HISTORY CULTURE AND LITERATURE

600 ఏళ్ళ క్రితం ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా?

భారతదేశాన్ని దేవాలయాల నిలయం అని చెప్పవచ్చు. వివిధ వాస్తు శిల్పులతో ఆ కాలంలో చాలామంది రాజులూ,పెద్దలు చాలా దేవాలయాలు కట్టించారు.వాటిలో శిల్పులు కొన్నిటిని చాలా వింతగా కట్టారు. ప్రతిదీ ఒకదానికొకటి భిన్నంగా కట్టారు.అయితే చాలా వరకు ఆలయాలను వాస్తు శిల్పులు భిన్నంగా ఉండేలా  కట్టారు,అసలు ఒకదానికొకటి పొంతన లేకుండా,ఒక్కో ఆలయాన్ని ఒక్కో ఆకారంలో కట్టడం జరిగింది.అలాంటి నగాలయాలు చాలానే భారత దేశంలో ఉన్నాయి .అయితే దానిలో ఒకటి తెలంగాణలో ఉన్న ఆలయమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ  నాగాలయం. ఒక్కసారి ఈ ఆలయాన్ని చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.దీని చరిత్ర 600 ఏళ్ల క్రితంది అని చరిత్రకారులు చెప్తారు. నిజంగానే ఆరువందల ఏళ్ళ క్రితమే కట్టిన ఇప్పటికి చెకు చెదరకుండా ఉన్న ఈ ఆలయాన్ని చుస్తే మీరు ఆశ్చర్య పోతారు.

భారతదేశంలో దేవాలయాలు వివిధ మార్గాలలో నిర్మించబడ్డాయి.కొన్ని దేవాలయాలు నేటికీ పాత వాస్తు శిల్పాలను  తాజాగా నిర్మిస్తూ,ఆలయాలు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి దేవాలయం తెలంగాణలోని నాంపల్లి గుట్టలో ఉంది.ఒకప్పుడు అసలు ఆలయాలకు నిర్మాణాలు లేవు. ఉన్న కొద్ది వాటినే ప్రజలు దర్శించుకునేవారు. ఉదాహరణకు వేములవాడ రాజన్న గుడి ఒకప్పుడు చిన్నగా ఒక చెట్టు కింద ఉండేది. కానీ ఇప్పుడు ఆలయాన్ని గుర్తించి బాగా అభివృద్ధి చేసారు.అలాగే నాంపల్లి గుట్ట కూడా 600 ఏళ్ళ క్రితం నిర్మాణం చేసారు. దీన్ని ఎవరు కట్టారో, ఎలా కట్టారో కానీ ఆ శిల్పకళా నైపుణ్యానికి మనం అచ్చేరుపొందాల్సిందే,అలాంటి శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయంలో సొరంగం లోకి వెళ్తుంటే ఆశ్చర్యంతో పాటు విస్మయం కూడా కలుగుతుంది.అంత సొరంగం లోపల అలాంటి శిల్పాలు చేక్కడం అంటే మాములు విషయం కాదు.అది కూడా ప్రహ్లాదుని కథంతా శిల్పాల రూపంలో చెప్పడం ఒక అద్భుతం, అయితే పాము బొడ్డులో నుండి భక్తులు వెళ్ళేలా రాతితో చెక్కడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇది నరసింహస్వామి ఆలయం.ఇది పాము ఆకారంలో నిర్మించబడింది. ఈ ఆలయం వేములవాడ కరీంనగర్ హైవే రోడ్డుపై ఒక చిన్న కొండపై ఉంటుంది. ఇది విష్ణు అవతారమైన లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేయబడిన చిన్న దేవాలయం. ఈ విగ్రహం ఆలయం నిర్మించబడిన రాతి నుండి చెక్కబడింది.

ఇకడికి వెళ్ళడానికి సొంతంగా లేదా ఆటోలు ఉంటాయి, ఆటోలో పైకి రావాలంటే రోడ్డు మార్గం ఉంది. కానీ పైకి వచ్చిన తర్వాత దాదాపు మూడు వందల మెట్లు ఎక్కాలి.ఇవి ఎక్కి దిగడం అంటే మాములు విషయం కాదు.భక్తులకు,భగవంతునికి మధ్య ఉన్నదూరాన్ని తగ్గించే ప్రయత్నం , అలాగే దేవుని పై భక్తులకు ఎంత నమ్మకం ఉందో తెలుసుకునే ఒక ప్రక్రియ.

