Telugu Special Stories

నట “మిక్కిలి” నేని.. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి..

మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి (7 జూలై 1916 – 22 ఫిబ్రవరి 2011)

అది కృష్ణాష్టమి. విపరీతమైన గాలివాన. ఒక ప్రక్కన కృష్ణానది పరవళ్లు తొక్కుతూ పక్కనున్న ఊర్లు అన్నిటినీ ముంచి వేస్తూవుంది. అటువంటి భయంకర వాతావరణంలో ఒక తల్లి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి కనింది. క్రమేపి ఆ వరద నీరు ఆ తల్లి గదిలోకి మోకాలి లోతు వరకు వచ్చేసి మంచాన్ని తాకింది. ఓ గుడ్డ ఉయ్యాల కట్టి, అందులో బాబుని పడుకోబెట్టి,  ఉయ్యాలను దూలానికి వేలాడదీశారు. ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో వంట లేదు. దొడ్లో ఉన్న గోవులు చనిపోయాయి.

గోకులాష్టమి నాడు పుట్టాడు, కాబట్టి గోవులన్నీ చనిపోయాయి అన్నారు. ఆ బాలుడు బ్రతికుంటే అరిష్టం అనుకున్నారట. ఆ బాలుడి అమ్మ మేనమామ తల్లి ఆ బాబు గొంతులో వడ్ల గింజ వేసి ఆ బాబును చంపేయాలనుకొందంట. ఆ విషయం గమనించిన ఆ అబ్బాయి అమ్మ, మేనమామ భార్య లక్ష్మమ్మ అడ్డుకుందంట. నాలుగు రోజులకు గాని వరద నీరు తగ్గలేదట. అందులోనూ “కృష్ణాష్టమి” నాడు పుట్టాడు గనుక సాక్షాత్తు కృష్ణుడే అన్నారట. అందుకే రాధాకృష్ణమూర్తి అనే పేరు పెట్టారట. వారే మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ. వారి అన్నయ్య పేరు బలరామమూర్తి గారూ. ఈ కథంతా మిక్కిలినేని గారికి వాళ్ళ అమ్మ గారూ చెప్పారట.

జననం..

మిక్కిలినేని గా ప్రసిద్ధిగాంచిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారూ 7 జూలై 1916 కృష్ణాష్టమి నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. వీరి తండ్రి మిక్కిలినేని  వెంకయ్య గారూ, తల్లి సౌభాగ్యమ్మ గారూ. వీరికి నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వీరిలో మిక్కిలినేని గారూ రెండోవారు. పుట్టడం గుంటూరు జిల్లాలలో అయినా కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగి పెద్దవాడయిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి జీవితం ఆంధ్రదేశంలో సంభవించిన సాంఘిక పరిణామానికి తార్కాణం. చిన్నప్పటి నుండి చిత్రలేఖనం అంటే విపరీతమైన ఆసక్తి వున్న మిక్కిలినేని గారిని వాళ్ళ నాన్న గారూ బందరులోని చిత్రలేఖనం జాతీయ కళాశాలలో చేర్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడితో అది మూతపడింది. మిక్కిలినేని గారి ఊరుకి దగ్గరలో గల పునాదిపాడులో థర్డ్ ఫారం వరకు చదువుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ నాన్న గారూ మరణించడంతో మిక్కిలినేని గారి చదువు అర్థంతరంగా ఆగిపోయింది.

బాల్యం…

ప్రాథమిక విద్యను కోలవెన్నులో అభ్యసించిన మిక్కిలినేని గారూ, పాఠశాల విద్య మాత్రం పునాదిపాడులో సాగింది. అటు పిమ్మట ఆయుర్వేద పశువైద్యాన్ని అభ్యసించి, పశువైద్యాచార్య వెటర్నరీ డిగ్రీ కూడా పుచ్చుకున్నారు. మిక్కిలినేని గారూ చిన్నతనంలో గ్రామంలో ప్రదర్శించే జానపద కళారూపాలు, జంగం కళలు, వీధి బాగోతాలు, తోలుబొమ్మలాటలు, చెక్కభజనలు, పగటి వేషాలు, హరికథలను మిక్కిలినేని గారూ తెల్లవార్లు చూసేవారు. అవి మిక్కిలినేని గారిని మిక్కిలి ఉత్సాహపరిచాయి, ఉత్తేజపరిచాయి. వారి నటనా జీవితానికి తొలి రూపురేఖలు దిద్దింది ఆ జానపద కళాకారులే.

