Telugu Cinema

వెండి తెర సంగీత సాహిత్యాభినవ త్రివేది.. సి.యస్.ఆర్ ఆంజనేయులు..

నాటక చలనచిత్ర రంగాలకు వారధిగా నిలిచిన ప్రతిభావంతుడైన నటులు చిలకలపూడి సీతారామాం ఆంజనేయులు (సి.ఎస్.ఆర్). తాను నట సవ్యసాచి, స్వతహాగా మేధావి, కుశాగ్రబుద్ధి, విద్యావంతుడు, పాత్రలో పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. ప్రేక్షకులను తన నటనతో మైమరిపింపజేసి తన వశం చేసుకొని ప్రశంసల వర్షం కురిపించుకోగల ప్రజ్ఞావంతుడు.

నాటక రంగంతో పాటు, రెండున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో కూడా వివిధ పాత్రలను ఎంతో ఉదాత్తంగా పోషించి, ప్రసిద్ధ రంగస్థలం గాయకుడిగా, అత్యుత్తమ గుణ చిత్ర నటుడుగా పురోగమించారు ఆంజనేయులు గారు. సి.ఎస్.ఆర్ ధరించిన పాత్రలలో ఒక పాత్రను మరొక పాత్రకు నటనలో సారూప్యం ఉండేది కాదు. ఏ పాత్రకు ఆ పాత్ర యొక్క ప్రత్యేకత నిలబెట్టుకునేది. తాను అత్యుత్తమ గాయకుడు. ఏనాడు ఏ నటుడిని, ఈ పాటని, ఏ అభినయాన్ని అనుకరించలేదు. స్వయంకృషితో, స్వీయ ప్రతిభతో, సృజనాత్మక శక్తితో, వివిధ కోణాలను ప్రతిభావంతంగా పాత్రను మలుచుకొని ప్రతీ పాత్రను ఉన్నత శిఖరాలకు ఎక్కించారు.

1950 లలో లో వచ్చిన మాయాబజార్, దేవదాసు, కన్యాశుల్కం, అప్పుచేసి పప్పుకూడు లాంటి చిత్రాలలో తన ప్రత్యేక నటనే తనను గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. సి.ఎస్.ఆర్ గారు “గృహప్రవేశం” లో గిరీశం లాంటి పాత్ర, “మాయాబజార్” లో శకుని, “దేవదాసు” లో పార్వతి భర్త, “కన్యాశుల్కం” లో రామప్ప పంతులు, “జయం మనదేరా” లో మతిమరుపు రాజా, “అప్పుచేసి పప్పుకూడు” లో అప్పులు చేయడంలో ప్రాథమిక సూత్రాలు నేర్పిన పెద్దమనిషి, “కన్యాదానం” లో పెళ్లిళ్ల పేరయ్య, “పరమానందయ్య శిష్యులు” లో పరమానందయ్య పాత్ర, ఇవన్నీ కూడా సి.ఎస్.ఆర్ గారి లోని విలనీ కి, కామెడీకి ప్రధాన సూత్రాలు.

పాత్రలలోని నిడివితో సంబంధం లేకుండా పాత్ర స్వభావాన్ని, హావభావాన్ని ప్రత్యేకంగా మలుచుకొని తన సొంత సంతకాన్ని నిలబెట్టుకున్న విలక్షణ నటులు సి.ఎస్.ఆర్ గారు. ఈ సినిమాల కంటే ముందుగా రాముడు, కృష్ణుడు, తుకారం, నారదుడు, వెంకటేశ్వర స్వామి లాంటి సినిమా ప్రధాన పాత్రలు ధరించారు. అంతకుముందు 15 సంవత్సరాల క్రితం రంగస్థలం మీద ఆయన ధరించని పాత్ర లేదని తక్కువ మందికి తెలిసుంటుంది.

సి.ఎస్.ఆర్ గారికి నాటక రంగం పుట్టినిల్లు అయితే, చలనచిత్ర రంగం మెట్టినిల్లు. నాటక రంగమైన పుట్టినిల్లు వదిలి మెట్టినిల్లు మద్రాసులో స్థిరపడ్డా కూడా అప్పుడప్పుడు పుట్టింటికి చుట్టం చూపుగా వస్తూ ఉండేవాడిని అని సి.ఎస్.ఆర్ గారు అంటుండేవారు. నాటక సినిమా రంగాలలో మకుటం లేని మహారాజుగా బాసించిన ప్రతిభావంతుడు సి.ఎస్.ఆర్ గారు ఒక్కరే. చిలకలపూడి సీతారామాంజనేయులు అన్న సుదీర్ఘమైన పేరు కుదిరించబడి పొడి అక్షరాలతో సి.ఎస్.ఆర్ అన్న పేరు వారికి చిరస్థాయి అయిపోయింది.

