CINEMATelugu Cinema

మహిళా దర్శకులకు మార్గం చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి… భానుమతి రామకృష్ణ…

అప్పట్లో కన్నాంబ, మాలతి, యస్.వరలక్ష్మి ఇత్యాదులు అందరూ లక్స్ తారలే. లక్స్ సబ్బు వాడమని ప్రకటనలు ఇచ్చినవారే. కానీ ఒక్క తార మాత్రం నేను ఆ సబ్బు వాడను కదా, నేనెలా ఇతరులకు ఆ సబ్బు వాడమని చెప్పేది అంటూ నిరాకరించారు. ఎక్కువ డబ్బులు ఇస్తామనన్నా ఒద్దంటూ ఒప్పుకోలేదు. ఆవిడే భానుమతి. దట్ ఈజ్ భానుమతి. సినిమా అభిమాన సంఘం వారు తనను ఉత్తమ నటిగా ఎన్నుకున్నారు. స్టూడియోలో చిత్రీకరణ లో ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పారు. ఆవిడ వారికి ధన్యవాదములు చెప్పలేదు. తాను చాలా సంతోషం, మీకు మంచి అభిరుచి ఉంది అన్నది. ఆవిడే భానుమతి, ఆవిడ మాత్రమే భానుమతి. తొంభై యేండ్ల తెలుగు సినిమా చరిత్రలో “భానుమతి” స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు. భవిష్యత్తులో కూడా మరో భానుమతి పుట్టదు. భానుమతి అంటే ముప్పిరిగొన్న ఆత్మవిశ్వాసం, అచ్చెరువొందే ఆత్మగౌరవం.

బహుముఖ ప్రజ్ఞాశాలి అనగానే తెలుగు చిత్ర పరిశ్రమలో ఠక్కున గుర్తొచ్చే పేరు డాక్టర్ భానుమతి రామకృష్ణ. తాను నటిగానే కాకుండా రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలుగా, దర్శకురాలుగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఇలా ప్రతి విభాగంలోనూ, ప్రతీ శాఖలోనూ తన ప్రజ్ఞను చాటుకున్న అరుదైన వ్యక్తి తాను. ఇలా పలువిధాలుగా తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వేరొకరు కనిపించరు. ఎనభై యేండ్ల భానుమతి గారి జీవితం తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయం.

సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన భానుమతి గారు అటు సిరిని సంపాదించారు. అలాగే ఇటు ఖ్యాతిని కూడా సాధించారామె. కానీ నిజానికి ఇవేమీ కూడా భానుమతి గారు కోరుకున్నది కావు. సాదాసీదా మధ్యతరగతి ఇల్లాలుగా, పిల్లాపాపలతో సంసారం చేద్దామన్నది మాత్రమే తన చిన్నప్పటి అభిలాష. కానీ ఆ పైవాడికి భానుమతి గారి అభిలాష నచ్చలేదు. ఆ అభిలాషకు కొంచెం నాటకీయతను జోడించి తన నిజ జీవితంలో ఆమె ఊహకు కూడా అందని స్వార్థం జోడించేసాడు. కానీ భానుమతి కంగారు పడలేదు. ఆ సిరి సంపదలను అనుభవిస్తూనే  తాను కోరుకున్న గృహిని జీవితాన్ని కూడా ఆనందదాయకంగా గడిపేసింది.

అహంభావాన్ని కూడా అందంగా ప్రదర్శించగల నేర్పు భానుమతికి మాత్రమే సొంతం. ఇందుకు ఆమె బహుముఖ ప్రజ్ఞా కంచుకవచంలా నిలిచి ఆమె ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దింది. అనేక శాఖలలో ప్రావీణ్యం సంపాదించుకున్నా తన గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా క్రమశిక్షణతో మెలిగిన అరుదైన వ్యక్తిత్వం భానుమతి గారి సొంతం. అందుకే తెలుగు సినిమా చరిత్రలో భానుమతి అధ్యయానికి మరొకటి సాటి లేదన్నది ఘంటాపథంగా చెప్పవచ్చు. తన ప్రతిభను దక్షిణ దేశపు సరిహద్దులు దాటించి, ఉత్తర ప్రాంతంలోనూ అభినందనలు అందుకున్న భానుమతి చలనచిత్ర జీవితం తెరిచిన అధ్యాయమే అయినా కూడా అందులోని విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తిని కలిగిస్తుంటాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం   :    భానుమతి రామకృష్ణ 

