CINEMATelugu Cinema

అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం… ప్రేమాభిషేకం..

ప్రేమ” అనేది ఒక అందమైన ప్రపంచం. ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిజమైన ప్రేమ. ఇది ఎవరికి అంత తేలికగా దొరకదు. వందలో ఒక్కరికి దొరుకుతుంది. రెండవది స్వార్థంతో కూడిన ప్రేమ. ప్రస్తుత సమాజంలో నడుస్తున్న చాలా ప్రేమలు స్వార్థంతో కూడిన ప్రేమలే. ఈ ప్రేమ చూడటానికి మాత్రమే బావుంటుంది. నిజ జీవితంలో దగ్గరగా ఉండి చూస్తే అన్నీ ముల్లే కనిపిస్తాయి. నిజానికి “నిజమైన ప్రేమ” ఎప్పుడూ ప్రేమించిన వాళ్ళకి దొరకదు. నిజమైన ప్రేమ ఉన్నా వాళ్ళకి దాని విలువ తెలియదు. ఇది ప్రేమ వరుస. పూర్వ కాలంలో ప్రేమ వల్ల రాజ్యాలు కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు అని మనము వింటూంటాము.

ప్రేమకథలు.. అందులోనూ భగ్న ప్రేమకథలు.. వెండితెరపై ఎప్పుడూ విజయవంతమైన ఫార్ములా.. ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి నారాయణ రావు కలయికలో తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం “ప్రేమాభిషేకం”. సరిగ్గా నలభై మూడేళ్ళ క్రిందట 18 ఫిబ్రవరి 1981 విడుదలైన సినిమా అది. కానీ ఈరోజుకీ కూడా ఆ పాటలు, మాటలు ఇలా అన్నీ కూడా సినీ ప్రియులకు గుర్తేవున్నాయి. “ప్రేమకు అర్థం త్యాగం” అనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన “ప్రేమాభిషేకం” అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం..

మరణావస్థలో ఉండి కూడా ప్రేయసి సుఖాన్ని కోరుతూ త్యాగంలోనే ప్రేమ ఉంటుందని, నిజమైన ప్రేమకు ప్రేమించడం లక్ష్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదస్తూ అక్కినేని నాగేశ్వరావు గారు వెండితెరపై అభిషేకం చేశారు. కథగా చెప్పుకుంటూ ఇందులో పెద్ద గొప్పతనం కనిపించదు. కానీ సినిమాలో ప్రతి ఫేమ్ దర్శకుడు నడిపించిన విధానం, సంగీతాన్ని సందర్భోచితంగా ఉపయోగించిన నైపుణ్యం, కొత్త దర్శకులకు ఇది పాఠ్యాంశం. దాసరిని దర్శకరత్న ఎందుకు అంటారో చెప్పడానికి ఈ సినిమా ఓ అందమైన నిదర్శనం. యాభై ఏడేళ్ల అక్కినేని ఒక ప్రేమికుడుగా ప్రేక్షకులు అంగీకరించ గలిగారంటే అదంతా దర్శకుని చాతుర్యమనే అని చెప్పాలి.

ఎన్నో మలుపులు.. ప్రేమానురాగాలు, అనుబంధాలు ఇలా ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లు చూపించారు దాసరి నారాయణరావు.. అందుకే ఈ సినిమా అప్పట్లోనే అంత వసూలు చేసి ఇండస్ట్రీలో ఉన్న  రికార్డు తిరగరాసింది. ఇక ఇప్పట్లో అయితే వందల కోట్ల రూపాయలను వసూలు చేసి ఉండేదేమో.. ఏది ఏమైనా ప్రేమకు చక్కగా నిర్వచనాన్ని చూపించారు దాసరి నారాయణరావు.

