CINEMATelugu Cinema

అక్కినేని నాగేశ్వరావు, అన్నపూర్ణల పెళ్లి పుస్తకంలో కొన్ని పేజీలు..

పెళ్ళి లేదా వివాహం అనేది సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది. కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.

ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక సుసంస్కారములు జరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారు కాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు.

అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 20 సెప్టెంబరు 1924 నాడు అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. అన్నపూర్ణ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 14 ఆగస్టు 1933   జన్మించింది. 18 ఫిబ్రవరి 1949 నాడు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ ల వివాహం జరిగింది. అక్కినేని దంపతులకు ఇద్దరు కొడుకులు అక్కినేని వెంకట్, నాగార్జున మరియు ముగ్గురు కుమార్తెలు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ. అక్కినేని నాగేశ్వరావు కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ అన్నపూర్ణ స్టూడియో బేనరుపై పరిచయం చేశాడు.

అక్కినేని నాగేశ్వరావు గారు ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతుడైన భర్త. సినిమా చిత్రీకరణ నుండి వచ్చాక సాధారణ గృహస్థుడిగా మారిపోయే అక్కినేని నాగేశ్వరావు గారు అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారు. అలాగే ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు. ఆమె కోసం, పిల్లల కోసం, వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా సమయాన్ని కేటాయించేవారు అక్కినేని నాగేశ్వరావు గారు. ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అక్కడ సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు నిర్మించడమే కాకుండా, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పారు.

అన్నపూర్ణ పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అక్కినేని నాగేశ్వరావు గారు. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు గారు సినిమాలు తగ్గించుకున్నారు. అన్నపూర్ణ గారితో గడిపేందుకు ఎక్కువ సమయం వెచ్చించేవారు. సకుటుంబ సపరివార సమేతం (2000) సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం అక్కినేని నాగేశ్వరావు గారు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అన్నపూర్ణ 2011 డిసెంబరు 28 న మరణించింది.

సహధర్మచారిణి తనను విడిచి వెళ్లిపోయాక అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆమె కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కినేని నాగేశ్వరావు గారు. అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన వాళ్లందరినీ విగ్రహం రూపంలో అన్నపూర్ణమ్మ పలకరిస్తున్నట్లే ఉంటుంది.

మౌనంతోనే అంగీకారం తెలిపిన “అన్నపూర్ణ”…

“లైలా మజ్ను” సినిమా తీసే రోజులలో అక్కినేని నాగేశ్వరరావు గారికి వివాహమైంది. వధువు దెందులూరు (పశ్చిమ గోదావరి జిల్లా) వాస్తవ్యులు శ్రీ కొల్లిపర వెంకటనారాయణ గారి కుమార్తె “అన్నపూర్ణ”. వాళ్ళ పెద్ద స్థితిపరులు. ఆ ప్రాంతంలో గౌరవ ప్రతిష్ట గల కుటుంబం. నిజానికి అమ్మాయికి ఇంట్లో మేనరికం ఉన్నా అదే ఇంట్లో అందరి ఆమోదము పొందలేదు. అక్కినేని వారి అబ్బాయి వచ్చి చూసి వెళ్ళాడు. కుర్రాడు బుద్ధిమంతుడు లాగానే ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. అమ్మాయి అతని అర్థాంగి కావడానికి మౌనం ద్వారా అర్థాంగీకారం సూచించింది.

అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితంలో అనేక ఉద్యమాలు సంచలనం కలిగించి సమస్యలైనట్టే పెళ్లి కూడా చర్చలు, వాగ్వాదాలకు తెరలేపింది. అక్కినేని నాగేశ్వరావు గారు ఇతరుల అసూయ ద్వేషాలకు గురికానంత పేరు, డబ్బు గడించుకున్నారు. వీపు తట్టడానికి వీలులేనంత ఎత్తుకు ఎదిగారు. ఒక వ్యక్తిత్వం గడించుకున్నారు. ఇతరులకు కోపం తెప్పించగలిగేటంత స్వతంత్రంగా అభిప్రాయాలు వెల్లడించసాగారు. ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలు అడిగితే ధీమా గడించుకున్నారు. అందువలన అక్కినేని గురించి ఆకాశరామన్న ఉత్తరాలు, అసభ్యకర ప్రచారాలు ఆరంభమయ్యాయి.

