Telugu Politics

ఆంధ్రరాష్ట్రశ్రేయస్సుకోసంకదిలిన ‘యువగళం’..! 

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ‘యువగళం’ పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయన స్వగృహంలో కుటుంబసభ్యుల ఆశీస్సులు తీసుకొని, ఇంటినుంచి నేరుగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. అనంతరం కడపకు చేరుకోనున్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎన్నో షరతులు, ఆంక్షలు… అయినప్పటికీ ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మనం ఆశిద్దాం…

తాత ఎన్టీరామారావుగారి ఆశీస్సులతో….  

ముందుగా ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధరల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతి ఇవ్వగా, మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనను కారు ఎక్కించారు. తర్వాత నేరుగా లోకేశ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లారు. తాత ఎన్టీరామారావు గారికి నమస్కరించి, పుష్పాంజలి ఘటించారు. ఈ క్రమంలో లోకేశ్‌ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించింది. ఆయన వాహన శ్రేణిని అనుసరిస్తూ ఘాట్‌ వద్దకు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు చేరుకోగా అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది.  

శంషాబాద్ నుంచి కడపకు 

ఎన్టీఆర్ ఘాట్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కడపకు బయల్దేరారు లోకేశ్. కడపకు చేరుకున్న అనంతరం పలు ఆలయాలు, దర్గా, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. తరువాత కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి దేవాలయాలను సందర్శించనున్నారు. స్థానిక గుళ్లను దర్శించుకున్నాక, కడప నుంచి రాజంపేట, రైల్వేకోడూరు, కరకంబాడి మీదుగా రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. రేపు(గురువారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం కుప్పం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అటు పిమ్మట ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తారు.

15 షరతులు విధింపు

‘యువగళం’ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇందుకు పోలీసుల్ని అనుమతి కోరగా, కేవలం 3రోజులకే పరిమితి చేయడంపై తెదేపాశ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్ర చేసినప్పుడైతే వెంటనే అనుమతి ఇవ్వడంతో పాటు పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు, అప్పటి డీజీపీ మూడు షరతులనే విధించినట్లు గుర్తుచేశాయి. ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలకు ముందుగానే తెలియజెప్పడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాదయాత్ర జరగడం, ప్రజల్ని పార్టీ వాలంటీర్లే నియంత్రించాలనేవి అప్పట్లో విధించిన షరతులు.. కానీ ఇప్పుడు యువగళం కోసం ప్రస్తుత పోలీసులు విధించిన షరతులు 15: అవి,

*రహదారులపై బహిరంగ సభలు నిర్వహించొద్దు. ఇందుకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ వివరాలు పలమనేరు డీఎస్పీకి ముందుగానే సమర్పించి అనుమతి పొందాలి. 

* పాదయాత్రలో భాగంగా ప్రజలతో జరిపే మాటామంతి బహిరంగ సభలా ఉండకూడదు. 

* యాత్రలో భాగంగా డీజే సిస్టమ్స్‌, లౌడ్‌ స్పీకర్లను వినియోగించకూడదు. సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టమ్‌ను అది కూడా తక్కువ శబ్దంతో వినియోగించాలి.

* భద్రతతో పాటు, సమూహ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ కోసం వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వీరంతా ఒకే తరహా యూనిఫాం ధరించాలి. 

* మొత్తం రోడ్డును స్తంభింపజేయరాదు. సాధారణ ప్రజల కార్యకలాపాలకు, ట్రాఫిక్‌ రాకపోకలకు మధ్య అంతరం ఉండాలి. 

* టపాసులు కాల్చకూడదు. మద్యం, మత్తు పదార్థాలు వంటివి వినియోగించకూడదు.

* డ్రోన్ కెమెరాలు వినియోగించి చిత్రాలు తీయాలంటే డ్రోన్‌ నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

*హాని కలిగించే ఆయుధాలు, రాళ్లు వంటివి వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

* ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. 

* అనుమతించిన వాహనాలే పాదయాత్రలో కనపడాలి. షెడ్యూల్‌లో పేర్కొన్న రూట్‌, సమయాలకు కట్టుబడే పాదయాత్ర సాగాలి.

* ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే అవుతుంది. ముందుగానే అంబులెన్సు సిద్దంగా ఉండాలి. ప్రథమ చికిత్స, వైద్యపరికరాలు వంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి. 

* రాత్రి బసచేసే ప్రదేశాల్లో అవసరమైన లైట్లు, బారికేడింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి.

* బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదు. 

* సభకు ఎంతమంది వస్తారనే అంచనా ప్రకారం, 20 శాతం మందికి అదనంగా ఏర్పాట్లు ఉండాలి.

* సభ జరుగుతున్నంతసేపూ పూర్తి కార్యక్రమాన్ని వీడియో తీయాలి. వాటికి సంబంధించిన ప్రతిని పలమనేరు డీఎస్పీకి సమర్పించాల్సి ఉంటుంది.

* సభకు హాజరయ్యే ప్రజలకు ఓ పద్ధతి ప్రకారం నీళ్లు, భోజనం అందించాలి. 

ఈ నెల 27న అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలై, 29 సాయంత్రం 5.55 గంటల వరకు మూడు రోజులవరకే ఈ  నియమావళి వర్తిస్తుందని తెలిపారు.

ఈ  విషయమై, కుప్పంలోని కమతమూరు రోడ్డులో నిర్వహించనున్న బహిరంగ సభకు అనుమతి కోరుతూ, ఈ నెల 9 నుంచి నిన్నటివరకు ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పీఏ మనోహర్‌.. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి వరుసగా దరఖాస్తులు పంపారు. ఆయన 14 రకాల ఆంక్షలతో మంగళవారం మధ్యాహ్నం అనుమతినిచ్చారు. బహిరంగ సభకు సంబంధించి షెడ్యూల్‌లో పేర్కొన్న నిర్దేశిత సమయాలకే కట్టుబడి ఉండాలని, వాటిలో ఏవైనా తేడాలున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండానే అనుమతులు రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ‘యువగళం’ పాదయాత్రను ముందుకు నడిపించాలని.. తుగ్లక్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు నాతోపాటు మీరు నడవాల్సిందిగా ఆయన ప్రజలను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రాశారు. 

Show More
Back to top button