దిగ్గ‌జ న‌టుడు అక్కినేని నాగేశ్వరావు హీరోగా, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తెర‌కెక్కించిన‌ “ప్రేమాభిషేకం” చిత్రం  సాధించిన‌ విజ‌యం తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఓ సంచ‌లనం. వాస్తవానికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారికి ఇలాంటి విజ‌యాలు కొత్తేమీకాదు. తన సినీ ప్రస్థానంలో చాలానే ఉన్నాయి. కానీ ఆరు ప‌దుల వ‌య‌సు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వ‌య‌స్సులో అంటే తన 57 ఏళ్ళ వయస్సులో ఓ విషాద‌క‌రంగా ముగిసే ప్రేమ‌క‌థా చిత్రంలో అక్కినేని గారు న‌టించ‌డం, అది ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌డం మాత్రం ఇప్పటికీ, ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని ఘ‌న‌తే. ఇది భార‌తీయ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో కేవలం ఏఎన్నార్‌కు మాత్ర‌మే సాధ్య‌మైన విష‌యం. ఈ చిత్రానికి ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే అక్కినేని నాగేశ్వరావు వెండితెరకు పరిచయం అయిన త‌రువాత స‌రిగా 40 ఏళ్లకు ఈ సినిమా రావ‌డం, అది విడుదలై నేటికీ 43 ఏళ్ళు అవ్వడం నిజంగా ఓ విశేషం..

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   దాసరి నారాయణ రావు 

నిర్మాణం   :     వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రచన     :    దాసరి నారాయణరావు

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, శ్రీదేవి, మురళీ మోహన్, మోహన్ బాబు

సంగీతం    :    చక్రవర్తి 

కథ         :     దాసరి నారాయణ రావు 

మాటలు, పాటలు   :   దాసరి నారాయణ రావు 

ఛాయాగ్రహణం  : పి.ఎస్.సెల్వరాజ్

ఎడిటింగ్      :      బి. కృష్ణం రాజు

నిర్మాణ సంస్థ    :     అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్ 

నిడివి      :     147 నిమిషాలు

విడుదల తేదీ   :     18 ఫిబ్రవరి 1981

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

రాజేష్ (అక్కినేని నాగేశ్వరరావు), దేవి (శ్రీదేవి) మీద పడతాడు. వరుస అపార్థాల వల్ల తరచూ గొడవలు జరుగుతుంటాయి. దేవి అతని ప్రతిపాదనను తిరస్కరించి అతనిని అవమానిస్తుంది. తర్వాత అతని కోసం ఆమె మనసు మార్చుకుంటుంది. వారు ప్రేమించుకుంటారు. అందుకు వారి కుటుంబ సభ్యులు అంగీకరించి వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు, దేవి సోదరుడు డాక్టర్ చక్రవర్తి (మోహన్ బాబు), రాజేష్ క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుంటాడు. పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు. దాంతో రాజేష్, దేవి రహస్యంగా పెళ్లి చేసుకోవాలని ప్రణాళిక చేసుకుంటుంటారు. కానీ అది జరగకముందే, డాక్టర్ వెంకటేశ్వర్లు (గుమ్మడి) నుండి రాజేష్ తన అనారోగ్యం గురించి కూడా తెలుసుకుంటాడు. తన సన్నిహితుడు ప్రసాద్ (మురళీ మోహన్) కూడా దేవిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాడు.

