CINEMATelugu Cinema

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ”… టంగుటూరి సూర్యకుమారి..

“మా తెలుగుతల్లికీ మల్లెపూదండ” పాట వినగానే గుర్తొచ్చే పేరు టంగుటూరి సూర్యకుమారి. టంగుటూరి సూర్యకుమారి పేరు వినగానే గుర్తొచ్చే పాట “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ”. నటిగా కంటే గాయని గానే తాను ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. అనేక గీతాలను, దేశభక్తి గేయాలను గ్రామఫోన్ రికార్డులుగా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గా సేవలు అందించి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడి కూతురు టంగుటూరి సూర్యకుమారి గారు. తన అసలు పేరు టంగుటూరి సూర్యప్రకాశమ్మ. సన్నిహితులు ముద్దుగా పిలుచుకున్న పేరు సూర్య.

టంగుటూరి సూర్యకుమారి గారు చలనచిత్ర నటి, గాయని, రంగస్థల నటి, కళాకారిణి, మొట్టమొదటగా మిస్ మద్రాసు గౌరవాన్ని అందుకున్న అద్భుత సౌందర్యరాశి. సుసంపన్న కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించడం, ఆ ప్రావీణ్యతలను విదేశీ గడ్డమీద ప్రాచుర్యంలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా టంగుటూరు సూర్యకుమారి గారు సాధించిన విశిష్టతలకు ఉదాహరణ. తన జీవితాన్ని విహంగ వీక్షణంలో చూస్తే పదిహేను సంవత్సరాలు సినీ జీవితంలోనూ, సుమరు ఐదు సంవత్సరాలు అమెరికా లోనూ, తన జీవితంలో రెండో సగభాగం ఇంగ్లాండు లోనూ గడిపారు.

ఆ రోజుల్లో కేవలం ప్రజ్ఞాపాటవాలతో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లోకి చొచ్చుకెళ్లిన తన ధైర్య సాహాసాలను ప్రదర్శించిన సూర్యకుమారి గారిని ఈ రోజుకి కూడా గుర్తు తెచ్చుకోవాలి. స్వాతంత్రోద్యమ సమయంలో వాళ్ళ పెదనాన్నతో కలిసి రాజకీయ వేదికల మీద ఆలపించిన దేశభక్తి గీతాలు విపరీతమైన సంచలనాలను సృష్టించాయి. సినిమాలలో నటిస్తూ కూడా లలిత గేయ రంగంలో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న తెలుగు యువతి టంగుటూరి సూర్య కుమారి. మిస్ మద్రాసు గా ఎంపికైన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. మిస్ ఇండియా పోటీల్లో ద్వితీయ మహిళగా నిలిచిన మొట్టమొదటి తెలుగు మహిళ టంగుటూరి సూర్యకుమారి గారు.

హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు పొందిన మొట్టమొదటి యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. హాలీవుడ్ ప్రముఖులకు తెలుగు పాటలు రుచిచూపించిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు “హిచ్ కాక్” కి కథా విభాగంలో పనిచేసిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్య కుమారి గారు. న్యూయార్క్ “హాఫ్ బ్రాడ్ వే” లో వారానికి ఒకసారి కొనసాగిన ఆంగ్ల నాటక రంగంలో ప్రధాన పాత్ర ధరించి ఉత్తమ నటి గా బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు.

లైఫ్ మ్యాగజైన్ పూర్తి పేజీ రంగుల పేజీలో ముద్రించబడిన తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. కొలంబియా యూనివర్సిటీలో భారతీయ సంగీతాన్ని, నృత్యాన్ని బోధించిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సురకుమారి గారు. లండన్ లో భారతీయ నృత్య సంగీత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన నలభై సంవత్సరాలు నడిపిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్య కుమారి గారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    టంగుటూరి సూర్యకుమారి

ఇతర పేర్లు  :  సూర్యప్రకాశమ్మ

జననం    :     13 నవంబరు 1925    

స్వస్థలం   :    రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశం

వృత్తి      :      తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు.

