దండమూడి రాజగోపాలరావు (16 అక్టోబరు 1916 – 06 ఆగష్టు 1981)
“మాదే జయం మహారాజా.. మమ్ము గెలిచేవారు మీ రాజ్యంలో లేరని తేలిపోయింది”.. విరాటరాజు కొలువులో జరిగిన మల్లయుద్ధం పోటీలో గెలుపొందిన ప్రత్యర్థి అన్న మాటలు విని తలపట్టుకుంటాడు విరాటరాజు. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ దేశ గౌరవం కాపాడే వారెవ్వరూ లేరా నాయనా అని కొడుకు ఉత్తరుని అడిగాడు విరాటరాజు. లేకేం. ఉన్నారు నాన్న గారు. దానికి ఆత్రుతగా అడిగిన విరాటరాజు కు ఉత్తరుడి సమాధానం “వలలుడు”. విరాటరాజు అస్థానంలో మారువేశాలలో ఉన్న పాండవులలో రెండవ వాడైన భీమాసేనుడే ఆ “వలలుడు”.
మహాభారతంలోని “విరాట పర్వం” లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ నర్తనశాల సినిమాకి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయంలో గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. ధర్మరాజు కంకుభట్టుగాను, భీముడు వంటలవాడు వలలుని గాను చేరుతారు.
వెంటనే మారువేశంలో ఉన్న అన్న కంకుభట్టు (ధర్మరాజు) గారి ఆజ్ఞ మేరకు మల్లయుద్ధలో పాల్గొని ప్రత్యర్థిని మట్టి కరిపించి తనదైన శైలిలో విజయఢంకా మ్రోగిస్తాడు. వెంటనే విరాటరాజు లేచి భళా భళా “భారత మల్ల సింహము” అనిపించుకున్నావు అని బహుమతులతో సత్కరిస్తారు. అలా మల్లయుద్ధం లో గెలుపొందిన భీముని పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటులు దండమూడి రాజగోపాల రావు గారు. తాను నిజ జీవితంలో భారతీయ ఆసియా క్రీడల పతక విజేత, ఒలింపిక్ వెయిట్‌లిఫ్టర్, బాడీబిల్డర్, చలనచిత్ర నటులు, క్రీడా నిర్వాహకులు మరియు కోచ్.
భారతదేశానికి చెందిన దండమూడి రాజగోపాల రావు గారు వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు. “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు కూడా పొందారు. తెలుగు రంగస్థల, సినిమా నటులైన వీరు 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరు 1963లో విడుదలైన నర్తనశాల చిత్రంలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ భీముని పాత్రను పోషించారు.
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : దండమూడి రాజగోపాలరావు
ఇతర పేర్లు : ఇండియన్ టార్జన్
జననం : 16 అక్టోబరు 1916
స్వస్థలం : గండిగుంట, కృష్ణా జిల్లా
ప్రసిద్ధి : ప్రముఖ క్రీడాకారుడు,
నర్తనశాల చిత్రంలో భీముడు పాత్రధారి.
భార్య : అనసూయ
పిల్లలు : ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి
మరణ కారణం : సహజ మరణం
మరణం : 06 ఆగష్టు 1981
@ జననం…
దండమూడి రాజగోపాల రావు గారు 16 అక్టోబరు 1916 లో కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలంలోని గండిగుంట గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. వీరు ఉయ్యూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత పెదపారుపూడి మండలం వానపాములలో తన సోదరి రంగమ్మ ఇంట ఉండి జాస్తి బాపయ్య, శిష్ట్లా సోమయాజులు ప్రభతుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ సాధన ప్రారంభించారు. భారత దిగ్గజ బాడీబిల్డర్ అయిన కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తి పొందిన తాను వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎంచుకున్నారు. తరువాత అతను కొల్లి రంగదాసుతో కలిసి పర్యటించి వివిధ భారతీయ రాష్ట్రాలు మరియు దేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
శరీర సౌష్టవ పోటీలో మిస్టర్ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు దండమూడి రాజగోపాలరావు. 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కావడం ద్వారా శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా 1940లో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయస్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు. 1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు.
@ కుటుంబ నేపధ్యం..
