CINEMATelugu Cinema

వికటించిన అద్భుతమైన ప్రయత్నం… చంద్రహారం సినిమా..

ఒక సినిమా విజయవంతం అయితే దానికి ప్రత్యక్ష మరియు పరోక్ష సంబంధాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందిస్తారు. పేరు ప్రఖ్యాతుల్ని, ఆర్థిక లాభాన్ని, సన్మాన సత్కారాల్ని, పురస్కారాల్ని పొందుతారు. అటువంటి సినిమాని తీసిన దర్శక నిర్మాతలు తదితర సాంకేతిక నిపుణులు దానితో సంబంధం ఉన్న ప్రతీవారు నిర్మితమవుతున్న ప్రతీ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటారు. అయినా చాలా సినిమాలకు విజయం దుర్లభమౌతుంది. చాలామంది నిర్మాతలు ఆర్థిక నష్టాన్ని, దర్శకులు కెరీర్ నష్టాన్ని చవిచూస్తున్నారు. ఒక నిర్మాత విజయం సాధించి లాభం పొందితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మరో సినిమాకి శ్రీకారం చుట్టడం వలన ఆ నిర్మాత వాళ్ళ లభించిన స్ఫూర్తితో నూతన నిర్మాణతలు రంగ ప్రవేశం చేసి సినీ నిర్మాణం చేయడం వలననూ సినీరంగంపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మందికి మేలు జరుగుతుంది.

సినీరంగంలో విజయం అనేది అనేకమంది అంకితభావంతో సమిష్టి కృషిచేస్తేనే సాధ్యమవుతుంది. సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణమైన చక్కని కథను ఎంపిక చేసుకోవడం నిర్మాత బాధ్యతే. కోట్లు ఖర్చు చేస్తూ సినిమా తీస్తే కొందరు నిర్మాతలు కథ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోకుండా దర్శకుడిపై ఆ బాధ్యతను పెట్టడం మంచిది కాదు. సగం సినిమా పూర్తి అయిన కథ బాగోకపోతే నిర్మాతను చూసి జాలిపడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయగలరు. “కాకి పిల్ల కాకికి ముద్దు” అన్నట్టు ఎవరి కథ వారికి గొప్పగా ఉంటుంది, కానీ దాన్ని సినిమాగా తీసే యోగ్యత ఉందో లేదో నిర్ణయించుకోవాల్సింది ముందు నిర్మాత మాత్రమే. కథ విషయంలో సరైన అవగాహన లేకుండా ఆమోదిస్తే స్వయంకృతాపరాధం అవుతుంది. దానికి ఉదాహరణగా చంద్రహారం (1954) సినిమాను పరిగణించవచ్చు.

విజయా వారి నాలుగవ చిత్రం చంద్రహారం. నిజానికి పాతాళభైరవి  (1951) తర్వాత విజయాధినేతలు నాగిరెడ్డి – చక్రపాణి లు అనుకున్నది “చంద్రహారం” ప్రాజెక్టునే. కానీ సరైన ప్రణాళిక లేనందున ఈ సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఏడాది తర్వాత తిరిగి ఆరంభమై అంచెలంచెలుగా సాగి చివరికి మూడేళ్ల తర్వాత పూర్తయింది. ప్రణాళిక లోపం కథ మీద, కథనం మీద కూడా అమితంగా ప్రభావం చూపి విజయావారికి భారీ ఆర్థికనష్టం చూపించింది. ఏ పాతాళభైరవి సినిమా విజయాసంస్థను సమున్నతంగా నిలబెట్టిందో, అదే పాతాళభైరవి సినిమా చంద్రహారం సినిమా విషయంలో ప్రతికూల శక్తి అయ్యింది. ప్రేక్షకులు మొత్తంగా పాతాళభైరవి సినిమాతో “చంద్రహారం” ను పోల్చుకుని పెదవిరిచాడు.

నాగిరెడ్డి – చక్రపాణి లకు ఊహకు కూడా అందని పరాజయాన్ని మిగిల్చింది చంద్రహారం సినిమా.

చిత్ర విశేషాలు….