ఇతర పేర్లు    :    భానుమతి

జననం    :    07 సెప్టెంబరు 1925   

స్వస్థలం   :    దొడ్డవరం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, 

వృత్తి      :   సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు

తండ్రి       :     బొమ్మరాజు వెంకటసుబ్బయ్య

జీవిత భాగస్వామి :  పి.యస్. రామకృష్ణారావు

పిల్లలు      :   భరణి (కుమారుడు)

మరణ కారణం   :    అనారోగ్యం 

మరణం   :   24 డిసెంబరు 2005, చెన్నై.

నేపథ్యం…

భానుమతి గారు 07 సెప్టెంబరు 1926 నాడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. తన తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. బొమ్మరాజు వెంకటసుబ్బయ్య గారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి భానుమతి. సంగీతం అంటే వెంకటసుబ్బయ్య ప్రాణం. మొదటినుంచి కూడా వాళ్ళది సంగీతజ్ఞుల కుటుంబం. భానుమతి గారిని ఒక గొప్ప సంగీత కళాకారిణిగా తీర్చిదిద్ది కచేరీలు చేయించాలనేది తండ్రి కోరిక. అప్పట్లో వాళ్లది జమీందారు వంశమే. కానీ సుబ్బయ్య గారి హయాం వచ్చేసరికి దాయాదుల కోర్టు వ్యాజ్యాలతో ఆస్తి అంతా హరివేణం అయ్యింది. అందువలన వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, గుడిలోకి వెళ్లడం భక్తి గీతాలు పాడడం, పెద్ద వాళ్ల దగ్గర కూర్చొని పురాణాలు వినడం బాల్యంలో భానుమతి గారికి తప్పనిసరి అభిమాన విషయాలయ్యాయి. పెద్ద కూతురు అంటే సుబ్బయ్య గారికి పంచప్రాణాలు. భానుమతి గారి సంగీత సాధన కొనసాగుతూ వచ్చింది. భానుమతికి సినిమాలలో నటించడం అంటే ఇష్టం లేదు, కానీ చూడడమంటేనే ఇష్టం.

సినీ నేపథ్యం…

భానుమతి గారికి సినిమాలలో నటించడం అంటే ఇష్టం లేదు, కానీ చూడడమంటేనే ఇష్టం. చిత్తజల్లు పుల్లయ్య గారు మొదట తీసిన లవకుశ (1934) సినిమా అంటే భానుమతి గారికి ప్రాణం. అందులో సీతగా వేసిన సీనియర్ శ్రీరంజని అప్పట్లో భానుమతి గారికి ఆరాధ్య దైవం. ఆ రోజుల్లో సినిమాల్లో గాని నాటకాల్లో గాని నటించే నటీమణులంటే చదువుకున్న వారిలో చాలా చులకనభావం ఉండేది. అందుచేత కాస్త మర్యాదస్తుల కుటుంబాల వారెవ్వరరూ కూడా ఆ ఊహలకు కూడా ఆలోచన రానిచ్చేవారు కాదు.  సుబ్బయ్య గారు కూతురు చేత కచ్చేరీలు ఇప్పించాలని మాత్రమే మోజుపడేవారు.