అవినీతిపరుడు, వ్యభిచారి అని వదంతులు..

అక్కినేని నాగేశ్వరరావు గారు వట్టి అవినీతిపరుడు అని, వ్యభిచారి అని కొన్ని ఉత్తరాలు చాటాయి. అందువలన ఆ ఉత్తరాల నిగ్గు వెంటనే తేలిపోయింది. అయినా సినిమా వాడు సినిమా వాడేనని నమ్మలేమని వెంకటనారాయణ గారి బంధువర్గంలో కొందరు వాదరించారు. నాగేశ్వరరావు భావి జీవితంలో బావమరిది, ఆప్తమిత్రుడు కాబోతున్న వెంకటేశ్వరరావు గారు (వెంకటనారాయణ గారి సోదరుడి పుత్రుడు)  ప్రతికూల వర్గంలో ముఖ్యుడయ్యాడు. “నాకు చెప్పకుండా అమ్మాయిని అసలు పెళ్లి చూపులకు ఎందుకు కూర్చోబెట్టారు” అంటూ పెదనాన్న గారితో వాదన ఆరంభించారు వెంకటేశ్వరరావు.

కానీ అప్పటికే వెంకటనారాయణ రావు గారు అక్కినేని కుటుంబానికి మాట ఇచ్చేసారు. అయితే వెంకటనారాయణ రావు గారు ఒత్తిళ్లకు లొంగిపోయారు. ఏలూరు వెళ్తూ అక్కడినుండి గుడివాడ వెళ్లి స్వయంగా అక్కినేని వారితో పెళ్లి వద్దు అనే సంగతి చెప్పి వస్తానని బయలుదేరారు. సోదరుడి కుమారుడు వెంకటేశ్వరరావు గారు కూడా వెంకటనారాయణ రావు గారితో వెళ్లారు. వెళ్లిన మరుసటి రోజు దెందులూరు నుంచి వారి సమీప బంధువు ఒకతను వచ్చాడు. వెంకటేశ్వర రావుని పక్కకు పిలిచాడు. “పాప (అన్నపూర్ణ) నీతో ఒక మాట చెప్పమందయ్యా” అన్నాడు. ఏమని  అంటే “వెంకట రాఘవపురం సంబంధం వద్దని చెప్పొద్దని నాన్నతో చెప్పమని అన్నయ్యతో చెప్పమంది” అన్నాడు నవ్వుతూ. అవునా నిజమేనా అని వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయి అడిగాడు. అవును అందుకే నన్ను పంపించింది. వాళ్ల పెద్దమ్మ ద్వారా నాకు చెప్పించింది. “మనది పెద్ద కుటుంబం. అలా మాటలు జరిగిపోయాక మళ్ళీ మాట తప్పడం మర్యాద కాదు” అని తాను అన్నాడు.

పాతికవేలు నగదు, ఐదెకరాల పొలం…

తండ్రి వెంకటేశ్వరరావు స్వగ్రామం వెళ్లారు. తన తల్లి ద్వారా “అన్నపూర్ణ” తేల్చేసింది. అతడు తప్ప మరొక సంబంధం అక్కర్లేదు అని. అమ్మాయి అన్నపూర్ణ ఇష్టపడింది కాబట్టి తప్పనిసరిగా అన్నగారు వెంకటేశ్వరరావు దారికి వచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టే ముందు అక్కినేని నాగేశ్వరరావు తో ఆస్తిపాస్తుల వివరం అడిగారు. విజయా పిక్చర్ అధిపతి చెరుకూరి పూర్ణచంద్రరావు గారు, కొడాలి వెంకటేశ్వర్లు గారు కూడా వెళ్లారు. తల్లిదండ్రులు సంపాదించిన ఐదు ఎకరాల భూమి (పిత్రార్జితం), పాతికవేల నగదు స్వార్జితం ఉందని చెప్పారు నాగేశ్వరరావు గారు. అయితే సొమ్ము బ్యాంకులోనే ఉందిగా చూడవచ్చా అన్నారు వెంకటేశ్వరరావు గారు.