 • దర్శకత్వం   :   కమలాకర కామేశ్వరరావు  (తొలిచిత్రం)
 • నిర్మాణం   :     నాగిరెడ్డి, చక్రపాణి
 • రచన     :    చక్రపాణి
 • చిత్రానువాదం   :     చక్రపాణి
 • తారాగణం  :   నందమూరి తారక రామారావు, శ్రీరంజని, సావిత్రి, ఎస్.వి. రంగారావు
 • సంగీతం    :    ఘంటసాల వెంకటేశ్వరరావు
 • కథ, మాటలు, పాటలు   :     పింగళి నాగేంద్రరావు
 • కళ      :      మాధవపెద్ది గోఖలే, కళాధర్
 • ఛాయాగ్రహణం      :     మార్కస్ బార్ట్‌లే
 • ఎడిటింగ్      :      సి.పి.జంబులింగం
 • నృత్యం     :     పసుమర్తి కృష్ణమూర్తి
 • నిర్మాణ సంస్థ    :     విజయా ప్రొడక్షన్స్
 • నిడివి      :     181 నిమిషాలు
 • విడుదల తేదీ   :     12 జనవరి 1954
 • భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

చందన రాజ్యాన్ని పాలించే చంద్రచూడునికి మగ సంతానం లేకపోవడంతో తన అల్లుడు ధూమకేతుకే రాజ్యాధికారం అప్పగిద్దామనే నిర్ణయానికి వస్తాడు. ఇంతలో రాజగురువు దివ్యఫలాన్ని ఇచ్చి చంద్రుని అనుగ్రహంతో రాణికి కుమారుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలాగే జరిగి మగ పిల్లవాడు పుడతాడు. మహారాజు కుమారునికి చందనుడు అని పేరు పెట్టి తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన మాలి వద్ద విద్యాబుద్ధులు నేర్పిస్తాడు.  చందనుడికి చంద్రహారాన్ని ఇచ్చిన రాజ గురువు రాజకుమారునికి యుక్త వయస్సులో దేవకన్యల వల్ల ప్రాణగండమున్నదనీ, పెళ్లి చేస్తే ఈ గండం నుండి తప్పించవచ్చని చెబుతాడు. అధికారం చేజారిపోయిందన్న కోపంతో ఉన్న ధూమకేతుకు నిక్షేపరాయుడు జత అవుతాడు. ఇద్దరూ కలిసి చందనుడికి వివాహం కాకుండా అడ్డుపడుతుంటారు.

చందనుడి మనసులో ఒక ఊహ సుందరి ఉంటుంది. బొమ్మగీసి తన ఊహ సుందరి కోసం వెతుకుతుంటాడు. ఆ ఊహ సుందరి పేరు గౌరీ. సిరిపురంలో తన సవతి తల్లి మరిడమ్మ చేతిలో నానాఅవస్థలు పడుతూ ఉంటుంది. గౌరీ అణుకువగల పరమ భక్తురాలు. మరిడమ్మ కూతురు చిన్ని అంటే ఆవిడ మేనల్లుడు బుజ్జాయికి ఇష్టం.  కానీ ఆ వెర్రి బాగులవాడికి గౌరీని ఇచ్చి చేసి కూతురికి పెద్ద సంబంధం చేయాలని మరిడమ్మ వ్యూహం. చంచల అనే దేవకన్య చందనుడిని వలచి తన కోరిక తీర్చమని కోరుతుంది. దానికి చందనుడు తిరస్కరిస్తాడు. దాంతో పగబట్టిన చంచల అతని మెడలో చంద్రహారాన్ని మాయతో హరించి అతన్ని నిర్జీవుణ్ణి చేస్తుంది. కానీ ఆమె సోదరీ అచల చాలా మంచిది. చందనుడిని, గౌరీని కలుపుతుంది.  చెలరేగిపోయిన చంచల మరిన్ని దుర్మార్గాలకు ఒడిగడుతుంది. గౌరీ తన భక్తితో వాటిని ఎలా తిప్పి కొట్టిందన్నది మిగతా కథ.

తారాగణం ఎంపిక...

వాస్తవానికి చంద్రహారం స్క్రిప్ట్ జులై 1950 నాటికే సిద్ధమైంది. కట్టుదిట్టంగా తయారుచేయించిన స్క్రిప్ట్ చేతికి రాగానే తారల ఎంపిక మొదలైంది. యువరాజు చందన్ గా ఎప్పటిలాగానే నందమూరి తారకరామారావు గారినే నిర్ణయించారు. నాయిక గౌరీ వేషానికి శ్రీ రంజని ని నిర్ణయించారు. శ్రీ రంజని గుణసుందరి కథ (1949) తో అప్పటికే ఆంధ్రదేశంలో ఇంటింటా మహిళల మనస్సు లో మహత్తరమైన స్థానం సంపాదించుకుంది. కానీ అందులో ఆవిడ కస్తూరి శివరావు తో జోడీ కట్టింది. ఆమెకు పెద్ద హీరోతో సినిమా అవకాశం ఇవ్వాలని చాలా రోజుల నుండి చక్రపాణి గారి మనస్సులో ఉంది. ఈ సినిమాతో అది నెరవేరింది.

