తొండ ముదిరితే ఊసరవెల్లి అయ్యేట్టుగా నేరస్తుడు ముదిరితే నేత అవుతాడు..! అంచేత నేరస్తుడెవుడూ నేతలతోటి కయ్యం పెట్టుకోడు! ప్రస్తుతం రాజకీయ నేతలు ఎన్ని స్కాములు చేస్తే.. ఎన్ని నేరాలకు పాల్పడితే, ఎన్ని నేరారోపణలు ఎదుర్కొంటే అంత గొప్ప రాజకీయ నాయకుడిగా, నాయకురాలిగా అవతారమెత్తే అవకాశాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ పై దాణా కుంభకోణంలో ఇప్పటివరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్షలు విధించింది. చివరి డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష వేసి, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. అయినా కూడా ఆయనకు ఆ రాష్ట్ర ప్రజల్లో ప్రజాదరణ తగ్గలేదు.
తాజాగా కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. స్కామ్లో ఆమె పాత్రపై ED ఆమెను ప్రశ్నించడం, ప్రస్తుతం దర్యాప్తు దశలో కేసు కొనసాగుతున్నా.. పార్టీ కార్యకర్తలు కవిత పై విజయ సూచికలు సూచిస్తూ వీరనారిలా దరహాసాలు, ఉపన్యాసాలు ఆమెను వీరవనితలా వర్ణిస్తుండడం విశేషం. ఇకపోతే ఓటుకు నోటు కేసులో కెమెరాకు చిక్కి ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ రేవంత్ రెడ్డి, రాజకీయ జీవితానికి సైతం ఆ కేసు ఎలాంటి అవరోధాలు సృష్టించకపోగా ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణ పెరగడం కనిపిస్తోంది.
ఇక ప్రస్తుత ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికొస్తే.. 2012 మే 27న అక్రమాస్తుల ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. దానికితోడు 16 నెలల పాటు జగన్ జైలులో గడపాల్సి వచ్చింది. అయినప్పటికీ.. జగన్ రాజకీయ జీవితానికి ఆయనపై నమోదైన కేసులు ప్రభావం చూపకపోవడం విశేషం. 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో ఆయన పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ.. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాలకుగాను, ఆయన స్థాపించిన YSRCP 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఏకంగా ఏపీ సీఎంగా ఎన్నికవ్వడం విశేషం.
ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 9న రూ.371 కోట్ల స్కిల్ డెవప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు A 37 నిందితుడిగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారంటూ ఆయనకు పాజిటివ్‌గా టాక్ వస్తున్న విషయమూ తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. ప్రజల్లో కొంతవరకు సింపతీ పెరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ.. అధికారంలో వున్నవాడు తన వేలిని యెప్పుడూ యెవరో ఒకరి మీద అడుగో నేరస్తుడని చూపతానే ఉంటాడు. జనం అతడి వైపు వేలు చూపించేదాకా…. నేరస్తుడే, నేతగా చలామణయిపోతాడు.