తొలి సినిమా వరవిక్రయం (1939)…

కానీ ఆయన స్నేహితులు గౌరీనాథ శాస్త్రి, గోవిందరాజుల సుబ్బారావు గార్లు మాత్రం అమ్మాయి ప్రజ్ఞ పదిమందికి తెలియాలంటే గ్రామ ఫోన్ రికార్డులు ఇప్పించాలని ప్రోత్సహించేవారు. వీళ్లంతా ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు పుల్లయ్య “వరవిక్రయం” సినిమాలో కాళింది వేషం కోసం బాలిక కావాలని వెతుకుతున్నారని తెలిసింది. చక్కటి గాత్ర శుద్ధి ఆ రోజుల్లో నటీనటులకు చాలా అవసరం. నేపథ్య గానం లేని రోజులవి. పిల్లలను సినిమాలో పెడితే పెళ్లి కాదేమో అని సుబ్బయ్య గారి బెంగ. సరిగ్గా ఆ సమయంలో టంగుటూరు సూర్య కుమారి సినిమాల్లో ప్రవేశించి చాంధసవాదులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆవిడ మేనమామ మైనంపాటి నరసింహారావు గారు ఇచ్చిన ధైర్యంతో సుబ్బయ్య గారు భానుమతి గారిని తీసుకుని పుల్లయ్య దగ్గరికి వెళ్లారు. భానుమతి గారి పాట వినగానే పుల్లయ్య గారు ఆనందంతో మాకు “కాళింది” దొరికింది అనేశారు.

“మాలతీ మాధవం”… 

భానుమతికి పుల్లయ్య గారి మాట పిడుగుపాటులా వినిపించింది. తాను కలలో కూడా ఊహించని పరిణామం ఇది. కానీ సుబ్బయ్య గారు ధైర్యం చెప్పారు. అప్పట్లో పుల్లయ్య గారి సినిమాలకు రేలంగి, కస్తూరి శివరాం ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుండేవారు. నవ్విస్తూ కబుర్లు చెప్పే రేలంగి అన్నయ్య కూడా ఆవిడకు ధైర్యాన్ని ఇచ్చారు. దాంతో భానుమతి గారి తెర జీవితం వరవిక్రయము (1939) సినిమా తో ఆరంభం అయ్యింది. 1939 లో విడుదలైన వరవిక్రయం తో భానుమతి గారి మాటకు, పాటకు కూడా విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక చాలు ఇంటికి వెళ్లి పోదాం అనుకుంటుండగా భవభూతి మధుకావ్యం “మాలతీమాధవం” సినిమాగా తీద్దామని పుల్లయ్య గారు అనుకోవడం భానుమతి గారి ఊహలకు తెరపడడం ఒక్కసారిగా జరిగిపోయాయి.

మాలతి అంటే మాధవుడు ఉంటాడు. ప్రణయ సన్నివేశాలు ఉంటాయి. ఎలా? భానుమతి గారి సమస్య అది. ఆ సినిమాలో పుల్లయ్య గారి మేనల్లుడు శ్రీనివాసరావు హీరో భానుమతి గారికి ఏమో సిగ్గు. అతనేమో బెదురుగొడ్డు. వీళ్ళిద్దరి మధ్య శృంగార సన్నివేశాలు పండించలేక పుల్లయ్య గారు తల పట్టుకుని కూర్చునేవారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా దర్శకుని అనుసరించారు. “మాలతి మాధవం” పరాజయం పాలైంది. కానీ భానుమతి గారికి మాత్రం సినిమా అవకాశాలు ఆగలేదు. “ధర్మపత్ని”, “భక్తిమాల” అలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మనసులో ఎంత అయిష్టత ఉన్నా తనని బయట వాళ్ళు ప్రశంసిస్తుంటే తండ్రి ముఖంలో కనిపించే వెలుగు చూసి భానుమతి గారు అన్నీ మరిచిపోయేవారు.