సి.ఎస్.ఆర్ గారి పద్య పఠనం ఒక ప్రత్యేకత. పద్యాన్ని పదవిభాగం చేసి, విరిచి పాడడంలో తనకు తానే సాటి. పద్యం పాడుతూనే మధ్య మధ్య వచనం కల్పించి తిరిగి పద్యాన్ని ఎత్తుకోవడంలో ప్రేక్షకులను అచ్చెరువొందించేవారు. ఈ విషయంలో తనకు సరితోడు ఉజ్జీ మరొకరు లేరు. ఆ విధంగా సి.ఎస్.ఆర్ బాణీని, ఒక విశిష్టతను నాటి నాటక రంగంలో సార్థకం చేసుకున్నారు. కేవలం పాటలతో, పద్యాలతో, నాటకాలలోని పాత్రలను రక్తి కట్టించే సమయంలో పాటకు, నటనకు తగిన అభినయాన్ని, పాత్రోచిత వాచికాన్ని సమస్థాయిలో నడపడం వల్లనే చిరకాలం అన్ని స్థాయిలలో కాలంతోపాటు ఉత్తమ నటుడిగా మనగలిగారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    చిలకలపూడి సీతా రామాంజనేయులు

ఇతర పేర్లు  :    సి.యస్.ఆర్. ఆంజనేయులు

జననం    :   11 జూలై 1907 

స్వస్థలం   :     నరసరావుపేట

నివాసం   :    మద్రాసు 

వృత్తి      :    నటుడు

పిల్లలు    :    నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు

మతం    :    హిందూ మతం

మరణ కారణం  :   సహజ మరణం

మరణం    :  8 అక్టోబరు 1963 మద్రాసు

జననం…

11 జులై 1907 తేదీన ప్లవంగ నామ సంవత్సర అశ్వయుజ శుద్ధ పాడ్యమి ఉదయం తొమ్మిది 09:30

నిమిషాలకు “చిలకపూడి సీతారామాంజనేయులు” (సి.ఎస్.ఆర్) గారు నరసరావుపేట లో జన్మించారు.

సి.ఎస్.ఆర్ గారి తండ్రి గాయకులు హరి ప్రసాద్ రావు గారికి వీరాభిమాని.

ఆ రోజులలో హరి ప్రసాద్ రావు గారు “హరిచంద్ర”, “సారంగధర” పాత్రలకు పెట్టింది పేరు.

హరి ప్రసాద్ రావు గారు ఆంధ్ర నట పితామహుడు. సి.ఎస్.ఆర్ గారి తండ్రి గారికి జ్యోతిష్యం తెలుసు.

తన కొడుకు మహానటుడు అవుతారని, తనను తానే కాకుండా కుటుంబాన్ని కూడా గొప్పగా పోషించగలరని భావించి, తాను ఉద్యోగాన్ని విరమించి.

కొడుకుని కోఆపరేటివ్ సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగం నుంచి విరమింపజేసిన “జ్ఞానచక్షువు”.

ప్రోత్సాహపూరితమైన ఆ తండ్రి ఆశీస్సులే సి.ఎస్.ఆర్ గారిని  “కళాపోషణ”లో మహానటుడుగా చిరకీర్తిని అందుకునేలా చేశాయి.

బాల్యం…

సి.యస్.ఆర్ గారు చిన్నప్పుడు మాష్టారు గారి ప్రోత్సాహంతో “మర్చంట్ ఆఫ్ వెనిస్” నాటకంలో షైలాక్ గా, బొబ్బిలి యుద్ధంలో బుస్సీ గా నటించారు. సి.ఎస్.ఆర్ గారి బంధువులు, స్నేహితులతో బాటు తన తండ్రి గారితో సహా సి.యస్.ఆర్ చేత చిన్నతనంలో చిరుతిళ్ళు (తిను బండారాలు) తినిపించి మరీ తనివితీరా పద్యాలు పాడించుకునేవారు. పాఠశాల విద్య పూర్తయిన సి.ఎస్.ఆర్ తన 17వ ఏట “రాధాకృష్ణ” అనే నాటకంలో మొదటిసారి “శ్రీకృష్ణ” పాత్ర ధరించి నాలుగు దశాబ్దాల పాటు తరగని తన నటనా వైదుష్యంతో చివరి వరకు రసజ్ఞులని రంజింపజేశారు. సి.ఎస్.ఆర్ గారు “శ్రీకృష్ణ” పాత్ర ప్రశంసనీయంగా ఉండడానికి అంగసౌష్టవం గల తన నిండైన విగ్రహం, స్పురద్రూపం, కనుముక్కు తీరు ఆ రోజులలో నటుడికి అవసరమైన కమ్మని కంఠం ప్రధాన కారణాలైనాయి.