మిక్కిలినేని గారి తండ్రి మరణించడంతో వారి ఉన్నత పాఠశాల విద్య ఎనిమిదో తరగతిలోనే అర్థంతరంగా ఆగిపోయింది. బాధ్యతలు లేని జీవితం అయింది. గాలిపటంలా తిరుగుతూ చుట్టుప్రక్కల గ్రామాల నాటిక సమాజంలో పాత్రలు ధరించేవారు. కోలవెన్ను గ్రామంలో “పంచముఖ ఆంజనేయ నాటక సమాజం” ఉండేది. అందులోనూ, ఇతర నాటక సమాజాలలోనూ పాత్రలు వేసేవారు. “చింతామణి” నాటికలో భవాని శంకరుడు, నారదుడు, జయంతుడు పాత్రలను, “రంగును రౌడీ” నాటకంలో రౌడీ పాత్రను ధరించేవారు. స్త్రీ పాత్రల్ని కూడా మిక్కిలినేని గారూ సమర్థవంతంగానే అభినయించేవారు.

మహానటులు కపిలవాయి రామనాథ శాస్త్రి గారికి శిష్యులు అయిన మిక్కిలినేని గారూ  శాస్త్రి గారితో కలిసి అనేక పాత్రలు ధరించడం వల్ల నటనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. నాటకంలో పాటలను, పద్యాలను శ్రవణంగా పాడేవారు. విజయవాడలో కొంతకాలం ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. ఒక పక్క కళలంటే అభిమానం, మరోపక్క తాడు బొంగరం లేని జీవితం.

వివాహం..

మిక్కినేని గారూ, భార్య శ్రీమతి సీతారత్నం గారూ ఒకే ఊరికి చెందినవారు. వీరిరువురూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. సీతారత్నం గారూ, మిక్కిలినేని గారి జీవితంలో, కష్టసుఖాలలో, కృషిలో పాలుపంచుకుంటూ ఉండేది. మహిళా సంఘ కార్యకర్తగా పనిచేసిన సీతారత్నం గారూ, ప్రజానాట్యమండలి రాష్ట్ర దళం ప్రదర్శించిన “మాభూమి” నాటకంలో తీవ్ర విమర్శల మధ్య మిక్కిలినేని గారితోపాటు కథానాయకగా నటించి, వారి ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను అడుగడుగునా గుండాల మధ్య భయంకరమైన వాతావరణంలో జీవించిన ధీరురాలు సీతారత్నం గారూ.

రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీకి కొరియర్ గా పనిచేసిన సీతారత్నం గారూ, ఉత్తరాలను చాలా ధైర్యంగా అందించేవారు. పోలీసులను దబాయించేవారు. అర్థరాత్రి మిక్కిలినేని గారి ఇంటి పై పలుమార్లు పోలీసులు దాడి చేసి నానా బీభత్సం చేస్తే తట్టుకొని పోలీసులను నిలదీసేవారు. మిక్కిలినేని గారి కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, అడుగడుగునా మిక్కిలినేని గారికి ధైర్యం చెబుతూ, వారి కష్టాలలో, సుఖాలలో వెన్నుదన్నుగా నిలబడిన మిక్కిలినేని గారి సతీమణి సీతారత్నం సేవలు నేను ఎప్పుడూ మరువలేను అని మిక్కిలినేని గారూ వారి సతీమణి గురించి గొప్పగా చెబుతుండేవారు.

మిక్కిలినేని గారి జీవితంలోకి సీతారత్నం గారూ ప్రవేశించడం వారి జీవితానికి ఒక మలుపుగా భావించే మిక్కిలినేని గారూ, వారి జీవితానికి ఒక స్థిరత్వం, ఒక బాధ్యత సీతారత్నం గారి వల్లనే ఏర్పడ్డాయి అని వారి సతీమణిని మెచ్చుకునేవారు. సీతారత్నం గారూ మంచి నటి కూడా. “మా భూమి” నాటకంలో తెలంగాణ స్త్రీగా నాయిక పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ నాటకాన్ని తిలకించిన బలరాజ్ సహానీ గారూ “ఆమె ఒక నిజమైన తెలంగాణ స్త్రీ” అని ప్రశంసించడం నేను మర్చిపోలేను అనేవారు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ.

