అవార్డులని గెలుచుకుంది. వర్ణ వ్యవస్థ గురించి సంభాషణలోను, పాటలలోను అనేక తత్వచింతనలు జొప్పించారు. అల్లు రామలింగయ్యకు, సోమయాజులుకు జరిగిన సంభాషణలలో వృత్తి ధర్మం, మనో ధర్మం గురించిన అభిప్రాయాలున్నాయి.

సృష్టి ఆదిలో లేకున్నా మధ్యలో పుట్టుకొచ్చిన వర్ణవ్యవస్థ గురించి వేటూరి పాటలలో చక్కని ప్రశ్నలున్నాయి.

ఆదినుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

నడిమంత్రపు మనుషులకే ఈ మాటలు, ఇన్ని మాటలు..

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మావాడేలెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్ర ధనుసౌతాది

అన్ని వర్ణాలకూ ఒకటే ఇహము పరముంటాయి

తెల్లావు కడుపున కర్రావులుండవా

కర్రావయ కడుపున ఎర్రావు పుట్టదా..

జె.వి.సోమయాజులు గారి పాక్షిక చిత్రాల జాబితా…

శంకరాభరణం (1979)

సప్తపది (1980)

వంశవృక్షం (1980)

పెళ్ళీడు పిల్లలు (1982)

సితార (1983)

స్వాతిముత్యం (1985)

దేవాలయం (1985)

విజేత (1985)

తాండ్ర పాపారాయుడు (1986)

శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)

కళ్యాణ తాంబూలం (1986)

ఆలాపన (1986)

ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)

మగధీరుడు (1986)

చక్రవర్తి (1987)

స్వయంకృషి (1987)

ఇడు నమ్మ అలు (1988)

స్వరకల్పన (1989)

ప్రతిబంధ్ (హిందీ) (1990)

అప్పుల అప్పారావు (1991)

ఆదిత్య 369 (1991)

రౌడీ అల్లుడు (1991)

అల్లరి మొగుడు (1992)

ముఠా మేస్త్రీ (1993)

గోవిందా గోవిందా (1993)

సరిగమలు (1994)

కబీర్ దాస్ (2003)

ఒండగోన బా (2003)

మరణం…

సోమయాజులు గారు 27 ఏప్రిల్ 2004లో తన 76వ ఏట  గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. ఒక్కొక్కరు ఒక్కో పాత్ర కోసం పుట్టారా అనిపించేటట్టుగా శంకర శాస్త్రి పాత్ర కోసమే సోమయాజులు గారు పుట్టినట్లు కనిపిస్తుంది. “రాధా కృష్ణయ్య” తోనే తొలి పాత్రధారణ చేసినా కూడా శంకరాభరణం తోనే విఖ్యాతులైనారు. నాటకరంగం సినిమా రంగానికి పెట్టిన “బిక్ష” లో సోమయాజులు గారు. నాటకాల పోటీలు నడిపిన పలు పరిషతుల్లో చాలా సార్లు “ఉత్తమ నటుడు”  అవార్డులు అందుకున్నారు.

Show More
Back to top button