CINEMATelugu Cinema

తెలుగు సినిమా చరిత్రలో తొలి హాస్య నటులు.. లంక సత్యం..

లంక సత్యం గారి పూర్తి పేరు లంక సత్యనారాయణ. హాస్యనటుడిగా తనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడిగా కూడా తనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. లంక సత్యం గారు సినిమా దర్శకుడు కూడా అని చాలామందికి తెలియదు. తెలుగు సినిమా టాకీలు ప్రారంభమైన తొలి సంవత్సరాలనుండి అంటే 1936 నుండి తాను మరణించిన 1968 వరకు సుమారు 32 సంవత్సరాలు సినిమా రంగంలోనే జీవించారు. తాను మరణించే సమయానికి తన వయస్సు 53 సంవత్సరాలు మాత్రమే. సినిమాలలో సీరియస్ నటుడుగా ప్రస్థానం మొదలుపెట్టిన మొదటి సినిమా నుండి తరువాత బలవంతంగా హాస్య నటుడిగా కొనసాగుతూ, సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

1940లో విడుదలైన మొట్టమొదటి తెలుగు నవలా చిత్రం అంతా కూడా మొట్టమొదటి సంపూర్ణ హాస్య చిత్రం “బారిష్టరు పార్వతీశం”. అందులో కథానాయకుడు లంక సత్యం. అందులో తొలి హాస్య కథనాయకుడు. తరువాత రోజులలో కథానాయిక గాను, గుణచిత్ర నటిగాను నిరూపించుకున్న జి.వరలక్ష్మి గారితో తొలి కథానాయకుడిగా నటించింది లంక సత్యం గారే. అది కూడా “బారిష్టరు పార్వతీశం” చిత్రంలోనే. తొలిసారిగా తన ప్రక్కన కథానాయికగా నటించిన నటిని తరువాత రోజులలో దర్శకత్వం కూడా చేసిన ఘనత లంక సత్యం గారిదే. తాను దర్శకత్వం చేసిన రోహిణి, మేలిమలుపు కథానాయిక వరలక్ష్మి గారు. తెలుగు సినిమా రంగంలో మూడు సినిమాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేస్తే ఆ మూడింటిలోనూ హీరో లంక సత్యం గారే. తాను నటించిన “బారిష్టరు పార్వతీశం” పూర్తి చిత్రంతో కలిపి విడుదలైన లఘు చిత్రం “బోండాంపెళ్లి”, “చదువుకున్న భార్య” ఈ మూడు చిత్రాలు కలిపి ఒకే చిత్రంగా ప్రదర్శించబడ్డాయి.

తెలుగు సినిమాల్లో దర్శకుడిగా మారిన తొలి హాస్య నటుడు లంక సత్యం గారే. జెమినీ స్టూడియో వారు క్రొత్తగా నిర్మించిన మొట్టమొదటి చిత్రానికి దర్శకత్వం వహించింది లంక సత్యం గారే. అయితే తెరమీద పేరు జెమినీ వాసన్ మిత్రుడు “నీలకంఠ” అని పేరు ఉంటుంది. ఇలా పేరు లేకుండా దర్శకుడుగా పనిచేయడానికి లంక సత్యం గారే విజయ పత్రికలో తాను వ్రాసిన వ్యాసంలో నేపథ్య దర్శకుడు అని పేర్కొన్నారు. అలా తన పేరు లేకుండా దర్శకత్వం చేసిన సినిమాలు ఇంకా రెండు మూడు ఉన్నాయి. ఎస్.ఎస్.వాసన్ జెమినీ పిక్చర్స్ నిర్మించిన తొలిమూడు చిత్రాలలో పాత్రలు ధరించిన గొప్పదనం కూడా లంక సత్యం గారిదే. ఆ చిత్రాలు “మదనకామరాజన్”, “జీవన్ముక్తి”, “బాలనాగమ్మ”