నాటకాలు…

సి.ఎస్.ఆర్ ఆంజనేయులు సంగీత, సాహిత్యాభినయ త్రివేణి. ఆలస్యమైనా కూడా తాను “శ్రీకృష్ణ” పాత్ర ధరించి అప్పటికే కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన “స్థానం నరసింహారావు” గారి సరసన చేరి   సమర్ధుడు అనిపించుకున్నారు. స్థానం (సత్యభామ), టి.రామకృష్ణ శాస్త్రి (నారదుడు), రఘురామయ్య (రుక్మిణి), వంగర వెంకట సుబ్బయ్య (వసంతకుడు), సి.ఎస్ ఆర్ (శ్రీకృష్ణ) పాత్ర ఒక మేలు కలయికగా ఉండేది ఆ రోజుల్లో. ఆరు పాత్రలు మాత్రమే ఉండే ఆ నాటకంలో పద్యాలు కోకొల్లలు గా ఉండేవి. ప్రతీ పాత్రకు కొద్దిగా పని ఉన్న నాటకం అది.

రాష్ట్రమంతటా, మైసూర్ మొదలైన ఇతర రాష్ట్ర ప్రాంతాలలోనే కాకుండా రంగూన్ లాంటి ఇతర దేశాలలో కూడా ఆ “రాధాకృష్ణ” నాటకాన్ని వీళ్ళు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. తెలుగువారి ఉత్తమ నాటకం “శ్రీకృష్ణ తులాభారం”. అందులో కూడా “శ్రీకృష్ణుడి”గా సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, సత్యభామగా స్థానం నరసింహారావు లు నటించడం ఆ రోజులలో చాలా గొప్ప విశేషం. ఆ కారణంగానే ఆ కాలాన్ని తెలుగు నాటక “స్వర్ణ యుగం” గా భాసిల్లింది.

చిత్ర రంగ ప్రవేశం…

శ్రీకృష్ణ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న సి.ఎస్.ఆర్ గారికి సరస్వతి టాకీసు వారు 1936లో తీసే “ద్రౌపది వస్త్రాపహరణం” సినిమాలో “శ్రీకృష్ణ” పాత్రకు అవకాశం వచ్చింది. అందులో యడవల్లి, దొమ్మేటి, కన్నాంబ, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, సింహాద్రి నాగరాజా రావు, రామతిలకం మొదలైన వారు ఇతర ప్రధాన పాత్రలు. సి.ఎస్.ఆర్ గారికి అందరికన్నా అధికంగా 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు. అలా అధిక పారితోషికం తో ఆరంభమైంది . సి.ఎస్.ఆర్ గారి సినీ జీవితం. అంతకు ముందే 1933 వ సంవత్సరంలో తీసిన “రామదాసు” లో సి.ఎస్.ఆర్ గారి శ్రీరాముడు పాత్ర కొన్ని కారణాల వల్ల వెలుగు చూడలేదు.

సి.ఎస్.ఆర్ గారి గురించి విన్న దర్శక, నిర్మాత హెచ్.ఎం.రెడ్డి గారు  “శ్రీకృష్ణరాయబారం” సినిమా తీయాలని సి.ఎస్.ఆర్ గారిని అడిగితే పద్యానికి 500 రూపాయలు చొప్పున చెల్లించమన్నారట. దాంతో “నీకు ఇచ్చేది పారితోషికం తో ఒక సినిమా తీయొచ్చు అనడంతో అది ఆగిపోయింది. మొత్తం మీద “ద్రౌపది”లో సి.ఎస్.ఆర్ గారికి శ్రీకృష్ణ పాత్ర ఖాయమైంది. అయితే పోటీగా కావాలి గుప్త గారు “ద్రౌపది మాన సంరక్షణ” తీయడం ప్రారంభించారు. అందులో యడవల్లికి పోటీగా బళ్ళారి రాఘవ, సి.ఎస్.ఆర్ కి పోటీగా బందా.