ఆమె పట్ల ఉదాసీనంగా నటిస్తూ ఆమెను ద్వేషించేలా చేయాలని నిర్ణయించుకుంటాడు రాజేష్. దేవి తనను ద్వేషించేలా చేయడానికి అతను వేశ్య జయంతి (జయసుధ)తో సహవాసం చేస్తాడు. దేవి అతనిని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతని ప్రవర్తన చూసి షాక్ అవుతుంది. రాజేష్ పెళ్లిని రద్దు చేసుకుంటాడు. తన పెళ్లి ప్రతిపాదన కేవలం తనను చాలాసార్లు అవమానించిన దేవిపై పగ తీర్చుకునే ఎత్తుగడ మాత్రమేనని నటిస్తాడు. దేవి కోపం తెచ్చుకుని, అహంకారి రాజేష్‌ను అవమానపరచడానికి ప్రసాద్‌తో తన పెళ్లి చేయమని తన సోదరుడిని కోరుతుంది. జయంతి రాజేష్‌ని పెళ్లి చేసుకోమని కోరుతుంది. కొద్దికాలం అయినా సరే వేశ్యగా కాకుండా రాజేష్ భార్యగా జీవించాలనుకుంటున్నాను అంటుంది. దాంతో రాజేష్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దేవి తన పెళ్లి అయిన వెంటనే, నిజం తెలుసుకుని రాజేష్‌ని కలవడానికి వెళుతుంది. రాజేష్ కొత్తగా పెళ్లయిన జంటను ఆశీర్వదించి, సంతోషంగా తుది శ్వాస విడుస్తాడు.

చిత్ర కథకు బీజం

అక్కినేని నాగేశ్వరావు గారు 1976లో హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. ఆ తర్వాత ఆయనకు తన స్టూడియో పతాకంపై సినిమాలు తీస్తే బాగుంటుందని ఆలోచన కలిగింది. తనకు సన్నిహితుడైన దాసరి నారాయణరావు కు చెబితే మంచి ఆలోచన “భేష్” అని అన్నారు. ఓం ప్రధమంగా “కళ్యాణి” అనే సినిమా తీశారు. ఇందులో మురళీమోహన్, జయసుధ లు ప్రధాన పాత్రలుగా మోహన్ బాబు, సత్యనారాయణ లు సహా పాత్రదారులుగా నటించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు, జయప్రదలతో దాసరి చిత్రీకరించిన సినిమా పేరు “బుచ్చిబాబు”.

అసలు ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరావు, దాసరి కలయికలో తొలిసారిగా చిత్రింపబడిన చిత్రం “దేవదాసు మళ్లీ పుట్టాడు”. ఈ సినిమా చేస్తున్న సమయంలో దేవదాసు ప్రేమ కోసం ప్రయత్నిస్తున్న పార్వతి, చంద్రముఖిల మధ్య సంఘర్షణను చిత్రీకరిస్తూ ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన దాసరి మదిలో మొగ్గ తొడిగింది. అది కాస్త “శ్రీవారు ముచ్చట్లు” సినిమా నాటికి ఓ ఆకారానికి వచ్చింది. అలా అన్నపూర్ణ స్టూడియో బ్యానరు లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా “ప్రేమాభిషేకం” అనుకున్నారు. రాజేష్ గా అక్కినేని నాగేశ్వరావు, దేవి గా శ్రీదేవి అని కూడా చిత్రకథ తయారు చేశారు దాసరి నారాయణ రావు గారు.

దాసరి గారు పరిచయం చేసిన నటీనటులు…

దాసరి గారు “మా బంగారక్క” సినిమా ద్వారా శ్రీదేవిని, “తిరుపతి” అనే సినిమా ద్వారా జయసుధని పూర్తిస్థాయి కథానాయికలను చేసింది దాసరి నారాయణరావు గారే. నటులు మోహన్ బాబుని “స్వర్గం నరకం” చిత్రం ద్వారా పరిచయం చేసింది దాసరి గారే. మురళీమోహన్ గారు “జగమేమాయ” సినిమాలో కథనాయకుడుగా వేషం వేసి ఆ తరువాత సినిమాలు లేక తాను బెజవాడ వెళ్ళిపోతే దాసరి నారాయణ రావు గారు పిలిచి “పాడబోయి భారతీయుడా” సినిమాలో  హీరోగా అవకాశం ఇచ్చింది కూడా దాసరి నారాయణ రావు గారే. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమాభిషేకం చిత్రంలోని ప్రధాన పాత్రలలో ఉన్న పాత్రలన్నీ కూడా దాసరి నారాయణ బడి నుంచి వచ్చినవే. ఈ పాత్రలో కథానాయిక శ్రీదేవి తమ్ముడిగా వేసింది “ప్రేమఖైదీ” హీరో హరీష్. ఈ సినిమాకి సంభాషణలు రికార్డింగ్ చేసిన వ్యక్తి “కృష్ణంరాజు”. ఈయన అన్నపూర్ణ స్టూడియో మొదలైన దగ్గర నుంచి ఇందులోనే పనిచేస్తూ ఉండేవాడు. తాను రాంగోపాల్ వర్మకు తండ్రి.