అధికారికంగా లంక సత్యం గారి దర్శకత్వం అని పేరు తెరపై కనిపించిన మొట్టమొదటి సినిమా 1946లో వచ్చిన “భక్త తులసీ దాస్”. ఆ సినిమా నిర్మాణంలో ఒక భాగస్వామి లంక సత్యం  అన్నయ్య గారు. ఆ “భక్త తులసీదాస్” ద్వారా తర్వాత రోజులలో ప్రముఖ నృత్య దర్శకుడైన పసుమర్తి కృష్ణమూర్తి గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి లంక సత్యం గారే. తాను దర్శకత్వం వహించిన తమిళ సినిమాలలో కూడా పసుమర్తి కృష్ణమూర్తి గారికి అవకాశం ఇచ్చారు. పసుమర్తి కృష్ణమూర్తి గారు నృత్య దర్శకుడుగా స్థిరపడడానికి దోహదం చేసింది కూడా లంక సత్యం గారే. ఎం.జీ.ఆర్, వి.ఎన్ జానకి గార్లు కలిసి తొలిసారిగా నటించిన తమిళ “మోహినీ” చిత్రానికి అధికారికంగా దర్శకుడు లంక సత్యం గారే.  దర్శకుడిగా పది సినిమాలు చేసినాక కూడా పరిస్థితులకు తలొగ్గి మళ్లీ సహాయ దర్శకుడిగా మారింది కూడా లంక సత్యం గారే. ఆ సినిమా 1956లో విడుదలైన ఉమా సుందరి. ఆ చిత్రానికి పి.పుల్లయ్య గారి దగ్గర సహకారదర్శకుడిగా పని చేశారు లంక సత్యం గారు.

1968 లో విడుదలైన “సర్కార్ ఎక్స్ ప్రెస్” చిత్రానికి నేపథ్య దర్శకుడు లంక సత్యం గారే. అలాగే తాను మరణించడానికి 4 నెలల ముందు ఆయన దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం “బెంగళూరు మెయిల్” విడుదలైంది. దాని హీరో కన్నడ కంఠీరవ “రాజ్ కుమార్”. 1962 లో విడుదలైన ఎన్టీఆర్ హీరోగా నటించిన “టైగర్ రాముడు” సినిమాకి మూడింట ఒక వంతు దర్శకత్వం చేసింది లంక సత్యం గారే. తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషలకు ముగ్గురు మూడు భాషల సూపర్ స్టార్లు ఎన్టీఆర్, ఎం.జీ.ఆర్, రాజకుమార్ లను దర్శకత్వం చేసిన ఘనత కూడా లంక సత్యం గారిదే. రికార్డుల పరంగా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఆయన దర్శకత్వం చేసిన సినిమాలలో ఒకటి రెండు తప్ప మిగిలినవి ప్రజదరణ పొందకపోవడం, అటు దర్శకుడిగా, ఇటు హాస్యనటుడిగా రెండు పడవల మీద ప్రయాణం సమర్థవంతంగా చేయకపోవడం, వీటి వలన లంక సత్యం గారికి రావలసినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది.

లంక సత్యం గారి తరువాత సినీ రంగ ప్రవేశం చేసి ఆయన కళ్ళ ముందే స్టార్లు అయిపోయిన రేలంగి, కస్తూరి శివరావు, రమణారెడ్డి గార్లతో పోలిస్తే లంక సత్యం గారు పోషించిన హాస్య పాత్రలు చిన్నవే అని చెప్పాలి. అక్కినేని, ఎన్టీఆర్, గుమ్మడి, ఎస్వీఆర్ లాంటి అలనాటి ప్రముఖ నటులందరి కంటే పదిహేను సంవత్సరాలకు ముందే నటుడిగా కొనసాగుతూ గౌరవ అభిమానాలను అందుకున్న స్నేహశీలి లంక సత్యం గారు. దర్శకుడిగా అవకాశాలు రాక వేషాల కోసం తిరుగుతున్నప్పుడు అక్కినేని, ఎన్టీఆర్ గార్లు సినిమాలలో ఏదో ఒక పాత్ర ఇప్పించి లంక సత్యం గారి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

హాస్యనటుని కోణంలో చూడాలంటే 1950 – 60 దశాబ్దాలలో లంక సత్యం, నల్ల రామమూర్తి అన్న పదాలు తరచూ వెండితెరపై కనిపిస్తూ ఉండేవి. లంక సత్యం గారు తనదైన ముద్ర వేసిన హాస్య చిత్రాల గురించి ఉదహరించాలంటే బాలనాగమ్మ (1942), బాలనాగమ్మ (1959), వెంకటేశ్వర మహత్యం (1960), ఇద్దరు మిత్రులు (1961) జగదేకవీరుని కథ (1961), గులేబకావళి కథ (1962), రాముడు భీముడు (1964) ఇలా సుమారు 60 నుండి 70 చిత్రాలలో తనదైన హాస్య నటనను ప్రదర్శించారు. లంక సత్యం గారు తాను మరణించే నాటికి తెలుగు సినిమాకు దర్శకత్వం చేసిన పనిలో ఉన్నారు. 19 ఫిబ్రవరి 1968 నాడు హఠాత్తుగా లంక సత్యం గారు కన్నుమూశారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    లంక సత్యనారాయణ 