ఈ మెట్లు కొంచెం ఏటవాలుగా ఎక్కేందుకు యువకులకు, యువతులకు అంటే ఆరోగ్యంగా ఉన్నవారికి 15 నిమిషాలకు సమయం పట్టవచ్చు.కానీ కాస్త నడివయసులో ఉన్నవారికి మెట్లు ఎక్కి దిగడం అంటే చుక్కలు కనిపించడమే అవుతుంది. ఇంత చేసిన తర్వాతే మనకు స్వామి దర్శనం జరుగుతుంది.

*చరిత్ర*

సంతానం లేని వారికి సంతానమిచ్చే బహిత్వంగాల క్షేత్రంగా నాంపల్లి ఆలయం ప్రసిద్ధికి ఎక్కింది.

11వ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రాజరాజ నరేంద్రుడు అనే రాజు కోనేటికి మెట్టు నిర్మించారని చరిత్ర కథనంలో ఉంది. నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో పాముల గుడి ఉంటుంది. ఈ ఆలయం పాము ఆకారంలో నిర్మించబడింది. సందర్శకులు ఈ ఆలయంలోకి  పాము బొడ్డు గుండా ప్రవేశించవచ్చు. పొడవైన సొరంగంలో వెళ్ళే దారిలో ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశ్యపుని కథను తెలిపే విగ్రహాలు ఇక్కడ ఉంటాయి.

సొరంగం చివరలో హిరణ్యకశ్యపుడునికి సంబంధించిన నరసింహస్వామి విగ్రహం ఉంది.అలాగే కొన్ని పురాతన నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహంలో స్తంభం నుండి బయటకు వస్తున్న నరసింహ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. లోపల ఉన్న కళారూపాలు చూస్తుంటే తన్మయత్వంతో పులకరించి పోతాం.అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలను,స్వామిని చూస్తూ మన శ్రమని మర్చిపోతాం.

అలాగే ఈ సర్పశిల్పం కృష్ణుని కాళీయమర్దనాన్ని గుర్తుకు తెస్తుంది ఇది పిల్లలను, పెద్దలను బాగా ఆకర్షిస్తుంది. కృష్ణుడు కాళీయుని గర్వభంగం చేసి,నాట్యం చేస్తున్నట్టు తీర్చిదిద్దిన ఈ శిల్పం ఊరంతా కన్పిస్తుంది.ఈ గుట్టపైకి ఎక్కితే మనకు ఊరంతా కనిపిస్తుంది.  

నాంపల్లి గుట్ట పాము ఆకారంపై కూర్చున్న సింహం ఆకారంలో భక్తులకు, కనిపిస్తుంది. ఈ అందమైన ఆలయం కుంకుమ రంగులో, పాము ఆకారంలో ఉంటుంది.  

పచ్చని ప్రకృతి మధ్యలో,ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి శబ్దాలు లేకుండా, వాహన కాలుష్యం లేకుండా , మనస్సుని ఆహ్లాద పరిచే విధంగా ఈ అందమైన ఆలయం ఉంది. ఇక్కడికి వెళ్ళాక మనసులో ఉన్న బాధాలన్నీ తీరిపోయి ఒక రకమైన సంతోషంతో ఉండిపోతాము.

కరీంనగర్ జిల్లా వేములవాడ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కరీంనగర్ నుండి అయితే 32 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుండి వేములవాడకు  వెళ్తే అక్కడి నుండి నాంపల్లి గుట్టకు ఆటోలో వెళ్ళవచ్చు, మనిషికి 20 రూ . తీసుకుంటారు. అలాగే ఫ్యామిలీ తో వెళ్ళాలి అనుకుంటే సొంత వాహనం ఉంటె వెళ్లి అక్కడ నాలుగు రోజులు ఉండి రావచ్చు.అక్కడ భక్తులకు అవసరమైన సత్రాలు అందుబాటులో ఉంటాయి.

ఆ సత్రంలో ఉండి, నిద్రలు చేస్తే మంచిదని భక్తుల నమ్మకం.కాబట్టి చాలా మంది వండుక తినడానికి  పోతున్నాం అనే వాడుక భాషలో మాట్లాడుకుంటారు.అంటే స్వామి దర్శనం అయ్యాక ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు.

మొక్కులు అంటే మేకని,కోళ్ళను కోయడం లాంటివి చేస్తారు.అంటే బలి ఇచ్చి దాన్ని నైవేద్యంగా సమర్పించి, దాన్ని పిలిచిన బంధువులందరికీ పెడతారు. అంటే దీన్నొక వేడుకలాగా చేసుకుంటారు.ఈ వేడుక కు బంధువులను పిలిచి పెద్దగా చేస్తారు.