వేశ్య పాత్రలో “జయసుధ”…

ఈ సినిమాలో ప్రత్యేక పాత్రకు నటి లక్ష్మీని అనుకున్నారు. కానీ కుదరలేదు. చివరకు జయసుధని సంప్రదించారు. ఆమె తనను ఆ సినిమాలో కథానాయిక కోసం సంప్రదించారని జయసుధ గారు సరే అనేశారు. ఈలోగా పత్రికలలో అక్కినేని, శ్రీదేవితో దాసరి సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అది చూసిన జయసుధ గారు ఎదో పొరపాటున వచ్చిన వార్త అనుకున్నారు. ఈ సినిమా కోసం జయసుధ పదకొండు రోజుల డేట్స్ కావాలి. అందుకోసం మేనేజర్ ను పంపించారు దాసరి. జయసుధ గారు దాసరి నారాయణ రావు గారికి ఫోన్ చేస్తే అవుట్ డోర్ లో సినిమా చిత్రీకరణలో ఉన్నారని తెలిసింది.

మళ్లీ పత్రికలలో అక్కినేని, శ్రీదేవి సినిమా గురించిన సినిమా వార్తలు వచ్చాయి. కొందరు పాత్రికేయులు ఇందులో మీ పాత్ర ఏమిటి అని పదేపదే జయసుధ గారిని అడగడంతో దాసరి గారి సినిమాలో ఏ వేషమైనా వేస్తాను. అది “వేశ్య” వేషమైనా సరే అని చెప్పారు. ఆ తర్వాత షూటింగ్ లో దాసరి నారాయణ రావు గారిని కలిసిన జయసుధ “అన్నపూర్ణ స్టూడియోస్” వారి సినిమాలో శ్రీదేవి కథనాయికగా చేస్తుందా? అని అడిగారు. దాంతో అవునన్నారు దాసరి నారాయణ రావు గారు. మరి నా విషయం ఏమిటి అని అడిగారు జయసుధ. వేశ్య పాత్ర అని చెప్పగానే జయసుధ గారు గట్టిగా నవ్వేసి పత్రిక వాళ్ళతో తాను ఇదే విషయం చెప్పానని తాను దాసరి గారితో అన్నారు.

సంగీతం…

ప్రేమాభిషేకం సినిమాకు సంగీతం చక్రవర్తి గారు అందించారు. అనేక సినిమాలకు స్వరాలు సమకూరుస్తూ తీరిక లేకుండా ఉండే చక్రవర్తి గారు, చాలా బిజీగా ఉండే దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి కలిసి పని చేశారు. చక్రవర్తి గారు మద్రాసు నుండి విమానంలో అన్నపూర్ణ స్టూడియోకి 11 గంటలకు వచ్చి ఉదయం 3 గంటల వరకు నాలుగు గంటలలో నాలుగు పాటలు ట్యూన్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన శ్రీమతి అన్నపూర్ణ గారు అక్కడే ఉండి పాటలను ఓకే చేశారు. అవి “తారలు దిగివచ్చిన వేళ”, “వందనం అభివందనం”, “కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న”, “నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని”. కేవలం నాలుగు గంటలలోనే ఈ నాలుగు సూపర్ హిట్ పాటలను స్వరపరచి అక్కడి నుండి మద్రాసుకు వెళ్లి ఉదయం 8 గంటలకు వేరే పాటల రికార్డింగు లో పాల్గొన్నారు. అంత బిజీగా ఉండేవారు చక్రవర్తి గారు.