ఇతర పేర్లు   :    లంక సత్యం 

జననం    :    04 ఆగస్టు 1915

స్వస్థలం   :  కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

జీవిత భాగస్వామి   :   సత్యావతి 

పిల్లలు   :   ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు 

వృత్తి      :    హాస్య నటుడు, గుణ చిత్ర నటుడు , చిత్ర దర్శకుడు 

మరణ కారణం   :   గుండెపోటు 

మరణం   :   19 ఫిబ్రవరి 1968

నేపథ్యం…

లంక సత్యం గారు 04 ఆగస్టు 1915 నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు కాకినాడలో గుమస్తాగా పని చేస్తూ ఉండేవారు. ఐదుగురు అన్నదమ్ములలో చివరివాడు లంక సత్యం. వారిది మధ్యతరగతి కుటుంబం. చదువు కూడా అంతంత మాత్రమే ఉండేది. తన చదువు ఎనిమిదో తరగతి తరువాత ఆగిపోయింది. తనతోబాటు చదువుకున్న వారు బి.ఏ.సుబ్బారావు, సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గార్లు కూడా ఉన్నారు. లంక సత్యం గారు చదువు మానేయడంతో నాటకాలు మొదలుపెట్టారు.

లంక సత్యం గారు ఆడవేషాలు వేసేవారు, సీరియస్ వేషాలు వేసేవారు, కానీ హాస్య వేషాలు వేయలేదు. మూకీ సినిమాలకు కామెంట్లు చెప్పడం మొదలుపెట్టారు. సత్యం గారి అన్నయ్య లంక కామేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి మంచి చొరవ ఉన్న వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా దూసుకెళ్లగల మనస్తత్వం. కామేశ్వరరావు గారు సచ్చిన్ అనే గ్రామ్ ఫోన్ కంపెనీలో రిప్రెసెంటేటివ్ గా పని చేసేవారు. చదువు మానేసి నాటకాలు వేస్తున్న తమ్ముడు లంక సత్యం గారికి అదే గ్రామ్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు. సత్యం గారు ఉద్యోగ రీత్యా గ్రామ్ ఫోన్ రికార్డులు అమ్మడానికి ఊరూరా తిరుగుతూ ఉండేవారు. ఇదంతా 1933 ప్రాంతంలో లంక సత్యం గారి 18 సంవత్సరాల వయస్సులో జరిగింది.

సినీ ప్రస్థానం…

1932లో టాకీలు మొదలయ్యాయి. సత్యం గారు నాటకాలు వేయడం వలన తనకు సినిమాల పట్ల ఆసక్తి కలిగింది. తనకు బొంబాయిలో తొలిసారిగా దర్శకులు నిరంజన్ పాల్ వద్ద సహాయకుడిగా అవకాశం దొరికింది. భారతదేశంలో తొలి తరం సినిమా రచయితలు, దర్శకులలో ప్రముఖులు ఈ నిరంజన్ పాల్ గారు. తాను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ కుమారుడు. తనకు 1928 నుంచి మూకీ సినిమాల నిర్మాణంలో అనుభవం ఉంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రచయితగా 1935 – 36 లో వచ్చిన “అచ్యుత్ కన్య”, “జన్మభూమి”, “జీవన్యాయ్” లాంటి సినిమాలకు రచనలు చేస్తూ దర్శకత్వ శాఖలో పనిచేసేవారు నిరంజన్ పాల్ గారు.

నటుడిగా తొలి సినిమా “అమ్మ”.. 

లంక సత్యం గారు 1935 నుండి 1939 వరకు నిరంజన్ పాల్ దగ్గిరే పనిచేశారు. దాసరి కోటిరత్నం నిర్మాణంలో, నిరంజన్ పాల్ దర్శకత్వంలో “అమ్మ” (1938) అనే సినిమా  మొదలైంది. ఆ రోజుల్లో నటీనటులు తప్ప మిగతా వారంతా తెలుగేతరులే ఉండేవారు. తెలుగు భాషా రాని దర్శకులు ఆ రోజుల్లో తెలుగు వాడిని సహాయకుడిగా పెట్టుకోవడం లాంటివి చేసేవారు. ఆ క్రమంలో తన దగ్గర అసిస్టెంట్ గా ఉంటున్న లంక సత్యం గారిని సినిమాకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నారు.