స్వాతంత్ర్య ఉద్యమంలో తన పాత్ర…

ఆ రోజులలో కాంగ్రెస్ ఉద్యమం ముమ్మరంగా జరుగుతూ ఉండగా ఆంధ్రదేశ పర్యటన చేస్తూ మహాత్మా గాంధీ గారు పునాదిపాడుకు వచ్చారు. వారిని చూడడానికి మిక్కిలినేని, వారి మిత్రులు అందరూ వెళ్ళారు. గాంధీ గారి మాటలు వారికి అర్థం కాకపోయినా గాంధీ గారూ స్వాతంత్రం కోసం పాటుపడుతున్నారని మిక్కిలినేని బృందం తెలుసుకున్నారు. గాంధీ గారూ టోపీ పెట్టడం, ఖద్దరు కట్టడం, నూలు వడకడం, జెండా పట్టుకుని ఊరేగింపులో పాల్గొనడం ఒక మహోత్సవంగా ఉండేది.

బసవరాజు అప్పారావు గారు వ్రాసిన “కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి” అనే పాటను, గరిమెళ్ళ గారు వ్రాసిన “మాకొద్దీ తెల్ల దొరతనం” పాటను గొంతు ఎత్తి పాడి అందరిని ఉత్తేజపరిచే వారు మిక్కిలినేని గారూ. మిక్కిలినేని గారూ ఒకసారి కాంగ్రెస్ ఫోటో పెట్టుకుని విజయవాడ హాస్పటల్ రోడ్డులో సైకిల్ మీద వెళుతుంటే పోలీసులు కొట్టారు. కమ్యూనిస్టు ఉద్యమం మిక్కిలినేని గారి జీవితాన్ని మార్చింది, దిశా నిర్దేశం చేసింది. మితవాద కాంగ్రెస్ నాయకుల పెత్తనంతో విసుగెత్తిపోయి విప్లవంలోకి వెళ్లిన భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ త్యాగాలతో చాలా మంది కమ్యూనిస్టులు ఉద్యమంలో చేరారు. ఆ విధంగా మిక్కిలినేని గారూ కూడా కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

కమ్యూనిస్టు పార్టీలో కొరియర్ గా..

కమ్యూనిస్టు పార్టీలో అప్పుడు తక్కువ మంది ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ మీద కఠినమైన నిర్బంధాలు ఆంక్షలుండేవి. పార్టీ రహస్యంగా పనిచేసేది. ఆ రోజులలో మిక్కిలినేని గారూ కొరియర్ గా పనిచేశారు. “స్వతంత్ర భారత్” అనే పత్రికను చుట్టుప్రక్కల గ్రామాల కార్యకర్తకు చాలా కష్టంతో రహస్యంగా పంపకం చేసేవారు మిక్కిలినేని గారూ. ఎక్కువభాగం యువకుల్ని కమ్యూనిస్టు పార్టీలో చేర్పించేవాళ్ళు. మిక్కిలినేని గురుదేవులైన యార్లగడ్డ బసవయ్య, మిక్కిలినేని అత్తయ్య గారు అర్ధరాత్రి రహస్య సమావేశంలో మార్కిస్టు సిద్ధాంతం గురించి క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్పేవారు.

తప్పులు చర్చించే వాళ్ళు. తప్పు చేస్తే ఒప్పుకునే వాళ్ళు. ఆత్మ విమర్శ ఉండేది. ప్రజా కళాకారుడిగా మిక్కిలినేని గారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది పార్టీయే. తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. మార్కిస్ట్ సూత్రాలు రెండుగా చీలిపోయాయి. మిక్కిలినేని గారితో బాటు ప్రజానాట్యమండలి కళాకారులు, దర్శకులు, నటులు, రచయితలు చాలామందిని సినిమా రంగంలో ఉన్నారు. చీలిపోయాక ఏ పార్టీ వారు కూడా మిక్కిలినేని గారి ఆలనపాలన పట్టించుకోలేదు.