ఈ ఆరోగ్యకరమైన పోటీలో “ద్రౌపది వస్త్రాపహరణం” విజయం సాధించింది. సి.ఎస్.ఆర్ కి అఖండ కీర్తి లభించింది. వైశ్రాయి కూడా సినిమా చూశారు. అధిక వ్యయ ప్రయాసలతో తీసిన ఆ చిత్రం తో సి.ఎస్.ఆర్ గారు సినిమాలలో స్థిరపడిపోయారు. అయినా సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు తప్ప ఎక్కువ సినిమాలు రాలేదు. సి.ఎస్.ఆర్ కు “భవాని శంకరుడు”గా చింతామణి నాటకంలో మంచి పేరు ఉండేది. బిల్వమంగళుడుగా బందా, చింతామణి గా స్థానం, సుబ్బిశెట్టిగా గండికోట జోగినాదం, శ్రీహరిగా సూరవరపు వెంకటేశ్వర్లు ఆ నాటకానికి మంచి పేరు తెచ్చారు.

స్థానం సి.ఎస్.ఆర్ పోటీపడి నటించేవారు. సందర్భానుసారంగా సమయస్ఫూర్తితో జనరంజకంగా వారి స్వకపోల కల్పనతో కూడిన చతురోక్తులతో ఆ రోజులలో రసజ్ఞులను మైమరపింప చేసినా తర్వాత ఆ సాంప్రదాయం వెర్రి తలలు వేసి ఆ నాటకానికి కొంత అపకీర్తి తెచ్చిపెట్టింది. సి.ఎస్.ఆర్ సారంగధరుడు, స్థానం చిత్రాంగిగా సారంగధర నాటకం మంచి పేరు తెచ్చుకుంది. సి.ఎస్.ఆర్ సంగీత సాహిత్యాభినయాలను మేలవించి జనం ముక్కు మీద వేలు వేసుకునేటట్టు చేసేవారు. స్థానానికి తాను భర్తగా “శ్రీకృష్ణతులాభారం” లో, విటుడిగా చింతామణిలో, పుత్రుడిగా సారంగధర లో నటించి కీర్తినార్జించారు.

సి.ఎస్.ఆర్ గారికి సతీసావిత్రి లో సత్యవంతుడు పాత్ర, బొబ్బిలి యుద్ధం లో విజయరామరాజు పాత్ర, కన్యాశుల్కంలో గిరిశం పాత్ర పేరు తెచ్చినాయి. సి.ఎస్.ఆర్ గారు వేసిన రామదాసు పాత్ర బళ్లారి రాఘవ గారి ప్రశంసలను పొందింది. నేను పాడలేను, నువ్వు పాడుతానన్నావు ఇకనుంచి ఆ పాత్ర నువ్వే వేయాలని ఆశీర్వదించి రాఘవ గారు ఆ అవకాశం సి.ఎస్.ఆర్ గారికి కల్పించారు. కళాపోషకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు గారి కోరిక మేరకు “హరిజన హృదయం” దృష్టితో సి.ఎస్.ఆర్ గారి తండ్రి సుబ్రహ్మణ్యం గారితో “పతిత పావన” నాటకం వ్రాయించి అందులో పరదేశి పాత్ర ధరించి గొప్ప ఖ్యాతిని గడించారు.

మహారాష్ట్ర భక్తుల పరంపర కు సంబంధించి “సంతు తుకారం” ను తెలుగువారికి పరిచయం చేసిన ఘనత సి.ఎస్.ఆర్ కే దక్కింది.

కే.బాల సరస్వతి గారి చేత తుకారం నాటకం వ్రాయించి తన శ్రీ లలిత కళా దర్శమండలి తరుపున సి.ఎస్.ఆర్ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

తుకారం నాటకం సి.ఎస్.ఆర్ కు ప్రాణం. సి.ఎస్.ఆర్ పోయినప్పుడు తుకారం పోయాడన్నారు.

తుకారం నాటకం ప్రదర్శన వల్ల వచ్చిన పదివేల రూపాయలు “సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ” కి కెప్టెన్ లక్ష్మీ ద్వారా అందజేశారు.

ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం వారు వార్ ఫండ్ నాటకాలు ఆడించేవారు.