అయితే ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటుందో రాత్రయితే అంత భయనకంగానూ ఉంటుంది.అంత ప్రశాంత వాతావరణం లోకి ఒక్కసారిగా రణగొణధ్వనుల మధ్య నుండి వెళ్ళిన వారికీ కాస్త అయోమయంగా కూడా ఉంటుంది. అంత ప్రశాంతమైన వాతావారణానికి తట్టుకోవడం కాస్త కష్టమే, కానీ అలవాటు అయితే అక్కడే ఉండాలి అనిపించక మానదు.

చుట్టూ చిన్న,చిన్న ఇళ్ళు, అప్పుడే కొత్తగా ప్రారంభం అవుతున్న కొన్ని భవనాలు, అభివృద్ధి చెందుతున్న నిర్మాణాలు, తాటి, ఈత చెట్లతో కనువిందు చేస్తూ, తాటి కల్లు, ఈత కల్లు విరివిగా దొరుకుంతుంది ఇక్కడ. దాంతో ఈ కల్లు కోసం భాగ్యనగరం నుండి పెద్ద పెద్ద కార్లలో వచ్చిన వారి కార్లు బారులు తీరి కన్పిస్తూ ఉంటాయి.

ఇక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయాలు చాలా అందంగా మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటాయి. అలాగే ఎత్తయిన ప్రదేశాలు అంటే ఇష్టమున్న వారు ట్రెక్కింగ్ చెయడానికి అనువైన ప్రదేశం ఇదని చెప్పవచ్చు.

ఈ నాంపల్లి గుట్ట అంటే కరీంనగర్ చుట్టుప్రక్కలే కాకుండా ఈ ఆలయం గురించి, దీని ప్రత్యేకత గురించి అందరికీ తెలియదు. తెలిసిన వారు మాత్రం సంతానం కోసం ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కి వెళ్తారు.సంతానం అయ్యాక తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మొక్కులు చెల్లించే క్రమంలో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది.

ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేశారు, కానీ ఒకప్పుడు అంతా రాళ్ళూ, రప్పలతో అడవిలా ఉండేది, అప్పట్లో ఇక్కడికి రాకపోకలు తక్కువ, తర్వాతి కాలంలో ఈ ఆలయం కాస్త అభివృద్ధి చెందింది. ఆలయానికి ఈ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు మలుపులతో తిరుపతిలా అనిపిస్తుంది, మొత్తం రోడ్డు అంతా మెలికలు తిరిగి పాము ఆకారంలా ఉంటుంది, కానీ ఆటోలు, బస్సులు వెళ్ళడానికి దీనిని అభివృద్ధి చేసారు. ఆలయ పూజారులు రొజూ మూడు వందల మెట్లు ఎక్కి,దిగుతూ ఉంటారు.ఎందుకంటే వారి ఇల్లు కిందనే ఉన్నాయి. పైన వారికి గదులు కేటాయించినా,రాత్రి అవ్వగానే పూజారులు కొండపై నుండి కిందకు వచ్చేస్తారు.సత్రాలలో ఉండేవారు ఉంటారు. అంటే నిద్ర చేస్తామని మొక్కిన వారు ఉంటారు, లేదంటే దర్శనం అవ్వగానే వంట చేసుకుని తిని సాయంత్రంలోపు తిరిగి వెళ్ళిపోతారు.

నాంపల్లి గుట్ట ఒక్కసారి వెళ్తే మళ్ళి, మళ్ళి వెళ్ళాలి అనిపించే ప్రదేశం ఇది, ఇక్కడికి ఒక్కసారి వెళ్తే మనకు తిరిగి రావాలి అని అనిపించదు.కాబట్టి వెళ్ళాలి అనుకునేవారు వెళ్లి రండి, అలాగే కొత్త ప్రదేశాలు చూడాలి, ట్రెక్కింగ్ చేయాలి అని అనుకునేవారికి ఇదొక నూతన అనుభూతి. కాబట్టి ఈ ప్రదేశానికి సంతానం లేని వారు సంతానం కోసం, ఆ స్వామిని దర్శించుకోవడం కోసం,ట్రెక్కింగ్ కోసం వెళ్లేవారి కోసం కొత్త అనుభూతిని పంచుకోవాలి,ఆస్వాదించాలి అనుకునేవారికి ఇదొక మంచి అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది.కాబట్టి తప్పకుండా నాంపల్లికి  వెళ్లి రండి , అందాలను, ఆలయాన్ని భక్తితో దర్శించుకోండి.ఆ అనుభూతులను గుండెల్లోనూ, ఫొటోలలోనూ బంధించుకోండి.అందరితో పంచుకోండి.

Show More
Back to top button