సంభాషణలు, పాటలు, ఇలాంటి వాటికి సహాయం చేస్తూ అమ్మ సినిమాలో ఒక పాత్ర కూడా వేశారు లంక సత్యం గారు. అది ఒక విషాద పాత్ర. ఆ సినిమాలో హీరోయిన్ లక్ష్మీరాజ్యం గారు. “అమ్మ” సినిమా 16 మార్చి 1939న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు రెండు వారాల నుండి తెలుగు పత్రికల్లో ప్రకటనలు బాగా గుప్పించారు. లంక సత్యం గారు తొలిసారిగా వెండితెరపై కనిపించింది “అమ్మ” అనే సినిమాలోనే. కొద్ది రోజుల తరువాత రెండో ప్రపంచ యుద్ధమేఘాలు భారతదేశమంతటా ఆవరించాయి. దాంతో తన రెండవ సినిమా ప్రయత్నం విరమించుకున్నారు నిరంజన్ పాల్ గారు. మూట ముల్లె సర్దుకుని బొంబాయి నుండి మద్రాసుకు బయలుదేరారు లంక సత్యం గారు.

హాస్య నటుడిగా తొలి చిత్రం “బారిష్టరు పార్వతీశం”…

మద్రాసులో కూడా తన తొలి గురువు నిరంజన్ పాల్ సిఫారసు పనిచేసింది. మద్రాసులో తెలుగులో తొలి మూకీ సినిమా నిర్మించిన ఆర్.ఎస్.ప్రకాష్ (రఘుపతి వెంకయ్య గారి అబ్బాయి) వద్ద సహాయకుడిగా చేరారు. 1921 నుంచి ఆర్.ఎస్.ప్రకాష్ గారు సినిమాలలో ఉన్నారు. తెలుగులో పూర్తి హాస్య భరిత చిత్రం నిర్మించదలిచారు. అది కూడా నవల చిత్రం. కథనాయకుడు, కథనాయిక లను కొత్తవారిని తీసుకుంటూ 1924 లో మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు వ్రాసిన “బారిష్టరు పార్వతీశం” నవలను సినిమాగా, పూర్తి హాస్య భరిత చిత్రంగా తీయాలనుకున్నారు. నిరంజన్ పాల్ సిఫారసు లేఖతో దర్శకత్వ శాఖలో చేరడానికి వస్తే, సరైన నటులు దొరకక ఆ పాత్రను సత్యం గారినే వేయమన్నారు ఆర్.యస్. ప్రకాష్ గారు. హాస్యం పండించడం తనతో కాదని, కుదరదు అన్నారు లంక సత్యం గారు. కానీ ఆర్.ఎస్.ప్రకాష్ గారు లంక సత్యం గారిని ఒప్పించి తనను ఆ సినిమాలోకి తీసుకున్నారు.

తన తొలి కథానాయిక జి. వరలక్ష్మి…

నాటకాలు వేసే జి.వరలక్ష్మీ గారిని కూడా ఇందులోకి తీసుకున్నారు. ఆమెకు కూడా మొదటి సినిమా “బారిష్టరు పార్వతీశం”. ఎదో కొంత ప్రయోగాత్మకం అనుకున్నా కానీ ఈ సినిమా మొత్తం ప్రయోగాత్మకంగా చేశారు ఆర్.ఎస్. ప్రకాష్ గారు. ఆ ప్రయోగంలో ప్రధాన పాత్రధారి “లంక సత్యం” తన మిత్రుడు కస్తూరి శివరావుకు కూడా ఈ సినిమాలో వేషాలు ఇప్పించారు. ఈ సినిమాకు ముడి ఫిలిం తక్కువగా ఉండడంతో సినిమా యొక్క నిడివి తగ్గింది. దాంతో హెచ్.ఎం.రెడ్డి గారి బావమరిది టి.యల్.రామచంద్ర దర్శకత్వం వహించిన “బోండాం పెళ్లి” సినిమాను కలిపి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 1940 జూలైలో విడుదల చేస్తామని ప్రకటన కూడా వేశారు. ఆ రెండు సినిమాలు కలిపి చూసినా కూడా మూడు గంటల నిడివి రాలేదు.

దాంతో ఆర్.ఎస్. ప్రకాష్ గారు హడావిడిగా “చదువుకున్న భార్య” అనే లఘు చిత్రాన్ని నిర్మించి విడుదల తేదీని ముందుకు జరిపారు. మొత్తానికి “బారిష్టరు పార్వతీశం”, ” బోండాం పెళ్లి”, “చదువుకున్న భార్య” మూడు కలిపి 07 ఆగస్టు 1940 నాడు విడుదల చేశారు. ఓకే టిక్కెట్టు పై మూడు సినిమాలు. ఈ మూడింటిలో కూడా లంక సత్యం, జి.వరలక్ష్మి గార్లు నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే వైవిధ్యమైన ప్రకటనలు ఇచ్చారు. “చదువుకున్న పెళ్ళాం సహితంగా బారిష్టరు పార్వతీశం గారు బోండాం పెళ్లిని జరిపించడానికి వస్తున్నారని, హాస్యకేసరికి సన్మానం అని రకరకాల ప్రచారం ఇచ్చినా గానీ ఆర్.ఎస్.ప్రకాష్ గారి ప్రయత్నం విఫలయత్నం అయింది. సినిమాను ప్రేక్షకులు అస్సలు ఆదరించలేదు. తెలుగులో తొలి హాస్య నటుడి గానే పేరు దక్కింది గానీ, తెలుగు వెండితెర కు ఒక అద్భుతమైన హాస్య నటుడు పరిచయం అయ్యారనే పేరు మాత్రం దక్కలేదు. 