పాతాళభైరవిలో మాయమహల్ వినోద ప్రదర్శనల్లో నాట్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో నర్తించిన సావిత్రిని ఎల్వీ ప్రసాద్ గారి సిఫారసు మేరకు ఈ రెండు చిత్రాల్లో తీసుకున్నారు. “పెళ్లిచేసిచూడు లో రెండో నాయిక. జోగరావుతో జోడి. చంద్రహారంలో పూర్తిస్థాయిలో వేశ్య వేషం. “మల్లీశ్వరి” సినిమాలో రాయలవారిగా అందరినీ అకట్టుకున్న శ్రీవత్స ను చంద్రచూడ రాజుగా, ఆయన భార్యగా వెంకుమాంబను, ధూమకేతుగా రేలంగిని, అతని సహధర్మచారిణి ఆశాదేవిగా సూర్యకాంతంను, నిక్షేపరాయునిగా జోగారావును, కింకరులుగా పద్మనాభం, కే.వీ.ఎస్.శర్మ లను, గౌరీ తండ్రిగా దొరస్వామిని, సవతి తల్లిగా ఋష్యేంద్రమణిని, మారుతి చెల్లి చిన్నిగా పుష్పలతను, ఆమె మేనమామగా పంతులును, అతని వెర్రిబాగుల కొడుకు బుజ్జాయిగా బాలకృష్ణను తీసుకున్నారు.

కథలో కీలకమైన “మాలి” వేషానికి ఎస్వీ రంగారావును, చంచలను మంచిదోవ పట్టించేందుకు ప్రయత్నించే ఆమె అక్క అచలగా కాంతాదేవిని తీసుకున్నారు. బాలచందన రాజుగా వేసింది బేబీ దువ్వూరి అన్నపూర్ణ. 05 ఆగస్టు 1950 నాడు ముఖ్యమైన ఆర్టిస్టులందరికీ మేకప్ టెస్ట్ తీశారు. సరిగ్గా 30 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 5వ తేదీన చిత్రీకరణ ప్రారంభించారు. “పెళ్లిచేసిచూడు” మొదటి షెడ్యూలు మొదలై అప్పటికే చురుగ్గా సాగుతుంది. రెండింటిలోనూ కథానాయకుడు నందమూరి తారకరామారావు గారే కావడంతో తన పనికి ఇబ్బంది కలగకుండా కథానాయిక గౌరీ (శ్రీ రంజని) పై గ్రామ దృశ్యాలతో చిత్రీకరణ ఆరంభించారు. సెప్టెంబర్ 12న పాటల రికార్డింగ్ కూడా జరిగింది.

చిత్రీకరణ ప్రారంభం…

దరిమిలా సిరిపురం దృశ్యాలు, చందన నగర దర్బారు దృశ్యాలు పూర్తి చేశారు. అప్పటికి 61 కాల్షీట్ల పని జరిగింది. శీనయ్య, మరిడమ్మ, బుజ్జాయి, చిన్ని మొదలైన చిన్నపాత్రల సన్నివేశాలు దరిదాపుగా పూర్తయ్యాయి. చందన నగరం దృశ్యాల చిత్రీకరణ ఆరంభించాలి. కానీ తీసిన దృశ్యాలు చూస్తే అందరికీ గుండె చేరువయ్యింది. అవే దాదాపు సగం సినిమా నిడివి ఉన్నాయి. అంటే స్క్రిప్ట్ లో లోపాలు బాగా ఉన్నాయన్నమాట. ఇలాగే చిత్రీకరించుకుంటూ వెళితే సినిమా నిడివి ఐదు గంటల వచ్చేటట్టు ఉంది. వెంటనే స్క్రిప్టును సంస్కరించాలన్న విషయం అందరికీ అర్థమైంది. జూన్ 1951 లో చిత్రీకరణ ఆపేశారు.