దండమూడి రాజగోపాల రావు గారి భార్య పేరు అనసూయ. దండమూడి దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. దండమూడి గారి రెండో కుమారుడు అమెరికాలో, పెద్ద చిన్న కుమారులు విజయవాడలోనే స్థిరపడ్డారు. కుమార్తె అట్లూరి ఝాన్సీరాణి వానపాముల లో ఉంటూ కొన్ని సంవత్సరాల క్రిందట మరణించారు. ప్రస్తుతం తన కూతురు మనుమడు రాజాజీ ఉంటున్నారు. మరో కుమార్తె దండమూడి గారి స్వగ్రామమైన గండిగుంటలో నివాసముంటున్నారు.
@ క్రీడా నేపథ్యం…
ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు ఒకరు. మనదేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లయిన 1948లోనే మిస్టర్ ఆసియాగా గెలిచి భారతజాతికి వన్నెతెచ్చిన ఘనుడు దండమూడి గారు.
శరీర సౌష్టవ పోటీలో మిస్టర్ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు కూడా దండమూడి రాజగోపాలరావు గారే కావడం విశేషం. తాను తొలి రోజుల్లో కొల్లి రామదాసు, సోమయాజులు తదితరుల వద్ద తర్ఫీదు పొంది 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కావడం ద్వారా తన శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా 1940 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయ స్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు.
1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్ ఆసియా బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు సుమారు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు. 1948లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు దండమూడి రాజగోపాల రావు గారు. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌కు తాను అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. వెయిట్ లిఫ్టింగ్లోనే కాక బలప్రదర్శనలో కూడా విశేష ప్రతిభ కనబర్చారు. చాతికి గొలుసులు చుట్టి గాలిపీల్చడం ద్వారా చాతిని పెంచి వాటిని తెంపడం లాంటి సాహసకృత్యాలను దండమూడి గారు అనేకం చేశారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు గారు, దండమూడి గారి శిష్యుడిగానే శరరీ సౌష్టవంపై ఆసక్తి పెంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వ్యాయామశాలల ఏర్పాటుకు కృషిచేశారు. ఒలింపిక్ పోటీల అనంతరం విజయవాడలో ఉచిత వ్యాయామశాల నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో దండమూడి గారు ఇచ్చిన స్థలాన్ని తిరిగి మున్సిపల్ కార్పొరేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం నిర్మించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో దండమూడి గారు “ఆంధ్ర భీమ”, “ఇండియన్ టార్జాన్”, “ఇండియన్ హెర్క్యులస్”, “జాయింట్ ఆఫ్ ఇండియన్” బిరుదులను పొందారు.
@ సినిమా నేపథ్యం…
దండమూడి రాజగోపాల రావు గారు క్రీడారంగంతో పాటు సినీ రంగంలో కూడా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమైన నర్తనశాల (1963) లో నటించారు. దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు, నటీనటులు ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన ఈ సినిమాలో భీముని పాత్ర ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని అందుకోవడమే కాకుండా నంది అవార్డును కూడా గెలుచుకొంది.
1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. నర్తనశాల (1963) లో అతను భీముని పాత్రను పోషించిన దండమూడి గారు భీమాంజనేయ యుద్ధం , వీరాభిమన్యులలో కూడా భీముని పాత్రలు పోషించారు. వెండితెరపై తన తక్కువ వ్యవధిలో దండమూడి గారు ఎన్‌టి రామారావు , సావిత్రి , శోభన్ బాబు , ఎస్వి రంగారావు , కాంతారావు , ముక్కామల మరియు మిక్కిలినేని గార్ల వంటి ప్రముఖులతో కలిసి నటించారు.
@ క్రీడా విజయాలు…
★ 1946లో బెంగుళూరులో జరిగిన హెవీవెయిట్ క్లాస్ కోసం జరిగిన XII ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ఇండియాలో దండమూడి గారు 1వ స్థానాన్ని గెలుచుకున్నారు.
★ దండమూడి గారు 1942లో కేరళ టైటిల్‌ను మరియు 1944లో బాంబే ప్రావిన్షియల్ గౌరవాలను గెలుచుకుని మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు.
