Telugu Special Stories

సాత్వికాభినయ సామ్రాట్.. గుమ్మడి వెంకటేశ్వర రావు

గుమ్మడి వెంకటేశ్వరరావు (9 జూలై 1927 – 26 జనవరి 2010),

ఏ పదాన్ని ఎక్కడ విరిచి సంభాషణ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో, తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్ది మందే ఉన్నారు. ఈ విషయంలో స్పష్టత కలిగిన వాచకం గల తారలు మరీ అరుదు. అటువంటి నటుల జాబితా తయారు చేయడం మొదలుపెడితే మొదటి మూడు స్థానాల్లోనే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరు వస్తుంది. గుమ్మడి గారూ ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ అగుపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది.

క్యారెక్టర్ ఆర్టిస్టు (గుణచిత్ర నటులు), సాత్వికాభినయ సామ్రాట్. ఏ పాత్రలో నటించినా పాత్రలో తెరకాయ ప్రవేశం చేసి, వ్యక్తిగా దాక్కొని నటుడుగా విజృంభించే వ్యక్తి గుమ్మడి గారూ. ముఖ్యంగా సాత్విక అభినయంలో గుమ్మడి గారు దిట్ట అని చెప్పాలి. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రలని వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను  పరిశీలించేవారు గుమ్మడి గారూ. అప్పుడు తనకు అనుకూలంగా పాత్రను మలుచుకుని సజీవ  రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టి నటించేవారు. అందుకే గుమ్మడి గారూ పోషించిన ఏ పాత్రను పరిశీలించినా కూడా అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషిగాను పక్కింటి మన పెద్దమనిషి గాను అనిపిస్తాయి.

జననం…

ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్న కృష్ణానది కొంత దూరం కృష్ణా జిల్లాను, గుంటూరు జిల్లాను రెండు భాగాలుగా విడదీస్తూ, విభజిస్తూ ప్రవహిస్తూంటుంది. కృష్ణా జిల్లాకు మరోవైపు ఉండే గుంటూరు జిల్లాకు చెందిన కొల్లూరు దగ్గరలో ఉన్న రావికంపాడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే గుమ్మడి వెంకటేశ్వర రావు గారూ 1927 జూలై 9 నాడు జన్మించారు. వీరి తల్లి బుచ్చమ్మ గారూ, తండ్రి బసవయ్య గారూ. గుమ్మడి గారికి ఒక చెల్లెలు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. వీరిది సామాన్య రైతు కుటుంబం. తన పెద్దనాన్న నారయ్య, తండ్రి బసవయ్యలు ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములే అయినా వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఒకే ఇంట్లో ఉండేవారు కలిసి వ్యవసాయం చేసుకునేవారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. వీరికి పశుపోషణ అంటే విపరీతమైన ఇష్టం.

గుమ్మడి తాత గారూ అయిన సుబ్బయ్య గారూ తన 80 సంవత్సరాల వయస్సులో డైయాబేటిక్ వ్యాధితో ఒక కాలు తీసేయాల్సి వస్తే, ఒంటి కాలిపై నేను బ్రతకను అని స్వచ్ఛంద మరణం కోరుకుని, తాను పెంచిన ఎద్దులను, తన మంచానికి రెండు వైపులా రెండు ఎడ్లను కట్టేయించి తాను మరణించే కొద్ది క్షణాల ముందు వరకు కూడా వాటి గంగడోళ్లను నిమురుతూ చనిపోయారు. చిన్నప్పటి నుండి కూడా గుమ్మడి గారూ పెద్దవాళ్ళతోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. గుమ్మడి గారి వయస్సు 15 యేండ్లు వున్నప్పుడు వాళ్ళ నాన్న గారి వయస్సు 40 యేండ్లు, గుమ్మడి గారి నాన్న గారి అమ్మకి 60 యేండ్లు, ఆవిడ అమ్మకి యనభై యేండ్లు, ఆవిడ అమ్మకి 103 యేండ్లు. వీళ్ళ మధ్యలో తిరుగుతూ వుంటే గుమ్మడి గారికి వృద్ధాశ్రమంలో తిరుగుతూ ఉన్నట్టుండేదట. గుమ్మడి గారూ తనకంటే 15 సంవత్సరాలు పెద్దవారితో తిరిగేవారట. అందువలన కాబోలు గుమ్మడి గారికి చిన్న వయస్సులోనే వృద్ధపాత్రలు ఎక్కువగా రావడం వలన, వృద్ధుల హావభావాలు తెలిసిన గుమ్మడి గారికి ఆ పాత్రలలో అవలీలగా నటించేవారు.