స్క్రిప్టు సంస్కరణ…

స్క్రిప్ట్ సంస్కరణ ఆరంభమైంది. కానీ “పెళ్లి చేసి చూడు” చిత్రీకరణ మాత్రం యధావిధిగా సాగుతుంది. రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదని ముందు “పెళ్లి చేసి చూడు” చిత్రం పూర్తి చేశారు. 29 ఫిబ్రవరి 1952 తేదీన “పెళ్లి చేసి చూడు” విడుదలైంది. పెద్ద విజయం సాధించింది. తెలుగు వెర్షన్ విడుదలైన మూడు నెలల తర్వాత తమిళనాడు తమిళ వెర్షన్ “కళ్యాణం పన్ని పార్” విడుదలైంది. అది కూడా అఖండ విజయం సాధించింది. ఇప్పుడు తదుపరి సినిమా బాగా ఆడకపోతే విజయా బ్యానర్ కి అప్రతిష్ట. అందుచేత స్క్రిప్ట్ జాగ్రత్తగా సంస్కరించాలని తీర్మానించారు. ఏం చేశారన్నది వాళ్ళకే తెలియాలి.

ఛాయాగ్రహకుడిగా మార్కస్ బార్ట్లే...

మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తి చేసి 06 ఏప్రిల్ 1952 తేదీన మళ్ళీ చిత్రీకరణ ఆరంభించారు. రెండోసారి చిత్రీకరణ ప్రారంభించే నాటికి ఛాయాగ్రహకుడు కొండారెడ్డి వేరే పనిలో నిమగ్నమై ఉండడం వలన ఈ సినిమా చేయలేని పరిస్థితి వచ్చింది. “కళ్యాణం పణ్ణి పార్” కూడా విడుదల కావడంతో “మార్కస్ బార్ట్లే” ఖాళీ అయ్యారు. తనను వెంటనే “చంద్రహారం” కు తీసుకువచ్చారు. కమలాకర కామేశ్వరరావు గారికి ఇది తొలి చిత్రం. స్క్రిప్ట్ లో జరిగిన మార్పు చేర్పుల వల్ల తనకు కంగారు లేకుండా పర్యవేక్షకులుగా ఎల్వీ ప్రసాద్ గారిని నియమించారు. ఎంతమంది అతిరథులు రంగంలోకి దిగినా కూడా ఎక్కడో ఏదో లోపం జరుగుతున్న అనుమానం అందరినీ వేధిస్తూనే ఉంది. అయితే అదేమిటన్నది ఎవ్వరికీ అంతుపట్టేది కాదు

భారీ నిర్మాణం...

మరిడమ్మ, బుజ్జాయి, చిన్ని పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు మళ్లీ తీశారు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. చంద్రహారం నిర్మాణంలో భారీ పర్వాల్లాంటి ఘట్టాలు కొన్ని ఉన్నాయి. సినిమాలో ఏ ఘట్టాన్ని ఒక్క నిమిషం చూసినా చాలు భారీ చిత్రం అన్న విషయం అర్థం అయిపోతుంది. తెరమీద కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కనిపించే సెట్ ల నిర్మాణానికి చిత్ర యూనిట్  మూడు వారాలు శ్రమించాల్సి వచ్చేది. కొన్ని సెట్లకైతే లైటింగ్ అమర్చడానికి బార్ట్లే కు రెండు కాల్షీట్ల వ్యవధి పట్టేది. భారీ చిత్రాల నిర్మాణంలో దక్షిణాత్యులు ఎవ్వరికీ తీసిపోరని యావత్ భారతదేశానికి చాటి చెప్పిన జెమినీ వారి చంద్రలేఖ (1948) విడుదలైన మరుసటి ఏడాదే విజయా పిక్చర్ ఏర్పాటయ్యింది. నాగిరెడ్డి – చక్రపాణిల మీద జెమిని వాసన్ ప్రభావం బాగా ఉండేది. షావుకారు (1950) సినిమా అపజయం పాలయ్యాక సినిమా నిర్మాణానికి కావాల్సింది తమ అభిరుచులు కాదని జనం కోరిందే మనం తీయాలని వాళ్ళిద్దరూ గ్రహించారు, దరిమిలా పాతాళభైరవి తీశారు.