రచయితగా…

1955 – 56 ప్రాంతంలో మిక్కిలినేని గారూ సినిమాలో అంత బిజీగా లేరు. సినిమా రంగంలో డబ్బు సంపాదించడం  ప్రధాన లక్ష్యం. ఇదే సమయంలో నార్ల వెంకటేశ్వరరావు గారు తమ పత్రికకి నటన మీద మిక్కిలినేని గారిని వ్యాసం వ్రాయమన్నారు. వ్రాశారు. తర్వాత కందుకూరు గారిపై వ్రాశారు. శిథిలమైపోతున్న నాటక రంగం గురించి చరిత్ర గర్భంలో కలిసిపోయిన నటీనటుల గురించి దేశాన్ని, జాతిని ఉర్రూతలూగించిన దాదాపు 150 జానపద కళారూపాల గురించి ఈ తరానికి భావితరానికి తెలియజేయాలనుకున్నారు మిక్కిలినేని గారూ. ఆ కృషిలో మమేకమైపోయారు. అలా వీరు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

సినిమా రంగం అన్నం పెడితే, నాటక జానపద కళా రంగాలకు మిక్కిలినేని గారూ తన వంతు కృషి చేశారు. మిక్కిలినేని గారికి మిత్రుడయిన ప్రజానాట్యమండలి కళాకారుడు, పెరుమాళ్ళు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిరిగిపోయిన కాగితం ముక్క పడి ఉంటే తీసి చదివారు. తెలుగు భాషా సమితి ఉత్తమ రచనకు గ్రంథాల పోటీ పెడుతున్నట్టు ఆ కాగితంలో ఉంది. అందులో నాటక కళపై కూడా గ్రంథం వ్రాయవచ్చు అన్నారు. రెండు మాసాలలో సమర్పించాలి. దాంతో ప్రతీరోజు రాత్రి 1:00 దాకా కూర్చొని వ్రాసేవారు. 1000 పేజీల ఆంధ్ర నాటక రంగ చరిత్ర కార్బన్ కాపీ పెట్టి మూడు కాపీలు రాయవలసి వచ్చింది మిక్కిలినేని గారికి. ఈ గ్రంథానికి వారికి బహుమతి కూడా వచ్చింది.

సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సందర్భంగా..

పీ.హెచ్.డి, డిగ్రీ ఉన్నవారు వ్రాసిన మిక్కిలినేని గారికే బహుమతి రావడం వారికి మహాదానందాన్ని, స్ఫూర్తిని కలిగించింది. 1965 నుంచి నటరత్నాలు రచన మొదలుపెట్టారు. 400 మంది నటీనటుల జీవితాలను పరిచయం చేసే ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ  బహుమతి మిక్కిలినేని గారిని వరించింది. దీనిని ఎన్టీ రామారావు గారికి అంకితం ఇచ్చారు. 1000 పేజీలతో తెలుగువారి జానపద కళారూపాలు వ్రాస్తే తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. విమర్శకులు, పత్రికలు సైతం ఈ మూడు గ్రంథాలను కొనియాడారు. ఆనాటి సినిమా రంగం తీరుతెన్నులు వేరు. ఆ రోజుల్లో ఇన్ని కుత్సితాలు, మోసాలు, మాయలు ఉండేవి కావు. ఆనాటి దర్శక, నిర్మాతలకి ఆదర్శాలు, దృక్పథాలు ఉండేవి. సామాజిక సమస్యలతోనే సినిమాలు తీసేవారు. కొంచెం లాభం వస్తే చాలనుకునేవారు. కె.వి.రెడ్డి గారి స్క్రిప్ట్ అంటే చిత్రమంతా అయిన తర్వాత 500 అడుగుల కంటే ఎక్కువ కట్ చేయడం ఎప్పుడూ లేదు

85 సంవత్సరాల కళా ప్రపూర్ణుడాయన. ఒకే జన్మను రెండు జన్మలుగా చేసుకున్న ఉద్యమ శీలి మిక్కిలినేని గారూ. వారు డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. చాలామందికి చలనచిత్ర నటుడుగా తెలుసు. అతి కొద్దిమందికి మాత్రమే రంగస్థలం నటుడుగా తెలుసు. మరి కొంతమందికి స్వాతంత్ర్య ఉద్యమ కారునిగా తెలుసు. ఇంకొంతమందికి గ్రంథకర్తగా తెలుసు. చాలా చాలా మందికి కమ్యూనిస్టుగా బాగా తెలుసు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటలకు నిలువుటద్దం మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ.