తెలుగులో దర్శకత్వం వహించిన తొలి మహిళ…

తెలుగు సినీ రంగానికి సంబంధించినంత వరకు నటి భానుమతి గారిది ప్రత్యేక అధ్యాయం. సినీ ప్రముఖులు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని వరవిక్రయము (1939) ద్వారా “కాళింది” పాత్రతో వెండితెరపైకి వచ్చిన తాను తర్వాతి కాలంలో కేవలం నటనకే పరిమితం కాలేదు.   తెలుగు సినీ రంగంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు.  భానుమతీ రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన “చండీరాణి” చిత్రంలో నందమూరి తారక రామారావు, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, అమర్‌నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సి.ఎస్.ఆర్ తదితరులు నటించారు. ఈ చిత్రం చండీరాణి 1953 ఆగస్టు 28న విడుదలైంది.

“ప్రేమ” చిత్రం విడుదలైన రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రస్తావశాత్తు రామకృష్ణ గారు జానపద కథను భానుమతి గారికి వినిపించారు. ఆ కథ ఆమెకు నచ్చింది. ఆ కథను వెండితెరకు ఎక్కించే బాధ్యతులు కూడా చేపట్టమంటూ భానుమతి గారిని ప్రోత్సహించారు రామకృష్ణ గారు. తాను వెన్నంటే ఉండి సినిమా మొత్తాన్ని పర్యవేక్షిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ జానపద కథే వెండితెర మీద “చండీరాణి” గా వచ్చింది. తీరా ఈ సినిమా తీసే సమయానికి బయట చిత్ర నిర్మాణ సంస్థకు “బ్రతుకు తెరువు” అనే సినిమాను దర్శకత్వం వహిస్తూ రామకృష్ణ గారు తీరికలేకుండా ఉన్నారు.

దాంతో భర్త పర్యవేక్షణ లేకుండానే భానుమతి గారు బాధ్యతలని భుజానికెత్తుకొని ఆ ఇతివృత్తాన్ని సినిమా కథగా విస్తరించుకొని ఎన్టీఆర్ గారిని కథానాయకుడిగా ఎంచుకొని, “చండీరాణి” గా, “చంప” గా తాను రెండు పాత్రలు పోషిస్తూనే దర్శకురాలిగా అవతరించారు. ఆ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు మాత్రం రామకృష్ణ గారు నిర్వహించారు. ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో మూడింటిలో ఈ చిత్రం రూపొందింది. అంతేకాక మూడు భాషల్లోనూ ఒకే రోజున 28 ఆగస్టు 1953 నాడు దేశవ్యాప్తంగా విడుదలైంది. అది అప్పటికి ఇప్పటికీ చెరిగిపోని అరుదైన ఘనత. అలా “చండీరాణి” ఏకకాలంలో మూడు భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వర్షన్ లలో ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే వ్రాసుకొని, స్వర రచనకు పర్యవేక్షకురాలిగా వహించిన తొలి మహిళగా భానుమతి రికార్డు సృష్టించారు. అది ఇప్పటికి చెరిగిపోని రికార్డు. మూడు భాషలలో ఘన విజయం సాధించింది.

గాయనిగా..

భానుమతి గారు గాయనీమణుల్లో ఎస్.వరక్ష్మి, పి.లీల, పి.సుశీల, లతామంగేష్కర్ గార్లను విశేషంగా అభిమానించే వారు. గాయనిగా ఆమె ప్రతిభ, పాడిన పాటలు ప్రేక్షకాభిమానులకు సుపరిచితాలే. భానుమతి గారి గాత్రం గురించి, తాను పాడిన మధురమైన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను 13 ఏళ్ల ప్రాయంలో ఎలాంటి మాధుర్యాన్ని పలికించారో, ఏడుపదులు దాటిన వయస్సులోనూ అదే మాధుర్యాన్ని తన గళంలో తాను పలికించగలిగారు. తాను ఎప్పటికప్పుడు మారుతున్న కాలాన్ని నిశితంగా గమనిస్తూ, తదనుగుణంగా వ్యవహరించే వారు. అందువల్లే “పత్తుమాద బంధం” అనే తమిళ చిత్రంలోని ఓ ఆంగ్ల గీతాన్ని ఉషాఉతప్తో కలిసి సమర్ధవంతంగా పాడగలిగారు. అలాగే “తోడు నీడ” లో తాను పాడిన ఆంగ్ల గీతం “వెన్ ఐ వాజ్ జస్ట్ ఎ లిటిల్ గర్ల్.. ఐ ఆస్క్డ్ మై మదర్.. విల్ ఐ బి ప్రెటీ, విల్ ఐ బి రిచ్” అనే పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నటిగా, గాయనిగా భానుమతి గారిని తెలుగు వారికి మరుపురాని మహిళ. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాకారులకు కార్యనిర్వాహణ అధికారిగా, ప్రిన్సిపాల్ గా మూడేళ్లు పనిచేయడం భానుమతి సంగీత ప్రతిభకు లభించిన అపురూపమైన గౌరవం. ఇలా అరుదైన గౌరవాలు తన ప్రతిభకు తగినన్ని పురస్కారాలు పొంది తెలుగు సినిమా బహుమతిగా మిగిలిపోయారు భానుమతి గారు.