జాతీయవాది అయిన సి.ఎస్.ఆర్ గారికి అది ఇష్టం లేక సినిమాల పైనే అధిక దృష్టి సారించారు. సి.ఎస్.ఆర్ గారు దేశభక్తులు, జాతీయవాది. 1938లో తుకారం చిత్రాన్ని సినిమాగా తీశారు. అందులో తానే సంభాషణలు వ్రాశారు. సి.ఎస్.ఆర్ సినిమాలలో వెలుగునీడలు చూశారు. 1935లో తీసిన ఈ సినిమా కనక వర్షం కురిపించింది.

తెలుగు వారి ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వరునిగా సి.ఎస్.ఆర్ గారు అందరి హృదయాలను ఆకట్టుకున్నారు. ఆ చిత్రం నెగటివ్ అగ్నికి ఆహుతి అయ్యింది.

సి.ఎస్.ఆర్ గారు అఖండ కీర్తి తెచ్చి పెట్టిన మరో చిత్రం శోభనాచల వారి “భీష్మ”. అందులో బలిజేపల్లి వారు రచించిన సీస పద్యం ప్రేక్షకుల్ని వెర్రెత్తిచ్చేసింది.

సి.ఎస్.ఆర్ గారు నటించిన “జయప్రద” చిత్రం విజయం సాధించలేదు.

అయినా దాన్ని 1950 ప్రాంతంలో “రాజ విక్రమ” అనే పేరుతో కొంత మెరుగులు దిద్ది విడుదల చేసిన ఫలితం లేకపోయింది.

సి.ఎస్.ఆర్ గారు నటించిన మంచి చిత్రం “చూడామణి”. సి.ఎస్.ఆర్ గారు వాల్మీకి చిత్రంలో ఒక మంచి పద్యం  పాడారు.

సారధి వారి “గృహప్రవేశం” సినిమా సి.ఎస్.ఆర్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

“హలో మై డియర్ తులసమ్మక్క” అంటూ రంగ ప్రవేశం చేసిన తీరు గిరీశం పాత్రను మరిపింపజేస్తుంది.

శివరావు నిర్మించిన “పరమానందయ్య శిష్యులు” చిత్రంలో పరమానందయ్య పాత్ర సి.ఎస్.ఆర్ గారి నటనకు మరో గీటురాయి. “నిత్య కళ్యాణం పచ్చతోరణం”, “కన్యాదానం”, “కన్యాశుల్కం” తన నటనకు మచ్చుతునకలు. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీ వారి “తల్లి ప్రేమ”, సురభి, పాదుక, సౌధామిని, లక్ష్మీ, సతీ సక్కుబాయి, సి.ఎస్.ఆర్ కు పేరు తెచ్చిన చిత్రాలు. సారధి వారి మాయలోకం, గృహప్రవేశం, అంతా మనవాళ్లే, ఎత్తుకు పైఎత్తు, రోజులు మారాయి, సి.ఎస్.ఆర్ గారి నటన వైవిధ్యానికి నిదర్శనాలు. భరణి వారి రత్నమాల, లైలా మజ్ను, ప్రేమ, చక్రపాణి చిత్రాలు సి.ఎస్.ఆర్ నటనకు నిలువుటద్దాలు.

వినోద వారి దేవదాసు, స్త్రీ సాహసం, కన్యాశుల్కం, విజయా వారి “పాతాళభైరవి”, “అప్పుచేసి పప్పుకూడు”, “మాయాబజార్” చిత్రాలు తన నటనకు మైలురాళ్లు. సి.ఎస్.ఆర్ “కుచేలుడు” గా “భక్త కుచేల” చిత్రం నారాయణమూర్తి గారు తీశారు. అందులో సి.ఎస్.ఆర్ గారి నటన పరాకాష్ట చెందింది. ఆ చిత్రాన్ని చూసి మలయాళంలో “శ్రీకృష్ణ కుచేల” నిర్మించారు. ఏ ఒక్క తమిళ చిత్రంలో నటించనని తాను మలయాల కుచేలలో నటించి ఘన కీర్తి తెచ్చుకుని, అప్పటి గవర్నర్ వి.వి గిరి గారితో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

కుటుంబం…

సి.యస్.ఆర్ గారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. గుప్తదానాలకు సి.యస్.ఆర్ గారు పెట్టింది పేరు. భేషజం, ఆడంబరం, ప్రచారం, ప్రాపకం తనకు ఆమడ దూరం.