@మిక్కిలినేని గారి రచనలు..

తెలుగువారి చలన చిత్ర కళ,

ప్రజా పోరాటాల రంగస్థలం,

నటరత్నాలు (1980, 2002),

ఆంధ్రుల నృత్య కళావికాసం,

ఆంధ్ర నాటకరంగ చరిత్ర,

తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.

మిక్కిలినేని గారూ నటించిన సినిమాలు…

శాంతినివాసం, 

పులి బెబ్బులి,

రామ్ రాబర్ట్ రహీమ్

గంధర్వ కన్య 

చిరంజీవి రాంబాబు

దాన వీర శూర కర్ణ 

సీతా కళ్యాణం (జనకుడు)

ఆడదాని అదృష్టం

బాల భారతం (ధృతరాష్ట్రుడు)

మావూరి మొనగాళ్ళు

చలాకీ రాణి కిలాడీ రాజా (కాబూలీవాలా)

జేమ్స్ బాండ్ 777

సంపూర్ణ రామాయణం (జనకుడు) 

బాలరాజు కథ 

గండర గండడు 

ప్రేమకానుక 

దేవకన్య 

కలిసొచ్చిన అదృష్టం 

శ్రీకృష్ణావతారం (ధర్మరాజు)

పల్నాటి యుద్ధం (కొమర్రాజు)

అంతస్థులు 

సి.ఐ.డి. (రామదాసు)

పాండవ వనవాసం (దుశ్యాశనుడు)

బభ్రువాహన (ధర్మరాజు)

మంచి మనిషి 

పూజాఫలం

రాముడు భీముడు

నర్తనశాల (ధర్మరాజు)

తిరుపతమ్మ కథ 

లక్షాధికారి

బందిపోటు 

పరువు ప్రతిష్ఠ

శ్రీకృష్ణార్జున యుద్ధం (బలరాముడు)

మహామంత్రి తిమ్మరుసు 

గులేబకావళి కథ 

గుండమ్మ కథ (జమిందారు)

దక్షయజ్ఞం (బ్రహ్మదేవుడు)

కులగోత్రాలు (చలపతి)

జగదేకవీరుని కథ (ఇంద్రుడు)

శ్రీ సీతారామ కళ్యాణం (జనకుడు)

రేణుకాదేవి మహత్యం 

పెళ్ళి మీద పెళ్ళి 

అప్పుచేసి పప్పుకూడు 

మాయా బజార్ (కర్ణుడు)

సారంగధర

తెనాలి రామకృష్ణ (కనకరాజు)

సంతానం 

పరివర్తన 

మేనరికం 

కన్నతల్లి

పుట్టిల్లు

పల్లెటూరు..

పురస్కారాలు..

ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1982 వ సంవత్సరంలో మిక్కిలినేని గారిని గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1999 వ సంవత్సరంలో సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం మిక్కిలినేని గారిని వరించింది.

మరణం..

మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ జీవిత చరమాంకంలో మూత్ర సంబంధిత వ్యాధితో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 22 ఫిబ్రవరి 2011 నాడు తన 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి భార్య పేరు సీతారత్నం గారూ. మిక్కిలినేని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జానపద బ్రహ్మగా ప్రసిద్ధి గాంచిన విఠలాచార్య గారూ తీసిన దాదాపు ప్రతీ చిత్రంలోనూ మిక్కిలినేని గారూ నటించారు. మిక్కిలినేని గారి ఆఖరి చిత్రం “భైరవద్వీపం”.

తన సినీ ప్రస్థానంలో 400 పైచిలుకు చిత్రాలలో నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు. మిక్కిలినేని గారూ స్వర్గీయ నందమూరి తారక రామరావు గారితోనే ఏకంగా 150 సినిమాల్లో నటించడం ఓ అద్భుతమైన రికార్డుగా చెప్పొచ్చు. ఆంధ్రా యూనివర్శిటీ మిక్కిలినేని గారిని కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. కేంద్ర ప్రభుత్వం మిక్కిలినేని గారికి రాష్ట్రపతి పురస్కారం కూడా ఇచ్చి సత్కరించింది. ఎన్నెన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్న మిక్కిలినేని గారూ తెలుగు సినిమా గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా నిలిచారు.

Show More
Back to top button