బాల్యం…

గుమ్మడి గారి ప్రాథమిక విద్యాభ్యాసం రావికంపాడులోనే సాగింది. హైస్కూలు చదువుల కోసం కొల్లూరు వెళ్లారు. రావికంపాడు నుండి కొల్లూరుకు మూడు మైళ్ళ దూరం పోయేటప్పుడు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వెళ్లేవారు. గుమ్మడి గారిని చిన్నప్పటి నుండి ప్రభావితం చేసిన వ్యక్తులలో ఇద్దరు గురించి ఎక్కువగా చెబుతుండేవారు. ఒకరు జాస్తీ శ్రీరాములు చౌదరి గారూ. వీరు తెలుగు మాస్టారు. గుమ్మడి గారి ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉండడం వలన తెలుగు పాఠాలు గుమ్మడి గారితో చదివించేవారు. గుమ్మడి గారిని ప్రభావితం చేసిన రెండో వ్యక్తి దొడ్డపనేని బుచ్చిరామయ్య గారూ. గుమ్మడి గారిని కమ్యూనిస్టు భావజాలం వైపు వెళ్లకుండా తనను నాస్తికత్వం నుండి ఆస్తికునిగా మార్చింది. గుమ్మడి గారూ 4వ ఫారం అంటే తొమ్మిదో తరగతి చదివేటప్పుడు పాఠశాల ముగింపుదినం నాడు వాళ్ళ మాస్టారు గుమ్మడి గారిని పిలిచి, నీ వాచకం బావుంటుంది. ఒక నాటకం వేస్తున్నాము అందులో ఒక వేషం వేయాలి అని చెప్పారు. ఆ వేషం ఒక ముసలి పాత్ర. అందులో లీనమై అద్భుతమైన నటన ప్రదర్శించినందులకు గానూ గుమ్మడి గారికి బహుమతి కూడా వచ్చింది.

వివాహం..

గుమ్మడి గారూ యస్.యల్.సి ఖచ్చితంగా తప్పుతాడు. వెంటనే వ్యవసాయంలో పెట్టేద్దామని ఇంట్లో వాళ్ళు భావించారు. అయితే వాళ్ళ ఊరినుండి ఎనిమిది మంది వెళ్ళితే, ఉత్తీర్ణులయ్యింది గుమ్మడి గారూ ఒక్కరే. యస్.యల్.సి ఉత్తీర్ణులయ్యారు గనుక కళాశాల చదువు చదవాలి. కానీ ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేదు. కమ్యూనిస్టు భావాజాలంతో తిరుగుతున్నాడు కనుక ఎక్కడ తప్పుదోవ పడతాడోనని పెళ్లిచెయ్యాలని అనుకున్నారు. గుమ్మడి గారి ప్రమేయం లేకుండానే 29 ఏప్రిల్ 1944 నాడు లక్ష్మీసరస్వతితో గుమ్మడి గారి వివాహం జరిగింది. గుమ్మడి గారికి కళాశాల చదవాలని కోరిక ప్రబలంగా ఉండేది. గుంటూరు హిందూ కళాశాలలో చేరారు.

కళాశాలలో విద్యార్థి విభాగానికి సెక్రటరీగా.. 