తెరవెనుక దర్శకుడిగా “జీవన్ముక్తి”..

23 ఫిబ్రవరి 1941 “తార శశాంక్” అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది. లంక సత్యం గారు తన భార్యను మద్రాసుకు తీసుకువచ్చారు. స్థిరమైన ఆదాయం వచ్చే పని కోసం లంక సత్యం గారు వెతుకుతున్నారు. అదే తరుణంలో జెమిని వాసన్ గారు ఎం.పీ.సీ.సీ స్టూడియోను కొన్నారు. దానిని జెమినీ స్టూడియోగా మార్చేశారు. వారు నెల జీతం మీద కళాకారులను తీసుకుంటుండేవారు. కె. వెంకట సుబ్బారావు తో ఉన్న పరిచయం కారణంగాలంక సత్యం గారు జెమినీ స్టూడియోలో నెల జీతానికి చేరారు. ఇదంతా 1941 ప్రాంతంలో జరిగింది.

దిండిగల్ అమృతం టాకీస్ వారు నిర్మిస్తూ డబ్బులు లేక చేతులెత్తేసిన మదన కామ రాజన్ అనే సినిమాను జెమినీ వాసన్ గారు  దానిని పూర్తి చేయాల్సి వచ్చింది. జెమినీ వాసన్ తన మొదటి చిత్రాన్ని తెలుగులో తీద్దామని అనుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన “భక్త చేత” అనే సినిమాను తెలుగులో “జీవన్ముక్తి” పేరుతో తీద్దామని అనుకున్నారు. ఈ సినిమాకు తెర వెనక లంక సత్యం దర్శకత్వం చేశారు. కానీ జెమినీ వాసన్ మిత్రులు నీలకంఠన్ గారు సినిమాకు దర్శకుడిగా పేరు వేయించుకున్నారు. ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదల రోజునే మరో కొత్త సినిమా “బాలనాగమ్మ” ని ప్రకటించారు.

ఒకవైపు నటుడిగా చిన్న చిన్న పాత్రలు…

లంక సత్యం గారికి “బాలనాగమ్మ” సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. డిసెంబరు 1942 విడుదలైన “బాలనాగమ్మ” సినిమా సంచలన విజయంతో లంక సత్యానికి పేరొచ్చింది. తనతో పాటు రేలంగి గారికి కూడా మంచి పేరు వచ్చింది. “బాలనాగమ్మ” తర్వాత జెమినీ వాసన్ గారి వైభవం అప్రతిహతంగా కొనసాగింది. జెమినీ వారి వద్ద పద్దెనిమిది నెలలు పని చేసి బయటకు వచ్చారు లంక సత్యం గారు. 1944లో విడుదలైన “చెంచులక్ష్మి” సినిమాలో  రామన్న గానూ, అక్కినేని మొట్టమొదటి సినిమాగా వచ్చిన సీతారామ జనంలో మాంత్రికుడు గానూ నటించారు.

పాత్రల నిడివి తో సంబంధం లేకుండా సినిమా ప్రకటనలో లంక సత్యం గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుండేది. ఆ రోజులలో గూడవల్లి రామబ్రహ్మం గారి వద్ద లంక సత్యం గారు సహాయకుడిగా చేరారు. ఆ సమయంలో గూడవల్లి గారు “మాయలోకం” సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తూనే ఆ సినిమాలో “కాంబోజీ రాజు” కొడుకులలో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరావు గారితో పరిచయం ఏర్పడింది. “మాయ లోకం” సినిమా అక్టోబరు 1945 లో విడుదలైంది.

