ఈ-కామర్స్ వ్యవస్థలో ఆగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఫ్లిప్‌కార్ట్. కేవలం రూ.4 లక్షలతో 2007లో ప్రారంభమైన సంస్థ 2019లో రూ.43,615 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇంత పెద్ద వ్యవస్థగా మారడానికి కారణం దీన్ని స్థాపకులు బిన్ని బన్సల్, సచిన్ బన్సల్. పేర్లు చూసి ఇద్దరు ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళని అనుకుంటున్నారా? కాదు. వారిద్దరు బాల్య స్నేహితులు కూడా కాదు. ఇద్దరు పుట్టి, పెరగింది ఒకే ప్రాంతమైనా వారిద్దరికి ఒకరికొకరు తెలియదు. ఛండీఘడ్లో పుట్టిన వీళ్లు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను అభ్మసించేందుకు ఐఐటీ ఢిల్లీకి వెళ్ళారు. ఒకే కళాశాల, ఒకే గ్రూప్ కావడంతో ఇద్దరూ స్నేహితులు అయ్యారు.
చదువు అయిపోయాక ఇద్దరు వేరు వేరు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇద్దరు కలిసి పని చేయాలని విధి నిర్ణయం అనుకుంటా. అలా ఒక సంవత్సరం ఉద్యోగం చేశాక మరలా ఇద్దరు అమేజాన్ కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగులుగా ఒకే సారి చేరారు. అప్పటికే అమెజాన్ ఈ-కామర్స్ రంగంలో రాణిస్తుంది. అలాంటి సంస్థలో పని చేయడం వీరికి బాగా కలిసి వచ్చింది. అక్కడ ఇద్దరు కలిసి ఒక సంవత్సరం పని చేసిన తర్వాత.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నారు. అలా వారి దగ్గర ఉన్న రూ.4 లక్షల సేవింగ్స్‌తో ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించారు. మొదట్లో పుస్తకాలను అమ్మేవారు. వ్యాపారం అభివృద్ధి చెందడంతో ఇతర వస్తువులు అమ్మడం ప్రారంభించారు. అతి స్వల్ప కాలంలోనే పెద్ద విజయం సాధించారు. మెల్లమెల్లగా ఇన్వెస్టర్లు పెరిగారు. చిన్న, పెద్ద వ్యాపారసంస్థలను కొంటూ బిజినెస్‌ను విస్తరించారు.
అంతే కాదు క్యాష్ ఆన్ డెలివరీ, EMI, రిటర్న్ ఆప్షన్ అనే పథకాలను ప్రారంభించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. అలా కస్టమర్లు పెరిగారు. 2011లో మూడు అవార్డులు పొందిన స్నేహితులు, 2012లో ఆరు అవార్డులు పొందారు. భారత్‌లో మెరుగైన భవిష్యత్తు ఉన్న కంపెనీలలో ఫ్లిప్‌కార్ట్, తొలి పది స్థానాల్లో.. చోటు సంపాదించుకుంది. 2018లో వాల్‌మార్ట్ కంపెనీ రూ.లక్ష కోట్లతో 70% పైగా ఫ్లిప్‌కార్ట్ వాటను కొనుగోలు చేసింది. కేవలం రూ.4 లక్షలతో ప్రారంభం అయిన స్టార్టప్ కంపెనీ రూ.లక్ష కోట్లకు అమ్మడం అంటే చిన్న విషయం కాదు. ఇంతటి విజయం పొందడానికి ముఖ్య కారణం బిన్ని బన్సల్, సచిన్ బన్సల్‌కు తమ మీద తమకున్న ఆత్మవిశ్వాసం. కొత్తగా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కథ.