దానికి నవ్విన నాగేశ్వరరావు గారు నేను చూపించగలిగేది నా డబ్బే అని మీరు నమ్మే పక్షంలో పాతికేం కర్మ లక్ష రూపాయలు చూపిస్తాను. నేను ఎటు తిరిగి సినిమా వాడినే కదా అని నాగేశ్వరావు అన్నారు. దాంతో అదిరిపడడం వెంకటేశ్వరరావు వంతయ్యింది. పెడేల్ మని చెంప దెబ్బ కొట్టినట్టు అయ్యింది వేంకటేశ్వర రావు గారికి. అక్కినేని నాగేశ్వరావు గారు గట్టివాడే అనుకున్నారు. ఒక్క నిమిషం మౌనం ప్రవర్తిల్లింది. గెలుపు నాగేశ్వరావు గారిదే. లౌక్యాన్ని ఒక్క సూటి మాటతో కొట్టేసాడు. ఇంకేం కావాలి అన్నాడు నాగేశ్వరావు గారు కొంచెం నిర్లక్ష్యంగా. ఎటూ తిరిగి మీరు ఆవిధంగా చెప్పాక ఇంకా మేము ఇప్పుడు అడిగి తెలుసుకోవాల్సిందేమీ లేదు. రానున్న రోజులలో మీ జీవితంలో చూసి తెలుసుకునేవే ఉంటాయి అన్నారు తన బావమరిది వెంకటేశ్వరరావు అభిమానం కొద్దీ. అక్కినేని నాగేశ్వరరావు గారు నవ్వారు.

పెళ్ళిలో యస్.వరలక్ష్మి కచ్చేరీ…

పెళ్లి ఆడపిల్ల ఇంటి వారి అంతస్తు తగ్గ వైభవంతో, మగ పెళ్లి వారికున్న గ్లామర్ కు తగ్గ సంబరంతో పెళ్ళున జరిగింది. సినిమా ప్రముఖులు పలువురు వెళ్లారు. ఎస్.వరలక్ష్మి గాన సభలో పాటల కచ్చేరి చేసింది. గూడవల్లి రామబ్రహ్మం గారు, పున్నమ్మ గారు తృప్తిగా నిట్టూర్చారు. పెళ్లి అయిన నాలుగైదు రోజుల తర్వాత మద్రాసు ప్రయాణం అవుతూ అక్కినేని నాగేశ్వరరావు గారు బామ్మర్దిని పక్కకు పిలిచారు. చూడండి బావగారు, నా దగ్గర పెళ్ళికి ముందు రొక్కం పాతిక వేలు ఉందన్నాను కదూ. అందులో పెళ్లి ఖర్చు ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది. గూడవల్లి రామబ్రహ్మం గారే పద్దు వేసి ఇచ్చారు.

ఇకపోతే ఇంక నా వద్ద ఉన్నది ఎంత? అయిదు ఎకరాల పిత్రార్జితం, మరియు మూడు వేల రూపాయలు రొక్కం అన్నాడు. ఇది విన్న బావమరిది వెంకటేశ్వర రావు నిర్ఘాంతపోయారు. “ఇతని గురించి చాలా పొరపాటుగా అంచనావేసుకున్నాను, తాను అసాధ్యుడే. అమ్మాయికిక పరవాలేదు” అనుకున్నారు తన మనసులో. ఆ క్షణంలోనే అక్కినేని నాగేశ్వరావు గారి మీద వెంకటేశ్వరరావు గారికి గౌరవం ఏర్పడింది. అప్పుడే తాను అక్కినేనికి ఆప్తమిత్రుడు అయ్యారు. ఉద్వేగంతో అక్కినేని గారి చేతులు పట్టుకుని బావగారు మన్నించాలి, మీవంటి అల్లుడు దొరికినందుకు నేను నిజంగా ఇప్పుడు గర్విస్తున్నాను. మా పాప అదృష్టవంతురాలు అన్నారు బావమరిది వెంకటేశ్వర రావు గారు.