వ్యక్తిగత జీవితం…

మకుటం లేని మహారాణిగా సినిమాల్లో వెలిగిపోతున్న రోజులలో ఆమెను ఒక మాములు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తనతో ఆమెను ప్రేమలో పడేలా చేసాయి. ఆ రోజుల్లోనే ఆమెను కథనాయికగా చూస్తూ, ఆమెతో మాట్లాడడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఆ సహాయ దర్శకుడు మాత్రం కేవలం సినిమా చిత్రీకరణ సమయంలో మాత్రమే మాట్లాడేవారు. పలు సందర్భాలలో భానుమతి గారు ఆయనతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా తాను మాత్రం మాట్లాడేవారు కాదట. ఆయన పేరే రామకృష్ణ. స్టార్ కంబైన్స్ వారు తీసిన “కృష్ణప్రేమ” సినిమా భానుమతి గారి జీవితంలో ఓ కొత్త మలుపు తిరిగింది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే భానుమతి గారు రామకృష్ణ గారి ప్రేమలో పడ్డారు. ఆ రోజుల్లో రామకృష్ణ గారు సహాయ దర్శకులు. చాలా రోజులు వాళ్ళది మూగ ప్రేమనే. అది “ప్రకాశము” కాగానే అమ్మ నాన్న గయ్యిమన్నారు. ఆస్తిపాస్తులు లేని మనిషితో నువ్వు కష్టపడుతుంటే చూడలేమన్నారు. అతడిని మర్చిపోమన్నారు.

కానీ భానుమతి గారు నాన్న కూతురు. తాను అనుకున్నది చేసి చూపించింది.  జార్జి టౌన్ “వెంకటేశ్వర స్వామి” వారి ఆలయంలో తాను కోరుకున్న మనిషి చేత తాళి కట్టించుకుంది.  కట్టుబట్టలతో పుట్టిల్లు వదిలి రామకృష్ణ గారితో కాపురానికి వెళ్లిపోయారు. టీ.నగర్ మహాలక్ష్మి వీధిలో ఫ్యామిలీ పోర్షన్ గా రూపుదిద్దుకున్న ఒకప్పటి కారు షెడ్డులో వారి సంసార జీవితం ఆరంభమైంది. అప్పుడు భానుమతి గారి దగ్గర ఎర్రని ఏగాని కూడా లేదు. ఉన్నదల్లా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మాత్రమే. కుంపట్లో అత్తెసరరు పడేసి పుస్తకాలు చదువుకుంటూ వంట చేయడం, సాయంత్రం కాగానే రామకృష్ణ గారితో కలిసి సినిమాకు వెళ్లడం. ఇదే వారి దినచర్య. రామకృష్ణ గారికి ఇంగ్లీషు, హిందీ సినిమాలు అంటే మహా పిచ్చి. మొదట, రెండో ఆట కూడా చూసేసి హాయిగా వెన్నెల్లో కబుర్లు ఆడుకుంటూ వాళ్ళిద్దరు ఇంటికి చేరేవారు. ఇది జీవితం అనుకున్నారు భానుమతి గారు.