వెయ్యిమంది అదనపు కళాకారులు…

పాతాళభైరవి సినిమా డబ్బులు బాగా రాబట్టి గల్లా పెట్టెను దండిగా నింపడంతో ఈసారి తీసే జానపదంలో తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఆ భారీతనం తామే అందించాలని నాగిరెడ్డి – చక్రపాణి లు ముచ్చటపడ్డారు. ప్రేక్షకుడికి మూడు నాలుగు సినిమాలు కలిపితే గాని దొరకని సంతృప్తి ఈ ఒక్క చిత్రంతోనే ఇచ్చేయాలనుకున్నారు. స్టూడియోలో కోట సెట్ వేసినప్పుడు దాదాపు 1000 మంది అదనంగా. కావలసి వచ్చారు. “ఎ” ఫ్లోర్ ప్రక్కన మైదానంలో కోట సెట్ వేశారు. ఎత్తైన ప్లాట్ ఫామ్ కట్టి ఆర్చి వేశారు. ఆ ఆర్చీలో రాజకుటుంబం వారు నిలబడతారు. ఆర్చి కి వెనుకగా ఒక కెమెరా యూనిట్, మైదానంలో చెరో ప్రక్క చెరో యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో మనం చూసిన చందన రాజు పుట్టినరోజు వేడుకలు ఈ సెట్ లోనే తీశారు. సినిమాలో కొన్ని నిమిషాల వ్యవధిలో మాత్రమే కనిపించే ఈ సన్నివేశాల చిత్రీకరణకు వారాల తరబడి శ్రమించవలసి వచ్చింది.

నటనలో సాంకేతిక నిపుణులు…  

కోట సెట్ మీద జరిగిన చిత్రీకరణకు రెండు కెమెరా యూనిట్లు పనిచేశాయి. ఒక యూనిట్ కు నాయకుడు బార్ట్లే నాయకుడు అయితే రెండో యూనిట్ కు నాయకుడు మల్లీ ఇరానీ. ఏడాదికి పాతిక సినిమాలు మాత్రమే తయారయ్యే ఆ రోజుల్లో ఇంతమంది అదనపు కళాకారులను ఎక్కడినుంచి తెస్తారు. అంతమంది కళాకారులు మద్రాసులో లేరు. ఈ విషయం తెలిసిన వాహినీ స్టూడియో కార్మికులంతా తాము కూడా వేషం కడతామంటూ మోజుపడ్డారు. క్యాంటీన్ కుర్రాళ్ళు మొదలుకొని ప్రొడక్షన్ మేనేజర్లు, సహాయ దర్శకుల దాకా (ఎం.శేషాచలం, వి.వి.ఎస్.మణి, చలం, మంగళగిరి మల్లికార్జునరావు) ప్రతీ వారు మేకప్ వేసుకుని నిల్చున్నారు. జోగారావు, పద్మనాభం, బాలకృష్ణ, కె.వి.ఎస్.శర్మలయితే ఏకంగా ఆరు, ఏడేసి వేషాలు కూడా వేశారు. ప్రొడక్షన్ యూనిట్ సభ్యులంతా ఇలా వేషాలు వేసుకుని తారలై పోవడంతో ఒక్కో రోజు వాళ్ళు చేసే పనులకు మనుషులు లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యేది.

కార్నివాల్ ను తలపించిన చిత్రీకరణ…

కోట సెట్ పని జరిగినన్నాళ్లు వాహిని లో ఏదో ఒక కార్నివాల్ జరుగుతున్నట్టు ఎక్కడ చూసినా కోలాహలం. చందనపురం రాజు సిరిపురం వీధుల వెంట వచ్చే సన్నివేశాలు తీయడానికి కూడా ఇంచుమించు ఇంత కోలాహలము జరిగింది. ఆ సన్నివేశాల్లో దాదాపు 400 మంది మేకప్ వేసుకొని నిల్చున్నారు. దర్బారు సన్నివేశాలు సరే సరి. అక్కడ భారీ ఎత్తున జనం చిత్రికరణలో పాల్గొన్నారు. ఇక దేవలోకం సెట్ మరొక పెద్ద తతంగం. ఇక్కడ మందలు ఉండరు. ఉండేదల్లా ఓ నలభై మంది దేవతలు, ఋషులు. మరో పది మంది నాట్యగత్తెలు. ఇంద్రలోకం సెట్ (ఇంద్రుడిగా వేసింది ఆర్.నాగేశ్వరరావు) వాహినీలోకెల్లా పెద్దయిన “డి” ఫ్లోర్ లో వేశారు. చుట్టూ రెండింతల తాడిచెట్లు, స్తంభాలు అమర్చారు. స్తంభాల మధ్య దేవతల కోసం ఆసనాలు వేశారు. వాటికి ఎదురుగా ఇంద్రుని ఆసనం ఉంచారు. దానికి రెండు ప్రక్కల చిన్న ఆసనాలు. మూడు వైపులా ఆక్రమించిన ఈ ఆసనాల క్రింద ఎత్తయిన అరుగు. ఆసనాలను, అరుగును చక్కటి నగిషీలతో అలంకరించారు. నేల మీద పెయింట్లతో డిజైన్లు వేసి వార్నీష్ చేశారు. దేవతలు, ఋషులూ ఆసీనులైన ఆ దేవేంద్రసభలో అప్సరసల నాట్యం చిత్రీకరిస్తుంటే వచ్చిన వాళ్లంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూశారు.