ఆ రోజుల్లో కూడా ప్రతీ రాజకీయ పార్టీలకు యువజనులలో ఒక విభాగం, విద్యార్థులలో ఒక విభాగం ఉంటూ ఉండేవి. ఆ కళాశాలలో కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగానికి గుమ్మడి గారూ సెక్రటరీ అయితే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మల్లిఖార్జున రావు సెక్రటరీగా ఉండేవాడు. వీరిరువురూ ఒకే బెంచీలో కూర్చునేవారు కానీ ఒకరినొకరు మాట్లాడుకునే వారు కారు. అయితే మల్లికార్జున రావు ఒక వారం రోజులు కళాశాలకు రాలేదు. కారణం ఏంటని అడుగగా, మద్రాసు వెళ్లి సినిమాలో వేషం వేసి వచ్చాను అని చెప్పారట మల్లిఖార్జున రావు. ఆ యం.మల్లికార్జున రావు గారే తరువాత రోజులలో దర్శకులై సూపర్ స్టార్ కృష్ణ గారితో గూఢచారి 116 లాంటి సినిమాలు తీశారు. మల్లికార్జున రావు గారి అమ్మ గారూ నటి శ్రీరంజని గారూ.

రంగస్థలం నటుడిగా…

మద్రాసు వెళ్లి వచ్చినప్పటి నుండి మల్లికార్జున రావు గారిపై గుమ్మడి గారికి అభిమానం పెరిగింది. ఇద్దరు కలిసి సినిమాలు బాగా చూసేవారు. ఎంత బాగా చూసేవారంటే అశోక్ కుమార్ నటించిన “కిస్మత్” అనే చిత్రం పదిసార్లు, “బాలానాగమ్మ” 18 సార్లు, ఉదయం ఒక సినిమా, సాయంత్రం ఇంకో సినిమా, ఇలా సినిమాలు చూస్తూనే నాటకాలు వేసేవారు. పల్నాటియుద్ధం లాంటి నాటకాలు వేసేవారు. అందులో గుమ్మడి గారూ బ్రహ్మనాయుడు పాత్ర వేస్తే, మల్లికార్జున రావు గారూ బాలచంద్రుడు వేషం వేసేవారు.  ఇలా ఒకవైపు నాటకాలు వేస్తున్నారు. ఇంకోవైపు విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉంటున్నారు. ఇన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిలయ్యారు.

ఇంట్లో వాళ్లకు చాలా ఆనందం వేసింది. వ్యవసాయంలో పెట్టేశారు. వ్యవసాయం చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు గ్రంథాలయంలో విరాభిమన్యు అనే ఒక నాటక పుస్తకం అగుపించింది. అందులో పద్యాలు లేవు. నాటకం వచనంలో ఉంది. వచనంలో ఉంటే చాలా తేలిక. అందువలన ఆ ఊరిలో కుర్రాళ్లను కలుపుకుని రూపాయి రూపాయి పోగేసుకుని 116 రూపాయలు చేసి ఒక నాటక సంస్థను పెట్టి ఈ విరాభిమన్యు నాటకం వేశారు. అందులో గుమ్మడి గారూ ధుర్యోధనుడి పాత్ర వేశారు. ఆ రోజుల్లో తెనాలిలో నాటకాలు వేసే మాధవపెద్ది వేంకటరామయ్య గారూ ధుర్యోధనుడి పాత్రకు ప్రసిద్ధి. విరాభిమన్యు నాటకాన్ని మరలా వేసి అందులో మాధవపెద్ది వేంకటరామయ్య గారూ కర్ణుడిగానూ, గుమ్మడి గారూ ధుర్యోధనుడి గానూ పాత్రలు వేశారు.

మాధవపెద్ది వెంకటరామయ్య గారూ గుమ్మడి గారితో, నీవు ధుర్యోధనుడి పాత్రలకు సరిపోవు. సాత్వికమైన నటనకు (సాత్వికాభినయానికి) నీవు సరిపోతావు. కాబట్టి నీవు సినిమాలలో ప్రయత్నించు అని సలహా ఇచ్చారు. గుమ్మడి గారూ సినిమాలలో స్థిరపడిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా తన రంగస్థలం గురువుగారు మాధవపెద్ది వెంకటరామయ్య గారే, వారే నాకు దారి చూపించారని చెబుతుండేవారు. తెనాలి దగ్గరలోని మండూరులో “ఖీల్జీ రాజ్య పతనం” అనే నాటకంలో  ఒక పాత్ర వేశారు. అందులో మరో రెండు పాత్రలలో నటించడానికి దుగ్గిరాల నుండి ఒక మాస్టారు, ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలిక వచ్చారు. బాలిక నృత్యం చేయడానికి వచ్చింది. బాలిక (నటి జమున గారూ),  మాస్టారు (జగ్గయ్య గారూ). తరువాత రోజులలో వీరు ముగ్గురు కలిసి సినిమాలలో నటించారు.

