Telugu Politics

ఏపీ రాజకీయాల్లో.. పార్టీ పొత్తులు.. ఫలించేనా?!

ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో.. పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పాత్రలు… తెరపైకి వస్తున్నాయి.. 

అధికార వైసీపీ ఓవైపు, తెలుగుదేశం, జనసేనలు మరోవైపు.. ఎవరికీ తగ్గ రీతిలో వారు పయనిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ సర్కారును గద్దె దించేందుకు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు, తుగ్లక్ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు.. అటు తెలుగు దేశం, జనసేన పార్టీలు స్వీయలాభం వదలి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యాయా?.. అంటే, అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. మాతో పాటు బీజేపీ కూడా కలసిరావాలని ఇటు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. 

అయితే బీజేపీ నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోనంటుంది. వాస్తవానికి, ఏపీలో బీజేపీకి బలమైన ఓట్లు పడింది ఒక్క శాతం కూడా లేదు.. అయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీని కలుపుకుంటే.. భవిష్యత్తులో ఉపయోగపడొచ్చన్న యోచనలో టీడీపీ, జనసేనలు పొత్తును కోరుకుంటున్నట్లు తోస్తుంది.  

బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలతో కలిసి రాకపోవడంతో.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు.. సిపిఐ, సిపిఎం వంటి వామపక్ష పార్టీలతో కలిసి కొత్త కూటమిగా ఏర్పాటయ్యే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తే, 2014లో సాధించిన దానికంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక అటు మోదీ ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత.. కొత్త కూటమికి కలిసొస్తాయని కూడా వినిపిస్తుంది. దీనికి తోడు వైసీపీ నాయకత్వం మొదట్నుంచి వైఫల్యాలను ఎదుర్కొంటుంది. 

వైసీపీ వైఫల్యాలు.. 

2019 ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి. 

ఒకటి విపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి. 

రెండోది.. జగన్ సొంత బాబాయ్ అయిన వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణహత్యకు గురి కావడం. 

ఈ రెండు సంఘటనలూ.. జగన్ కు గెలుపొందేందుకు దోహదంచేశాయి.  

ఆ తరువాత జగన్ అధికారంలోకి రావడం.. అలా వచ్చి నేటికి నాలుగేళ్లు కావొస్తుంది. ఈ నాలుగేళ్ల కాలంలోనూ ఈ రెండు సంఘటనలకు సంబంధించిన కేసులూ ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలాయి. 

కోడి కత్తి కేసు విషయాన్నీ తీసుకుంటే.. తనపై దాడి జరిగిందంటూ అప్పట్లో అందర్నీ ఏకం చేసిన జగన్.. ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకుని.. అనంతరం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత ఆ కేసును పట్టించుకున్న దాఖలాలే లేవు. పైగా ఈ కేసు తేలాలంటే.. బాధితుడిగా మిగిలిన జగన్ కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఎన్నోసార్లు పేర్కొన్నప్పటికీ.. జగన్ హాజరు కావడం లేదు. బదులుగా నాలుగేళ్లుగా ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను అనే యువకుడు రిమాండ్ ఖైదీగానే జైల్లో మగ్గిపోతున్నాడు. తనపై హత్యాయత్నం కేసును పూర్తి చేసుకోవాలన్న స్పృహ.. నిందితుడికి శిక్ష పడాలన్న భావన జగన్ లో ఏ కొంచం కూడా లేదు. అసలా సంఘటనే జరగలేదన్నట్లుగా.. ఆయన తీరు విస్తుబోయేలా చేస్తుంది.  

తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి జగన్, ఆయనతో పాటు ఆయన పీ.ఏ నాగేశ్వర్ రెడ్డిని కూడా వచ్చే నెల(ఏప్రిల్ 10న) హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించడం విశేషం.   

ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయానికొస్తే.. అప్పట్లో అధికార పక్షమే ఈ దారుణానికి ఒడిగట్టిందంటూ సీన్ క్రియేట్ అయ్యేలా చేశాడు సీఎం జగన్.. అప్పటి విపక్ష నేతగా ఈ హత్య కేసు దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇక సీబీఐ విచారణ అవసరం లేదని కొట్టి పారేయడం విస్మయానికి గురి చేస్తోంది. కానీ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. తన తండ్రిని హత్య చేసిన వారికి తగిన శిక్ష పడాల్సిందేనంటూ.. పట్టుబట్టి సీబీఐ దర్యాప్తును సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా..అడ్డంకులు అవాంతరాలు ఏర్పడిన విషయం తెలిసిందే. 

అయినా పట్టు విడువక సుప్రీంను ఆశ్రయించింది. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది. దీంతో కేసు విచారణ తెలంగాణకు మారింది. అప్పటి నుంచీ దర్యాప్తులోనూ వేగం పెరిగింది. వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది తేలబోతుందన్న విషయంపై సర్వత్రా స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో కీలకంగా మారారు. సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆరోపిస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు సైతం చేశారీయన. 

అయితే ఏ కారణాల వల్ల అధికార పగ్గాలు చేతికి అందాయో.. అవే ఇప్పుడు వైకాపాను కిందకు లాగుతున్నాయి. ఈ రెండిటి విషయంలో.. వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బ తీస్తోంది. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించిన శైలి ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఈ కేసు మూలాలు తవ్వుతున్నారు నెటిజన్లు..

దీనికి తోడు అమరావతి రాజధాని అంశంలో అన్యాయం.. రాష్ట్రం నిండా అప్పులు.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏపీ రాష్ట్రం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న నమ్మకం రోజురోజుకు సన్నగిల్లేలా చేస్తుంది.

Show More
Back to top button