చిత్రీకరణకు 52 సెట్ లు…

చంద్రహారం సినిమాలో చిన్నా చితకా కలుపుకొని మొత్తం 52 సెట్లు ఉన్నాయి. చిత్రీకరణ అంతా దాదాపు వాహినీ లోనే జరిగింది. నిక్షేపరాయుడు మీద చిత్రీకరించిన ఓహోం ఓహోం హోం.. పాటను మద్రాసు శివారులో ఉన్న సంబరంబాక్కంలో తీశారు. అలాగే గౌరీ మీద చిత్రీకరించిన నీకు నీవే తోడుగా.. లోక యాత్ర సేతువా.. పాటలో కొన్ని షాట్లను ఆంధ్ర సరిహద్దులలో ఉన్న తడ అడవుల్లో తీశారు. మరికొన్ని సన్నివేశాలను ఏర్కాడు కొండల మీద తీశారు. చంద్రహారం తెలుగుతో పాటు తమిళంలో కూడా తయారైందని చెప్పుకున్నాం కదా. తమిళ వర్షన్ లో కూడా దరిదాపుగా తెలుగులో వేసిన వారే వేశారు. అక్కడ రచయిత రామయ్య దాస్. టైటిల్స్ పడేటప్పుడు తెలుగులో వచ్చే విజ్ఞాన దీపమును వెలిగింప రావయ్య.. పాట చాలా మందికి ఈనాటి గుర్తే. తమిళ వర్షన్ లో ఇక్కడ రామలింగ స్వామిగళ్ అనే శివభక్తుడు రచించిన పాటను వాడుకున్నారు. ఘంటసాల సారంగరాగంలో దానికి అద్భుతంగా బాణీ కట్టారు. అప్పట్లో విజయ వారి సంగీత విభాగానికి ఆర్కెస్ట్రా కండక్టర్ గా మాస్టర్ వేణు (నటుడు భానుచందర్ తండ్రి) ఉండేవారు. ఘంటసాలకు సహాయకులుగా పామర్తి, కృష్ణమూర్తి ఉండేవారు.

ఎట్టకేలకు పూర్తయిన చిత్రీకరణ…

డిసెంబరు 1953 లో “చంద్రహారం” సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పతాక సన్నివేశంలో దేవేంద్రుని దర్బార్ లో వచ్చే చంచల నాట్యం చివరిగా చిత్రీకరించడం జరిగింది. అప్పటికే చిత్రీకరణ అయిన భాగాలు నెగిటివ్ కట్టింగ్ పూర్తి అయిపోయింది. డబ్బింగ్ రికార్డింగ్ పూర్తి చేసి అయినంతవరకు రీళ్ళని ప్రింట్లు కూడా తీసేశారు. నిర్మాణం ఆరంభించిన మూడు సంవత్సరాల తర్వాత చంద్రహారం చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయింది. ఖర్చు తడిసి మోపెడయ్యింది. పాతిక లక్షల రూపాయలకు చేరుకుంది. నెగటివ్ ఫిల్ములకు అయిన ఖర్చే మూడున్నర లక్షలు. సౌండ్ నెగిటివ్ కు మరో రెండున్నర లక్షల ఖర్చు అయ్యింది. సినిమాకు పని చేసిన ప్రతీ తార, సాంకేతిక నిపుణుడు తమ యావచ్ఛక్తినీ ఈ సినిమాకు ధార పోశారు. సినిమాను చూసిన ప్రతీవారు సినిమా ఆహా అంటే ఓహో అన్నారు. నాగిరెడ్డి – చక్రపాణిల ముఖంలో ఆనందమే ఆనందం.