సినీ ప్రస్థానం..

ఒకసారి తెనాలిలో ఉన్న గుమ్మడి గారి ఆంధ్ర రేడియోస్ మరియు ఎలక్ట్రానిక్స్ అనే షాపుకు విజయా సంస్థ చక్రపాణి గారు వచ్చారు. ఈదర లక్ష్మీనారాయణ గారూ గుమ్మడి గారిని చక్రపాణి గారికి పరిచయం చేశారు. ప్రతిభ ఉంటే ఎందులోనైనా రాణిస్తాడు. కానీ సినిమాలలో కన్నా కూడా షాపులోనే బాగుంది కదా. ఇందులోనే కొనసాగమని చెప్పి వెళ్ళిపోయారు చక్రపాణి గారూ. కానీ గుమ్మడి గారి తోడల్లుడు రామకోటేశ్వర రావు గారికి, గుమ్మడి గారిని సినిమాలలో చూడాలనే బలీయమైన కోరిక ఉండేది. కొన్ని రోజులకు “దేవదాసు” నిర్మాత డి.యల్. నారాయణ గారూ తెనాలిలో గల వీరి షాపుకు వచ్చి గుమ్మడి గారి గురించి వాకబు చేసి, తన ఫోటోలు తీసుకెళ్లారు. “శ్రీలక్ష్మమ్మ కథ” లో వేషం ఇస్తానన్నారు. తరువాత కుదరలేదు అని గుమ్మడి గారికి ఉత్తరం వ్రాశారు.

తొలి చిత్రం “అదృష్టదీపుడు”లో.. 

ఇదిలా ఉండగా ఒకరోజు తమిళనాడు టాకీస్ వాళ్ళు టెలిగ్రామ్ పంపించారు. తమిళనాడు టాకీస్ కు అధిపతి సౌందర్ రాజన్. వీరు తెలుగులో ఒక సినిమా తీయదలచి కొత్త నటులు కావాలి అని నిర్మాత డి.యల్. నారాయణ గారిని అడుగగా, వారు గుమ్మడి గారి ఫోటోలు సౌందర్ రాజన్ గారికి ఇచ్చారు. దాంతో గుమ్మడి గారికి టెలిగ్రామ్ పంపించారు. సౌందర్ రాజన్ తీసిన “అదృష్టదీపుడు” చిత్రంలో నటించారు. అదే తన మొదటి సినిమా. ఒకటి, రెండు చిన్న సినిమాలలో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. దర్శక, నిర్మాత బి.వి.రమానందం గారూ ఎన్టీఆర్ గారి సలహామేరకు గుమ్మడి గారిని కలిసి తాను తీయబోయే చిత్రానికి హీరోగా గుమ్మడి గారిని ఎంచుకున్నారు. ఆ సినిమా పేరు “జై వీర భేతాళ”. కథానాయికగా 13 సంవత్సరాల వయసున్న అమ్మాయి వచ్చింది. ఆవిడ ఎవరో కాదు తనతో పాటు “ఖీల్జీ రాజ్య పతనం” లో నాట్యం చేసిన “జమున” గారూ. సినిమా షూటింగ్ సగం జరిగిన తరువాత దర్శక, నిర్మాత బి.వి.రమానందం గారూ గారూ మరణించారు. దాంతో సినిమా సగంలోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ గారూ అవకాశం ఇచ్చిన వేళ..

ఎన్టీఆర్ గారూ రాయలసీమ కరువు నివారణ నిధి వసూలు కోసం ఆంధ్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో గుమ్మడి కూడా ఒక నాటికలో పాల్గొన్నారు. ఆ టూరు నుంచి తిరిగి రాగానే తను నిర్మించే “పిచ్చి పుల్లయ్య” చిత్రంలో గుమ్మడి కి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్ నటుడిగా అప్పటికే పాపులారిటి సంపాదించుకున్న ఎస్వీ రంగారావు వేయదగిన పాత్ర అది. అయినా సరే రామారావు గారూ గుమ్మడి గారిని పిలిచి వేషం ఇచ్చారు. ఆ విధంగా లభించిన అవకాశంతో తన భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి గుమ్మడి గారూ ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన “తోడు దొంగలు” చిత్రంలో కూడా మరో మంచి వేషం వేశారు.