తండ్రి    :   టంగుటూరి శ్రీరాములు

తల్లి     :   రాజేశ్వరి 

జీవిత భాగస్వామి  :    హెరాల్డ్ ఎల్విన్ 

బంధువులు   :    టంగుటూరి ప్రకాశం పంతులు 

మరణ కారణం  :  వృద్ధాప్యం 

మరణం    :   25 ఏప్రిల్ 2005, లండను

నేపథ్యం…

టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. ప్రకాశం పంతులు గారి చిన్న తమ్ముడు జానకి రామయ్య గారు లండన్ లో డాక్టరు చదువుకున్నారు. తాను డాక్టరు గా ప్రాక్టీసు చేసే క్రమంలో తాను మద్రాసులో స్థిరపడ్డారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాయర్ గా మద్రాసు లో స్థిరపడ్డారు. మధ్యలో ఉన్న వాడు ప్రకాశం పంతులు గారి పెద్ద తమ్ముడు శ్రీరాములు వకీలు గా రాజమండ్రి లోనే స్థిరపడ్డారు. శ్రీరాములు భార్య రాజేశ్వరి. శ్రీరాములు గారు అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. ఆంగ్లంలో విపరీతమైన సామర్థ్యం కలిగిన వాడు. వీరికి ఆరుగురు సంతానం. ఆరుగురు సంతానంలో చివరి జన్మించినది టంగుటూరి సూర్యప్రకాశమ్మ. 1925  లో జన్మించారు.

సూర్యకుమారి గారికి ముగ్గురు  అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. అందరికంటే పెద్దవాడు గోపాలకృష్ణ రావు. మద్రాసు ఫైర్ సర్వీస్ లో పోలీసు అధికారి గా పని చేసేవారు. చిట్టచివరిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఒక అన్నయ్య పేరు అచ్యుత రామయ్య. టెన్నిస్ రామారావు అనేవారు. ఇంకో అన్నయ్య పేరు రాజా రామ్మోహన్ రాయ్. తనకు సంగీతం అంటే ఇష్టం. హార్మోనియం వాయించేవారు. వీరిద్దరు బ్రహ్మచారులు గానే ఉండిపోయారు. పెద్ద అక్కయ్య పేరు సావిత్రి. భర్త పేరు ప్రకాశ రావు 1925 – 30 ప్రాంతంలో మద్రాసులో లాయరు గా పనిచేస్తుండేవారు. చిన్నక్కయ్య పేరు పుష్పవల్లి ఈ పుష్పవల్లి గారి కుమారుడే కరుణామయుడుగా పేరు తెచ్చుకున్న విజయ్ చందర్ గారు. ఇక చివరి సంతానమైన ఆరో సంతానమే మన టంగుటూరి సూర్య కుమారి గారు.

బాల్యం….

తాను మాటలతోనే పాటలు నేర్చుకున్నారు. నాలుగు, ఐదు సంవత్సరాకే పాటలు పాడుతుండేవారు. తాను ఎక్కడ నేర్చుకున్నది లేదు. కోయిలలా చక్కగా పాడుతున్నారు అని వాళ్ళ అమ్మగారు అంటుండేవారు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఏమైనా సమావేశాలకు వెళుతుంటే సూర్య కుమారి గారిని కూడా తోడు తీసుకు వెళ్లేవారు. బహుశా అందువలనో ఏమో గాని ఈవిడకు చిన్నప్పటి నుంచి ఆ చొరవ, తెగింపు, ధైర్య సాహాసాలు, పట్టుదల ఇవన్నీ తన పెదనాన్న టంగుటూరి ప్రకాశం గారి నుంచే తనకు వచ్చాయి. తాను ఎక్కడ పాఠశాలకు వెళ్లింది లేదు. సూర్యకుమారి గారి నాన్న గారు, అక్కయ్యలు, అన్నయ్యలు అందరూ చదువుకున్న వారే. కనుక తాను ఇంటి వద్దనే చదువు నేర్చుకున్నారు. తాను పాఠశాలకు వెళ్ళింది లేదు.

సినీ రంగ ప్రవేశం…

సూర్యకుమారి గారు మద్రాసు లో తన అక్క సావిత్రి గారి ఇంటిలో ఉన్నప్పుడు తన 12 ఏళ్ల వయస్సులో పాట బిగ్గరగా పాడుతుండగా వాళ్ళ బావ గారు పిలిచి ఆ పాటను తమిళ చిత్ర నిర్మాత ముందు పాడించారు. కళ్ళముందు కదలాడిన ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్న సదరు నిర్మాత 1937లో తన 12 ఏళ్ల వయస్సు లో “విప్రనారాయణ” అనే తమిళ సినిమాలో బాలనాటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చిత్రీకరణ కొల్హాపూర్ లో జరిగింది. కనుక సూర్యకుమారి గారి అమ్మ గారు తనను తీసుకెళ్లారు. ఆ సినిమాలో పేరును సూర్యప్రకాశమ్మ బదులు సూర్యకుమారి గా తెరమీద వేశారు. అప్పటి వరకు సూర్యప్రకాశమ్మ గా ఉన్న ఆ పేరు అప్పటినుండి సూర్యకుమారి గా మారిపోయింది.