★ తాను 1947లో బర్మాలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
★ దండమూడి గారు వెయిట్ లిఫ్టింగ్‌లో న్యూ ఢిల్లీలో జరిగిన 1951 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇది ఫీల్డ్‌లో బలమైన పోటీ మరియు పాల్గొనే దేశాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక భారతీయ అథ్లెట్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనలలో ఇది ఒకటిగా భావించవచ్చు.
★ దండమూడి గారు 1952లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. హెవీవెయిట్ విభాగంలో 780 పౌండ్లు ఎత్తారు.
★ దండమూడి గారు 1954లో జరిగిన ఇండియన్ ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్లో మళ్లీ గోల్డ్ మెడల్ సాధించి మూడు రికార్డులు నెలకొల్పారు.
★ దండముడి గారు భారతీయ మొదటి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్ గా అవతరించారు. 1945 నుండి 1958 వరకు 13 సంవత్సరాలు నిరంతరంగా టైటిల్‌ను చేజిక్కించుకుని ఉన్నారు.
★ దండముడి గారు 1948లో కలకత్తాలో ఆసియా బాడీబిల్డింగ్ పోటీలో మిస్టర్ ఆసియా టైటిల్‌ను గెలుచుకున్నారు.
★ తాను ఆంధ్రా ఒలింపిక్ సంఘం 1వ అధ్యక్షులు. ఆంధ్రా ఒలింపిక్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. తాను ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ఇతర ముఖ్యమైన క్రీడా సంఘాల స్థాపకులు. దాంతో రాష్ట్రంలో మరియు భారతదేశంలో కూడా క్రీడల అభివృద్ధికి అది దోహదం చేసింది.
★ తాను వెయిట్ లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మొదటగా 1948లో లండన్ గేమ్స్‌లో, రెండవసారి 1952లో ఫిన్లాండ్ గేమ్స్‌లో మరియు 1956లో మెల్బోర్న్ గేమ్స్‌లో మూడవసారి ప్రాతినిథ్యం వహించారు.
★ దండమూడి గారు లండన్ గేమ్స్‌లో 16వ స్థానంలో, మెల్బోర్న్ గేమ్స్‌లో 9వ స్థానంలో మరియు ఫిన్లాండ్లో 6వ స్థానంలో నిలిచారు. ఇది ప్రపంచంలోని ప్రీమియర్ స్పోర్టింగ్ ఎగ్జిబిషన్లో తన అత్యుత్తమ ప్రదర్శన.
★ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో డి.ఆర్.గోపాల్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఫ్రీ జిమ్నాసియాను స్థాపించారు. తాను ఇన్స్టిట్యూట్లో కోచ్‌గా మరియు మెంటార్‌గా కూడా పాల్గొని తన బహుముఖ ప్రతిభ గల సామర్థ్యాన్ని మరియు క్రీడకు సేవను నిరూపించుకున్నారు.
@ శివైక్యం…
ఒలంపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబరచి, ఆంధ్ర ప్రదేశ్ రాష్టం తరుపుననే కాకుండా, భారతదేశ ఖ్యాతిని తన క్రీడాలతో ఖండాంతరాలకు వ్యాపింపజేసిన దండమూడి రాజగోపాల రావు గారు. తాను గొప్ప క్రీడాకారులు అయ్యుండి కూడా ప్రజా దృష్టికి, మీడియా దృష్టికి ఎందుకో దూరంగానే ఉన్నారు. ఒలింపిక్స్ చరిత్రను, పరిణామాన్ని గుర్తించినప్పుడు కానీ, పరిగణలోకి తీసుకుని చర్చించినప్పుడు కానీ విజయవాడకు చెందిన దండమూడి రాజగోపాల రావు గారు మనకు స్ఫురణకు వస్తుంటారు. దండముడి గారు తన విన్యాసాలతో దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించారు.
ఊపిరి పీల్చుకుంటూ, కండరాలను వంచుతూ శరీరానికి కట్టిన ఇనుప గొలుసులను తెంచుకునేవారు. అనేక బిరుదులను, అనేక అవార్డులను బహుమతులుగా గెలుచుకున్న దండమూడి రాజగోపాలరావు గారు 06 ఆగష్టు 1981 నాడు శివైక్యం చెందారు. క్రీడలకు తాను చేసిన విశేష సేవలను గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదుగా, విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి “దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం” అని నామకరణం చేశారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రివర్యులు టి.అంజయ్య గారు ప్రారంభించారు.