ప్రేమాభిషేకం లోని చాలా పాటలు అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించారు. రెండు పాటలు మద్రాసులో తీశారు. “దేవి మౌనమా శ్రీదేవీ మౌనమా” అనే పాటను హైదరాబాదులో ఒక గుడిలో తీశారు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో తీస్తూవున్నప్పుడే దాసరి గారు మరో ఐదు సినిమాలకు అందులో పోస్ట్ ప్రొడక్షన్స్, సన్నివేశాల చిత్రీకరణ లాంటివి చేశారు. ప్రేమాభిషేకం సినిమాకు సమాంతరంగా తన మిగతా సినిమాలు చేసేవారు. అంత బిజీగా ఉంటుండేవారు దాసరి నారాయణ రావు గారు. ఈ సినిమా కోసం 13 పాటలు రికార్డింగు చేశారు. కాకపోతే ఏడు పాటలు మాత్రమే ఆ సినిమాలో పెట్టారు. “జీవితాన్ని చూడు” అనే పాటను సినిమాలో లేదు. కానీ ఆడియో క్యాసెట్ లో ఉంది.

క్యాసెట్ లో కూడా విడుదల చేయని మరో ఆరు పాటలు ఉన్నాయి. ముందుగా జీవితాన్ని చూడు అనే పాటను పెడితే అక్కినేని గారు వద్దన్నారు. దాంతో సవాలుగా తీసుకొని దాసరి గారు “వందనం అభివందనం” అనే పాటను వ్రాశారు. సినిమాలో పాటలన్నీ దాసరిగారే వ్రాశారు. నిజానికి దాసరి గారికి పాటలు వ్రాయడం “బుచ్చిబాబు” సినిమా నుండి అలవాటు అయ్యింది. ఆ సినిమాలో పాటల రచయిత సమయానికి పాటలు అందించకపోతే అక్కినేని గారి అనుమతి తీసుకుని “సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి” అనే పాటతో దాసరి గారు పాటల రచయిత అవతారం ఎత్తారు. ఆ అనుభవంతో ప్రేమాభిషేకం సినిమాలోని పాటలన్నీ దాసరి గారే వ్రాశారు. ఈ పాటలన్నీ ఎంత ప్రజాదరణ పొందాయంటే, ఈ సినిమా విజయంలో అవి ఎంతో కీలక పాత్ర పోషించాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

విడుదల…

ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారంతా ఈ సినిమా బాగానే ఉంది. ప్రేమనగర్ లాగే ఉంది. ఓ మాదిరిగా ఉంది అన్నారు. ఇందులో విలన్ లేరు. ప్రతినాయక పాత్రలు ఉండవు. పాత్రలన్నీ కూడా మంచి పాత్రలే. ఒకటి ప్రేమ, రెండోది త్యాగం. ఈ సినిమా పెద్దగా ఆడుతుందని ఎవ్వరూ చెప్పలేదు. కానీ సినిమా విడుదలయ్యాక మొదటి ఆట నుండి విపరీతమైన ప్రజాదరణ పొందింది. మొట్టమొదటి రోజే ఈ సినిమా రికార్డులు సృష్టించిందని చెప్పాలి. ఎన్ని రికార్డు సృష్టించింది అంటే ఈ సినిమా 32 కేంద్రాల్లో విడుదల చేస్తే 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 29 కేంద్రాల్లో రజోత్సవం జరుపుకుంది.

తెలుగులో తొలి ప్లాటినం జూబ్లీ సినిమా..

అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకున్న మొట్టమొదటి సినిమా ఇదే. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా జయభేరి మ్రోగించింది. ఆ రోజుల్లో ఉదయం ఆటలు (మార్నింగ్ షోలు) ఎక్కువగా ఉండేవి కావు. మధ్యాహ్నం ఆటలు ఎక్కువగా నడిచేవి. ఈ సినిమా 12 కేంద్రాలలో 250 రోజులు ఆడితే, 8 కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడింది. ఈ సినిమా రెండు కేంద్రాల్లో 75 వారాలపాటు ఆడి ప్లాటినం జూబ్లీ జరుపుకుంది. గుంటూరులో విజయా టాకీస్ లో 380 రోజులు ప్రదర్శనమైనప్పుడు అభిమానులంతా కలిసి ఒక శిలాఫలకం పెట్టారు. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో ఉన్న జనాభా, ఆ రోజుల్లో ఉన్న థియేటర్ల సంఖ్య, ఆ రోజుల్లో ఆడినటువంటి ఆటలు అన్నీ లెక్క కట్టుకుంటే ఇప్పటికి కూడా అదే పెద్ద రికార్డు అంటున్నారు విశ్లేషకులు.

విడుదల తేదికి ప్రత్యేకతలు…

ఈ సినిమా మొదలుపెట్టిన తేదీకి, విడుదల తేదీకి, శత దినోత్సవం తేదీకి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా మొదలుపెట్టింది 20 సెప్టెంబరు 1980 లో అక్కినేని నాగేశ్వరావు గారు పుట్టినరోజు నాడు. ఈ సినిమా విడుదలైంది 18 ఫిబ్రవరి 1981 నాడు, అది అక్కినేని గారి పెళ్లి రోజు. శత దినోత్సవం జరుపుకుంది 28 మే 1981 నాడు, అది నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు కలిసి నటించిన చివరి చిత్రం “సత్యం శివం” కూడా మే 28 నాడు ప్రేమాభిషేకం సినిమా శతదినోత్సవం నాడే విడుదలైంది. ఈ విధంగా ఈ సినిమా యొక్క మైలురాళ్లకు ఏదో ఒక తేదీ ప్రత్యేకత ఉంటూ వచ్చింది.

ఈ సినిమా తెలుగులో బాగా ఆడాక ఇతర భాషల్లో కూడా నిర్మించారు. హిందీలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై “ప్రేమ తపస్య” అని తీశారు. దానికి కూడా దాసరి గారే దర్శకులు. అందులో జితేంద్ర, రీనా రాయ్ శ్రీదేవి పాత్రను, రేఖ జయసుధ పాత్ర పోషించారు. “ప్రేమ తపస్య” కూడా బాగాడింది. తమిళంలో ఈ సినిమా కమలహాసన్, శ్రీదేవి, శ్రీప్రియ (జయసుధ పాత్ర) నటించారు. కమలహాసన్ గారు మాట్లాడుతూ తనకన్నా అక్కినేని గారే బాగా నటించారని ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ సినిమా రికార్డులు ఎవ్వరు అధిగమించలేరు.

పురస్కారాలు…

★ నంది అవార్డులు…

ఈ సినిమాలో వేశ్యగా అత్యుత్తమ  నటన కనబరిచినందుకు గానూ ఉత్తమ నటిగా జయసుధ నంది పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సినిమాలో పాటలకు నేపథ్యం గాయకుడిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గానూ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు.

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా భాస్కర్ రాజు నంది పురస్కారం పొందారు.

దర్శకుడిగా అద్భుతమైన సినిమాను అందించినందుకు గానూ ఉత్తమ ప్రత్యేక జ్యూరీ అవార్డును  దాసరి నారాయణరావు గారు దక్కించుకున్నారు.

★ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్..

ఉత్తమ దర్శకుడిగా దాసరి నారాయణరావు గారు ఫిల్మ్‌ఫేర్ అవార్డు ( తెలుగు ) గెలుచుకున్నారు..

నటి జయసుధ ఫిల్మ్‌ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెలుచుకున్నారు.

ఉత్తమ నటిగా జయసుధ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ( తెలుగు ) నామినేట్ చేయబడింది.

ఉత్తమ నటిగా శ్రీదేవి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ( తెలుగు ) నామినేట్ చేయబడింది.

Show More
Back to top button