రెండు నెలల పాటు “విప్రనారాయణ” చిత్రీకరణ జరిగింది. మరుసటి సంవత్సరం “అంబికా పతి” అనే సినిమాలో నటించారు. ఆ తరువాత 1938 లో “అదృష్టం” అనే తమిళ సినిమాలో పాత్ర తనకు విపరీతమైన పేరు తీసుకువచ్చింది. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా “జయప్రద” (1938) అనే తెలుగు సినిమాలో  నటించారు  సూర్యకుమారి గారు. 1939 వ సంవత్సరం లో గూడవల్లి రాంబ్రహ్మం గారు రూపొందించిన అభ్యుదయవాద చిత్రం “రైతు బిడ్డ” సినిమాలో సూర్యకుమారి ని బాలిక పాత్రకు ఎంపిక చేసుకున్నారు.  బళ్లారి రాఘవ, కొమ్మూరి పద్మావతీ దేవి ల కుమార్తెగా నటించారు సూర్యకుమారి గారు. ఇందులో “రావోయి వనమాలి బిరబిర రావోయి” అనే పాట తానే పాడారు. ఒకవైపు సినిమాలో నటిస్తూ, సంగీతంలో శిక్షణ కూడా తీసుకునేవారు. ఆ తర్వాత “సుమంగళి” లో నటించారు.

ఆ తరువాత “దేవత” అనే సినిమాలో నటించి 10 పాటలు పాడారు.  ఇలా ఆరు సంవత్సరాలలో తాను 14 సినిమాలలో నటించారు. “దేవత” సినిమా తరువాత “ప్రేమ బంధన్” అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత మహాత్మా గాంధీ గారి ప్రతిష్ట డాక్యుమెంటరీలో కూడా పాటలు పాడారు సూర్యకుమారి గారు. ఆ తరువాత “భక్త పోతన” సినిమాలో నటించారు. 1942లో “దీనబందు”చిత్రం లో నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ శంకరాడి సుందరాచారి గారే వ్రాశారు. 1943లో చిత్తూరు నాగయ్య గారి సొంత సినిమా “భాగ్యలక్ష్మి” లో నటించారు. 1943 లోనే కృష్ణ ప్రేమ అనే సినిమాలో నటించారు. ఇందులో నారథుని పాత్రలో నటించారు సూర్యకుమారి గారు. 1943లో తన వయస్సు 18 సంవత్సరాలు వచ్చేనాటికి ఆమె నటించిన చిత్రాలు పంతొమ్మిది. 1954లో సూర్య కుమారి గారి నాన్నగారు మరణించారు. దాంతో కుటుంబ బాధ్యతలు తాను మోయాల్సి వచ్చింది.

సూర్య కుమారి గారు తన గాన ప్రతిభను పూర్తిగా ఉపయోగించారు. దాంతో ఆమె నటనకు ఆమెకు అనేక అవార్డులను గెలుచుకున్నారు. తాను “వతన్” (1954) మరియు “ఉదన్‌కటోలా” (1955) అనే హిందీ సినిమాలలో కూడా నటించారు. “ఉదన్‌కటోలా” లో ఆమె హిందీ చలనచిత్ర ఐకాన్ దిలీప్ కుమార్‌ తో కలిసి నటించారు. దాంట్లో అద్భుతమైన నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి ఎంపికయ్యారు.

మిస్ మద్రాసు గా…

టంగుటూరి సూర్యకుమారి గారు అందగత్తె. ఆ రోజుల్లో తాను వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా జనం గుంపులు గుంపులుగా ఆగి చూసేవారు. 1952లో జరిగిన అందాల పోటీలలో టంగుటూరి సూర్యకుమారి గారు మిస్ మద్రాస్ గా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో అందాల పోటీలు అంటే ఈనాటి మాదిరిగా అంగాంగ ప్రదర్శనలు కావప్పుడు. ఆత్మ సౌందర్యానికి పట్టం కట్టిన అద్భుత వేదికలు. సూర్యకుమారి గారిలోని బహుముఖ ప్రజ్ఞ సహజంగానే సినిమా వారిని ఆకర్షించింది.