అక్కినేని అదృష్టవంతులు…

భానుమతి గారు అన్నట్లు నిజానికి అదృష్టవంతుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. ఇతర విషయాలలో మినహాయిస్తే, వైవాహిక జీవితంలో మాత్రం అక్కినేని నాగేశ్వరావు గారు నిజంగా అదృష్టవంతుడు అని అతని బంధువులు, మిత్రులంతా అంటుండేవారు. ఇదే మాటను అక్కినేని నాగేశ్వరావు గారు కూడా హృదయపూర్వకంగా, గర్వంగా అంటారు. అంతటి అనుకూలవతి, ఉత్తమ ఇల్లాలు, సత్యవతి దొరకడం అక్కినేని గారి జీవితంలో శుభోన్నతి సాధించడానికి ఎంతో దోహదం చేసింది. వాస్తవానికి అన్నపూర్ణ గారు అక్కినేని గారికి ఉపన్యాసాలు ఇచ్చి నీతులు చెప్పిందని కాదు.

తెనాలి రామలింగ కవి చెప్పినట్టు వారి దాంపత్యంలో ఆమె ఆకుమాటు పిందెలా అమరి అందగించింది. భర్త పద్ధతులలో మార్పు కావాలని తోచినప్పుడు మౌనంతోనే సహనంతోనే అది సాధించింది. ఆంధ్రదేశంలో ఎందరో ఆడపడుచులు భర్త కావాలని కోరుకునే యువకుడు తనకు వరుడుగా లభించాడని ఆమెకు తెలుసు. కానీ జీవితం సినిమా కథలో నాయికా, నాయకుల ప్రేమ మట్టాలలాగా పూర్తిగా ఆనందంతో నిండిపోయి ఉండదని, అలా నింపుకోవడం వ్యక్తుల వంతు అని ఆమె నేర్చుకుంది. డాక్టర్ల భార్యలాగా, యాక్టర్ల భార్యలకు ఇది కొంత అనుభవానికి వస్తుంది.

నైతికంగా ఉత్తమురాలు అన్నపూర్ణ…

అందరూ దుర్వ్యసనం అనే మద్యపానం గురించి స్వయంగా తెలుసుకోవాలన్న కుతూహలం వలన, వయస్సు అలాంటిది కావడం వలన, మిత్రుల ఒత్తిడి వలన, నలుగురు ఒత్తిడి చేసినప్పుడు తాగకపోతే పద్ధతి కాదంటారన్న అపోహ వలన, తన వృత్తికి అది మంచిది కాదన్న దురభిప్రాయం వలన అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఘట్టంలో అప్పుడప్పుడు మద్యం త్రాగుతూ వచ్చారు. అలవాటుపడ్డారని కాదు, కానీ గత పది, పదిహేనేళ్లలో  అతను మొత్తం ఇరవై సార్లు త్రాగి ఉంటాడు. అది కూడా ఒక పాలు మద్యం అయితే, తొమ్మిదింతలు సోడా వేసుకొని త్రాగేవారు. ఇట్టి విషయం తన భార్యకు తెలియడం అక్కినేని గారికి ససేమిరా ఇష్టం లేదు. ఒకనాడు కొందరు మిత్రుల ఒత్తిడి వలన మామూలు కన్నా కొంచెం ఎక్కువనే తీసుకున్నారు. భోజనం చేస్తే ఆమె పసిగట్టవచ్చునన్న ఉద్దేశంతో లేని చిరాకు నటించి తినే వచ్చానని ముక్తసరిగా టకీమని చెప్పేసి వెళ్లి పడుకున్నారు.

అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేదు. ఎక్కడ, ఎప్పుడు అని కూడా ప్రశ్నించలేదు. ఆ రాత్రి అక్కినేని గారు ఆకలితో అవస్థ పడ్డారు. మరునాడు ఉదయం అతను స్థిమితం పడ్డాక అన్నపూర్ణ గారు అడిగారు మీరు రాత్రి అబద్ధం చెప్పారు అని. అక్కినేని నాగేశ్వరావు గారు ఉలిక్కిపడి తలెత్తు చూశారు. రాత్రి మీరు త్రాగారు, అన్నం తినలేదు. తిన్నాను అని అబద్ధం చెప్పారు. నాకు అప్పుడే తెలిసినా మీరు ఇబ్బంది పడతారు అని అడగలేదు అని అన్నారు అన్నపూర్ణ గారు. అక్కినేని గారు తాను చాలా తెలివైన వాడినని, అద్భుతంగా నటిస్తానని, అబద్ధం అవసరమైతే బాగా చెబుతానని, వెర్రిబాగుల పిల్లని నమ్మించడం సులువు అని అనుకుంటున్న తను తొలిసారిగా ఒక కొత్త సత్యం నేర్చుకున్నారు.

