అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎలక్షన్‌లో అయినా పరువు నిలుపుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. దీంతో పార్టీలో క్రమంగా పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. అయితే.. అంతకుమించి ఘోరమే చవి చూసిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి.. అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి వలసలు పెద్ద ఎత్తునే మొదలయ్యాయి. అది కాస్త అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఎక్కువైంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సిట్టింగ్‌లు, టికెట్లు దక్కించుకున్న వాళ్లు సైతం ‘కారు’ దిగేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో హైకమాండ్ కంగుతిన్నది. ఎలాగో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటీ గెలవలేదు. దీంతో ఇక బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్దకమైంది అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయని ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జంప్ చేయడం మొదలుపెట్టారు ప్రతిపక్ష బీఅర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా నిన్న ఒకే దఫాలో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. పార్టీలో కొనసాగే వారెవరో, వీడే వారెవరో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కంటిన్యూ అవుతున్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి అరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరికల విషయంలో ఎత్తుకు పై ఎత్తులతో కాంగ్రెస్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. హస్తం పార్టీ వ్యూహానికి కేసీఆర్ అస్త్రాలు పని చేయడం లేదనే చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో అరుగురు ఎమ్మెల్సీలు త్వరలోనే బీఅర్ఎస్ వదిలి అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలై.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసుల రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇలా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో ఈ ఆరుగురు కూడా బీఆర్ఎస్ బిగ్ షాట్‌లే కావడంతో ఆ పార్టీ ఒక్కసారిగా కుదేలైంది.
ఇక ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యవసరంగా నిర్వహించిన సమావేశానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కీలక సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతోన్న నేపథ్యంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీకి డుమ్మా కొట్టడం సందేహాలకు తావిస్తోంది. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సాధారణంగా బీఆర్ఎస్‌కు ఉద్యమ పార్టీగా మంచి గుర్తింపు ఉంది. 60 ఏళ్ల నాటి కల సాకారం కావడంతో సుడిగాలిలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కథ మరో మలుపు తిరిగింది. వరుసగా తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడం.. నియంతృత్వ విధానాలు కేసీఆర్ పాలనలో స్పష్టంగా కనిపించడం.. ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కు గానీ వినే ఓపిక గానీ నాటి పాలకులకు లేకుండా పోయింది.
గులాబీ పార్టీ అగ్రనేతల అహంకారపూరిత మాటలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది. అంతే మూడోసారి అధికారంలోకి వస్తామని పగటికలలు కన్న బీఆర్ఎస్ నిండా కుప్పకూలిపోయింది. అంతేకాకుండా నేతలు, కార్యకర్తలు సమీక్షల్లో బహిరంగంగానే తమ నాయకత్వం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్నాళ్లూ మేం చెప్పిందే వేదం అని భావించిన గులాబీ పార్టీ అగ్రనేతల్లో ఒక్కసారిగా కలవరం స్టార్ట్ అయ్యింది. క్యాడర్ అభిప్రాయాలను ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదని, తమకు విలువ ఇవ్వకపోవడం సంగతి పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై తమ అభిప్రాయం రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా పెడచెవిన పెట్టారనే గగ్గోలు వినిపించింది. మాజీ మంత్రుల ముందు సైతం క్యాడర్ నాయకత్వంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. నిజానికి బీఆర్ఎస్ చేసిన అతి పెద్ద తప్పు ఇదేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
ఇకపోతే బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిని ఇకనైనా మార్చుకోకపోతే కష్టమేనని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారుకు కనీస టైమ్ ఇవ్వకుండా హామీల అమలుకు డిమాండ్ చేయడం ప్రజల్లో వెగటు పుట్టిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే.. కనీసం ఏడాది గడువు అయినా ఇవ్వాలి కదా అనే అభిప్రాయం ప్రజల్లో లేకపోలేదు. ఇదిలావుంటే.. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి రెండుసార్లు టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు శ్రమించిన ఉద్యమ లీడర్లను బీఆర్ఎస్ తొక్కేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
తమ రాజకీయ స్వార్థం కోసం ఉద్యమ నేతలను పక్కకు నెట్టి ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించారనే ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గాల్లో పార్టీ అభిప్రాయాన్ని, ఉద్యమ నేతల అభిప్రాయం తీసుకోకుండానే టికెట్లు ఇవ్వడం.. మంత్రి పదవులను కట్టబెట్టడం క్యాడర్లో అసంతృప్తికి కారణమనే చెప్పాలి. కాబట్టి ఇకనైన బీఆర్ఎస్ పార్టీ నేతలు వారి కార్యకర్తలను, ప్రజలను తప్పక గుర్తుపెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.