విడుదల, ఫలితం…

సర్వాంగ సంశోభితమైన చిత్రాన్ని తయారుచేయడానికి దక్షిణ భారతదేశంలో ఏ నిర్మాత ఇంతకంటే పెద్దయత్నాన్ని గానీ, సఫలయత్నాన్ని గానీ చేయజాలరని వాళ్లు బలంగా విశ్వసించారు. ఆ నమ్మకంతోనే తమ ఆధ్వర్యంలో వెలుపడే “కినిమా” సినీ మాస పత్రిక డిసెంబరు1953 సంచికను చంద్రహారం సినిమా కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఇంత గొప్ప చిత్రానికి ఒక సంచికను యావత్తు అంకితం చేయడానికి ఎంతైనా గర్విస్తున్నామని ప్రకటించారు కూడా. కానీ జనం అలా అనుకోలేదు. 6 జనవరి 1954   తేదీన “చంద్రహారం” సినిమా విడుదలైంది. పావు గంటకే ప్రేక్షకులు ఆవలిస్తూ చిటికలు వేశారు. మరసటి పావుగంటకు గుర్రెట్టి నిద్రపోయారు.

సినిమా బజ్జుంది. మామూలుగా కాదు గుర్రెట్టి మరీ బజ్జుంది. ప్రేక్షక జనం యావత్తు ఇంకా “పాతాళభైరవి” మంత్రంలోనే, “పాతాళభైరవి” మత్తులోనే తూగుతున్నారు. నందమూరి హీరో అనగానే ప్రేక్షకులు ఇందులో కూడా బోలెడు సాహసాలు ఊహించారు. చందన రాకుమారుడు మాత్రం సినిమాలో పది రీళ్ళు నిద్దురోతూనే ఉంటాడు. చంచల చెలరేగిపోయి తనను బెదిరిస్తూ ఉంటే బిక్క ముఖం వేసుకుని అలాగే చూస్తుంటాడు. మాట్లాడితే చాలు గౌరీ తులసి కోట చుట్టూత ప్రదక్షిణ చేస్తూ పేరంటం పాడుతుంది. నేపాల మాంత్రికుడు మాత్రం ఇందులో మాలి అనబడే సాధు బాబా. ఎంత సాధువు అంటే చిత్తూరు నాగయ్య మాత్రమే ఆ వేషం వేసేటంత. మరి యస్వీ రంగారావు గారిని ఎందుకు ఎన్నుకున్నారో నిర్మాతలకే తెలియాలి.

ప్రేక్షకుల స్పందన….

చిత్ర నిర్మాతలు నాగిరెడ్డి – చక్రపాణి లు సినిమా విడుదలైన రోజునే మధ్యాహ్నం పూట బయలుదేరి నెల్లూరు వెళ్లారు. అక్కడ శేషమహాల్లో “చంద్రహారం” ఆడుతుంది. ఆ థియేటర్ నాగిరెడ్డి గారికి పిల్లనిచ్చిన మామగారిది. మామగారి ఇంటికి వెళ్లకుండా మొదటి ఆట సమయానికి వీళ్ళిద్దరూ థియేటర్ వద్దకు చేరారు. సినిమా మొదలైంది. అక్కడ ఎలాంటి అలికిడి లేదు. ఇంటర్వెల్ అయ్యింది. వీరిద్దరినీ గుర్తుపట్టిన కొందరు విద్యార్థులు ఇంటర్వెల్ తర్వాత అయినా సినిమాలో కథ ఉంటుందా? హీరో ఇకనైనా నిద్రలేస్తారా అని అడిగారు. వీళ్ళ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. సినిమా పోయిందని అర్థమైంది. బెల్ మ్రోగి సినిమా మొదలుకాగానే చీకట్లో ఇద్దరు నిశ్శబ్దంగా బయటికి వచ్చేసారు. వారు నేరుగా మద్రాసుకు తిరిగి వచ్చేసారు.

పాతిక లక్షలు నష్టం…

దారిలో ఒక్క మాట మాట్లాడుకుంటే ఒట్టు. టి.నగర్ లోని వాళ్ళ ఇంటికి వచ్చాక (వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. క్రింద నాగిరెడ్డి కుటుంబంతో పాటు చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకున్న చక్రపాణి పిల్లలు ఉండేవారు. పైన చక్రపాణి ఒక్కరికీ ఒక గది ఉండేది. నాగిరెడ్డి గారు అడిగారు టైం ఎంత అయ్యిందని.  రెండున్నర అన్నారు చక్రపాణి గారు. ముక్తసరిగా. మాట్లాడకుండా మేడమీది గదిలోకి వెళ్లి విద్యుత్తు వెలుతురు ఆర్పేసి పడుకున్నారు చక్రపాణి గారు. మర్నాడు ఉదయం కూర్చుని ఇద్దరు ఒక ప్రేక్షకుడిలా సినిమాలో తప్పులను బేరిజు వేసుకున్నారు. ఏమేం తప్పులు చేసారో ఇద్దరికీ బోధపడింది. కానీ వాళ్ళు చేసిన తప్పులకు మూల్యంగా పాతిక లక్షలు చెల్లించవలసి వచ్చింది.