తెరపై దర్శకుడిగా “భక్త తులసీదాస్”…

లంక సత్యం గారి జీవితం కాస్త అటు కాస్త ఇటు కొనసాగుతుండగా 1945 చివరలో తాను పూర్తిస్థాయి దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. లంక సత్యం గారి అన్న కామేశ్వరరావు గారు మరియు నటులు పి.సూరిబాబు కలిసి ప్రారంభించిన చిత్రం “భక్త తులసీదాస్”. ఈ చిత్రానికి లంక సత్యం గారు దర్శకత్వం వహించారు. అధికారికంగా దర్శకుడిగా తెరపై పేరు వేసిన చిత్రం “భక్త తులసీదాస్”. తరువాత రోజులలో ఎన్టీఆర్ గారితో సినిమాలు తీసిన డి.యోగానంద్ గారు “భక్త తులసీ దాస్” సినిమాకు సహాయ దర్శకుడుగా చేరారు. ప్రముఖ సంగీత దర్శకులు పి.నరసింహ రావు గారు చక్కటి బాణీలు అందించారు. 10 ఏప్రిల్ 1946 నాడు విడుదలైన “భక్త తులసీదాసు” ఓ మాదిరిగా ఆడింది.

“భక్త తులసీదాసు” లో పసుమర్తి కృష్ణమూర్తి గారికి నృత్య దర్శకుడిగా అవకాశం లభించింది. ఈ సినిమా తర్వాత తమిళంలో “శంభగవల్లి” అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు లంక సత్యం గారు. ఈ సినిమా కోయంబత్తూరు లో నిర్మాణం అయ్యింది. “పసుమర్తి కృష్ణమూర్తి” గారికి ఈ సినిమాలో కూడా లంక సత్యం గారు అవకాశం ఇచ్చారు. 1947లో విడుదలైన ఈ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేదు. కోయంబత్తూరు లో లంక సత్యం గారికి జూపిటర్ సంస్థ వారితో పరిచయం ఏర్పడింది. వారి దగ్గర నెలరోజుల జీతానికి కుదిరారు లంక సత్యం గారు. “మోహినీ” చిత్రంలో టీ.ఎస్.బాలయ్య, మాధురీదేవి ఒక జంట అయితే, ఎం.జీ.ఆర్, వి.ఎన్.జానకి లది ఒక జంట. ఈ చిత్రంలో ఎగిరే గుర్రాల కోసం ఛాయాగ్రాహకులు “రామ్ నాథ్” గారు సహాయం చేశారు. అక్టోబరు 1948లో విడుదలైన తమిళ “మోహినీ” చిత్రం చక్కటి విజయం సాధించింది.

తప్పిపోయిన రైలు ప్రమాదం… 

మోహినీ సినిమా విజయం తర్వాత త్యాగరాజ భాగవతార్ కోరిక మేరకు తనకు ఒక సినిమా తీసి పెట్టమన్నారు. సరేనని ఒప్పుకున్న లంక సత్యం గారికి నిరాశే ఎదురయ్యింది. ఆ సినిమా ఆగిపోయింది. ఆత్మ అభిమానం అధికంగా ఉన్న లంక సత్యం గారు ఒకరి దగ్గరికి వెళ్లి నాకు సినిమా అవకాశాలు ఇమ్మని అడగలేకపోయారు. ఆ తరువాత మూడు సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఒకసారి సినిమా చర్చల కోసం హైదరాబాదు వెళ్లి తిరిగి వస్తుండగా కాజీపేట వద్ద రైలు ప్రమాదానికి గురైంది. తన మిత్రుడు కలవడం వలన రెండో బోగీలో ఎక్కాల్సిన లంక సత్యం గారు మూడో భోగిలో ఎక్కేసారు. ఖాజీపేట వద్ధ వీరు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైంది. ముందు రెండు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. లంక సత్యం గారు రెండవ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తూ మరణించారు అని పొరపాటున పత్రికలలో రావడంతో బంధువులు ఆందోళన చెందారు. చివరికి నేరుగా తనను చూసినాక సంతోషపడ్డారు.

పరాజయం పాలైన చిత్రం “రోహిణీ”… 

తనతో పాటు నటించే హాస్య నటులంతా కస్తూరి శివరావు, రేలంగి లాంటి వారు హాస్యనటుల నుండి హాస్య  తారలై స్టార్ డమ్ అందుకుంటుంటే, లంక సత్యం గారు మాత్రం 1951 లో వచ్చిన మాయ పిల్ల, 1952 లో వచ్చిన పరాశక్తి, రాజేశ్వరి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. 1953లో సినిమా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఆ సినిమా పేరు “రోహిణీ”. లంక సత్యం గారి దర్శకత్వంలో “మోహినీ” లో ప్రధానపాత్ర పోషించిన హీరోయిన్ మాధురి దేవి నిర్మించిన చిత్రం “రోహిణి”. ఇందులో జి.వరలక్ష్మి కథానాయిక, ఎస్.వి.రంగారావు గారు ప్రధాన పాత్రలో నటిస్తే అందులో లంక సత్యం గారు సింగారయ్య అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.