ఆ రోజులలో అమెరికా సినిమా పరిశ్రమ భారతదేశ సినీ ప్రముఖుల బృందాన్ని హాలీవుడ్ దర్శించేందుకు ఆహ్వానించింది. భారతదేశం నుండి ఎంపిక చేసిన ఇద్దరిలో ఒకరు నర్గీస్ అయితే ఇంకొకరు టంగుటూరి సూర్యకుమారి గారు. ఆమె అందం, ఆకర్షణ, దరహాసం, కంఠ మాధుర్యం, హుందాతనం, బంగారు ఛాయ విదేశీయులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గారిని ఆమె బృందం కలుసుకున్నారు.  1960 వరకు తాను అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. చిత్తూరు నాగయ్య గారు నిర్మించిన “రామదాసు” తన చివరి సినిమా. అందులో ఆమె పాత్ర “సితార బేగం”.

“మా తెలుగు తల్లికీ మల్లెపూదండ”…

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ నాయకుల బహిరంగ సభలు ఎక్కడ జరిగినా కూడా సూర్యకుమారి గారి పాటలు అక్కడ తప్పనిసరిగా వుండేవి. నిజానికి నాయకుల ప్రసంగాలకన్నా, జనంలో సూర్యకుమారి గారి పాటలు వినాలనే ఆసక్తి ఎక్కువ ఉండేది. ముఖ్యంగా శంకరాబాడి సుందరాచారి వ్రాసిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాట తన గొంతులో కొత్త సొగసులు పోయేది. ఆ తరం వారంతా ఈ పాట వింటే చెవి కోసుకునేవారు. సూర్యకుమారి గారు చాలా దేశభక్తి గీతాలు పాడారు. కానీ ఈ పాటకు వచ్చినంతగా తనకు ఇతర పాటలపై ఖ్యాతి రాలేదు. మా తెలుగు తల్లికి పాటకు ఆర్.సుదర్శనం గారు స్వరాలు సమకూర్చారు.

బాలాంత్రపు రజనీకాంత రావు వ్రాసి సంగీతం స్వరపరిచిన శతపత్ర సుందరీ.. ఎవరు విన్నారు ఎవరు కన్నారు..  మ్రోగింపుము జయభేరి.. ఇదే జోత నీకిదే… ఈనాడే పదిహేనవ తేదీ ఎత్తవోయి నీ జెండా..  మాది స్వతంత్ర్య దేశం.. ముక్కోటి కంఠాలు ఒక్క పొంగున పొంగాయి.. వంటి పాటలు, శ్రీశ్రీ వ్రాయగా రజనీ స్వరాలు సమాకూర్చిన ఓహో స్వాతంత్ర్య దేవీ.. ఏవి నీవిచ్చేడి కానుకలేవి.. ఓ మహాత్మా ఏది హింస..?? ఏది అహింస.. అన్న పాటలు, గురజాడ విరచిత దేశమును ప్రేమించుమన్నా..  గీతం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన హే భారత జననీ ఇలా వ్రాసుసుకుంటూ పోతే అనంత గీతాలు. ఈ పాటలన్నీ కూడా సూర్యకుమారి గొంతులో నుంచి జాలువారాకే అమరాత్వాన్ని ఆపాదించుకున్నాయి.

వంశం పేరు, తెలుగుజాతి పేరు సదా గుర్తుండేలా చేసింది ఇద్దరు మహోన్నత వ్యక్తులు. వారు ఒకరు టంగుటూరి ప్రకాశం పంతులు, మరొకరు టంగుటూరి సూర్యకుమారి గార్లు. 1972లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాట వేదికపై పాడడం కోసం ఆమె ప్రత్యేకంగా హైదరాబాదుకు వచ్చారు. ఆ సభలలో ఇదొక ప్రత్యేక ఆకర్షణ. పాశ్చాత్య నాట్యకళ, చిత్రకళ, సంగీతాల గురించి అధ్యయనం చేసేందుకు ఆవిడ లండన్ కు వెళ్లారు. అక్కడ మన భారతీయ కళల పట్ల విదేశీలకున్న ఆసక్తిని గమనించి వాటిని బోధించడానికి అక్కడే ఉండిపోయారు సూర్యకుమారి గారు.

