Telugu Featured NewsTelugu Politics

బీజేపీ ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడగలవా..?

దేశంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరి వ్యూహాల్లో వారు బిజీ అయిపోయారు. అయితే, ప్రస్తుతం చూసుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం పడుతున్నారు. ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చేవి, సమస్యలు పరిష్కరించేవి, మౌలిక సదుపాయాలు కల్పించేవి ప్రాంతీయ అభిమానం ఉన్న ప్రాంతీయ పార్టీలే కనుక. ఈ నేపథ్యంలో చాలా మందికి వచ్చే సందేహం వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదురించి ప్రాంతీయ పార్టీలు నిలబడగలవా? అయితే, ఏ పార్టీలకు ఎంత సామర్థ్యం ఉందో.. ఏం బలహీనతలు ఉన్నాయో పదండి ఒక లుక్ వేద్దాం.

* బీజేపీ బలహీనంకు ఇవే కారణమా..?

ప్రస్తుతం దేశంలో చూసుకుంటే బీజేపీని ఎదుర్కొనగల సత్తా ఉన్న పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ… బీజేపీ రాను రాను బలహీనత పడుతోందనడంలో కూడా అంతే అతిశయోక్తి లేదు. దీనికి ప్రధాన కారణం మణిపూర్ హింస ఘటన, ఢిల్లీ అధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్, కాంగ్రెస్ పార్టీ ఎం.పి, యువనేత రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించి కోర్టు ద్వారా ఎం.పి.గా తొలగించడం, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం, ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసాన్ని ఖాళీ చేయించడం ద్వారా బీజేపీయే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశాలను కల్పించినట్లయింది. అయితే, రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ అక్రమ చర్యను ఎండగడుతూ వచ్చిన విమర్శలను ప్రధాని మోడీ ఎదుర్కోలేక రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం నుండి బహిష్కరణకు అతివేగంగా గురిచేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో రాహుల్ గాంధీ లాంటి బర్తరఫ్ ఏ పార్టీ కైనా జరగవచ్చు. ఇది అప్రజాస్వామికం, నియంతృత్వం చర్య అని దేశంలోని 15 ప్రాంతీయ పార్టీలు కలిసి కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయడానికి ముందుకు వచ్చాయి. అదే సత్తా 2024 సాధారణ ఎన్నికలలో ఐక్యత చూపించినట్లయితే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవటం చాలా సులువవుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా బీజేపీ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామికంగా కేంద్ర స్వయం ప్రతిపత్తిగల సంస్థలో ఈ.డి, సి.బి.ఐ.లను బీజేపీని తనను వ్యతిరేకించిన వారిపై దాడులు జరిపించి, భయపెట్టి నోరుమూయించడం లేదా బీజేపీలో చేరేటట్లు ప్రేరేపించడం వంటివి చేస్తోంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటితోపాటు పెద్ద నోట్ల రద్దు, రాఫెల్ అక్రమాలు, ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను ప్రైవేటు వారికి అమ్మకం వంటివి బీజేపీని బలహీన పడుతోంది అనడంలో అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

* కాంగ్రెస్ బలహీనానికి అలసత్వం, చేతగానితనమే కారణమా..?

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, సరైన సమయంలో గట్టిగా తన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వెనుకబడుతుందని, ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని చేజార్చుకొంటుందని నిపుణులు చెబుతున్నారు. . అదే బీజేపీ తన అధికారంతో వీలు లేకపోయినా ప్రాంతీయ పార్టీలలో దూరిపోయి నేనే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చాటుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను కోల్పోయింది, కోల్పోతుంది. ఉదా: ఈశాన్య రాష్ట్రాలలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాలలో కాంగ్రెస్ స్థితిని నిలబెట్టలేకపోవడం. బీజేపీ ఆయా రాష్ట్రాలలో దూరిపోవడానికి కారణం కాంగ్రెస్ పాత తరం నాయకుల అలసత్వం, చేతగానితనం, సమయస్ఫూర్తితో సరైన సమయంలో స్పందించకపోవడమే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధినాయకత్వం నమ్ముకున్న నాయకులు చురుకుదనంతో వ్యవహరించక పోవడంతో చేతికి వచ్చిన అవకాశాలను నిలుపుకో లేకపోవడమే అని కూడా అంటున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు ఉన్నా.. జాతీయ పార్టీ అయిన ఆప్, కాంగ్రెస్‌ల మధ్య మాత్రం పొత్తులు కుదిరే అవకాశం కనపడటం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి శాపంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి.

* బీజేపీ ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడగలవా..?

నేడు ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోవాలంటే తప్పక కాంగ్రెస్ సహకారం కావాలనే విషయం అర్థం చేసుకొన్నారు. కానీ, ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల అనంతరం పొత్తులకు ఎదురు చూస్తున్నాయి. అందువల్లనే దేశ రాజకీయాల్లో బీజేపీని బలంగా ఎదుర్కొనేందుకు ప్రతి పక్షాలకు సత్తా సరిపోవడం లేదు. ఈ అంశం అన్ని పార్టీలు గ్రహించినా.. జాతీయ స్థాయిలో ఐక్యత కనపరచటం లేదు. అయితే, ప్రతిపక్షాలు బీజేపీని కట్టడి చేయడానికి జులై నెలలో జరిగిన విపక్షాల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఇవన్నీ.. బీజేపీని కొంత వరకు ప్రభావితం చేసినా.. పగ్గాలు మాత్రం బీజేపీకే దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవి 2024 ఎన్నికల్లో ఎంత ప్రభావితం చూపుతుందో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button