మహా పథగమనం…

తెలుగులో భానుమతి గారు కథనాయికగా నటించిన చివరి చిత్రం “గృహలక్ష్మి” (1967). అదే ఏడాది “పుణ్యవతి” కూడా విడుదలైంది. భానుమతి గారికి అప్పటికే ఒళ్ళు వచ్చేసింది. కథానాయిక వేషాలు ఆపేసింది. ఆ తరువాత నాలుగేళ్లకు “చలం” గారి “మట్టిలో మాణిక్యం” సినిమాతో గుణచిత్ర నటిగా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వదినగా, అమ్మగా, మామ్మగా మరికొన్ని సినిమాల్లో నటించారు. తమ అన్యోన్య దంపత్యానికి తెరదించుతూ 1983లో రామకృష్ణ గారు కాలం చేశారు. మారుతున్న సినిమా పోకడలు భానుమతి గారిని కూడా నిరుత్సాహపరిచాయి.

క్రమంగా ఆవిడ సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు. ఇవాళ మద్రాసులో వాహిని, జెమినీలతో పాటు భరణి స్టూడియో కూడా లేదు. చాలాకాలం విదేశాల్లో ఉండి వచ్చిన కుమారుడు “భరణి” మద్రాసులోనే నివాసం ఉండి హాయిగానే గడిపిస్తున్నారు. “భరణి” మద్రాసులోనే స్థిరపడడంతో కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలతో భానుమతి గారు చాలా కాలం శేషజీవితం ఆనందంగా గడిపేశారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ గారు 24 డిసెంబరు తేదీన చెన్నైలోని 2005 తన స్వగృహంలో కన్నుమూశారు.

తన నటనతో ఎదుట ఉన్న నటీనటులపై ఆధిపత్యం చేసేవారు భానుమతి గారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా పాత్ర ఉంటేనే ఆమె నటించడానికి అంగీకరించేవారు. కథానాయిక పాత్ర నుంచి బామ్మ పాత్ర వరకూ భానుమతి ఏ పాత్ర పోషించినా అందులో తన ఆధిక్యతే కనిపిస్తుంది. అరుదైన గౌరవాలు, తన ప్రతిభకు తగినన్ని పురస్కారాలు పొంది, తెలుగు సినిమాకు బహుమతిగా మిగిలిన భానుమతి గారు భూలోక చాపచుట్టి మహాపథగమనం చేరుకున్నారు. భానుమతి గారు బ్రతికి ఉన్నన్నాళ్లూ అందరూ ఆవిడను పొగరుబోతు అన్నారు. చనిపోయాక వారే అది ఆత్మాభిమానం అన్నారు. అప్పుడది నిజం, ఇప్పుడిది నిజం…

వ్యక్తిత్వం…

తాను అనుకున్నది కుందబద్దలు కొట్టినట్లు చెబుతారు భానుమతి గారు. భానుమతి గారు చిత్ర రంగంలోకి ప్రవేశించిన తొలి రోజులలో నటీనటులను దర్శకులు గౌరవించేవారు కాదు. హీరోలను ఏమిట్రా అని, హీరోయిన్లను ఏమే అని పిలిచేవారు. అయితే పుట్టుకతో ఆత్మాభిమానం మెండుగా ఉన్న భానుమతి గారికి ఈ విషయం చాలా బాధించేది. ఓసారి ఓ తమిళ చిత్ర చిత్రీకరణ సమయంలో భానుమతి గారు ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు చాలా ప్రముఖుడు. ఆయన సెట్ లోకి రాగానే భానుమతి గారిని పిలిచి ఏమిటే డైలాగులు చూసుకున్నావా అని అడిగాడు. దాంతో ఆమెకు ఒళ్ళు మండి “ఏమిట్రా డైలాగులు చూసుకునేది” అనడంతో ఆ దర్శకుడితో పాటు సెట్లో ఉన్న వాళ్లంతా బిత్తరపోయారు. ఆ రోజులలో ఈ సంఘటన పరిశ్రమలో చాలా మార్పు తెచ్చింది. అప్పటినుండి భానుమతి గారినే కాదు, మిగిలిన నటీనటులను అందరూ గౌరవించడం ప్రారంభించారు.