వ్యక్తిగత జీవితం…

భారతీయ సంస్కృతిని నలుగురికి పంచేది చీర కట్టే అని అందరికీ నేర్పించారు సూర్యకుమారి గారు. ఇంగ్లాండు తన శాశ్వత నివాసం చేసుకోవాలనుకున్న తర్వాత అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలలలో పూర్తిగా మమేకమయ్యారు. భారతీయ సంగీతం, సంస్కృతిని పాఠశాలలో ప్రచారం చేసేవారు. ఆ సంగీతం పరిచయం కోసం బీబీసీ వారికి డాక్యుమెంటరీ కూడా తయారుచేశారు. 1965 లో బ్రిటన్ చేరినప్పుడు సూర్య కుమారి గారికి హెరాల్డ్ ఎర్విన్ పరిచయమయ్యారు. అతను ఒక చిత్రకారుడు. ఎనిమిదేళ్ల వారి పరిచయం క్రమంగా ప్రణయానికి, అక్కడ నుండి పరిణయానికి దారి తీసింది. ఒక సంప్రదాయ భారతీయ కుటుంబంలో పుట్టిన టంగుటూరి సూర్య కుమారి గారు 46 ఏళ్ల వరకు అవివాహిత గా ఉండడమంటే అది ఒక విశేషం.

అయితే ఆ వయస్సులో 66 ఏళ్ల వయస్సున్న విదేశీ వ్యక్తిని, అందులోనూ విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహమాడాలని నిర్ణయం తీసుకోవడం మరోచరిత్ర. వారిద్దరిది ఆదర్శ దాంపత్యం. లాంఛనంగా 1973లో వివాహం చేసుకున్నా, అంతకుముందు నుండే వారు సహజీవనం చేస్తున్నారని ఇందుకు సాక్షాలున్నాయి. ఆ కాలానికి అది ఒక సాహాసమే. స్తబ్దతగా ఉండటం సూర్యకుమారి గారికి తెలియదు. ఎప్పుడూ అదే చలాకితనం. ఇంగ్లాండ్ లో “ఇండియా పర్ఫార్మింగ్ సొసైటీ” ని స్థాపించి ఎందరికో సంగీతాన్ని, నృత్యాన్ని శిక్షణ ఇస్తూ వారిని తన వెంట ఐరోప దేశాలు తిప్పి ప్రదర్శన ఇప్పించేవారు. తన జీవితానికి చేదోడు వాదోడుగా ఉన్న తన భర్తను 1985లో కోల్పోయారు సూర్యకుమారి గారు.

శాశ్వత నిద్ర…

1973లో హెరాల్డ్ ఎల్విన్ గారిని వివాహం చేసుకున్న సూర్యకుమారి గారు తన జీవితానికి చేదోడు వాదోడుగా ఉన్న భర్తను 1985లో కోల్పోయారు. తన భర్త చివరి యాత్రలో తంబూర వాయిస్తూ, భగవద్గీత భజగోవిందం శ్లోకాలు గానం చేశారు. ఆమె ఒంటరి. తనకు పిల్లలు లేరు. దేశం కాని దేశమైనా వాటన్నింటినీ తన ఆధ్యాత్మిక శక్తితో అధిగమించారు. అలా జీవనయానం గడిపిన సూర్యకుమారి గారు ఇరవై సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రదర్శనలు ఇచ్చారు. తన వయస్సు 75 కు చేరుకోగానే చలాకీగా కనిపిస్తున్న ఆమె ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ప్రతి దీపావళి పండుగకు ఆసుపత్రిలో రోగుల, ఉద్యోగుల వినోదార్థం కచేరీలు పాడడం సూర్యకుమారి గారికి అలవాటు. ఆ దీపావళి నాడు కూడా అలాగే చేశారు.

ఏదో అనారోగ్యం వల్ల ఆమె బలహీనంగా ఉంటున్నది. ఇంటి దగ్గర మాత్రమే జబ్బుల గురించిన మాటలు, బయట చలాకి పనులే. అలా దాదాపు ఆరు నెలలు సాగింది. ఆమె ఆసుపత్రికి చికిత్సకు వెళుతున్నా కూడా అదే ఉత్సాహం. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత తన బాధను దిగమింగుకుంటూ, ఇతర రోగులను సందర్శిస్తూ వారు కోరిన పాటలు పాడుతూ కూని రాగాల ద్వారా వారిని ఉత్సాహపరుస్తూ ఉండేవారు సూర్యకుమారి గారు. 25 ఏప్రిల్ 2005 రాత్రి 11 గంటలకు సమయం వరకు రోగుల మధ్య గడిపిన ఆమె బెడ్ మీద పడుకున్న టంగుటూరు సూర్యకుమారి గారు నిద్రలోకి జారుకున్నారు. అదే తన శాశ్వత నిద్ర అయ్యింది. అర్థరాత్రి దాటిన అరగంటకు అత్యంత సఫలమైన తీరిక లేకుండా గడిపిన ఓ కళాకారిణి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి, విదేశాలలో మెట్టి ఎనలేని కీర్తి గడించిన టంగుటూరి సూర్యకుమారి గారు లండన్ లో మరణించారు.

Show More
Back to top button