ఎదుటి వాళ్ళ తెలివితేటలను చాలా తక్కువగా అంచనా కట్టి మనం అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా తెలివి తక్కువ తనమని, ఈ అమ్మాయి తన కన్న తెలివైనది అని, అక్కినేని గారు చెబుతున్నది అబద్ధమని తెలిసినా కూడా ఆ సమయానికి నమ్మినట్టు నటించి తననే వెర్రిబాగుల వాడిని చేసిందని నాగేశ్వరరావు గారికి అర్థం అయిపోయింది. దాంతో నాగేశ్వరరావు గారికి భార్య మీద విపరీతమైన గౌరవం పెరిగింది. ఆమె ఎన్నడూ అబద్ధం చెప్పదు. చెప్పవలసిన అవసరం, ఆస్కారం లేని వాతావరణం లో పెరిగిన పిల్ల.  అబద్ధం చెప్పే వాళ్ళ మీద ఆమె కోపగించుకుంటుందని, మాట్లాడదని అక్కినేని గారికి తెలుసు. అక్కినేని గారు తొలిసారిగా భయపడ్డారు. నైతికంగా ఆమె ఉన్నత స్థాయిలో ఉంది. “నిజమే అన్నపూర్ణ” అన్నాడు.

అన్నపూర్ణ మనసు గెలిచిన అక్కినేని…

1951 నుంచి 54 మధ్య రోజుకు రెండు మూడు కాల్షీట్లు ఉంటూ ఉండడం వలన ఉదయం ఆరు గంటలకు వెళ్లే నాగేశ్వరరావు గారు రాత్రి ఏ రెండు మూడు గంటలకో ఇంటికి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. సగటున రోజుకి ఇరవై గంటలు పని చేసేవారు. జీవితం ఏదో నటన ఏదో, నిజమేదో కల ఏదో, నిద్ర ఏదో మెలకువ ఏదో తెలియక తికమక పడిన రోజులవి. ఇంటికి వచ్చిన ఇంత తిని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోవడం తప్ప ఇంట్లో వాళ్ళని పలకరించే తీరిక గానీ, ఓపిక గానీ ఉండేవి కావు. ఆ సమయంలో వాసన్ గారు “సంసారం” సినిమా హిందీలో తీయ సంకల్పించి నాగేశ్వరావు గారిని బుక్ చేయబోయి అతను షాట్ షాట్ కు మధ్య నిద్రపోయే స్థితిలో ఉండటం చూసి అతనిని వదులుకున్నారు.

ఒకనాడు అక్కినేని నాగేశ్వరరావు గారు బాగా అలసిపోయి నీరసంతో, నిద్రమత్తుతో రాత్రి పూట కారు దిగి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ అక్కడే పడుకుని నిద్రపోయారు. కారు చప్పుడైనా తలుపు తట్టిన చప్పుడు కాకపోవడంతో పదినిమిషాలు చూసి అన్నపూర్ణ బయటకు వచ్చింది. అలసటతో ఒళ్ళు తెలియని నాగేశ్వరరావును భార్య, తల్లి ఇంచుమించు మోసుకుని లోపలికి తీసుకువెళ్లారు.  మర్నాడు ఉదయం నాగేశ్వరరావుకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఎదర అన్నపూర్ణ ఎన్నడూ లేనిది కంటతడి పెట్టింది. అప్పుడు అక్కినేని గారు లేదు అన్నపూర్ణ ఇంక ఇన్ని సినిమాలలో ఎప్పుడూ నటించను. ఎక్కువ పని చేయడం కూడా ఒక వ్యసనమని ఇప్పుడు తెలుస్తోంది, బాధపడకు అన్నారు నాగేశ్వరరావు గారు.

ఆనాడు ఆరంభించిన ప్రయత్నం అమలులోకి వచ్చి సంవత్సరానికి ఐదు చిత్రాలకు పరిమితం కావడానికి రెండు, మూడేళ్లు పట్టింది. “నేను ఆ నిర్ణయం చేయడానికి మిగతా కారణాలు ఉన్నా, ముఖ్యమైనది ఆమె మనసు నొప్పించకూడదన్నదే” అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

Show More
Back to top button