54 ఏళ్ల క్రిందట పాతిక లక్షలంటే ఇవాళ ఎన్ని వందల కోట్ల రూపాయలతో సమానమో మీరే లెక్కవేసుకోండి. సినిమా వాళ్లు ఆ తర్వాత ఎక్కడైనా తారసపడి సినిమా బాగా పోలేదేమి అని అడిగితే నాగిరెడ్డి గారు తట్టుకోలేకపోయేవారు, కానీ చక్రపాణి గారు మాత్రమే తప్పదు అన్నట్టు పరాజయాన్ని అంగీకరించేవారు. ఎట్లా పోద్దయ్యా ఏంటివోడు సగం సినిమా నిద్రపోతూనే ఉంటాడాయే. మరి సినిమా కూడా కునుకెయ్యక ఏటవుద్ది అనేవారు ఛలోక్తిగా. హిట్టయిన సినిమా నిర్మాత కనిపిస్తే మా “చంద్రహారం” సినిమా కన్నా మీ సినిమా బాగుందయ్యా. మాకీపాలి వినోదపు పన్ను తగ్గుద్దులే అనేవారు. ఏ సినిమా విజయవంతం అవుతుందో, ఏ సినిమా పరాజయం పాలవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక పరాజయానికి భారీ మూల్యం అక్షరాలా పాతిక లక్షలు, అదీ డెబ్బయ్యేళ్ళ క్రిందట.

సమీక్ష వ్రాసినందుకు పాత్రికేయుని బదిలీ…

“ఉరుమురుమి మంగళం మీద పడ్డదని” చంద్రహారం సినిమా కూడా ఒక పాత్రికేయునికి బదిలీ శిక్ష వేసింది. అప్పట్లో “ఆంధ్రప్రభ” పత్రికలో సినిమా విభాగాన్ని బొమ్మకంటి సుబ్బారావు చూసేవారు. ఆయన చంద్రహారం గురించి వ్రాస్తూ సినిమా చాలా నీరసంగా ఉన్నదని, నాయకుడు ఎప్పుడు చూసినా నిద్దరోతుంటాడని, కత్తి యుద్ధాలు చాలా పేలవంగా ఉన్నాయని వ్రాశారు. అంతే.. “నాగిరెడ్డి – చక్రపాణి” లకు వెర్రి కోపం వచ్చింది. అసలే పరాజయ భారాన్ని తట్టుకోలేకపోతున్న ఈ ఇద్దరు ఆ పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేసి సమీక్ష వ్రాసిన సదరు పాత్రికేయుడిని అత్యవసరంగా ఉరితీయాలి అన్నంత కోపంగా మాట్లాడారు.

ఆంధ్రప్రభ యాజమాన్యం బొమ్మకంటి సుబ్బారావు గారిని ఊరైతే తీయలేదు గానీ, వెంటనే వేరే ఊరికి బదిలీ చేసింది. ఆ తరువాత విజయాధినేతలు తమ “కినిమా” పత్రికకు బాధ్యతలు వహిస్తున్న ఎడిటర్ కొడవగంటి కుటుంబరావుతో అదే ఆంధ్రప్రభలో మరో వ్యాసం వ్రాయిస్తూ “చంద్రహారం” సినిమా అద్భుతంగా ఉన్నదని, నిజానికి కత్తి యుద్ధాలే ఆ సినిమాకు ముఖ్యమని వ్రాయించారు. కానీ ప్రేక్షకులు అప్పుడే తమ నిర్ణయానికి వచ్చేసారు. సినిమా చీదేసింది. సినిమాలో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే అయస్కాంత శక్తి లేనప్పుడు మనం ఎన్ని వ్రాతలు వ్రాయించినా టికెట్లు తెగవని ఆనాడే ఋజువైంది. ఇది ఈనాటికీ అక్షర సత్యం.

Show More
Back to top button