ఆర్థిక కష్టాలు…

1954 సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పటికీ లంక సత్యం గారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే తనకు ముగ్గురు సంతానం. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి.  అందరి వయస్సు 10 సంవత్సరాలకు అటూ, ఇటూ ఉంటుంది. పోషణ కష్టంగా ఉండడంతో భార్య పిల్లలను కాకినాడకు పంపించారు లంక సత్యం గారు. లంక సత్యం గారు తన భార్య సత్యావతికి నెలకు ₹100 పంపిస్తే వాటితో పిల్లలను చదివిస్తూ కుటుంబ పోషణ జరిపేవారు. 1956లో పి.పుల్లయ్య గారి వద్ద “ఉమా సుందరి” సినిమాకు సహాయ దర్శకులుగా పనిచేశారు.

ఎన్టీఆర్, కన్నాంబ, శ్రీరంజని ప్రధాన పాత్రలుగా చేశారు ఆ సినిమాలో. లంక సత్యం గారికి ఎన్టీఆర్ గారితో పరిచయం స్నేహంగా మారింది. 1956లో సీ.వీ.రెడ్డి, పి.సుబ్బారాయుడు, సి.వి.సుబ్బారావు లాంటి ఈ ముగ్గురు కొత్త నిర్మాతలు కలిసి “ఆనంద” అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. “మేలుకొలుపు” అనే సినిమాను తీస్తూ దర్శకులుగా కే.ఎస్.ప్రకాశ రావు మరియు లంక సత్యం గారిని దర్శకులుగా పెట్టుకున్నారు. ఇందులో జి.వరలక్ష్మీ ప్రధాన పాత్రధారిణి. జమున గారు కూడా ముఖ్యపాత్ర పోషించారు. లంక సత్యం గారికి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నాక తన కుటుంబాన్ని మళ్లీ కాకినాడ నుండి మద్రాసు కు తీసుకువచ్చారు.

పాక్షిక దర్శకత్వంలో “టైగర్ రాముడు”...

1959 నుండి వరుసగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లు నటించిన సినిమాలలో లంక సత్యం గారికి చిన్నదో పెద్దదో ఏదో ఒక పాత్ర దొరుకుతూ ఉండేది. 1959లో వచ్చిన ఎన్టీఆర్ “బాలనాగమ్మ” లో లంక సత్యం గారు పులిరాజు వేషం వేశారు. 1942లో వచ్చిన “బాలనాగమ్మ” లోనూ, 1959 లో వచ్చిన “బాలనాగమ్మ” లోనూ రెండు చిత్రాలలో లంక సత్యం గారు నటించారు. “మాంగల్యబలం”, “పెళ్లి మీద పెళ్లి”, “వచ్చిన కోడలు నచ్చింది”, “నమ్మిన బంటు”, “అపూర్వ చింతామణి”, “శ్రీ వెంకటేశ్వర మహత్యం”, “ఇద్దరు మిత్రులు”, “జగదేకవీరుని కథ”, “భీష్మ”, “గులేబకావళి కథ” వీటన్నింటిలోనూ 1959 – 60 ప్రాంతాల్లో నటించారు లంక సత్యం గారు.

చిన్నాచితకా వేషాలతో, పాత్రలలో నటిస్తున్న సత్యం గారు 1962 లో టైగర్ రాముడు (ఎన్టీఆర్, రాజసులోచన) సినిమాను పంతం చిన్నారావు, వడ్డె శ్రీనివాసరావులు నిర్మించారు. నిర్మాతలకు డబ్బులు అయిపోయి చేతులెత్తేసేసరికి లంక సత్యం గారి అన్నగారు అయిన లంక కామేశ్వర రావు గారు మద్రాసులో ఉన్న తన రెండు ఇల్లులు అమ్మేసి టైగర్ రాముడు తీస్తానని ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో దాని దర్శకులు సి.ఎస్.రావు గారు వేరే సినిమాకు వెళ్లిపోయారు. చేసేది లేక లంక సత్యం గారు మిగిలిన భాగం దర్శకత్వం చేశారు. తెర మీద దర్శకుడుగా సి.ఎస్.రావు గారి పేరే వేశారు. సినిమాకి పేరు లేని దర్శకుడు అయ్యారు లంక సత్యం గారు. 08 మార్చి 1962 నాడు విడుదలైంది.

