చాలామందిని వేధించే సమస్య తెల్ల జుట్టు. వయసుతో సంబంధం లేకుండా ఈ తెల్లజుట్టు కొందరిలో యుక్త వయసులోనే వస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తెల్లజుట్టు రావడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారి పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘మెలనోసైట్ స్టెమ్ సెల్స్’ అనేవి మన జుట్టుకు రంగును నిర్ధారిస్తాయి. మనిషి వయస్సు పెరుగుతున్న కొద్దీ మెలనోసైట్స్ స్టెమ్ మూల కణాలు బలహీనమవుతున్నట్లు ఈ రీసెర్చ్‌లో గుర్తించారు.
దీని వల్ల జుట్టు తన సహజ రంగు స్వభావాన్ని కోల్పోతుందట. కొన్ని కణాలు జుట్టు కుదుళ్లలోని గ్రోత్ కంపార్ట్‌మెంట్ల మధ్య కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వయసు పెరుగుతున్న వారిలో మెలనోసైట్స్ స్టెమ్ కణాలు కదిలే సమయంలో చిక్కుకుపోయి, వీటి సంఖ్య తగ్గుతుంది. దీంతో జుట్టు రంగును కాపాడే శక్తిని మెలనోసైట్ స్టెమ్ కణాలు కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
తెల్ల జుట్టు అనారోగ్యమా?
పుట్టుకతో సంక్రమించే జన్యువులే మనిషి రంగు, ఆకారం లాంటి అంశాలను నిర్ణయిస్తాయి. జాతి, నివసించే ప్రాంతాన్ని బట్టి మనుషుల జుట్టు రంగు మారే వయసులో తేడాలుంటాయి. సాధారణంగా చాలామందికి 40 ఏళ్లు దాటితే తెల్లజుట్టు వచ్చే అవకాశాలు ఎక్కువ. జుట్టు తెల్లబడటం అనారోగ్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రసాయన ఉత్పత్తులైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడకం వల్ల జుట్టు తెల్లబడుతుందని ఈ రీసెర్చ్‌లో తేలింది. అధిక సల్ఫేట్ ఉన్న ప్రొడక్ట్స్ జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్‌లేని హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడటం ఉత్తమం.
శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోతే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండదు. ఫోలిక్ యాసిడ్, బయోటిన్ వంటి పోషకాల లోపం ఉంటే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఈ పోషకాలను భర్తీ చేయడానికి డెయిరీ ఉత్పత్తులు, గుడ్లు, మాంసం వంటి ఆహారాలను తీసుకోండి.