నవ్వి నవ్వించగల శక్తి తనకు ఉండేది. ప్రజాహిత కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి గల వ్యక్తి సి.యస్.ఆర్ గారు, బ్యాట్మెంటన్ ఆటగాడు.

తీరిక సమయాల్లో ఆడుతూ ఉండేవారు. చలోక్తులతో అందరినీ అలరిస్తూ ఉండే నటన ఆయన జీవితం.

నాటకం సినిమా సి.యస్.ఆర్ ఆంజనేయులు గారికి రెండు కళ్ళు. తన హృదయం మానవతావాదం. తన జీవితం సార్థకం. మహానటుడుగా తాను ఎందరికో మార్గదర్శకుడు.

భక్తి పాత్రలకు పేరుగాంచిన (రామదాసు, తుకారం) తన ప్రియ శిష్యుడు శ్రీ చుండూరు మధుసూదనరావు నేటికీ మళ్ళీ సి.యస్.ఆర్ గారిని ప్రత్యక్షం చేయగల ప్రతిభాశాలి.

సి అంటే క్రియేటివ్, ఎస్ అంటే స్టాండర్డ్, ఆర్ అంటే రియాల్టీ అని సి.ఎస్.ఆర్ అనే అక్షరాలకు తాను నిర్వచనం చెబుతారు.

చిత్ర సమాహారం..

పాదుకా పట్టాభిషేకం.. రామదాసు.. భక్త శిరియాల.. గృహప్రవేశం.. జీవితం.. బాలాజీ.. చూడామణి..

దేవదాసు (1953 సినిమా) ఇల్లరికం.. జయం మనదే.. కన్యాదానం.. ఎత్తుకు పైఎత్తు.. పాతాళభైరవి..

జగదేకవీరుని కథ.. ద్రౌపదీ వస్త్రాపహరణం.. సుమతి.. వాలి సుగ్రీవ.. సతీ సక్కుబాయి..

పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా).. మాయా రంభ.. నవ్వితే నవరత్నాలు.. బభృవాహన..

కన్యాశుల్కము.. అప్పుచేసి పప్పుకూడు.. మాయా బజార్.. బికారి రాముడు.. పెళ్ళిసందడి…

నటరాజ సాయుజ్యం…

మలయాళ చిత్రం “శ్రీకృష్ణ కుచేల” విజయంతో దానిని తెలుగులో డబ్ చేశారు. అప్పటికి సి.ఎస్.ఆర్ చనిపోవడంతో మద్దాలి కృష్ణమూర్తి సి.ఎస్.ఆర్ కి కంఠం ఇచ్చారు.

1945 వ సంవత్సరం లో దక్షిణ భారత సినిమా వార్షికోత్సవానికి ఇంటూరి వెంకటేశ్వరరావు గారి పిలుపు పై సి.ఎస్.ఆర్ మద్రాసు సినీ వర్కర్స్ యూనియన్ కి అధ్యక్షుడు అయ్యాడు.

సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు దర్శకత్వంలో ప్రారంభించిన “శివగంగ”, “రిక్షావాలా” చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.

తీరుబడి అయినప్పుడు పాడి బజార్ లో మిత్రులతో సి.ఎస్.ఆర్ గారు సినిమా ముచ్చట్లు చెప్పుకునేవారు.

“సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు లేని పాణి బజార్ శివుడు లేని కైలాసం” అని ఇంటూరి వారు తమ సినిమా పత్రికలో సి.ఎస్.ఆర్ గారు నిష్క్రమించినప్పుడు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

నాగయ్య లాంటి మహానటుడే ఒక రకంగా సి.ఎస్.ఆర్ గారు నాకు గురువు అన్నారు. ముక్కామల, ఎస్వీ రంగారావు, గుమ్మడి, సి.ఎస్ ల్.ఆర్  గారిని ఎంతో గౌరవించేవారు.

లలిత హాస్య ప్రదర్శనలో సి.ఎస్.ఆర్ గారిని మించిన నటుడు లేడని దర్శకుడు కె.వి.రెడ్డి గారు అనేవారు.

సి.ఎస్.ఆర్ గారు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని మరపురాని మహానటుడుగా భాసించారు.

నాలుగు దశాబ్దాల పాటు జయప్రదం గా నటజీవితం సాగించిన ఆ నటయోగి 8 అక్టోబర్ 1963 నాడు  తనువు చాలించి నటరాజ సాయుజ్యం పొందారు.

Show More
Back to top button