కన్నడ లో “బెంగళూరు మెయిల్”… 

టైగర్ రాముడు ప్రయోగం అయ్యాక లంక సత్యం గారు “ఆప్త మిత్రుడు”, “రాముడు భీముడు”, “గురువును మించిన శిష్యుడు”, “సతీ అరుంధతి” లాంటి సినిమాలలో నటించారు లంక సత్యం గారు. 1967 లో వచ్చిన “కొచ్చిన్ ఎక్స్ ప్రెస్” సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. ప్రేమ్ నజీర్, షీలా నటీనటులు. కృష్ణన్ నాయర్ దర్శకుడు. తమిళ, తెలుగు, హిందీ కన్నడ భాషలో ఏకకాలంలో పునర్నిర్మాణం ప్రారంభించారు. తెలుగులో “సర్కార్ ఎక్స్ ప్రెస్” అని, కన్నడంలో “బెంగళూరు ఎక్స్ ప్రెస్” అని సమాంతరంగా షూటింగ్ లు జరిగాయి.

రెండింటికి నిర్మాత వై.వి.రావు గారు, సమర్పణ ఎస్.భావనారాయణ. బ్యానర్ పేరు గౌరీ ఆర్ట్ ఫిలిమ్స్. రెండింటికీ కూడా దర్శకులు లంక సత్యం గారే. కొన్ని కారణాల వల్ల తెలుగు “సర్కార్ ఎక్స్ ప్రెస్” కి దర్శకుడు మలయాళ దర్శకులు ఎం.కృష్ణ అని ఉంటుంది. కన్నడ సినిమా “బెంగళూరు మెయిల్” సినిమాకు ఎల్.ఎస్.నారాయణ అని ఉంటుంది. జ్యోతిష్కం మీద బాగా నమ్మకం ఉన్న లంక సత్యం గారు కన్నడ సినిమాకు తన పేరును ఎల్.ఎస్.నారాయణ అని వేయించుకున్నారు. ఆ సినిమాలు 1968 లో విడుదలయ్యాయి. రెండు సినిమాలు విజయవంతమయ్యాయి.

మరణం…

లంక సత్యం గారు తాను 53 సంవత్సరాల వయస్సులో ఉదయం పేపర్ చదువుతుండగానే కూర్చుని క్రింద పడిపోయారు. అప్పటికే తాను ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణ వార్త గురించి వ్రాస్తూ విజయ చిత్ర పత్రికలో ఇలా చెప్పారు “పరిశ్రమలో ఉన్న చిన్న పెద్దా ఆయనను ఎరుగుదురు. ఆయన అనేకమందిని అనేక విధాలా ప్రోత్సహించిన వ్యక్తి” అని విజయ చిత్ర పత్రికలో వ్రాశారు.

కుటుంబం…

1936లో ముమ్మిడివరం దగ్గరలో ఉన్న కొమ్మనాపల్లి అగ్రహారానికి చెందిన సత్యవతి గారితో వివాహం జరిగింది. అప్పటికే ఆయన  వయస్సు 21 సంవత్సరాలు, భార్య వయసు 12 సంవత్సరాలు. లంక సత్యం గారు కన్నుమూసే సమయంలో ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశారు. అప్పటికే అబ్బాయి నరసింహారావు  టీ.వీ.ఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వయస్సు 23 సంవత్సరాలు. అత్యధిక కాలం అందులోనే ఉద్యోగం చేసిన నరసింహారావు గారు ప్రస్తుతం తన 76 సంవత్సరాల వయస్సులో మద్రాసులో విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. లంక సత్యం గారి పెద్ద కుమార్తె 20 సంవత్సరాల క్రిందటే కన్నుమూశారు.

రెండో కుమార్తె హైదరాబాదులోనూ, మూడో కుమార్తె విజయనగరం లోనూ నివాసం ఉంటున్నారు. అందరి సంతానం గౌరవప్రదమైన వృత్తులలో స్థిరపడ్డారు. ఎంతో ప్రతిభ ఉండి, సామర్థ్యం ఉండి, మంచితనం స్వాభిమానాన్ని నిలబెట్టుకుంటూ సినీ రంగంలో ఎంతో మందికి సహాయం చేసి కళ్ళముందే అందరూ ఎదిగిపోతున్నప్పటికీ తన నటన, దర్శకత్వం రెండు పడవల ప్రయాణంలో సమన్వయం కుదరక, ఒక విధంగా చెప్పాలంటే కాలం కలిసి రాక తక్కువగా అంచనావేయబడ్డ కళాకారునిగా ఉండి పోయినప్పటికీ లంక సత్యం గారి సినిమాకులకు ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కాల్సిన నటులు, దర్శకులు లంక సత్యం గారు.

Show More
Back to top button