ఈ రెండు పాత్రలతో గుమ్మడి గారూ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో దర్శక నిర్మాతలు వారికి అడక్కుండానే అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అర్ధాంగి,  జయసింహ, మాయాబజార్, ఏది నిజం (ఇందులో విలన్ గా నటించారు. ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించినప్పుడు, ఆవార్డు అందుకోవడానికి తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు గుమ్మడి గారూ), ఇల్లరికం, మా ఇంటి మహాలక్ష్మి (హైదరాబాదులో తయారైన తొలి తెలుగు చిత్రం) దొంగల్లో దొర, కుల గోత్రాలు వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. పరిశ్రమతో పాటు ప్రేక్షకుల హృదయాల్లోను స్థానం సంపాదించుకున్నారు.

విభిన్న పాత్రలను పోషించిన క్యారెక్టర్ యాక్టరుగానే కాకుండా ఒకే రకం పాత్రను ఎన్నో చిత్రాల్లో పలురకాలుగా పోషించి ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా ఎప్పటికప్పుడు కొత్తదాన్ని చూపించిన విలక్షణ నటులు గుమ్మడి గారూ. ఏ పాత్ర పోషించినా అందులో గుమ్మడి గారి మార్కు కనిపిస్తుంది. తెలుగు సినిమాలతో పాటు రెండు హిందీ చిత్రాలలో కూడా గుమ్మడి గారూ నటించారు. సువర్ణ సుందరి హిందీ వర్షన్ లో నటించడమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్పారు. అలాగే “ఈడు – జోడు” తెలుగు వర్షన్ తో పాటు, హిందీ వర్షన్ కంగన్ లో కూడా నటించారాయన. హిందీ నటులు అశోక్ కుమార్ తో కలిసి ఆ సినిమాలో నటించారాయన. అలాగే కొన్ని తమిళ చిత్రాల్లో కూడా గుమ్మడి గారూ నటించారు.

పురస్కారాలు..

మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి గానూ 1963 వ సంవత్సరంలో ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి అవార్డు లభించింది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 1963 వ సంవత్సరానికి గానూ గౌరవ డాక్టరేట్ తో ఘన సన్మానం చేశారు.

చలనచిత్ర రంగానికి గుమ్మడి గారూ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1970 వ సంవత్సరంలో పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.

“మరో మలుపు” చిత్రానికి గానూ కోసం 1982 వ సంవత్సరంలో గుమ్మడి గారూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారంతో గౌరవించబడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి గారి అద్వితీయ నటనకు మెచ్చి 1998 వ సంవత్సరంలో “రఘుపతి వెంకయ్య” అవార్డు నిచ్చి సత్కరించింది.

జ్యోతి మరియు సీతా కళ్యాణం చిత్రాలలో అద్భుతమైన నటనకు గానూ 1976 వ సంవత్సరంలో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు వరించింది..

మరణం..

గతంలో గుమ్మడి గారూ పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో గొంతు సరిగ్గా పనిచేయలేదు. దాంతో గుమ్మడి గారూ నటించిన కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పించారు. బహుళ అవయవ వైఫల్యంతో కొంతకాలంగా బాధపడుతున్న గుమ్మడి 26 జనవరి 2010న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించారు. 1957 లో తాను నటించిన  మాయాబజార్ (నలుపు మరియు తెలుపు) చిత్రాన్ని రంగుల (కలర్ లో) చిత్రంగా తీర్చి దిద్ది బహిరంగ ప్రదర్శన గావించబడినప్పుడు చూసి తరించిపోయారు. ఈ అద్భుతమైన క్షణాలకోసమేనేమో నేను ఇన్నాళ్లు బ్రతికివుంది అని సంతోషం వ్యక్తపరిచారు.

Show More
Back to top button