తన నటనతో ఎదుట ఉన్న నటీనటులపై ఆధిపత్యం చేసేవారు భానుమతి గారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా పాత్ర ఉంటేనే తాను నటించడానికి అంగీకరించేవారు. కథానాయిక పాత్ర నుండి బామ్మ పాత్రల వరకు భానుమతి గారు ఏ పాత్ర పోషించినా కూడా అందులో తన ఆధిపత్యం కనిపిస్తుంది. ఆవిడది ఉడుం పట్టు. అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. కుమారుడు భరణికి ట్యూషన్ చెప్పిన మాష్టారు దగ్గరే శిక్షణ తీసుకొని 1966 లో వాల్తేరు వెళ్లి మెట్రిక్యూలేషన్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది పి.యు.సి.లో క్లాస్ కూడా సాధించారు. బి.ఏ కి కూడా సన్నద్ధమయ్యారు. కానీ స్పాండిలైటిస్ సమస్య రావడంతో ఉపసంహరించుకున్నారు. చదువు విషయంలో ఉన్న అసంతృప్తిని తన సాహితి వ్యాసంగం రూపేనా తీర్చుకున్నారు భానుమతి గారు.

సశేషం…

భానుమతి పొగరున్న నటీమణి. ఇలాంటి పొగరు సాహితీరంగంలో విశ్వనాథ గారికే చెల్లింది. సామర్థ్యాన్ని మనస్సులో భావిస్తే ఆత్మవిశ్వాసం అంటాం. బయటికి వినిపిస్తే అహంకారం అంటాం. భానుమతి కి ఉన్న తెరపై తన నటనా ఉనికిని తెలియజేసే విధానం శివాజీ, దిలీప్ కుమార్, సుచిత్రా సేన్, పాల్ ముని వంటి వారిలో చూస్తాం. మల్లీశ్వరి, లైలా వంటి తొలినాటి పాత్రలకి భానుమతి లొంగింది. నటిగా మిగతా మలి జీవితం పాత్రలన్నింటినీ ఆవిడ లొంగదీసుకొంది. అందుకనే ఆమె స్థాయినీ, వైలక్షణ్యాన్నీ, వ్యక్తిత్వాన్ని తట్టుకొన్న పాత్రలు మాత్రమే  మలిరోజుల్లో బ్రతికాయి. మిగతా పాత్రల్లో కేవలం భానుమతే కనిపిస్తుంది.

భానుమతిని బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం అతి సుళువుగా అందరూ యిచ్చే కితాబు. కానీ నిజానికి ఆమెను ప్రముఖంగా గొప్ప నటీమణే అనవచ్చు. తనదైన ప్రత్యేకతను ఆద్యంతమూ నిలుపుకొన్న గొప్ప గాయకురాలు అనవచ్చు. మిగతా పనులు ఆమె కోరుకుంటే అల్లుకోగల చిలవలు. కథా రచన ఆమె అభినివేశం, అభిరుచీ ఆమె ప్రత్యేకతలు. తన వ్యక్తిత్వాన్ని యీ వ్యాపార రంగంలో అంత నిర్దుష్టంగా నిలుపుకొని నెగ్గుకు రాగలిగిన ఒకే ఒక్క దమ్మున్న నటీమణి భానుమతి. అక్కినేని, ఎన్టీఆర్ ఆమె సమక్షంలో ఇబ్బంది పడేవారని చెప్తారు. అది వారికి ఆమె పట్ల, ఆమె వయస్సు పట్ల ఉన్న గౌరవం మాత్రమే.

Show More
Back to top button